మంగళసూత్రం, వెండి ఉంగరం సహా 22 బహుమతులు ఇచ్చి మళ్లీ పెళ్లి చేస్తామన్నారు... వంద జంటలు ఆశ పడ్డాయి.. కానీ తర్వాత ఏమైందంటే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లక్ష్మీ పటేల్
- హోదా, బీబీసీ కోసం
''కుటుంబ సభ్యులు లేకుండా ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న వారికి హిందూ సంప్రదాయం ప్రకారం మళ్లీ పెళ్లి చేస్తాం.
పెళ్లి చేయడంతో పాటు జంటలకు మంగళసూత్రం, లెహెంగా, వెండి పట్టగొలుసులు, బంగారు చెవిపోగులు, పరుపులు, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టౌ, మిక్సర్, కిచెన్ సెట్, స్టీల్ గిన్నెలు, వధువుకు 10 చీరలు, వరుడికి 3 జతల దుస్తులు, వాచ్, మూడు కుర్చీలు, కలశం, చేతి గడియారం, వెండి ఉంగరం వంటి 22 వస్తువుల్ని బహుమతిగా ఇస్తాం.
అంతేకాదు ప్రభుత్వం నుంచి 2 లక్షల 50వేల రూపాయలు ఇప్పిస్తాం'' అంటూ ఒక వ్యక్తి కరపత్రాలు పంచారు.
పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని ప్రేమ వివాహం చేసుకున్న చాలా జంటలు ఆశ పడ్డాయి. దాని కోసం ఒక్కో జంట ఆ వ్యక్తి అడిగిన 22, 000 రూపాయలు కూడా చెల్లించాయి.
కానీ హిందూ ఆచారాల ప్రకారం, తమ కుటుంబాల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్న 113 జంటలు మోసపోయాయి.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ ఘటన జరిగింది.
పోలీసులు నమోదు చేసిన ఫిర్యాదు ప్రకారం, అహ్మదాబాద్‌లోని ఆమ్రైవాడి ప్రాంతంలో ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న దంపతుల కోసం సామూహిక వివాహ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
కానీ, తీరా సమయానికి చూస్తే అక్కడ పెళ్లి మండపాల్లేవు, పెళ్లి ఏర్పాట్లు కూడా చేయలేదు.
పెళ్లి చేసుకోవాలనుకునే దంపతులకు మంగళసూత్రం, పెళ్లి బట్టలు, సారెగా 22 రకాల బహుమతులు, ప్రభుత్వం నుంచి రూ. 2.50 లక్షలు ఇప్పిస్తామంటూ ఒక్కో జంట నుంచి రూ. 22,000 వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘రాత్రి వెళ్లి చూస్తే అంతా ఖాళీ’’
సామూహిక వివాహాల పేరుతో మోసపోయిన వారిలో ఆమ్రైవాడికి చెందిన పంకజ్ వఘేలా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కొంతకాలం క్రితం ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత కొన్నాళ్లకు ఇరు కుటుంబాలు వారి ప్రేమ పెళ్లిని అంగీకరించాయి.
కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని పంకజ్, ఆయన భార్య కోరుకున్నారు. సామూహిక వివాహాల పేరుతో వారు మోసపోయారు.
ఈ ఘటనపై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఫిర్యాదుదారులు చెప్పిన వివరాల ప్రకారం, అహ్మదాబాద్‌లో హిందూ జన వికాస్ సేవా సంఘ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మే 27న సర్వజన సామూహిక వివాహ మహోత్సవ్ కార్యక్రమం జరగాల్సి ఉంది.
ఈ కార్యక్రమంలో ఇప్పటికే ప్రేమ వివాహాలు చేసుకున్న 113 జంటలకు హిందూ ఆచారాల ప్రకారం మళ్లీ పెళ్లి చేయనున్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ఇదే తొలిసారి.
అయితే, సామూహిక వివాహ కార్యక్రమానికి ముందురోజు రాత్రి పెళ్లి ఏర్పాట్లు చూడటానికి కొన్ని కుటుంబాలు వేదిక వద్దకు వచ్చాయి.
కానీ, అక్కడ వారికి ఎలాంటి ఏర్పాట్లు జరిగినట్లు కనిపించలేదు. నిర్వాహకుడు, హిందూ జన వికాస్ సేవా సంఘ్ ట్రస్ట్ అధిపతి ప్రకాశ్ రామ్‌బాయి పర్మర్‌ను సంప్రదించేందుకు వారు ప్రయత్నించారు. కానీ, ఆయన ఫోన్ ఎత్తలేదు.
తాము మోసపోయినట్లు ఆ కుటుంబాలు గుర్తించాయి.
సామూహిక వివాహాలు జరగాల్సిన రోజున, పెద్ద ఎత్తున ప్రజలు స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసులు ఐపీసీ సెక్షన్లు 420, 406 కింద కేసులు నమోదు చేసి, నిందితుడు ప్రకాశ్ రామ్‌బాయి పర్మర్‌ను అరెస్ట్ చేశారు.
‘‘నిందితుడు కరపత్రాల్లో ఆశ కలిగించే ప్రకటనలు ఇచ్చి, 113 జంటల నుంచి డబ్బులు వసూలు చేశారు. పెళ్లి ఏర్పాట్లు కూడా చేయలేదు. బహుమతులు ఇవ్వలేదు. నిందితుడిపై కేసు నమోదు చేశాం’’ అని పోలీసులు కేసు పెట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘మెహందీ వేడుక చేసుకున్నాం, పెళ్లి కారు మాట్లాడుకున్నాం’’
ఆస్రేవాద్‌లో నివసించే పంకజ్ వాఘేలా వయస్సు 27 ఏళ్లు. ఆయన రోజూవారీ పనులు చేస్తూ జీవనోపాధి పొందుతుంటారు. 2023 జనవరి 28న ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు ఈ పెళ్లిలో పాల్గొనలేదు.
కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకోవాలనే ఆశతో సామూహిక వివాహ కార్యక్రమం కోసం డబ్బులు కట్టారు. కానీ, మోసపోయారు.
తన పెళ్లి గురించి పంకజ్ వాఘేలా బీబీసీతో చెప్పారు.
‘‘ఏడాది క్రితం ఇంట్లో నుంచి పారిపోయి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. మా కుటుంబాలకు అప్పుడు మా పెళ్లి ఇష్టం లేదు. కొన్ని నెలల తర్వాత, మా కుటుంబాలు మా పెళ్లిని ఒప్పుకున్నాయి.
అదే సమయంలో సామూహిక వివాహాలకు సంబంధించిన కరపత్రాన్ని మాకు ఇచ్చారు. రెండు కుటుంబాల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకోవచ్చని మేం అనుకున్నాం. హిందూ జన వికాస్ సేవా సంఘ్ ఆఫీసుకు చెందిన ప్రకాశ్ పర్మర్, మీలాంటి వాళ్ల కోసమే ఈ కార్యక్రమం అని చెప్పారు.
రూ. 22 వేలు చెల్లించి వచ్చేశాం. దీనికి బదులుగా పెళ్లి ఏర్పాట్లతో పాటు మిగతా బహుమతులు ఇస్తామని ఆయన చెప్పారు. పెళ్లి తేదీ కంటే ముందే నా భార్యకు లెహెంగా ఇచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుక జరుపుకోవాలని మేం సన్నాహాలు మొదలుపెట్టాం.
మెహందీ వేడుక చేసుకున్నాం. పెళ్లి కోసం కార్లను అద్దెను తీసుకున్నాం. కార్లను అలంకరించే పనులు మొదలుపెట్టారు. కానీ, ముందు రోజు అక్కడికి వెళ్లి చూస్తే వేదిక వద్ద ఏర్పాట్లేమీ లేవు.
పెళ్లి పేరుతో మోసపోయినట్లు గ్రహించాం. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా అక్కడ మాలాంటి వారే ఉన్నారు. ఈ పథకం పేరుతో 113 జంటలు మోసపోయాయి. మా కలలన్నీ చెదిరిపోయాయి. కొంతమంది తమ పెళ్లి కోసం డీజే ఏర్పాటు చేసుకున్నారు’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘పెళ్లి కోసం బంధువులు వచ్చారు’’
సామూహిక వివాహాల పేరుతో మోసపోయిన మరో వ్యక్తి దీపక్ సోలంకి కూడా బీబీసీతో మాట్లాడారు.
తన మిత్రుడి ద్వారా ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రం తనకు దొరికిందని ఆయన చెప్పారు.
‘‘మా వాళ్లు లేకుండా నా పెళ్లి జరిగింది. ఇప్పుడు వాళ్ల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకున్నా. ట్రస్టు వారికి డబ్బులు కట్టి పెళ్లి కోసం మా బంధువులను పిలిచాను. 26వ తేదీనే కొందరు బంధువులు మా ఇంటికి వచ్చారు. భోజనం చేస్తుండగా సామూహిక వివాహాలు జరుగట్లేదని నాకు ఫోన్ వచ్చింది. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లాను. దారంతా ఏవేవో ఆలోచనలు.
పెళ్లి కోసమని బంధువుల్ని పిలిచాం. ఇంట్లో వేడుకలు నిర్వహించాం. తీరా చూస్తే ఇప్పుడంతా బాధే మిగిలింది. అహ్మదాబాద్ కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా మోసపోయిన వారిలో ఉన్నారు. వారి పరిస్థితి మరీ అధ్వాన్నం’’ అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, LAXMI PATEL
నిందితుడిపై గతంలోనూ చీటింగ్ కేసులు
సామూహిక వివాహాల పేరుతో మోసం చేసిన ప్రకాశ్ పర్మర్‌ను అరెస్ట్ చేసినట్లు మీడియా సమావేశంలో ఆమ్రైవాడి పోలీస్ ఇన్‌స్పెక్టర్ డీవీ హదత్ వెల్లడించారు.
నిందితుడు ప్రచురించిన కరపత్రంలో ఈ పథకంలో పాల్గొన్నవారికి మంగళసూత్రం, లెహెంగా, వెండి పట్టుగొలుసులు, బంగారు చెవిపోగులు, పరుపులు, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టౌ, మిక్సర్, కిచెన్ సెట్, స్టీల్ గిన్నెలు, వధువుకు 10 చీరలు, వరుడికి 3 జతల దుస్తులు, వాచ్, మూడు కుర్చీలు, కలశం, చేతి గడియారం, వెండి ఉంగరం వంటి 22 వస్తువుల్ని బహుమతిగా ఇస్తామని పేర్కొన్నారని ఆయన చెప్పారు.
ప్రభుత్వం నుంచి రూ. 2.50 లక్షలు ఇప్పిస్తామనే హామీ కూడా ఇచ్చారని వెల్లడించారు.
నిందితుడికి కోర్టు అయిదు రోజుల రిమాండ్ విధించినట్లు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారి పీఎస్ మియాత్ర బీబీసీకి చెప్పారు.
గతంలో కూడా నిందితుడు సామూహిక వివాహాల పేరుతో, రైల్వే టిక్కెట్ల పేరుతో మోసం చేసినట్లు దర్యాప్తులో తేలిందని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ‘ఒక కూతురు నుంచి ఇలాంటి మాటలు వినడం అసాధారణంగా అనిపిస్తుంది...’
- స్కూటీ అంటే అమ్మాయి, బైక్ అంటే అబ్బాయి...హైదరాబాద్‌లో పిల్లల విక్రయ ముఠా గుట్టు ఎలా బయటపడిందంటే...
- టీ20 వరల్డ్‌కప్: ఆస్ట్రేలియా నుంచి అమెరికాకు పిచ్ తరలింపు, ఎలా సాధ్యమైంది?
- స్టార్మీ డేనియల్స్: డోనల్డ్ ట్రంప్ దోషిగా తేలిన ‘హష్ మనీ’ కేసులో కీలక వ్యక్తి అయిన ఈ మహిళ ఏం చెప్పారు?
- ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమవుతాయా, గత అనుభవాలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














