మెదక్: బక్రీద్ సందర్భంగా ఇక్కడ జరిగిన గొడవేంటి? ఎందుకు జరిగింది?

ధ్వంసమైన హాస్పిటల్
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ పట్టణంలో బక్రీద్ సందర్భంగా ఆవులు తరలిస్తున్నారన్న ఆరోపణలు పట్టణంలో ఉద్రిక్తతకు కారణం అయ్యాయి.

లాఠీచార్జీలు, కత్తిపోట్లు, దుకాణాల ధ్వంసం వరకు పరిస్థితి వెళ్లింది. ప్రస్తుతం మెదక్‌లో ప్రశాంతత నెలకొంది.

జూన్ 15 శనివారం ఉదయం నుంచి మెదక్‌లో ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ఉదయాన్నే మెదక్‌లోని ఒక మదరసా దగ్గర, బక్రీద్‌ సందర్భంగా బలి ఇవ్వడానికి 40 ఆవులను కట్టేసి ఉంచారని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు కొన్ని ఆవులను తరలించి టీటీడీ కళ్యాణ మండపం దగ్గర ఉంచారు.

తరువాత మరోచోట 70 ఆవులని తరలిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. అదేక్రమంలో ముస్లిం-హిందూ మతాలకు చెందిన కొందరి మధ్య ఒక ఖాళీ స్థలంలో తోపులాట జరిగింది.

అయితే ఆవుల తరలింపును పోలీసులు అడ్డుకోలేదని, సరైన సమయంలో స్పందించలేదని ఆరోపిస్తూ హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు కలిసి మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ధర్నా చేస్తున్నవారిపై పోలీసులు లాఠీచార్జి చేశారు.

అదే రోజు అంటే, జూన్ 15 సాయంత్రం మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డుపై ప్రదర్శన నిర్వహించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
పగిలిన అద్దాలు

ఆ యాత్ర కొంత ఉద్రిక్తంగా మారింది. దారిలో కనిపించిన మరో వర్గానికి చెందినవారి దుకాణాలపై రాళ్లు రువ్వి, బోర్డులు, అద్దాలను ధ్వంసం చేశారు.

ఈ ప్రదర్శనలో పాల్గొన్న వారిపై లాఠీచార్జీ జరపగా నర్సింగ్ అనే కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి.

మరోవైపు ర్యాలీ కంటే ముందు జరిగిన గొడవల్లో అరుణ్ రాజ్ అనే వ్యక్తికి కత్తిపోట్లు కారణంగా గాయాలయ్యాయి.

ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు.

మరోవైపు కైఫ్, ఆరిఫ్, తాహెర్ అనే ముగ్గురికీ గాయాలయ్యాయి. వారు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు.

ముస్లింలు - హిందువుల భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న ‘మెదక్ ఆర్థోపెడిక్ సెంటర్’ అనే ఆసుపత్రిపై జరిగిన దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తమ ఆసుపత్రిపై దాడి గురించి యాజమాన్య ప్రతినిధి ఆవేదనగా మాట్లాడిన వీడియో అది.

మెదక్ ఆర్థోపెడిక్ సెంటర్

దెబ్బతిన్న ఆసుపత్రిని బీబీసీ పరిశీలించింది. ఆసుపత్రి గ్రౌండ్ ఫ్లోర్‌లో అద్దాలు, లోపల ఉన్న ఫార్మసీ అద్దాలు, ఫార్మసీలోని వస్తువులు ధ్వంసం అయ్యాయి.

ఆసుపత్రిలోని రోగుల మంచాలపైనా రాళ్లు పడ్డాయి. ఆ సమయంలో రోగులు ఎవరూ లోపల లేరు.

‘‘15వ తేదీ సాయంత్రం శబ్దాలు వస్తున్నాయని బయటకు వచ్చాం. బయట పెద్ద ర్యాలీ జరుగుతోంది. రాళ్లు కనిపించాయి. దెబ్బ తగిలిన ఓ వ్యక్తిని (ముస్లిం) ఆసుపత్రిలోకి తీసుకు వచ్చారు. ఆయనకు మేం ప్రథమ చికిత్స చేశాం. వెంటనే 150 నుంచి 200 మంది జనం వచ్చి రాళ్లు విసిరారు. బయట నిలిపి ఉన్న వైద్యుడి కారు పూర్తిగా ధ్వంసం చేశారు. రెండు బైకులు దెబ్బతిన్నాయి. ఆయాగా పనిచేసే రొక్కమ్మకూ గాయాలు అయ్యాయి’’ అని బీబీసీతో చెప్పారు ఆసుపత్రి నిర్వాహకుల్లో ఒకరైన నజీర్.

ప్రస్తుతం ఆయన ఆసుపత్రిని శుభ్రం చేసి, జరిగిన నష్టాన్ని అంచనా వేసే పనిలో ఉన్నారు.

అదే రోడ్డుపై ఉన్న రాయల్ అరేబియన్ మండీ అనే హోటల్ అద్దాలు కూడా మొత్తం ధ్వంసం చేశారు ఆందోళనకారులు.

అలాగే మెదక్‌లోని హైదరాబాద్ రోడ్డులో ఓ వర్గానికి చెందినవారి బేకరీలు, ఆసుపత్రులపై రాళ్ల దాడి జరిగింది.

మెదక్

‘‘వాళ్లు ఆవులను వధించాలనుకున్నారు. రాజ్యాంగం ప్రకారం గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయమని చెబుతున్నాం అంతే. ముందుగా మేమిచ్చిన సమాచారం మేరకు 40 ఆవులను రక్షించి టీటీడీ మండపంలో పెట్టారు పోలీసులు. కానీ, మరో 70 ఆవులు తరలిస్తున్నారన్న సమాచారం తెలిసి మేం అక్కడకు వెళ్లాం. అక్కడ వాళ్లు మాపై దాడి చేశారు. ప్రాణ భయంతో మేమంతా పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చినా పోలీసులు స్పందించలేదు. వారు వెంటనే స్పందించి ఉంటే ఇంత సమస్య వచ్చేది కాదు. మాతో పోలీసులు దురుసుగా ప్రవర్తించినందుకే ధర్నా చేశాం. ఈలోపు అరుణ్ రాజ్ అనే మా కార్యకర్తను కత్తితో పొడిచారు.

మాపైన దాడులు చేశారు. దీంతో తప్పనిపరిస్థితుల్లో ప్రాణ రక్షణ కోసం మేం కూడా తిరిగి రాళ్లు వేశాం. మెదక్ ఆర్థో సెంటర్ భవనంపైన కొందరు పెద్ద పెద్ద రాళ్లు పట్టుకుని ఉన్నారు. అందుకే అక్కడ మేం రాళ్లు విసిరాం. ఇప్పటివరకు అరుణ్‌ని పొడిచిన వారిని గుర్తించి అరెస్ట్ చేయలేదు’’ అని బీబీసీతో అన్నారు నర్సింగ్.

‘‘ఆవుల తరలింపును అడ్డుకోవాలని మేం పోలీసులను కోరాం. కానీ, వారు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాలంటూ ఆలస్యం చేశారు. పోలీసుల వైఫల్యం వల్లే ప్రశాంతంగా ఉన్న మెదక్‌లో అల్లర్లు జరిగాయి’’ అని బీజేపీ నాయకులు కాశీనాథ్, సత్యనారాయణలు బీబీసీతో అన్నారు.

మెదక్

అయితే, ఇదంతా ప్రణాళిక ప్రకారమే జరిగింది అంటున్నారు ముస్లింలు. ముందుగా ప్రణాళిక వేసుకుని, అన్నీ అమర్చుకుని తమ వ్యాపారాలపై దాడి చేశారనేది వారి ఆరోపణ.

‘‘ఆరోజు ఉదయం 11 గంటల నుంచే గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

మా షాపులను రాళ్లు, కర్రలతో ధ్వంసం చేశారు. మదరసాలో ఆవుల్ని కట్టేశారనేది అసత్యం. గోవధపై నిషేధం ఉందని ముస్లింలకు తెలుసు. అందుకే ఆవుల్ని తరలించలేదు. వీళ్లు కావాలనే గొడవలు పెట్టించారు. మదరసా దగ్గర గొడవ చేసేందుకు ఉద్దేశపూర్వకంగా ఆవులు ఉన్న వీడియో విడుదల చేశారు. తరువాత అల్లర్లు సృష్టించి, మా వ్యాపారాలపై దాడులు చేశారు’’ అని బీబీసీతో అన్నారు షేక్ అహ్మద్.

అంతా సాధారణంగా ఉన్నప్పటికీ, తెలంగాణలో అల్లర్లు చేయడం కోసం కావాలని ఇలా చేస్తున్నారని ఆరోపించారు షేక్ అహ్మద్.

‘‘దీనిలో పోలీసుల వైఫల్యం కూడా ఉంది. వారు సమయానికి స్పందించలేదు. పోలీసుల పాత్రమీద కూడా విచారణ చేయాలి’’ అని అన్నారాయన.

నర్సింగ్‌, షేక్‌ అహ్మద్‌ చెప్పిన విషయాలను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేకపోయింది. ఈ కేసులో దర్యాప్తు జరుగుతోందని, ఆ తర్వాత పూర్తి వివరాలు బయటకు వస్తాయని పోలీసులు చెప్పారు.

ఈ ఘర్షణల్లో గాయపడ్డ కైఫ్, ఆరిఫ్, తాహెర్ హైదరాబాద్‌లోని ఎంఐఎం నేత ఒవైసీకి చెందిన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

వారితో మాట్లాడటానికి బీబీసీ ప్రయత్నించింది కానీ వారు అందుబాటులోకి రాలేదు.

మెదక్

ఈ ఘటనలకు నిరసనగా ఆదివారం మెదక్ బంద్‌కు పిలుపునిచ్చింది బీజేపీ. ఆదివారమే కాదు, సోమవారం కూడా మెదక్ పట్టణంలో బంద్ వాతావరణం కనిపించింది.

దుకాణాలు తెరవలేదు. కేవలం హోటళ్లు తెరిచారు. బస్సులు మాత్రం తిరిగాయి.

పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితి సమీక్షించి, 144 సెక్షన్ అమలు చేశారు.

గొడవలకు కారణమనుకున్నవారిని శనివారం రాత్రి నుంచే అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు.

బీజేపీ నేత రాజా సింగ్ మెదక్ రాకుండా ముందస్తు అరెస్ట్ చేశారు.

కోర్టు అనుమతితో స్థానిక బీజేపీ ఎంపీ రఘునందన రావు జైల్లో ఉన్న బీజేపీ నాయకులను కలవబోతున్నారు.

‘‘చట్టాన్ని పోలీసులు పరిరక్షించనప్పుడు, ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారు’’ అని న్యాయవాది అయిన రఘునందన రావు మీడియాతో అన్నారు.

మరోవైపు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రెండు వర్గాలకు చెందిన బాధితులను మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోహిత్ పరామర్శించారు.

అరెస్టయిన వారిలో హిందువులు ఎక్కువగా ఉన్నారని హిందూ సంఘాలు ఆరోపణలు చేశాయి.

‘‘రెండు వైపులా తప్పు చేసిన వారిని అరెస్ట్ చేస్తాం. ఒకరు ముందు, ఒకరు వెనుక అంతే. మేం అల్లర్లకు కారకులుగా గుర్తించిన వారిలో 23 మంది హిందువులు, 22 మంది ముస్లింలు ఉన్నారు’’ అని ఐజీ రంగనాథ్ మీడియాకు చెప్పారు.

పోలీసులు విఫలమయ్యారన్న ఆరోపణలను ఐజీ రంగనాథ్ తోసిపుచ్చారు.

‘’సరైన సమయంలో పోలీసులు స్పందించలేదన్నది నిజం కాదు. ఒకవేళ పోలీసులు నిర్లక్షంగా వ్యవహరించారని తేలితే వారిని కూడా బాధ్యులను చేస్తాం. మొత్తం మూడు కేసులు నమోదు చేశాం. ఒక వర్గం వారిని మాత్రమే అరెస్ట్ చేస్తున్నామన్నది నిజం కాదు. పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం’’ అని ఐజీ రంగనాథ్ మీడియాతో చెప్పారు.

‘‘పశువులను అక్రమంగా తరలిస్తున్నారని ఎవరికైనా తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి తప్ప వాళ్లే చర్యలు తీసుకోవాలనుకోవడం మంచిది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల చెక్ పోస్టులు పెట్టి పశువులను తరలిస్తున్న వందలాది వాహనాలను పట్టుకుంటున్నాం. ఈ విషయంలో ఎవరికీ అనుమానాలు వద్దు’’ అని ఆయన అన్నారు.

తెలంగాణలోని పాత పట్టణాల్లో మెదక్ ఒకటి. హైదరాబాద్‌కు 90 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ పట్టణంలో తెలంగాణలోని మిగిలిన టౌన్లతో పోలిస్తే ముస్లింల జనాభా శాతం కూడా తక్కువే.

సుదీర్ఘ కాలం జిల్లా కేంద్రంగా ఉన్న ఈ పట్టణ జనాభా సుమారు 50 వేలు ఉంటుంది. 1996 తరువాత ఇక్కడ మతపరమైన ఉద్రిక్తత ఏర్పడటం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు స్థానికులు కొందరు.

దక్షిణ భారతదేశంలో పెద్ద చర్చిల్లో ఒకటైన సీఎస్ఐ చర్చి కూడా ఇదే పట్టణంలో ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)