ఎగ్జిట్ పోల్స్ 2024: మోదీ హ్యాట్రిక్ కొడతారా? లేక ఇండియా కూటమి బీజేపీని అడ్డుకుంటుందా?

ఫొటో సోర్స్, FB/Modi
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి.
ఎన్డీయే కూటమి మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని చాలా సంస్థల ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి.
350కి పైగా సీట్లతో ఎన్డీయే కూటమి గెలుస్తుందని, విపక్షాల ఇండియా కూటమికి 125 నుంచి 150 మధ్యలో సీట్లు రావొచ్చని పలు సర్వేలు పేర్కొంటున్నాయి.
మొత్తం 543 లోక్‌సభ స్థానాలుండగా.. అధికారం చేపట్టడానికి 272 మెజార్టీ వస్తే సరిపోతుంది. ఈ మెజార్టీని ఎన్డీయే కూటమి అధిగమిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
బీబీసీ న్యూస్ తెలుగు అందించే ఆసక్తికర కథనాలు ఇకపై నేరుగా మీ వాట్సాప్‌లో చూడండి. మా వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

ఫొటో సోర్స్, REUTERS, ANI
రిపబ్లిక్ భారత్ మాట్రిజ్ ఎగ్జిట్ పోల్
ఎన్డీయే కూటమికి 353 నుంచి 368 వరకు సీట్లు వస్తాయని రిపబ్లిక్ భారత్ మాట్రిజ్ ఎగ్జిట్ పోల్ పేర్కొంది.
ఇండియా కూటమి 118 నుంచి 133 స్థానాల్లో గెలుస్తుందని ఈ సంస్థ అంచనా వేసింది.
ఇక ఇతరులకు 43 నుంచి 48 సీట్లు వస్తాయని రిపబ్లిక్ భారత్ మాట్రిజ్ తన సర్వేలో పేర్కొంది.
దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్
ఎన్డీయే కూటమికి ఈసారి 281-350 సీట్లు రావొచ్చని దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్ పేర్కొంది.
ఇండియా కూటమికి 145-201 సీట్లు వస్తాయని ఈ సంస్థ అంచనా వేసింది.
ఇతరులు 33 నుంచి 49 సీట్లు గెలిచే అవకాశం ఉందని దైనిక్ భాస్కర్ పేర్కొంది.

జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్
ఎన్డీయే కూటమికి 377 సీట్లు, ఇండియా కూటమికి 151, ఇతరులకు 15 సీట్లు వస్తాయని జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్‌లో తెలిపింది.
రిపబ్లిక్ టీవీ-పీ మార్క్ సర్వే
రిపబ్లిక్ టీవీ-పీ మార్క్ సర్వే ఎన్డీయే కూటమికి 359 సీట్లు, ఇండియా కూటమికి 154 సీట్లు, ఇతరులకు 30 వస్తాయని అంచనా వేసింది.
ఏబీపీ సీఓటర్
ఎన్డీయే 353-383 స్థానాలలో గెలుస్తుందని ఏబీపీ సీఓటర్ సర్వే పేర్కొంది.
ఇండియా కూటమికి 152-182 స్థానాలు, ఇతరులకు 04-12 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

ఫొటో సోర్స్, Getty Images
పోటీ ప్రధానంగా ఎవరి మధ్య?
ఈ ఎన్నికలు ప్రధానంగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే (నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్) కూటమికి ఇండియా కూటమికి మధ్య జరిగాయి.
ఎన్డీయే మోదీ సారథ్యంలో మూడోసారి ఎన్నికల బరిలోకి దిగింది.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో పీఏ సంగ్మాకి చెందిన నేషనల్ పీపుల్స్ పార్టీ, నితీష్ కుమార్ పార్టీ జనతాదళ్ యునైటెడ్, చంద్రబాబు నాయుడి తెలుగుదేశం పార్టీ, ఏకనాథ్ శిందె పార్టీ శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, జయంత్ చౌదరికి చెందిన రాష్ట్రీయ లోక్‌దళ్, హెచ్‌డీ దేవెగౌడ పార్టీ జనతాదళ్(ఎస్) సహా మరికొన్ని చిన్న, పెద్ద పార్టీలు ఉన్నాయి.
ఇండియా కూటమిలో కాంగ్రెస్‌తో పాటు, వామపక్ష పార్టీలు, లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్, అఖిలేశ్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ, స్టాలిన్ పార్టీ డీఎంకే, హేమంత్ సోరెన్ సారథ్యంలోని ఝార్ఖండ్ ముక్తి మోర్చా, ఉద్దవ్ ఠాక్రేకి చెందిన శివసేన, శరద్ పవార్ పార్టీ ఎన్సీపీ, అర్‌వింద్ కేజ్రీవాల్‌కి చెందిన ఆమ్ ఆద్మీ సహా మరో రెండు డజన్ల పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
గత ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 303 సీట్లు
2019 ఎన్నికల్లో ఏప్రిల్ 11 నుంచి మే 19 మధ్య ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 353 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ సొంతంగా 303 సీట్లు సాధించింది.
కాంగ్రెస్ 52 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి 92 సీట్లు గెలుచుకుంది.
ఈసారి ఏకంగా 400కి పైగా సీట్లను గెలిచి, మూడోసారి అధికారంలోకి వస్తామని మోదీ చెబుతున్నారు. మోదీ చేస్తున్న ఈ వ్యాఖ్యలను ఇండియా కూటమి సభ్యులు కొట్టేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మోదీ, రాహుల్ ఎక్కడి నుంచి పోటీ చేశారు?
ప్రధాని నరేంద్రమోదీ తన సిట్టింగ్ నియోజకవర్గం వారణాసి నుంచి పోటీ చేయగా.. కాంగ్రెస్ ప్రధాన నేత రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్, ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీ నుంచి పోటీకి దిగారు.
రాహుల్ గాంధీకి వాయనాడ్ సిట్టింగ్ నియోజకవర్గం కాగా, రాయబరేలీ నుంచి తన తల్లి సోనియా గాంధీ స్థానంలో ఈసారి పోటీ చేశారు.
ప్రస్తుతం ఆరోగ్య కారణాల వల్ల సోనియా గాంధీ రాయబరేలీలో పోటీ నుంచి తప్పుకోగా, ఈ స్థానం నుంచి రాహుల్ పోటీకి దిగారు.
గాంధీ-నెహ్రూ కుటుంబంలోని సభ్యులు గత కొన్ని దశాబ్దాలుగా ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ, రాయబరేలి నుంచి పార్లమెంట్ సభ్యులుగా ఉంటూ వస్తున్నారు.
కానీ, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ అమేఠీ నియోజకవర్గంలో ఓడిపోయారు. అమేఠీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున కిశోరీ లాల్ శర్మ పోటీ చేశారు.

ఫొటో సోర్స్, ANI
ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతల సమావేశం
ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగియడానికి కొన్నిసేపటి ముందు విపక్ష పార్టీల ‘ఇండియా’ కూటమి నేతలు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో విపక్ష పార్టీల ప్రధాన నేతలు హాజరయ్యారు.
కౌంటింగ్ డేకు ఎలా సిద్ధం కావాలనే విషయాలపై చర్చించేందుకు ఇండియా కూటమి నేతలతో సమావేశం నిర్వహించినట్లు ఖర్గే తెలిపారు. తమ పోరాటం ఇంకా ముగియలేదని, అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు అలర్ట్‌గా ఉండాలని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఇవి కూడా చదవండి:
- ఏసీ పేలి ఇల్లంతా కాలిపోయింది.. అసలు ఏసీ ఎందుకు పేలుతుంది.. పేలకుండా ఏం చేయాలి?
- గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి: కొత్తగా తీసిన పాత కథ.. విశ్వక్సేన్ నటన మెప్పించిందా?
- స్కూటీ అంటే అమ్మాయి, బైక్ అంటే అబ్బాయి...హైదరాబాద్‌లో పిల్లల విక్రయ ముఠా గుట్టు ఎలా బయటపడిందంటే...
- ‘ఒక కూతురు నుంచి ఇలాంటి మాటలు వినడం అసాధారణంగా అనిపిస్తుంది...’
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














