అపాయంలో ఉపాయం: ఎడారిలో సింహాలబారి నుంచి తప్పించుకున్న ఇద్దరు స్నేహితురాళ్ళ కథ...

ఫొటో సోర్స్, AP
- రచయిత, "లైవ్స్ లెస్ ఆర్డినరీ" సిరీస్,
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
‘నాకు చాలా ఉత్సాహంగా ఉంది. ఈ దృశ్యం చాలా అందంగా ఉంది.’ అంటూ విశాలమైన కలహారి ఎడారిగుండా తన విహారయాత్రను గుర్తు చేసుకున్నారు స్వీడన్‌కు చెందిన హెలెన్ అబెర్గ్. అక్కడికి వెళ్లడం ఆమె చిన్ననాటి కల.
"నాకు 10 ఏళ్ల వయస్సులో, మా స్కూల్లో కలహారి ఎడారి గురించి ఒక అద్భుతమైన ఫోటోను చూపించారు. నా ఫ్రెండ్స్‌తో ‘నేను ఏదో ఒక రోజు అక్కడికి వెళతాను' అని అంటే, వాళ్లంతా నన్ను చూసి నవ్వారు." అని ఆమె గుర్తు చేసుకున్నారు.
స్నేహితులు ఎగతాళి చేసినా, ఆమె కలలు కనడం మానలేదు.
గీసుకుపోయిన మోకాళ్లు, దుస్తులపై గడ్డి మరకలు, ముఖంపై చిరునవ్వుతో ఇంటికి వచ్చే అమ్మాయి హెలెన్. కానీ ఆమె స్నేహితురాలు జెన్ని సోడర్ క్విస్ హెలెన్‌కు భిన్నంగా ఉంటారు. తానెప్పుడూ తార్కికంగా ఆలోచిస్తూ ఉంటారు.
వీరిద్దరూ స్వీడిష్ టెలివిజన్ మార్నింగ్ న్యూస్ షో వీడియో ఎడిటర్‌లుగా పని చేస్తూ స్నేహితులయ్యారు. ఇద్దరూ గొప్ప సాహసికులు కూడా.
2004లో హెలెన్‌కు ప్రమాదం జరిగింది. బైక్ నడుపుతుండగా తాగిన మత్తులో ఓ డ్రైవర్ ఆమెను ఢీ కొట్టాడు. హెల్మెట్ ఆమె ప్రాణాలను రక్షించింది.
ఈ ప్రమాదం హెలెన్‌కు కొత్త దృక్పథాన్ని ఇచ్చింది.
2006లో బోట్స్‌వానాలోని గాబోరోన్‌లోని కొత్త టెలివిజన్ స్టేషన్‌లో పని చేయడానికి ఓ ప్రకటనను చూసి ఆమె దానికి దరఖాస్తు చేశారు.
900,000 చదరపు కి.మీ. కలహారి పచ్చికబయళ్లు ఉన్న మూడు దక్షిణాఫ్రికా దేశాలలో బోట్స్‌వానా ఒకటి కావడంతో, ఆమెకు తన కలను నెరవేర్చుకునే అవకాశం లభించింది. అలాగే ఆమె జెన్నీని తనతో వచ్చేందుకు ఒప్పించారు.
2016లో వాళ్లిద్దరూ కలిసి ఒక ప్రయాణానికి అన్ని సన్నాహాలు చేసుకున్నారు. కానీ అది ఎలా ముగుస్తుందో వాళ్లు ఎన్నడూ ఊహించలేదు.


ఫొటో సోర్స్, GETTY IMAGES
ఎదురుగా పులి, జింక
"మేము ఉదయాన్నే బయలుదేరాం, దూరంగా పర్వతాలు కనిపించాయి. సెంట్రల్ కలహారి గేమ్ రిజర్వ్‌కి వెళ్లే దారి చాలా అందంగా, విశాలంగా, ఖాళీగా ఉంటుంది. అక్కడ ఎక్కువ గ్రామాలు లేవు’’ అని జెన్నీ వివరించారు.
అప్పుడు వాళ్లు ఒక కారులో ప్రయాణిస్తున్నారు.
"రిజర్వ్ ప్రాంతంలోకి ప్రవేశించినప్పుడు, పక్కకు వెళ్లకూడదు, జంతువులు తినేస్తాయి." అన్నారు హెలెన్.
తాను కంఠస్థం చేసిన పాఠాన్ని హెలెన్ నొక్కి చెప్పారు.
రూల్ నెంబర్ వన్:
‘‘కారులోంచి ఎప్పుడూ దిగొద్దు. మీ కారు ఆగిపోయినా కిందకు దిగొద్దు. ట్రక్ చెడిపోయిందా లేదా మీరు తప్పిపోయారా? అయినా దిగొద్దు. మీరు బాత్రూమ్‌కి వెళ్లాలా? కారు దిగి, పక్కనే ఆ పని చేసి, మళ్లీ వెంటనే కారులోకి ఎక్కాలి.’’
నిబంధనలకు అనుగుణంగా, మొదటి రోజు రాత్రి అద్భుతంగా గడిచిపోయిందని జెన్నీ చెప్పారు.
"ఆకాశం నక్షత్రాలతో నిండి ఉంది, దూరం నుంచి కీచురాళ్లు, హైనాలు అరవడం వినబడుతుంది."
మరుసటి రోజు, వాళ్లు రిజర్వ్‌లో చిరుతను చూశారు.
"మా ఎదురుగా ఒక చిరుతను చూసి బెదిరిపోయిన ఒక జింక కనిపించింది," హెలెన్ ఉత్సాహంగా గుర్తు చేసుకున్నారు.
"జింక ఊపిరి కూడా పీల్చుకోకుండా నిలబడింది. చిరుత దాని చుట్టూ తిరుగుతూ, అది కదలితే దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. చివరకు జింక కదలకపోవడంతో చిరుత అక్కడి నుంచి వెళ్లిపోయింది.’’ అన్నారు హెలెన్.
అయితే, వాళ్లకు ఆ రోజంతా అలా ఆనందంగా గడిచిపోలేదు.
"మధ్యాహ్నం, హెలెన్ డ్రైవింగ్ చేస్తుండగా, ఏదో కాలిన వాసన వచ్చింది. దూరంగా ఎక్కడా పొగ కనిపించలేదు. నేను కారును చెక్ చేశాను. నా వెనుకవైపు అద్దంలో నారింజ రంగులో మంటలు కనిపించాయి.’’
"వెనుక టైర్ నుంచి మంటలు వస్తున్నాయి. హెలెన్‌తో, 'కారులో మంటలు వస్తున్నాయి, మనం బయట పడాలి’ అన్నాను."
“బ్యాటరీ కూడా మంటల్లో ఉండడం చూసి, మేం దూకాల్సిందే అని నిర్ణయించుకున్నాం. నేను బ్రేక్ నొక్కి, అది కదులుతుండగానే కిందికి దూకాను.’’ అని చెప్పారు హెలెన్.
అయితే జెన్నీ కాలు సీట్ బెల్ట్‌లో చిక్కుకోవడంతో ఆమె వెంటనే బయటకు దూకలేకపోయారు. చివరకు పాకుతూ బయట పడాల్సి వచ్చింది.
"నేను ట్రక్కుకు దగ్గరగా, తలక్రిందులుగా పడిపోయాను. వెనుక టైర్ నా వైపు వచ్చింది. దీంతో నా పని అయిపోయింది అనుకున్నాను. కానీ బాగా దెబ్బలు తగిలినా, ట్రక్కుకు దూరంగా వెళ్లి ప్రాణాలను రక్షించుకున్నా. అకస్మాత్తుగా, కారు పెద్ద శబ్దం చేస్తూ పేలి, భూమి నుంచి అర మీటరు పైకి లేచింది." అని హెలెన్ చెప్పారు.
"ఇప్పుడు మేం ఏం చేయాలి? మేం చనిపోతామా?’ అనే ఆలోచనలో నా బుర్రలో సుడులు తిరగసాగాయి ’’ అన్నారు హెలెన్.

ఫొటో సోర్స్, GETTY IMAGES
జంతువులు దాడి చేస్తే?
హెలెన్, జెన్నీ మంటల నుంచి బయటపడ్డారు కానీ, వాళ్ల ఆహారం, మందులు, నీళ్లు, మ్యాప్‌లు, దుస్తులు అన్నీ కాలిపోయాయి.
"మేము షాక్‌లో ఉన్నాం, మండుతున్న కారుకు దగ్గర ఉండడం మంచిదో కాదో మాకు తెలియదు. దానికి దగ్గరగా ఉంటే అది ప్రమాదకరమైన జంతువులను దూరంగా ఉంచుతుందేమో అనుకున్నాం.’’ చెప్పారు జెన్నీ.
సమయం మించిపోయి, చీకటి పడింది. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి.
"సమీప పట్టణం 20 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలుసు. మాకు అదృష్టం ఉంటే, హఠాత్తుగా ఆ దారిలో ఎవరైనా కనిపిస్తారు అనుకున్నాం." అని హెలెన్ చెప్పారు.
వాళ్లిద్దరూ నడవడం ప్రారంభించారు
“నేను చెప్పులు వేసుకున్నాను. అవి పాములు, తేళ్లు ఉన్న పొదల మధ్య నడవడానికి అనువైనవి కావు. చాలా భయంగా ఉండడంతో వేగంగా నడుస్తున్నాను. హఠాత్తుగా జెన్నీ నా వెనుక లేదని నేను గ్రహించాను." అని హెలెన్ చెప్పారు.
కింద పడి దెబ్బలు తగిలిన జెన్నీకి నడవడం కష్టంగా ఉండడంతో, ఆమె చాలా నెమ్మదిగా నడుస్తోంది.
"మేం ఒక పెద్ద కొమ్మను తీసుకుని, దాన్ని చెరో పక్కా పట్టుకున్నాం, విడిపోతామన్న భయంతో ఆ పని చేశాము.’’ అని చెప్పారు హెలెన్
కాసేపటికి చీకటి పడింది.
" నేను అలసిపోయాను, ఇంక నడవలేను అని జెన్నీ చెప్పింది. నేను అది ఎంత మాత్రం కుదరదని, ఆమెను ఒంటరిగా వదిలి వెళ్ళలేనీ చెప్పాను. క్రూరమృగాలు మాపై దాడి చేయవచ్చు. అవి నన్ను కచ్చితంగా తినేస్తాయని అనుకున్నాను. అందుకని ఏదైనా జంతువు నా మీద దాడి చేస్తే, నన్ను రక్షించుకోవడానికి ప్రయత్నించవద్దని, అక్కడి నుంచి పారిపోవాలని హెలెన్‌కు చెప్పాను.’’ అన్నారు జెన్నీ.
ఏదైనా క్రూరమృగం దాడి చేస్తే, ఇద్దరూ చనిపోవడం కంటే కనీసం ఒకరు బతకడం మేలు కాబట్టి, మరొకరిని రక్షించడానికి ప్రయత్నించకుండా, మిగిలిన వాళ్లు పారిపోవాలని వాళ్లిద్దరూ నిర్ణయించుకున్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
చీకట్లో ఎర్రటి కళ్ళు
ఎవరో ఒకరు కనిపిస్తారనే ఆశ వారిని ముందుకు నడిపింది. కానీ కలహారి ఎడారిలో తాము జంతువులకు ఆహారం అని వాళ్లకు తెలుసు కాబట్టి వాళ్లు భయపడ్డారు.
వాళ్లు అనుకున్న ముప్పు నిజంగానే ఎదురయ్యింది.
"నేను ముందుకు వెళుతుండగా, హఠాత్తుగా, చీకటిలో ఎర్రటి చుక్కలు మా వైపు కదులుతున్నట్లు కనిపించింది. నేను గట్టిగా కళ్ళు మూసుకుని, తెరిచాను. అవి మొత్తం నాలుగు ఉన్నాయి, రెండు జతల కళ్ళు మా వైపు వచ్చాయి.’’
"నేను ఎంత భయపడ్డానంటే వాటి గురించి నేను జెన్నీకి కూడా చెప్పలేదు. సరిగ్గా అదే సమయంలో జెన్నీ, నేను కొంచెం ఆగుతాను, నా బూటులో ఏదో గుచ్చుకుంది అని చెప్పింది.’’ అన్నారు హెలెన్.
"మనం ఆగలేం అని జెన్నీతో చెప్పబోయాను. ఈలోగా కదలకుండా నిలబడిన చిరుత బారి నుంచి తప్పించుకున్న జింక నాకు గుర్తుకు వచ్చింది. దాంతో మేము నిశ్చలంగా ఉన్నాం. జెన్నీ ఆ కొద్ది సేపు విశ్రాంతి తీసుకుంది. నేను ఆ కళ్ల గురించి ఆమెకు ఏమీ చెప్పలేదు. చివరికి మాకు గడ్డిలో ఏదో చప్పుడు వినిపించింది. మెల్లమెల్లగా ఏదో అడుగుల శబ్దం మాకు దూరంగా పోయింది.’’ అని గుర్తు చేసుకున్నారు హెలెన్.
"ఈ తర్వాత మాకు, ఆ ప్రాంతంలో అంత పెద్దగా, ఎర్రగా వెలిగే కళ్లు సింహాలవే అని తెలిసింది.’’ అని చెప్పారామె.

ఫొటో సోర్స్, KATARINA MARTHOLM
బతకాలంటే క్రూర జంతువులను దూరంగా ఉంచాలని వాళ్లకు తెలుసు. అందుకే వాళ్లు ఏదో ఒక శబ్దం చేయడం ప్రారంభించారు.
"మొదట పాడటానికి ప్రయత్నించాం. కానీ ఒకేసారి నడవడం, పాడటం కష్టమైంది. వర్ణమాల, సంఖ్యలు, జర్మన్ వ్యాకరణం, అన్ని రకాల పదాలు బిగ్గరగా అరిచి చెప్పుకున్నాం.’’ అన్నారు హెలెన్.
అకస్మాత్తుగా, వాళ్లు ఏదో ఒక వస్తువును ఢీకొన్నారు, అదొక గోడ.
"నేను కర్రతో తట్టుకుంటూ చూస్తే, అక్కడ ఒక టాయిలెట్ ఉందని గ్రహించాను." అని చెప్పారు జెన్నీ.
ఆ చిన్న బాత్‌రూమ్ వాళ్లకు ఆశ్రయంగా మారింది.
జంతువుల భయం పోగొట్టుకోవడానికి వాళ్లు రాత్రంతా ఒకరికొకరు పట్టుకుని కూర్చున్నారు.

ఫొటో సోర్స్, KATARINA MARTHOLM
ట్రాక్టర్ ఉంది.. కానీ తాళాల్లేవ్
"తెల్లవారుజామున, దాదాపు 150 మీటర్ల దూరంలో మూడు ఇళ్ళు కనిపించాయి. మాకు చాలా సంతోషంగా అనిపించింది. మేం సురక్షితంగా బయటపడ్డామనుకున్నాం.’’
వెళ్లి ఆ ఇళ్ల తలుపులు, కిటికీలు కొట్టారు. కానీ లోపల ఎవరూ కనిపించలేదు.
"అక్కడ మానవ సంచారం కనిపించలేదు. ఆ ఇళ్లను ఖాళీ చేసి పోయారు." అని జెన్నీ చెప్పారు.
అతి కష్టం మీద వాళ్లు ఒక తలుపు తెరవగలిగారు. తినడానికి ఏమైనా దొరుకుతుందా అని వెతికారు.
"మాకు కొంచెం పాస్తా, సూప్, 2 స్పామ్ డబ్బాలు కనిపించాయి.’’ అని జెన్నీ చెప్పారు.
కానీ అప్పటికీ వాళ్లకు మనుషులు ఎవరూ కనిపించలేదు. జెన్నీకి అప్పటికే భుజం బాగా సలుపుతోంది.
వాళ్లు మ్యాప్‌ను చూస్తే, 100 కిలోమీటర్ల దూరంలో కానీ నివాస స్థలాలు కనిపించలేదు. దాంతో పైన ఏవైనా విమానాలు వెళితే కనిపిస్తాయని, నేల మీద ఇటుకలతో ‘హెల్ప్’ అని రాశారు.
కానీ దాని వల్ల ప్రయోజనం లేకపోయింది. అక్కడ వాళ్లకు ఒక ట్రాక్టర్ కనిపించింది, కానీ దాన్ని స్టార్ట్ చేయడానికి తాళం కనిపించలేదు.
"మేము అన్నిచోట్లా వెదికాం. హెయిర్ క్లిప్‌లు, రకరకాల తాళాలతో ప్రయత్నించాం. చిట్టచివరికి ఒక తాళంతో ఇంజిన్ స్టార్ట్ అయ్యేటట్లు కనిపించింది. మాకు మళ్లీ ఉత్సాహం వచ్చింది. దానిలో ఎక్కువ గ్యాస్ లేదు, కానీ మేం బ్రతుకుతామనే ఆశ కలిగింది.’’ అని జెన్నీ చెప్పారు.
వాళ్లు ట్రాక్టర్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, ఆ తాళం విరిగిపోయింది. దాంతో అక్కడి నుంచి తప్పించుకోవాలనే వాళ్ల ఆశలు సన్నగిల్లాయి.
వాళ్ల మూడు రోజుల పర్యటనలో అది నాల్గవ రోజు. వాళ్ల ఎదుట ట్రాక్టర్ ఉంది కానీ దానిని స్టార్ట్ చేసే దారి లేదు. జెన్నీ మరో తాళం చెవిని వెతకాలని నిశ్చయించుకుంది.
హఠాత్తుగా ఆమెకు ఏదో శబ్దం వినిపించింది. "నేను చాలా డాక్యుమెంటరీలు చూశాను, అది సింహాలు చేసే శబ్దమని నాకు తెలుసు. నేను చాలా భయపడ్డాను, స్తంభించిపోయాను. హెలెన్‌ను కూడా పిలవలేకపోయాను. అయితే, హెలెన్‌కు కూడా అది వినిపించింది." అన్నారు జెన్నీ.
వాళ్లు ఇద్దరూ ట్రాక్టర్ క్యాబ్‌లోకి ప్రవేశించి, తలుపులు మూసేసి, సింహం వస్తుందేమో అని భయపడుతూ కూర్చున్నారు.

ఫొటో సోర్స్, AP/GETTY IMAGES
క్యాన్ ఓపెనర్‌తో మ్యాజిక్
జెన్నీ, హెలెన్ చాలా సేపు ట్రాక్టర్‌లో కూర్చున్నారు. ఈసారి హెలెన్ తాళం కోసం వెతకాలని నిర్ణయించుకున్నారు.
"అలసిపోయాను, భయంగా ఉంది. చచ్చిపోవడం ఖాయమని నిర్ణయించుకున్నాను. ట్రాక్టర్ స్టార్ట్ చేయడానికి అన్ని చోట్లా తాళం కోసం వెతుకుతున్నప్పుడు ఏడుపు ఆపుకోలేకపోయాను. అప్పుడే జెన్నీ లోపలికి వచ్చింది. తను నాతో మనం ఏదైనా తినాలి అంది. మేము స్పామ్ డబ్బాలను తెరవబోతున్నప్పుడు, వాటిని తెరవడానికి ఉపయోగించే క్యాన్ ఓపెనర్ తాళంలాగా ఉందని గ్రహించాను.’’ అన్నారు హెలెన్.
"క్యాన్ ఓపెనర్‌తో ప్రయత్నించడం కామెడీ ఆలోచన. కానీ హెలెన్ తన తెలివిని ఉపయోగించి, ఆ పని చేయగలను అనుకుంది. ’’ అన్నారు జెన్నీ.
"మేం ట్రాక్టర్ గ్గరకు వెళ్లి స్టార్ట్ చేశాం! అది స్టార్ట్ అయింది. మేము సింహాల సంగతి మరిచిపోయి డ్యాన్స్ చేస్తూ గెంతడం మొదలుపెట్టాం."అన్నారామె.
వాళ్లు తమకు కావలసిన సామాన్లను సర్దుకుని గ్రాస్‌ల్యాండ్స్ సఫారీ హోటల్‌కి బయలుదేరారు. కొన్ని రోజుల పాటు ఎడారిలో తిరిగి, సింహాల బారిన పడి కూడా హెలెన్, జెన్నీ సురక్షితంగా తిరిగి వచ్చారు.
జరిగిన సంఘటనలను ఇంటికి, పోలీసులకు, రాయబార కార్యాలయానికి ఫోన్ చేసి చెప్పారు.
తాము బయట పడడానికి కారణం జెన్నీ అని హెలెన్ అంటే, హెలెన్ అని జెన్నీ అంటారు.
"ఇద్దరు జెన్నీలు ఉండి ఉంటే, ఇద్దరం చనిపోయేవాళ్లం. లేదా ఇద్దరు హెలెన్‌లు ఉన్నా చనిపోయేవాళ్లం. కానీ మేము ఇద్దరమూ డిఫరెంట్ కాబట్టే బతికాం." అని జెన్నీ అన్నారు.
"మనకు అన్ని సమయాలలో ఎవరో ఒకరు తోడు అవసరం. జెన్నీ లేకుంటే ఈ రోజు నేను లేను. అలాగే నేను లేకుండా జెన్నీ ఉండేదని అనుకోను." అన్నారు హెలెన్.
ఇవి కూడా చదవండి:
- టీడీపీ, వైసీపీ మధ్య ఓట్ల తేడా ఎంత? అది ఫలితాలను ఎలా మార్చేసింది?
- చంద్రబాబు కేబినెట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..
- భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు
- చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతిలో ఎందుకు చేయడం లేదు
- ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














