టీ20 ప్రపంచకప్: లీగ్ దశలోనే పాకిస్తాన్ నిష్క్రమణ, బాబర్ ఆజమ్ కెప్టెన్సీ వదిలేస్తాడా

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ జట్టు క్రికెట్ వరల్డ్ కప్-2023 తరహాలోనే టీ20 వరల్డ్ కప్-2024 నుంచి కూడా లీగ్ దశలోనే నిష్క్రమించింది.
ఐర్లాండ్‌పై విజయంతో ఈ టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ ప్రయాణం ముగిసింది. ఐర్లాండ్‌పై విజయం సాధించినప్పటికీ, అంతకుముందు రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన పాక్ జట్టు టోర్నీలో ముందుకు వెళ్లే అవకాశాన్ని కోల్పోయింది.
ఆదివారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. కానీ, సూపర్-8 దశకు అర్హత సాధించలేకపోయింది.
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. బాబర్ ఆజమ్ కెప్టెన్సీ వదులుకోవాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు.

టీ20 ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ నిష్క్రమించిన తర్వాత బాబర్ ఆజమ్ విలేఖరుల సమావేశంలో పాల్గొన్నాడు.
పాక్ ఆటగాళ్లతో పాటు మేనేజ్‌మెంట్ చాలా నిరాశలో ఉందని బాబర్ అన్నాడు. ‘‘మేం ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాం. మా సామర్థ్యానికి తగిన ఆటతీరును ప్రదర్శించలేకపోయాం. ఒక జట్టుగా మేం మెరుగ్గా రాణించలేకపోయాం. మా నిష్క్రమణకు ఏ ఒక్క ఆటగాడో కారణం కాదు. మేం కొన్నిసార్లు బ్యాటింగ్‌లో రాణించాం. కొన్నిసార్లు బౌలింగ్‌లో రాణించాం. ఇక్కడి పిచ్‌లు ఎలా ఉన్నాయో మీరూ చూశారు. ఇక్కడి పిచ్ ఫాస్ట్ బౌలర్లకు సహకారం అందిస్తోంది. కానీ, మా బ్యాట్స్‌మెన్ ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోయారు’’ అని చెప్పాడు.
కెప్టెన్సీ గురించి కూడా బాబర్ ఆజమ్ మాట్లాడాడు. ‘‘ఇంతకుముందు కూడా కెప్టెన్సీ చేయకూడదని అనిపించినప్పుడు నేను ఆ బాధ్యతల్ని వదిలేశాను. నేనే స్వయంగా ఆ విషయాన్ని ప్రకటించాను. తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) మళ్లీ నాకు ఆ బాధ్యతలు కట్టబెట్టింది. ఇప్పుడు కూడా నేను కెప్టెన్సీ వదిలేయాలనుకుంటే మేమంతా కూర్చొని దీనిపై చర్చిస్తాం. నిర్ణయం పీసీబీదే’’ అని బాబర్ ఆజమ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
టోర్నీలో పాక్ ప్రయాణం ఎలా సాగింది?
లీగ్ దశలో పాకిస్తాన్ మొదటి రెండు కీలక మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ తర్వాత చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందినప్పటికీ సూపర్-8కు అర్హత సాధించలేకపోయింది.
అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ సూపర్ ఓవర్‌లో ఓటమి పాలైంది.
తర్వాత భారత్‌తో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 120 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక పాక్ ఓడిపోయింది.
భారత్, అమెరికా, కెనడా, ఐర్లాండ్‌లతో కూడిన గ్రూప్ ‘ఎ’లో పాకిస్తాన్ కూడా భాగం.
ఈ గ్రూపు నుంచి భారత్, అమెరికా జట్లు సూపర్-8కి అర్హత సాధించాయి. ఈ గ్రూపులో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.
అమెరికా, ఐర్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో రెండు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఫలితంగా అమెరికా సూపర్-8లో అడుగుపెట్టింది.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌లో ఏమంటున్నారు?
పాకిస్తానీ దినపత్రిక డాన్‌కు చెందిన స్పోర్ట్స్ జర్నలిస్ట్ అబ్దుల్ గఫార్ ఒక ట్వీట్ చేశారు.
‘‘బాబర్ ఆజమ్ 2023 వరల్డ్ కప్ తర్వాత క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో జట్ల కెప్టెన్సీకి రాజీనామా చేశారు. అయితే ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ పర్యటనల తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మళ్లీ బాబర్ ఆజమ్‌కు కెప్టెన్సీని అప్పగించింది’’ అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.
పీసీబీ నిర్ణయంపై పాకిస్తాన్ మీడియాలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో చాలా ఐసీసీ టోర్నమెంట్‌లలో పాకిస్తాన్ ఓటమి చవిచూసింది.
2017లో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ నేతృత్వంలోని పాక్ జట్టు భారత్‌ను ఓడించి చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఆ తర్వాత నుంచి పాకిస్తాన్‌కు మరో ఐసీసీ ట్రోఫీ దక్కలేదు.
2009లో పాక్ జట్టు టీ20 వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. తాజాగా టోర్నీ నుంచి పాక్ నిష్క్రమించడతో పాకిస్తాన్ ప్రజలు నిరాశ చెందారు.
సోషల్ మీడియాలో అభిమానులు తమ అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. పాక్ జట్టుపై మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. జట్టులో మార్పులు చేయాలని కోరడంతో పాటు బాబర్ ఆజమ్ కెప్టెన్సీపైనా అభిమానులు ప్రశ్నలు సందిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సెహ్వాగ్ ఏమన్నాడంటే?
పాకిస్తాన్ బ్యాటింగ్ తీరుపై భారత మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
పాక్ జట్టు బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు.
అత్యధిక స్ట్రయిక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసేలా తమ శైలిని మార్చుకోవాలని అన్నారు.
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్, టెన్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ, తాను ఒకవేళ ఇప్పుడు బాబర్ ఆజమ్ స్థానంలో ఉంటే కెప్టెన్సీకి రాజీనామా చేసి క్రికెట్ మీద దృష్టిపెట్టేవాడినని అన్నారు.
పాకిస్తాన్ వరల్డ్ కప్ ప్రయాణం ముగిసిందని పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- టీడీపీ, వైసీపీ మధ్య ఓట్ల తేడా ఎంత? అది ఫలితాలను ఎలా మార్చేసింది?
- చంద్రబాబు కేబినెట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..
- భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు
- చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతిలో ఎందుకు చేయడం లేదు
- ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














