జంతుబలి: ఇస్లాం, జుడాయిజం, క్రైస్తవం, హిందూ మతాలలో ఈ ఆచారం ఎప్పటి నుంచి ఉంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఓర్చి ఒతొండ్రిలా
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇస్లాంను అనుసరించే వారికి ఈద్ అల్-అదా లేదా ఖుర్బానీ లేదా బక్రీద్ శనివారం నుంచి ప్రారంభమైంది. ప్రవక్త ఇబ్రహీం తన కొడుకును అల్లాకు బలి ఇవ్వాలనుకున్నారని, అయితే అల్లా ఆయనను ఆపి, కుమారుడికి బదులుగా ఒక గొర్రెను బలి ఇవ్వమని కోరారని ఆ రోజున ముస్లింలు గుర్తుచేసుకుంటారు.
ఇబ్రహీంను క్రైస్తవం, జుడాయిజంలలో అబ్రహం అని పిలుస్తుంటారు.
ముస్లింల నమ్మకం ప్రకారం...‘’ప్రవక్త ఇబ్రహీంకు ఒక రోజు కల వచ్చిందని, అందులో అల్లా తన విధేయతను చూపడానికి కొడుకు ఇస్మాయిల్‌ను బలి ఇవ్వమని కోరారు. ఈ కల అల్లా నుంచి వచ్చిన సందేశంగా ఇబ్రహీం భావించి, దాని గురించి తన కొడుకుతో మాట్లాడారు. అల్లా ఆదేశాలను పాటించాలని కొడుకు సూచిస్తారు. అనంతరం, ఇబ్రహీం తన కుమారుడిని అల్లా కోసం బలి ఇవ్వబోతుంటే, అల్లా అతన్ని అడ్డుకొని, పరీక్ష పెట్టడమే తన ఉద్దేశమని, కొడుకును బలి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. అల్లా ఆయనకు ఒక పొట్టేలు (గొర్రె)ను ఇచ్చి, ఈ జంతువును బలి ఇవ్వమని సూచించారు’’.
ఇస్లాం ఆవిర్భావానికి పూర్వం నుంచి ఈ బలి సంప్రదాయం కొనసాగుతోంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు వారి వారి మతపరమైన భావాలను అనుసరించి వివిధ రకాల జంతువులను బలి ఇస్తుంటారు. ఒక వ్యక్తికి అవసరమైన దానికంటే ఎక్కువ సంపద ఉంటే, త్యాగం చేయడమనేది సంప్రదాయంగా ఉంది.
అయితే జంతుబలి గురించి ఇతర మతాలు ఏం చెబుతున్నాయి? జుడాయిజం, క్రైస్తవం, హిందూ మతాలు జంతు బలిని ఎలా చూస్తాయి?


ఫొటో సోర్స్, Getty Images
జుడాయిజంలో
ఇస్లాం, యూదు, క్రైస్తవ మత చరిత్రల్లో చాలా సారూప్యతలు ఉన్నాయి.
బ్రిటన్‌లోని లియో బేక్ కాలేజీ అకడమిక్ సర్వీసెస్ హెడ్ రబ్బీ గేల్ సోమర్స్ మాట్లాడుతూ.. యూదుల గ్రంథాలలో అనేక రకాల త్యాగాలు ప్రస్తావించారని, ఆ త్యాగాల కోసం నిర్దిష్ట సమయం, నిర్దిష్ట స్థలం కూడా ఉంటుందనీ చెప్పారు.
"ఇపుడు ఈ త్యాగ పద్ధతులను ఎక్కువగా పాటించడం లేదు. ఎందుకంటే ఆ ప్రదేశాలు ఇప్పుడు లేవు. బలి ఇచ్చే బదులు, ప్రార్థనలలో త్యాగాలను గుర్తుచేసుకుంటారు." అని గేల్ సోమర్స్ అన్నారు.
రబ్బీ బ్రాడ్లీ షావిట్ ఆర్ట్సన్ అమెరికన్ జ్యూయిష్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్. ఆయన జిగ్లర్ స్కూల్ ఆఫ్ రబ్బినిక్ స్టడీస్‌కి కూడా సేవలు అందిస్తున్నారు.
"రోమన్ వారియర్స్ రెండో టెంపుల్‌ను ధ్వంసం చేసినప్పటి నుంచి జంతు బలిని జుడాయిజంలో అనుమతించలేదు" అని బ్రాడ్లీ షావిట్ చెప్పారు.
యూదులకు టెంపుల్ అంటే టెంపుల్ మౌంట్, ఇది పాత జెరూసలేం నగరంలో ఉండేది, ఈ రోజు అల్-అక్సా మసీదు ఉన్న ప్రాంతమది. టెంపుల్ నిర్మాణం మళ్లీ జరగాలని యూదులు తమ ప్రార్థనలలో కోరుకుంటూ ఉంటారు. ఆ ఆలయాన్ని నిర్మించినప్పుడే ఇక్కడ జంతుబలి ఇవ్వగలమని భావిస్తారు.
టెంపుల్ లేనందున చాలామంది యూదులు జంతుబలిని ఆచరించరు. అయితే జెరూసలేంలోని సమరయులు వంటి కొన్ని గ్రూపులు ఇప్పటికీ ‘పాస్‌ఓవర్’ సమయంలో దీనిని ఆచరిస్తున్నారు. ఈ మతంలోని ఇతర గ్రూపులు జంతువు ధరను విరాళంగా అందిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
బలి ఇచ్చేది గొర్రె, గేదె లేదా మేక అయినా ఆ జంతువు మతపరంగా బలికి తగినదై ఉండాలి, అంటే అది 'కోషర్' అయి ఉండాలి.
హీబ్రూ ప్రకారం 'కోషర్' అంటే 'సిద్ధంగా' లేదా తినడానికి సరైనది. యూదుల ఆహార నియమాలకు అనుగుణంగా ఉండే ఆహారాలను కోషర్ ఫుడ్స్ అంటారు.
"కోషర్ జంతువులు మాత్రమే బలి ఇస్తారు. కొంత మాంసం బలిపీఠం మీద కాల్చేవారు, కొంత మతాధికారుల కుటుంబాలకు ఇచ్చేవారు. కొంత మాంసం బలి ఇచ్చిన వారికి, వారి కుటుంబాలకు తినడానికి ఇచ్చేవారు" అని బ్రాడ్లీ షావిట్ ఆర్ట్సన్ అన్నారు.
కాలక్రమేణా బలి ఆచారం తగ్గిపోయింది, కానీ మాంసం తినడం ఇప్పటికీ అనేక పండుగలలో ముఖ్యమైన భాగంగా ఉంది.
జంతు బలి విషయంలో యూదుల మతపరమైన ఆచారాలు త్యాగం ఉద్దేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి.
అంతకుముందు జుడాయిజంలో మూడు మతపరమైన పండుగలు ఉన్నాయి. అవి జంతుబలి పరంగా ముఖ్యమైనవి. ఈ పండుగలు పెసా (పాస్‌ఓవర్), షావూట్ (వారాల పండుగ), సుక్కోట్ (గుడారాల పండుగ).
రోష్ హషానా (యూదుల నూతన సంవత్సరం), యోమ్ కిప్పూర్ (విమోచన దినం) వంటి ఇతర సెలవు దినాలలో కూడా జంతు బలి ఇస్తారని సోమర్స్ వివరించారు.
అబ్రహం త్యాగం కథ యూదుల గ్రంథాలలో కూడా కనిపిస్తుంది. అయితే, జంతువులను బలి ఇవ్వాలనే ఆదేశం తరువాత వచ్చింది. ఇది యూదులలో కొద్దిగా భిన్నంగా కనిపిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
క్రైస్తవంలో
అనేక యూదుల గ్రంథాలకు బైబిల్ పాత నిబంధనలతో సారూప్యతలు ఉన్నాయి.
"పాత నిబంధన పుస్తకాలు, ముఖ్యంగా లెవిటికస్ 17, డ్యుటెరానమీలు జంతు బలులు ఎలా జరిగేవో వివరిస్తాయి. వివిధ పండుగలలో ఉదయం లేదా సాయంత్రం జంతు బలులు నిర్వహించేవారు" అని ఢాకాలోని కాఫ్రుల్ కాథలిక్ చర్చి పాస్టర్ డాక్టర్ ప్రశాంతో టి రిబీరో చెప్పారు.
ఆ రోజుల్లో క్షమాపణ, పశ్చాత్తాపం కోసం జంతు బలులు జరిగాయి. కానీ ఈ ఆచారం మతపరంగా అనుసరించలేదు. ఎందుకంటే ఏసుక్రీస్తు మరణం గొప్ప త్యాగంగా పరిగణిస్తారు.
బలి ఇవ్వడానికి మతపరమైన నిబంధన ఏమీ లేనప్పటికీ, అనేక సందర్భాల్లో "ఎవరైనా దేవునికి వాగ్దానం చేసినా లేదా దేవుడి దగ్గర ప్రతిజ్ఞ చేసినా...వాళ్లు త్యాగం చేస్తుంటారు. ఇలా జంతు బలి వివిధ మార్గాల్లో జరుగుతుంది" అని డాక్టర్ రిబీరో చెప్పారు.
యూదులతో అనుబంధం తప్ప, క్రైస్తవ మతానికి దేవుని పేరిట జంతువులను బలి ఇచ్చే నిర్దిష్ట ఆచారం లేదని ఆయన చెప్పారు. అయితే, క్రైస్తవ మతంలో మాంసాహారం తినడానికి ఎటువంటి పరిమితి లేదు.
చాలా దేశాలలో యూదుల సెలవుదినమైన పాస్‌ఓవర్ సందర్భంగా మాంసాన్ని తింటారు.
ఈస్టర్ పండుగకు ముందు ఇటలీలో ప్రయాణం చేస్తే గొర్రె మాంసం తినడం దాదాపు తప్పనిసరి అని రిబీరో చెప్పారు. అయితే, జుడాయిజంలో ఉన్నట్లుగా క్రైస్తవ మతంలో మతపరమైన ప్రయోజనాల కోసం జంతు బలి చేసే ఆచారం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
హిందూ మతంలో...
హిందూమతంలో జంతుబలి అంశంపై వివాదం ఉంది, అయితే హిందువులలోని కొన్ని వర్గాలు జంతుబలి ఆచారాన్ని అనుసరిస్తాయి. ఉదాహరణకు, భారత్, బంగ్లాదేశ్‌లోని అనేక ప్రాంతాలలో దుర్గాపూజ, కాళీ పూజ వంటి మతపరమైన ఆచారాల సమయంలో జంతుబలి ఇస్తారు.
"రామాయణం, మహాభారతం వంటి అనేక హిందూ మత పరమైన పుస్తకాలు, పురాణ గ్రంథాలలో జంతుబలి ప్రస్తావన ఉంది" అని బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ యూనివర్శిటీలో సంస్కృతం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కుశాల్ వరణ్ చక్రవర్తి అన్నారు.
"బలి ఇచ్చిన జంతువు బంధం నుంచి విముక్తి పొందుతుందని ఋగ్వేదంలో పేర్కొన్నారు" అని ఆయన తెలిపారు.
జంతుబలి సాధారణమేనని 500 బీసీ నుంచి 1,500 బీసీ వరకు నమ్మేవారు. బలిచ్చిన జంతువు మాంసాన్ని మొదట దేవునికి సమర్పించి, ఆ తర్వాత విందులో తినేవారు. అయితే, ఆధునిక భారతదేశంలో జంతుబలి ఆచారం గురించి నిపుణులకు భిన్నాభిప్రాయాలున్నాయి.
"కొన్ని పురాతన దేవాలయాలలో ఇప్పటికీ జంతుబలి ఆచారం ఉంది" అని చక్రవర్తి అన్నారు.
ఇందుకు బంగ్లాదేశ్‌లోని థాక్స్‌వరీ దేవాలయం, భారత్‌లోని త్రిపుర సుందరి, కామాఖ్య, కాళీఘాట్ కాళి ఆలయాలను ఆయన ఉదాహరణగా చెబుతున్నారు.
జంతుబలిపై ఆధునిక భారతదేశంలో అంత విస్తృత ఆచారం ఉన్నట్లు తెలియదని హిందూమతం నిపుణురాలు డాక్టర్ రోహిణి ధర్మపాల అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
హిందూమతంలో జంతుబలి ఆధునిక పద్ధతులు తరచుగా దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కంటే స్వీయ-తృప్తి, పోటీలకు సంబంధించినవిగా ఉన్నాయని చక్రవర్తి అన్నారు. ఇలాంటివి బలి పవిత్రతను తగ్గిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
భారతదేశంలోని అనేక సమూహాలు వివిధ దేవాలయాలలో జంతుబలిని స్వచ్ఛందంగా నిలిపివేశాయి. ‘మతపరమైన ప్రయోజనాల కోసం చేసే జంతు బలి’ నిషేధానికి ఈ గ్రూపులు మద్దతుగా నిలుస్తున్నాయి.
శ్రీలంకలో హిందువులు జంతుబలిని నిషేధించారు.
నేపాల్‌లో పండుగల వేళ జంతు బలిని కొంతమంది ప్రజలు స్వచ్ఛందంగా ఆపేశారు. గతంలో హిందూ రాజ్యంలో భాగంగా ఉన్న నేపాల్ ఇప్పుడు స్వతంత్ర సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా ఉంది. అయితే, ఇక్కడ జంతుబలిని అధికారికంగా నిషేధించలేదు.
ఇవి కూడా చదవండి:
- బీరు టబ్బులో స్నానం చేస్తే ఆరోగ్యం బాగుపడుతుందా? ఈ ట్రెండ్ ఎందుకు విస్తరిస్తోంది...
- చంద్రబాబు కేబినెట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..
- భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు
- చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతిలో ఎందుకు చేయడం లేదు
- ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










