జస్‌ప్రీత్ బుమ్రా ప్రత్యేకత ఏంటి? టీమిండియాకు అనూహ్య విజయాలు ఎలా అందివ్వగలుగుతున్నాడు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సంజయ్ కిశోర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అత్యల్ప స్కోరు చేసినప్పటికీ భారత్ విజయం సాధించింది. పాకిస్తాన్ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది.
22 గజాల పిచ్‌పై పోరాడిన 22 మంది ఆటగాళ్లలో ఈ అనూహ్య విజయానికి, ప్రత్యర్థి జట్టు ఊహించని ఓటమికి కారణం జస్‌ప్రీత్ బుమ్రా. అతను 4 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు, పాక్ జట్టు ఓటమికి బాటలు వేశాడు.
బుమ్రా వేసిన 24 బంతుల్లో పాకిస్తాన్ బ్యాటర్లు 15 డాట్ బాల్స్‌గా ఆడారు. పొట్టి క్రికెట్‌లో ఈ డాట్ బాల్స్ విలువ, వికెట్ కంటే తక్కువేం కాదు.
మ్యాచ్ ముగిసిన తర్వాత, భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎక్స్‌లో బుమ్రా ప్రదర్శనపై పోస్టు చేస్తూ టీ20లో ఎక్కువగా వికెట్లు ఆశించడం సరైంది కాదన్నారు. ఇలా చెబితే అభిమానులు ఎగతాళి చేస్తారని కూడా చెప్పారు.
టీ20లో వికెట్లు రావడమనేది బౌలర్ మీద ఆధారపడి ఉంటుందని అశ్విన్ అభిప్రాయం వ్యక్తంచేశారు. వికెట్ల కోసం బౌలర్లు అనవసర సమయాల్లో దూకుడుగా బంతులు సంధిస్తారని తెలిపారు. తన ఓవర్లో బ్యాటర్లపై ఒత్తిడిని పెంచి, తర్వాత వచ్చే బౌలర్లు వికెట్లు తీసేలా చేయడం అరుదని, బుమ్రా వంటి నిస్వార్థ బౌలర్లు మాత్రమే చేయగలరని అశ్విన్ అభిప్రాయపడ్డారు.
పాకిస్తాన్ మ్యాచ్‌లో బుమ్రా డాట్ బాల్స్ ఎక్కువ వేయడంతో బ్యాటర్లపై ఒత్తిడి పెరిగిందని, దీంతో తర్వాతి బౌలర్లకు బ్యాటర్లు వికెట్లు సమర్పించుకున్నారనే అర్థంలో అశ్విన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
వికెట్లు సాధించడమే లక్ష్యం కాదు
మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో జస్‌ప్రీత్ బుమ్రా వ్యాఖ్యలు అశ్విన్ ప్రకటన మాదిరే ఉన్నాయి. బుమ్రా ఆలోచనా విధానాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.
"మీకు వికెట్ మద్దతుగా ఉంటే, మీ అత్యుత్తమ బంతిని పూర్తి శక్తితో ప్రయోగించడానికి ప్రయత్నిస్తారు. కానీ, నేనలా చేయలేదు. మేం బౌలింగ్‌కు వచ్చినప్పుడు స్వింగ్, సీమ్ తగ్గింది. ఒకవేళ మేం బంతులు ఇష్టానుసారం వేస్తే బ్యాటర్లు సులువుగా పరుగులు చేస్తారు. బ్యాటర్లపై ఒత్తిడి పెంచాలి, పెద్ద బౌండరీ లైన్ సద్వినియోగం చేసుకోవాలి. అందుకే వికెట్లు లభించాయి’’ అని అన్నారు బుమ్రా.
కఠినంగా న్యూయార్క్ పిచ్
న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పిచ్ చాలా కఠినంగా, ఆశ్చర్యకరంగా ఉంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ బౌలర్లకు సహకరించడంతో భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ అయింది.
పాకిస్తాన్ లక్ష్యం 120 పరుగులే అయినా బుమ్రాపై ఒత్తిడికి లోనవలేదు. తనకు చిన్నప్పటి నుంచి బౌలింగ్ అంటే చాలా ఇష్టమని బుమ్రా చెబుతుండేవారు. బౌలర్లు మెరుగ్గా రాణిస్తే, మనుసుకు సంతోషంగా ఉంటుందని తెలిపాడు.
పవర్ ప్లేలో బుమ్రా బౌలింగ్’లో రిజ్వాన్ ఇచ్చిన క్యాచ్‌ను శివమ్ దూబే వదిలేశాడు, రిజ్వాన్ అప్పుడు 7 పరుగులతో ఆడుతున్నాడు.
అయితే, ఐదో ఓవర్‌లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం (13)ను ఔట్ చేసి బుమ్రా టీమిండియాకు తొలి వికెట్ అందించాడు. 10 ఓవర్లు ముగిసేసరికి పాక్ స్కోరు వికెట్ నష్టానికి 57 పరుగులు. 13వ ఓవర్‌కు పాకిస్తాన్ 3 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది. లక్ష్యం స్వల్పమే కావడంతో అభిమానుల్లో అలజడి మొదలైంది. అప్పుడు బుమ్రా మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు.

ఫొటో సోర్స్, Getty Images
టర్నింగ్ పాయింట్
ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్ ఒక ఎండ్‌లో నిలబడి ఆడుతున్నాడు. అప్పటికే 43 బంతుల్లో 31 పరుగులు చేశాడు, మ్యాచ్ పాకిస్తాన్ వైపే ఉన్నట్లు అనిపించింది. అయితే 15వ ఓవర్‌లో జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌కు వచ్చి, మ్యాచ్ స్వరూపం మార్చేశాడు.
ఆ ఓవర్ తొలి బంతికే రిజ్వాన్ వికెట్ నేలకూల్చాడు. రిజ్వాన్ అవుటైన తర్వాత మ్యాచ్ గతి మారిపోయింది. చివరి 18 బంతుల్లో పాకిస్తాన్ 30 పరుగులు చేయాల్సి ఉంది.
సిరాజ్ ఓవర్‌లో ఇమాద్, ఇఫ్తికార్ తొమ్మిది పరుగులు చేశారు, లక్ష్యాన్ని 12 బంతుల్లో 21 పరుగులకు తగ్గించారు, అయితే బుమ్రా 19వ ఓవర్’లో మూడు పరుగులే ఇచ్చి, చివరి బంతికి ఇఫ్తికర్ (5)ను అవుట్ చేశాడు. దీంతో పాక్ లక్ష్యం ఆరు బంతుల్లో 18 అయింది.
చివరి ఓవర్లో పాకిస్తాన్ 11 పరుగులే చేయగలిగింది. టీమిండియాకు విజయం వరించింది.
బ్యాట్, బంతి మధ్య బ్యాలెన్స్
పాకిస్తాన్‌పై భారత్ అనూహ్య విజయం సాధించిన తర్వాత, వాట్సాప్ గ్రూప్‌లో నా సీనియర్‌లలో ఒకరు మెసేజ్ చేస్తూ "చాలాకాలం తర్వాత బ్యాట్, బంతికి మధ్య పోటీని చూడగలిగాం. ఐపీఎల్‌లో బ్యాటర్‌కు అనుకూలంగా ఉండే నిబంధనలతో మ్యాచ్ బ్యాలెన్స్ చెదిరిపోయింది" అని చెప్పారు.
మ్యాచ్ తర్వాత, బుమ్రా కూడా "బ్యాట్, బంతికి మధ్య పోటీ ఉన్నప్పుడే నాకు మ్యాచ్ పట్ల ఆసక్తి ఉంటుంది. బ్యాటర్ మాత్రమే ఆధిపత్యం చెలాయిస్తే, టీవీని ఆఫ్ చేస్తా" అని ఎక్స్‌లో తెలిపాడు.

ఫొటో సోర్స్, Getty Images
మాజీ క్రికెటర్లు ఏమన్నారు?
బుమ్రాపై మాజీ ఆటగాళ్లు కూడా ప్రశంసలు కురిపించారు.
"భారత మీడియా విరాట్ కోహ్లీ, ఇతర బ్యాటర్ల మీద ఫోకస్ పెట్టింది. బుమ్రా ఎటువంటి సందడి లేకుండా ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. ప్రస్తుతం భారత జట్టులో బుమ్రా అత్యుత్తమ ఆటగాడు" అని కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఎక్స్ పోస్టులో అభిప్రాయం పంచుకున్నారు.
భారత మాజీ ప్లేయర్ మొహమ్మద్ కైఫ్ ఎక్స్‌లో "జస్ప్రీత్ బుమ్రా గొప్ప మ్యాచ్ విన్నర్.. ఏ ఫార్మాట్‌లోనైనా, ఏ పరిస్థితిలోనైనా, ప్రపంచంలో ఎక్కడైనా" అని తెలిపారు.
భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఎక్స్‌లో స్పందిస్తూ "ఓటమి దారిని విజయంగా మార్చే వ్యక్తిని బుమ్రా అంటారు. ఇది ఎంత గొప్ప స్పెల్, న్యూయార్క్‌లో విజయం ప్రత్యేకం" అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
విమర్శకులకు తగిన సమాధానం
ఒక సంవత్సరం క్రితం వెన్ను గాయం నుంచి కోలుకుంటున్నప్పుడు తన భవిష్యత్తును ప్రశ్నించిన చాలామంది విమర్శకులకు బుమ్రా తన అత్యుత్తమ ప్రదర్శనలతో గట్టి సమాధానమిచ్చాడు.
వెన్ను శస్త్రచికిత్స కారణంగా, బుమ్రా 2022 టీ20 ప్రపంచ కప్, 2023 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌తో సహా ముఖ్యమైన మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
బుమ్రా గత సంవత్సరం ఐర్లాండ్ పర్యటనలో క్రికెట్‌కు రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ 2024లలో మంచి ప్రదర్శన కనబరిచాడు.
మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో బుమ్రా మాట్లాడుతూ “చూడండి, ఏడాది క్రితం ఇదే వ్యక్తులు నేను మళ్లీ ఆడలేనని, నా కెరీర్ ముగిసిపోతుందన్నారు, ఇప్పుడు వారి ప్రశ్న మారిపోయింది” అని గుర్తుచేశాడు.
"బుమ్రా నిరంతరం మెరుగవుతున్నాడు. అతనేం చేయగలడో చాలా ఏళ్లుగా చూశాం, నేను దాని గురించి పెద్దగా మాట్లాడను. బుమ్రా చివరి వరకు ఈ ఆత్మవిశ్వాసంతో ఉండాలని కోరుకుంటున్నాం. అతను బంతితో ప్రతిభావంతుడని మాకు తెలుసు’’ అని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.

ఫొటో సోర్స్, Getty Images
అనతి కాలంలోనే అత్యుత్తమ స్థాయికి
బుమ్రా తక్కువ కాలంలోనే గొప్ప విజయాలు సాధించాడు.
టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 150 వికెట్లు పడగొట్టిన భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా, వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు సాధించిన రెండో భారత బౌలర్ కూడా. మూడు ఫార్మాట్లలో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌కు చేరుకున్న మొదటి బౌలర్ కూడా బుమ్రానే.
బుమ్రా 2013లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌తో తన ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించాడు, జట్టును ఐదుసార్లు ఛాంపియన్‌గా చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 2019లో ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికయ్యాడు.
బుమ్రా తన మొదటి ఐపీఎల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని, మొదటి వన్డేలో స్టీవ్ స్మిత్‌ను, మొదటి టీ20లో డేవిడ్ వార్నర్‌ను, మొదటి టెస్టులో ఏబీ డివిలియర్స్‌ను అవుట్ చేశాడు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రమాదకర యాక్షన్
అసాధారణమైన యాక్షన్, నైపుణ్యాలతో 30 ఏళ్ల బుమ్రా ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన బౌలర్లలో ఒకరిగా మారిపోయాడు.
బుమ్రా సంధించిన బంతిని, బ్యాట్స్‌మెన్ చదవడం అంత సులువు కాదు. ఐపీఎల్ సమయంలో లసిత్ మలింగ ఖచ్చితమైన యార్కర్లు వేయడంలో నిపుణుడిగా పేరుగాంచాడు.
డెత్ ఓవర్లలో అతని బంతులను ఆడటం ఏ బ్యాట్స్‌మెన్‌కైనా కష్టంగా ఉండేది. వారి ప్రత్యేకమైన చర్య డెలివరీ చాలా వేగంగా వస్తోందన్న భ్రమను బ్యాటర్‌కు కలిగిస్తుంది.
ఇవి కూడా చదవండి:
- 2024 ఎన్నికలు: తీహార్ జైలు ఖైదీ ఒక రాష్ట్ర మాజీ సీఎంను ఓడించారు... ఇలాంటి విశేషాలు ఇంకా ఎన్నంటే...
- ఆంధ్రప్రదేశ్: చంద్రబాబు, పవన్, జగన్‌ల కంటే భారీ మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరంటే..
- తెలంగాణ: ఒక్క సీటూ గెలవని బీఆర్ఎస్, ఎన్నికలకు ముందే ఆశలు వదిలేశారా
- కంగనాపై దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ మహిళా జవాన్ ఎవరు, ఎయిర్ పోర్టులో అసలేం జరిగింది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














