చాంగ-6: చంద్రుని ఆవలి వైపు నుంచి అరుదైన శిలలను తీసుకొచ్చిన చైనా వ్యోమనౌక

- రచయిత, లారా బికర్, కెల్లీ ఎన్జీ
- హోదా, బీజింగ్, సింగపూర్ నుంచి
చంద్రునిపై ఇప్పటివరకు ఎవరూ పరిశోధించని దక్షిణ ధ్రువం మీదకు వెళ్లి, అక్కడి శిలలను తొలిసారిగా తీసుకొని చైనా లూనార్ ప్రోబ్ చాంగ-6 భూమికి తిరిగొచ్చింది.
ఈ చాంగ-6 అంతరిక్ష నౌక.. ఎన్నో సవాళ్లతో కూడిన రెండు నెలల మిషన్ తర్వాత గురువారం మంగోలియా ఎడారిలో నేలకు దిగింది.
చాంగ-6 తీసుకొచ్చే నమూనాలతో గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి? వంటి ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం దొరికే అవకాశం ఉండటంతో శాస్త్రవేత్తలంతా దీని కోసం ఎదురుచూస్తున్నారు.
2019లో కూడా చాంగ-4 అనే అంతరిక్ష నౌకను చంద్రుని దక్షిణ ధ్రువంపైకి చైనా పంపించింది.
చంద్రుని దక్షిణ ధ్రువం అంటే, చంద్రుని మీద మనకు కనిపించని భాగం ఇది. దీన్ని చంద్రుడికి ఆవలి వైపు అని కూడా అనొచ్చు.

దక్షిణ ధ్రువానికి చేరుకోవడం కష్టమా?
చంద్రుని దక్షిణ ధ్రువానికి చేరుకోవడం సాంకేతికంగానూ అతి పెద్ద సవాలు. ఎందుకంటే దక్షిణ ధ్రువం ఎగుడుదిగుడుగా, భారీ బిలాలతో ఉంటుంది. చదునైన ఉపరితలాలు చాలా తక్కువగా ఉంటాయి.
ఈ ప్రాంతంలో మంచు జాడలు ఉండొచ్చనే అంచనాతో శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంపై చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. మంచు జాడలు ఉంటే వాటి నుంచి నీరు, ఆక్సిజన్, హైడ్రోజన్‌ను తయారు చేయొచ్చనేది వారి ఉద్దేశం.
చాంగ-6 మిషన్, చైనాకు గర్వకారణంగా నిలిచింది.
మంగోలియా ఎడారిలో చాంగ-6 క్యాప్సూల్ దిగిన వెంటనే అధికారులు అక్కడ చైనా జెండాను పాతుతున్నట్లుగా చైనా ప్రభుత్వ మీడియా చూపించింది.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, చాంగ-6 మిషన్ కమాండ్ సెంటర్‌లో ఉన్నవారికి అభినందనలు తెలిపారు.

ఫొటో సోర్స్, CGTN
53 రోజుల పాటు సాగిన మిషన్
మే నెలలో చాంగ-6ను ప్రయోగించారు. కొన్ని వారాల తర్వాత ఇది చంద్రుని దక్షిణ ధ్రువానికి సమీపంలోని ఒక బిలం వద్ద విజయవంతంగా దిగింది. ఈ మిషన్ 53 రోజుల పాటు సాగింది.
ఇప్పుడు భూమికి తిరిగొచ్చిన ఈ ప్రోబ్‌ను బీజింగ్‌కు పంపి అక్కడే అందులోని నమూనాలను సేకరిస్తారని ప్రభుత్వ ప్రసార సంస్థ సీసీటీవీ వెల్లడించింది.
చంద్రునిపై చైనా చేపట్టిన ఆరో మిషన్ ఇది. దక్షిణ ధ్రువం మీద రెండోది. చైనా పురాణాల్లోని చంద్ర దేవత అయిన చాంగ పేరిట ఈ మిషన్‌లోని ప్రోబ్‌కు చాంగ-6 అని పేరు పెట్టారు.
ఈ ప్రోబ్ ఒక డ్రిల్, రోబోటిక్ చేయి సహాయంతో చంద్రుని మీది శిలలు, మట్టిని సేకరించడంతో పాటు అక్కడి ఫోటోలు తీసింది.

ఫొటో సోర్స్, CGTN
చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు? భూమిని వేరే గ్రహాలు ఢీకొట్టడం వల్ల చంద్రుడు ఏర్పడ్డాడా? వంటి సిద్ధాంతాలను పరీక్షించడానికి చాంగ-6 తీసుకొచ్చిన నమూనాలు సహాయపడతాయని స్కాట్లాండ్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త క్యాథరీన్ హేమన్స్ అన్నారు.
‘‘ప్రోబ్ విజయవంతంగా కిందకు దిగడాన్ని చూడటం అద్భుతంగా ఉంది. మనకు కనిపించే చంద్రుని ఉపరితలంపై, భూమికి ఆవలివైపు ఉన్న చంద్రుని ఉపరితలంపై భౌగోళిక పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉంటాయి. చంద్రుని మీద ఆ తేడా ఎందుకు ఉంటుందనేది ఒక పెద్ద పజిల్’’ అని ఆమె అన్నారు.
భూమికి తీసుకొచ్చిన ఈ నమూనాలు, చంద్రుని కేంద్రంలోని కూర్పును పరిశోధకులు అర్థం చేసుకోవడానికి సహాయపడతాయని ఆమె చెప్పారు.
‘‘ఆ నమూనాలు భూమిని పోలి ఉంటాయా? భూమి, చంద్రుడు ఒకప్పుడు ఒకటేననే సిద్ధాంతాన్ని అవి నిర్ధరిస్తాయా?’’ అనేది తెలియాల్సి ఉందన్నారామె.
చైనా గత పదేళ్లుగా అంతరిక్ష కార్యక్రమాలకు భారీ వనరుల్ని కేటాయించింది. రష్యా, అమెరికాలకు దీటుగా నిలిచేందుకు ప్రయత్నిస్తోంది.
2030 నాటికి చంద్రుని మీదకు మానవ సహిత మిషన్‌ను పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. చంద్రుని దక్షిణ ధ్రువం మీద ఒక స్థావరాన్ని నిర్మించాలని యోచిస్తోంది.
అలాగే అమెరికా కూడా ఆర్టెమిస్ 3 మిషన్ ద్వారా 2026 నాటికి చంద్రుని మీదకు ఆస్ట్రోనాట్లను పంపాలని ప్రణాళికలు రచిస్తోంది.
అదనపు రిపోర్టింగ్ జోయల్ గింటో
ఇవి కూడా చదవండి:
- మెదక్: బక్రీద్ సందర్భంగా ఇక్కడ జరిగిన గొడవేంటి? ఎందుకు జరిగింది?
- చంద్రబాబు కేబినెట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..
- భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు
- చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతిలో ఎందుకు చేయడం లేదు
- ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














