అమెరికా అధ్యక్ష ఎన్నికలు: ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో బైడెన్ తడబాటు, ట్రంప్ వ్యంగ్యం

బైడెన్, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బైడెన్, ట్రంప్
    • రచయిత, ఆంథోనీ జర్చర్
    • హోదా, ఉత్తర అమెరికా కరస్పాండెంట్

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్న జో బైడెన్, డోనల్డ్ ట్రంప్ మధ్య గురువారం రాత్రి ముఖాముఖి చర్చ జరగడానికి ముందు చాలామంది అమెరికన్ల నుంచి మరోసారి అధ్యక్ష పదవి చేపట్టడానికి తగిన ఫిట్‌నెస్, వయసు బైడెన్‌కు ఉన్నాయా అనే ఆందోళన వ్యక్తమైంది.

వారంతా అనుకున్నట్లే బైడెన్ ఆ చర్చలో తడబడ్డారు, పొంతనలేకుండా మాట్లాడారు.

చర్చ మధ్యలో బైడెన్ శిబిరానికి చెందినవారు విలేకరులతో మాట్లాడుతూ అధ్యక్షుడు జలుబుతో బాధపడుతున్నారంటూ ఆయన గొంతులోనీ జీరకు కారణాన్ని వివరించేందుకు ప్రయత్నించారు.

అది నిజం కావచ్చు కానీ, ఆ వివరణ ఏదో బైడెన్ అసమర్థతకు క్షమాపణ కోరినట్టు అనిపించింది.

దాదాపు 90 నిమిషాలసేపు చర్చలో బైడెన్ డీలాపడినట్టుగానే కనిపించారు. ప్రత్యేకించి ఆయన చెప్పిన కొన్ని సమాధానాలు ఏమాత్రం పొంతన లేకుండా ఉన్నాయి. ఒక దశలో ఆయన తాను మాట్లాడుతున్న విషయాన్ని వదిలిపెట్టి ప్రభుత్వం వృద్ధులకోసం నిర్వహించే ఆరోగ్యసంరక్షణ కార్యక్రమం మెడికేర్ గురించి ప్రస్తావించారు.

చర్చ అనంతరం బైడెన్ కమ్యూనికేషన్స్ మాజీ డైరెక్టర్ కేట్ బెడింగ్‌ఫీల్డ్ ‘సీఎన్ఎన్‌’తో మాట్లాడుతూ ‘‘ఇది బైడెన్‌కుమంచి చర్చ కాదు. తనకు శక్తి సామర్థ్యాలున్నాయని నిరూపించుకోవడమే ఆయనకున్న సమస్య. కానీ ఈరోజు చర్చలో ఆయన ఆ పని చేయలేకపోయారు’’ అని చెప్పారు.

అయితే చర్చ కొనసాగుతున్నకొద్దీ గాయపడిన బాక్సర్ రోప్‌పై పడి తిరిగి పైచేయి సాధించడానికి పంచ్‌లు విసిరినట్టు పెద్ద పెద్ద విషయాలు మాట్లాడటం ద్వారా చర్చను తనవైపు మళ్లించుకోవాలని బైడెన్ భావించారు. ఈ క్రమంలో ఆయన చేసిన కొన్ని ప్రయత్నాలు మాజీ అధ్యక్షుడిని రెచ్చగొట్టి కోపంతో ప్రతిస్పందించేలా చేశాయి.

సీఎన్ఎన్ నిర్వాహకులు మొదట ఆర్థికవ్యవస్థ, వలసలకు సంబంధించిన అంశాలను చర్చకు పెట్టారు. ఈ విషయాలలో అమెరికన్లు డోనల్డ్ ట్రంప్‌ను ఎక్కువగా విశ్వసిస్తున్నారని పోల్ రిజల్ట్స్ సూచించడం బైడెన్ పరిస్థితిని మరింత దిగజార్చింది.

బైడెన్ సమాధానాలకు ట్రంప్ వ్యంగ్యంగా స్పందించారు.

‘‘ ఆయన ఆ వాక్యం చివరన ఏం మాట్లాడారో నిజంగా నాకు తెలియదు. అసలు ఆయన మాట్లాడారని భావించడం లేదు’’ అని ట్రంప్ అన్నారు.

బీబీసీ తెలుగు న్యూస్ వాట్సాప్ చానల్
ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ట్రంప్ దూకుడు

మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఈసారి క్రమశిక్షణతో, చురుగ్గా వ్యహరించారు. 2020లో తన మొదటి చర్చ నాటి కోపతాపాలు ఈ సారి కనిపించలేదు. అదేసమయంలో ఈ చర్చలో అవకాశం వచ్చినప్పుడంతా ఆయన బైడెన్‌పై విరుచుకుపడ్డారు.

ట్రంప్ పదేపదే పచ్చి అబద్ధాలు చెప్పినా, వాస్తవ దూరమైన వాదనలు చేసినా బైడెన్ వాటిని తిప్పికొట్టలేకపోయారు.

చర్చ అబార్షన్‌పైకి మళ్లినప్పుడు ట్రంప్ అదేపనిగా డెమొక్రటిక్ ఎక్స్ట్రీమిజమ్‌పై మాట్లాడారు.

‘రో వర్సెస్ వేడ్’ కేసులో మహిళలకు అబార్షన్ హక్కును అనుమతిస్తూ వెలువడిన తీర్పును ఆ దేశ సుప్రీం కోర్టు గతంలో కొట్టివేసింది. నిజానికి ఆ విషయంలో డెమోక్రాట్లకు ఉన్న అనుకూలతను బైడెన్ ఉపయోగించుకుని పాయింట్లు సాధించే అవకాశం ఉన్నా ఆయన ఆ పని చేయలేకపోయారు.

‘‘మీరు చేసిన పని భయంకరమైనది’’ అని మాత్రమే బైడెన్ అన్నారు.

జో బైడెన్

ఫొటో సోర్స్, GETTY IMAGES

రేసులోకి బైడెన్

చర్చ పూర్తయిన కొద్దిసేపటి తరువాత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మాట్లాడుతూ అధ్యక్షుడు బైడెన్ మెల్లగా చర్చను ప్రారంభించారనే విషయం నిజమేనని అంగీకరిస్తూ, ఆయన చర్చను చాలా బలంగా ముగించారని చెప్పారు.

కానీ కమలాహారిస్ మాటలు మితిమీరిన ఆశావాదంగా అనిపించినప్పటికీ, చర్చ ముందుకుసాగిన కొద్దీ బైడెన్ కొంత స్థిరంగా మాట్లాడారనేది నిజం.

బైడెన్ మాట్లాడిన వాటిల్లో డోనాల్డ్ ట్రంప్‌కు అడల్ట్ ఫిల్మ్ స్టార్ స్టార్మీ డేనియల్‌తో సంబంధాల విషయంపై జైలు శిక్ష పడటాన్ని లేవనెత్తడం, ఆయనకు నైతిక విలువల్లేవని చెప్పడం గుర్తించదగినవి.

కానీ ‘‘నేను పోర్న్‌స్టార్‌తో సెక్స్‌ చేయలేదు’’ అని ట్రంప్ బదులిచ్చారు.

యూఎస్ క్యాపిటల్‌పై జనవరి 6న జరిగిన దాడుల గురించి మాట్లాడినప్పుడు ట్రంప్ వెనకడుగు వేసినట్టుగా కనిపించారు.

ఆ ప్రశ్న వచ్చినప్పుడు బైడెన్ సరిగా పనిచేయడం లేదనే విమర్శ ద్వారా పక్కదోవపట్టించాలని చూసినా, బైడెన్ ఆ అవకాశం ఇవ్వలేదు.

క్యాపిటల్‌ హిల్ దాడులను ప్రోత్సహించింది ట్రంపేనని బైడెన్ ఆరోపించారు. క్యాపిటల్ హిల్ వరకు వెళ్లాలని ఆయన వారిని ప్రోత్సహించారని, ఆయన సహాయకులు ఏదో ఒకటి చేయమని బతిమాలడంతో ఆయన మూడు గంటలు అక్కడే కూర్చున్నారని బైడెన్ అన్నారు.

జో బైడెన్, ట్రంప్

ఫొటో సోర్స్, CNN

బైడెన్ వ్యూహాత్మకంగానే ముందస్తు చర్చకు ప్రతిపాదించారా

అమెరికా ఆధునిక చరిత్రలో ఇదే అత్యంత ముందస్తు చర్చ. ట్రంప్ పరిపాలనలోని అస్తవ్యస్త తీరును ప్రజలు గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఈ ముందస్తు చర్చ ఉపయోగపడుతుందని బైడెన్ టీమ్ భావించింది.

కానీ చర్చ తరువాత చాలామంది మాజీ అధ్యక్షుడి కంటే బైడెన్ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు.

బైడెన్ బృందం ముందస్తు చర్చను కోరుకోవడానికి కారణం.. ఒక వేళ చర్చలో ఆయన వెనుకబడితే దాన్నుంచి కోలుకోవడానికి తగినంత సమయం దొరుకుంతుందని భావించడమే.

చివరకు గురువారం రాత్రి చర్చ తర్వాత వారికి ఊరటనిచ్చే అంశం ఇదే కావచ్చు.

ఆగస్టులో డెమొక్రాట్లు సమావేశమవుతారు.

ఆ సమయంలో బైడెన్ రెండోసారి పాలనలో చేయాలనుకుంటున్న అంశాలపై మరింత స్పష్టత ఇవ్వచ్చు.

సెప్టెంబర్‌లో మరో చర్చ జరగనుంది. అదే జరిగితే నవంబర్‌లో ఎన్నికలకు ముందు అమెరికన్ల మనసుల్లో ఈ సెప్టెంబర్ చర్చే గుర్తుంటుందనేది బైడెన్ బృందం భావన.

అయితే ట్రంప్‌తో మరోసారి చర్చకు సిద్ధమైనంత మాత్రాన బైడెన్ తన సత్తా చూపగలరా అనే వాదన కూడా వినిపిస్తోంది.

మరికొందరు ప్రెసిడెంట్ అభ్యర్థిని మార్చలా అని ఆలోచిస్తూ ఉండొచ్చు.

ఇలాంటి ఆలోచనలు రాకుండా చేయడానికి బైడెన్ శిబిరానికి మరో రెండు నెలల సమయం ఉంది. పార్టీ ప్రైమరీ డెలిగేట్స్ గెలుచుకున్న బైడెన్‌ను కాదని, కొత్త అభ్యర్థిని ఎన్నుకోవడం అంత తేలికైన విషయం కాదు.

అయితే కొంతమంది ఈ విషయంపై అంతర్గతంగా జర్నలిస్టులతో మాట్లాడటం తప్ప ఎవరూ బహిరంగంగా స్పందించలేదు.

ఈ ఆగస్టులో జరిగే సమావేశంలో అధ్యక్ష అభ్యర్థిని మారుస్తారా అనే బీబీసీ ప్రశ్నకు డిప్యూటీ క్యాంపైన్ మేనేజర్ క్వెంటిన్ ఫల్క్స్ మాట్లాడుతూ ‘ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి అలాంటి ప్రశ్నలకు విలువ ఇవ్వదలుచుకోలేదు.’’ అని చెప్పారు.

‘‘డెమొక్రటిక్ నామినీ ప్రెసిడెంట్ బైడెనే. ఆయన ఎన్నికల్లో గెలవబోతున్నారు’’ అని క్వెంటిన్ చెప్పారు.

అయితే రాబోయే రోజుల్లో బైడెన్ తన మద్దతుదారులను సమీకరించుకోగలిగితే మొదటి వాదనే నిజం కావచ్చు. రాజకీయ నాయకులు ప్రతికూలతలను తట్టుకుని నిలబడతారని డోనల్డ్ ట్రంప్ నిరూపించారు.

కానీ ఈ చర్చ తరువాత చాలామంది డెమోక్రాట్లకు బైడెన్ అవకాశాలపై అనేక సందేహాలు ఉండొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)