టీ20 వరల్డ్‌కప్: సూపర్-8 రౌండ్ పోటీలు ఎలా నిర్ణయించారు? సెమీస్, ఫైనల్లో వర్షం పడితే విజేతను ఎలా నిర్ణయిస్తారు?

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ

2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో సూపర్-8 రౌండ్ మ్యాచ్‌లు జూన్ 19 నుంచి ప్రారంభం అవుతాయి. గతంలో లేని విధంగా ఈసారి సూపర్-8 రౌండ్‌లో ప్రతి జట్టుకు సీడ్‌ కేటాయించారు. దీని ఆధారంగానే జట్ల మధ్య మ్యాచ్‌లను నిర్ణయించారు.

ఈసారి టీ20 ప్రపంచకప్‌లో 20 జట్లు పాల్గొన్నాయి. ఇందులో టీమ్‌లను ఏ,బీ,సీ, డీ అనే 4 గ్రూపులుగా విభజించి ఒక్కో గ్రూపులో 5 టీమ్‌లను చేర్చారు.

ఆయా గ్రూపులలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-8 రౌండ్‌కు అర్హత సాధిస్తాయి.

సూపర్-8 రౌండ్‌లో 8 జట్లను 2 గ్రూపులుగా విభజించారు, ఆ జట్లు వారి గ్రూపుల్లోని జట్లతోనే పోటీ పడతాయి. అనంతరం ఆయా గ్రూపులలో మొదటి 2 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇరు మ్యాచ్‌లలోని విజేతలు ఫైనల్స్‌కు వెళతాయి.

వాట్సాప్
జస్‌ప్రీత్ బుమ్రా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జస్‌ప్రీత్ బుమ్రా

ఐసీసీలో కొత్త నిబంధనలు

సూపర్-8 రౌండ్‌కు అర్హత సాధించిన జట్ల కోసం ఐసీసీ ఈసారి కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. అంటే, సూపర్-8కు చేరుకోకముందే అర్హత సాధించిన 8 జట్లకు ఆయా టీమ్ ర్యాంకింగ్స్‌ను అనుసరించి సీడింగ్ ఇచ్చారు.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్ ప్రకారం ప్రపంచకప్‌లో టాప్ 8 జట్లు ర్యాంకు ఆధారంగా A1, A2, B1, B2, C1, C2, D1, D2 పేర్లతో సీడింగ్ కేటాయించారు.

  • భారత్ (A1) పాకిస్తాన్ (A2)
  • ఇంగ్లాండ్ (B1) ఆస్ట్రేలియా (B2),
  • న్యూజిలాండ్ (C1) వెస్టిండీస్ (C2)
  • దక్షిణాఫ్రికా (D1), శ్రీలంక (D2)

టీ20 ర్యాంకింగ్ ప్రకారం ఈ సీడింగ్ ఇచ్చారు. దీని ఆధారంగా ఈ సూపర్-8 రౌండ్ జరగబోతోంది. ఇదే టోర్నీలో ఆడుతున్న ఇతర చిన్న జట్లకు ముందుగా సీడింగ్ ఇవ్వలేదు. ఒకవేళ ‘చిన్న జట్లు’ సూపర్-8 రౌండ్‌కు అర్హత సాధిస్తే, సీడింగ్ ఉండి గ్రూప్ దశలోనే నిష్క్రమించిన జట్టు స్థానం ‘చిన్న జట్టు’కు లభిస్తుంది.

ఉదాహరణకు, ర్యాంకింగ్ ప్రకారం పాకిస్తాన్ జట్టుకు A2 హోదా ఇచ్చారు. అయితే, పాకిస్తాన్ సూపర్ 8 రౌండ్‌కు అర్హత సాధించలేదు కాబట్టి ఆ జట్టు స్థానంలోకి వచ్చిన యూఎస్ఏకు A2 సీడింగ్ ఇచ్చారు. అదేవిధంగా ర్యాంకింగ్ ప్రకారం C1 స్టేజ్‌ను న్యూజిలాండ్‌కు కేటాయించారు, కానీ ఆ జట్టు అర్హత సాధించకపోవడంతో, C1 స్థానం అఫ్గానిస్తాన్ టీంకు లభించింది.

అయితే, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 2వ స్థానంలో ఉన్న జట్టు గ్రూప్ దశలో అగ్రస్థానం సాధించినా దానికి సూపర్-8 రౌండ్‌లో సీడింగ్ అగ్రస్థానం ఇవ్వబోరు. అది రెండో స్థానంలోనే ఉంటుంది.

అంటే గ్రూప్ బీ ని పరిశీలిస్తే.. B1, B2లుగా సీడింగ్స్ ఉన్న ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు సూపర్-8 రౌండ్‌కు అర్హత సాధించాయి. అయితే, గ్రూప్ దశలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిచింది. ఇంగ్లండ్ రెండో స్థానంలో నిలిచింది. అయినా కూడా, సూపర్-8 రౌండ్‌లో ఆసీస్‌కు B1 స్థానం లభించలేదు. దానికి ICC ఇంతకుముందు ఇచ్చిన B2 స్లాట్ మాత్రమే దక్కింది. ఇదే మాదిరిగా మిగతా జట్లు సూపర్-8 రౌండ్‌లో పోటీపడతాయి.

టీ20 ప్రపంచకప్

ఫొటో సోర్స్, Getty Images

సూపర్-8 రౌండ్‌ మ్యాచ్‌లు ఎలా నిర్ణయిస్తారు?

ఎనిమిది జట్లు సూపర్-8 రౌండ్‌కు అర్హత సాధించడంతో, ప్రతి జట్టు ఐసీసీ ఇచ్చిన సీడింగ్స్ ఆధారంగా ఒకదానితో ఒకటి పోటీపడుతుంది.

సూపర్-8లో భాగంగా గ్రూప్ 1లో భారత్ (A1), ఆస్ట్రేలియా (B2), అఫ్గానిస్తాన్ (C1), బంగ్లాదేశ్ (D2) జట్లు ఉన్నాయి.

గ్రూప్-2లో యూఎస్ఏ (A2), ఇంగ్లండ్ (B1), వెస్టిండీస్ (C2), దక్షిణాఫ్రికా (D1) జట్లు చోటు దక్కించుకున్నాయి.

ప్రతి గ్రూప్‌లో జట్లు రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో పోటీపడతాయి. ఆయా గ్రూపుల నుంచి మొదటి 2 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ-ఫైనల్‌కు చేరుకుంటాయి.

భారత జట్టు మ్యాచ్‌లు

19 నుంచి సూపర్-8 రౌండ్ ప్రారంభం కానుంది. భారత్ జూన్ 20న అఫ్గానిస్తాన్ (C1)తో, జూన్ 22న బంగ్లాదేశ్ (D2)తో, జూన్ 24న ఆస్ట్రేలియా (B2)తో తలపడనుంది.

మూడు పెద్ద జట్లు ఔట్..

ఈసారి టీ20 ప్రపంచకప్‌లో కొన్ని మ్యాచ్‌లలో షాకింగ్ ఫలితాలు వచ్చాయి. మాజీ చాంపియన్లు కూడా చిన్న జట్ల చేతిలో ఓడి, లీగ్ రౌండ్‌లోనే నిష్క్రమించారు. శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు అలాగే ఇంటి ముఖం పట్టాయి.

ఐసీసీ టీ20 ప్రపంచకప్

ఫొటో సోర్స్, Getty Images

సూపర్-8 రౌండ్, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లలో వర్షం పడితే?

మ్యాచ్ సమయంలో వర్షం లేదా ప్రతికూల వాతావరణం ఏర్పడితే, ఫలితాన్ని నిర్ణయించడానికి కనీసం 5 ఓవర్ల మ్యాచ్ అయినా జరిగేలా చూస్తారు. మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ పెడతారు.

అదేవిధంగా మొదటి సెమీ-ఫైనల్, ఫైనల్‌కు రిజర్వ్ డే ఉంది, కానీ రెండో సెమీ-ఫైనల్‌కు రిజర్వ్ డే లేదు. ఫైనల్, రెండో సెమీ-ఫైనల్ మధ్య కేవలం ఒక రోజు మాత్రమే గ్యాప్ ఉంది. అందుకే, రిజర్వ్ డే పెట్టలేదు. కానీ, ఆ రోజు సెమీస్ ఆడటానికి అదనపు సమయం కేటాయించారు.

ప్రతి సెమీ-ఫైనల్ మ్యాచ్‌కు 250 నిమిషాల (4 గంటల 10 నిమిషాలు) అదనపు సమయం ఉంటుంది. 26వ తేదీన తొలి సెమీఫైనల్ జరగనుంది, వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోతే ఆ రోజు 60 నిమిషాల అదనపు సమయం ఉంటుంది. ఒకవేళ అప్పటికీ మ్యాచ్ జరగకపోతే మరుసటి రోజు మ్యాచ్ జరుగుతుంది. రిజర్వ్ డేకు 190 నిమిషాల సమయం అందుబాటులో ఉంటుంది. అమెరికాలో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.

27న రెండో సెమీఫైనల్ జరగనుంది. అయితే, వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడితే ఆ రోజు అదనంగా 250 నిమిషాల సమయం కేటాయించారు. కానీ మరుసటి రోజు మ్యాచ్ నిర్వహించేందుకు రిజర్వ్ డే ఇవ్వలేదు.

ఫైనల్‌ మ్యాచ్ జూన్ 29న జరుగుతుంది. జూన్ 30 రిజర్వ్ డేగా నిర్ణయించారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ 190 నిమిషాల్లో ముగియాలి.

తొలి సెమీఫైనల్‌, ఫైనల్‌లో 10 ఓవర్లు మాత్రమే ఆట జరిగి, వర్షం కారణంగా మ్యాచ్‌ ఆగిపోతే మళ్లీ రిజర్వ్‌ డేలో కొత్త మ్యాచ్‌ జరగదు. మ్యాచ్ ఆగిపోయిన ఓవర్ నుంచి ఆట తిరిగి ప్రారంభమవుతుంది.

ఒకవేళ సెమీ-ఫైనల్‌కు వాతావరణం అడ్డంకిగా మారితే, సెకండ్ రౌండ్ గ్రూపు దశలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. ఫైనల్లో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడితే ఇరు జట్లను విజేతలను ప్రకటిస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)