మొబైల్ ఓటీపీతో ఈవీఎంలను అన్‌లాక్ చేయొచ్చా, 48 ఓట్ల తేడాతో ఓటమి వ్యవహారంలో వివాదమేంటి?

ఫొటో సోర్స్, facebook
లోక్‌సభ ఎన్నికల అనంతరం దేశంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. ప్రధాన మంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారాలూ పూర్తయ్యాయి.
కానీ, మహారాష్ట్రలోని ముంబయి వాయువ్య లోక్‌సభ నియోజకవర్గం ఫలితంపై వివాదం మాత్రం ఇంకా చల్లారలేదు.
ఆదివారం మళ్లీ ఈ వ్యవహారంపై చర్చ మొదలైంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం ఒక ఆంగ్ల దినపత్రిక క్లిప్పింగ్‌ను ట్వీట్ చేశారు.
అందులో.. శివసేన (శిందే గ్రూపు) అభ్యర్థి రవీంద్ర వాయకర్ బంధువు వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌కు ఈవీఎంను అన్‌లాక్ చేసే ఓటీపీ వస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్లుగా ఉంది.
ముంబయి వాయువ్య నియోజకవర్గంలో రవీంద్ర వాయకర్ 48 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలిచారు.
రీకౌంటింగ్ తర్వాత రవీంద్ర వాయకర్ 48 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
అయితే ఆయన ప్రత్యర్థి, శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) అభ్యర్థి అమోల్ కీర్తికర్ ఆ ఫలితంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. లెక్కింపు, ఫలితాల వెల్లడి సమయంలో అక్రమాలు జరిగి ఉంటాయని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కేసులో కోర్టును ఆశ్రయిస్తామని కూడా శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) తెలిపింది.

మీడియాలో వచ్చిన వార్తపై చర్చ ప్రారంభం కావడంతో పోలీసులు ఆ వార్త తప్పు అని వివరణ ఇస్తూ ప్రకటన విడుదల చేశారు.
మీడియా ప్రతినిధులకు వన్రాయి పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, ఇది తప్పుడు వార్త అని పోలీసులు తెలిపారు. ఈ వార్తను పోలీసులు ఇచ్చినట్లు తప్పుగా ప్రచారం చేశారని అన్నారు.
దీనితో అధికార మహా కూటమి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడిల వైపు నుంచి ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తాయి.
ముంబయి ఎన్నికల అధికారి వందనా సూర్యవంశీ తాను నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ ఆరోపణలన్నింటినీ ఖండించారు.
ఈవీఎంలను ఎట్టి పరిస్థితుల్లోనూ ట్యాంపరింగ్ చేయలేమని ఆమె అన్నారు.
ఈ వ్యవహారంలో జూన్ 14న వన్రాయ్ పోలీస్‌లో ఠాక్రే వర్గం కేసు పెట్టింది. ఆ తర్వాత కొన్ని వార్తాపత్రికలతో మాట్లాడిన పోలీసులు దీనికి వివరణ ఇచ్చారు.
"వాయకర్ బంధువు మంగేష్ పాండిల్కర్ ఈవీఎంకు కనెక్ట్ చేసిన మొబైల్ ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఫోన్‌ను మిషన్‌ను అన్‌లాక్ చేయడానికి అవసరమైన ఓటీపీని జనరేట్ చేయడానికి ఉపయోగించారు" అని పోలీసులు అన్నట్లు ఓ వార్తాపత్రిక తన కథనంలో పేర్కొంది.
ఆ ఫోన్‌ను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని, డేటాను, వేలిముద్రలను పరిశోధిస్తున్నామని పోలీసులు చెప్పినట్లుగా ఆ కథనంలో రాశారు.

ఫొటో సోర్స్, AFP
ఎన్నికల అధికారులు ఏం చెప్పారు?
ఈ విషయంపై చర్చ జరుగుతుండడంతో ముంబయి ఎన్నికల అధికారి వందన సూర్యవంశీ ఆదివారం విలేఖరుల సమావేశంలో దీనిపై వివరణ ఇచ్చారు.
"ఈవీఎంను అన్‌లాక్ చేయడానికి ఓటీపీ అవసరం లేదు. ఇది తప్పుడు వార్త, దీనికి ఎలాంటి ఆధారం లేదు" అని సూర్యవంశీ అన్నారు.
ఈవీఎంకు ఎలాంటి కమ్యూనికేషన్ మెకానిజం లేదని, ఇది ఫూల్‌ప్రూఫ్ వ్యవస్థ అని ఆమె తెలిపారు. తప్పుడు వార్తను ప్రచురించినందుకు సంబంధిత వార్తాపత్రికకు సెక్షన్ 499, సెక్షన్ 505 కింద నోటీసు జారీ చేసినట్లు ఆమె తెలిపారు.

ఫొటో సోర్స్, ANI
బీజేపీకి 40 సీట్లు కూడా వచ్చేవి కావు – ఆదిత్య ఠాక్రే
తాము మొదటి నుంచి వాయువ్య నియోజకవర్గంలో అవకతవకల గురించి చెబుతూ వచ్చామని, దీనిపై కోర్టుకు వెళతామని శివసేన (ఠాక్రే వర్గం) నేత ఆదిత్య ఠాక్రే తెలిపారు.
"ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని ఎలాన్ మస్క్ స్వయంగా చెప్పారు. ఎన్నికల సంఘం ఎలాన్ మస్క్‌పై కూడా చర్యలు తీసుకుంటుందా? ఆయన దేశానికి వస్తే ఆయననూ అరెస్టు చేస్తారా? ఎన్నికల సంఘం బీజేపీ కార్యాలయం నుంచి నడుస్తోంది" అని ఆదిత్య ఠాక్రే అన్నారు.
ఈవీఎంలు లేకుంటే బీజేపీకి 40 సీట్లు కూడా వచ్చేవి కాదని ఆయన అన్నారు.
ఈ విషయంలో శివసేన (ఠాక్రే వర్గం) నేత సుష్మా అంధారే సైతం విమర్శలు గుప్పించారు. రోజురోజుకు కొత్త విషయాలు బయటకు వస్తున్నాయని, ఈవీఎం అన్‌లాక్ చేసిన మొబైల్ రవీంద్ర వాయకర్ బంధువు వద్ద లభించాక కూడా ఆయన గెలిచినట్లు భావిస్తున్నారా? అని ఆమె ప్రశ్నించారు.
బీజేపీ నుంచి నైతికత ఆశించలేమని.. అయితే కొన్నాళ్లు బాలాసాహెబ్‌తో సన్నిహితంగా మెలిగిన వాయకర్ నుంచి నిజాయితీని ఆశిస్తున్నామని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, ANI
మా స్ట్రైక్ రేటే ఎక్కువ - ఏక్‌నాథ్ శిందే
పోలీసులు ఇచ్చిన ప్రకటనపై విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే అన్నారు.
ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎంపీలు గెలిచినప్పుడు ఈవీఎంలపై రాని అనుమానం, కేవలం వాయకర్ విషయంలోనే ఎందుకు వస్తోందని ఆయన ప్రశ్నించారు.
ముంబయిలో మహా వికాస్ అఘాడి కంటే తమకు రెండు లక్షల ఓట్లు ఎక్కువ వచ్చాయని, వారి కంటే తమ స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉందని అన్నారు. ఉద్ధవ్ ఠాక్రే కాళ్ల కింద భూమి కదులుతోందని, అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని శిందే అన్నారు.
రవీంద్ర వాయకర్ మాట్లాడుతూ, ‘‘విజేతను ప్రకటించక ముందే 6 గంటలకు కౌంటింగ్ కేంద్రానికి వెళ్లాను. అక్కడ వేలాది మంది పోలీసులు, అభ్యర్థుల తరపు మనుషులు అనేకమంది ఉన్నారు. అక్కడ ఏమైనా అవకతవకలకు పాల్పడే అవకాశం ఉందా?’’ అని ప్రశ్నించారు.
ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యం కాదని, ఎన్నికల సంఘం ఎన్నికలను సక్రమంగా నిర్వహించిందని, దీనిని వివాదాస్పదం చేయవద్దని కోరారు.

ఫొటో సోర్స్, ANI
ఎన్నికల సంఘం సమావేశం ఏర్పాటు చేయాలి - పృథ్విరాజ్ చవాన్
ముంబయి వాయువ్య నియోజకవర్గంలో లెక్కింపు కేంద్రానికి అనుమతి లేకుండా ఫోన్ తీసుకువెళ్లారని, దానిని రవీంద్ర వాయకర్ బంధువు వాడుతున్నాడని తెలిసిందని కాంగ్రెస్ నేత పృథ్విరాజ్ చవాన్ అన్నారు.
‘జూన్ 4న ఓట్ల లెక్కింపు రోజున ఈ ఘటన జరిగింది. దీనిపై జూన్ 14న పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఎఫ్‌ఐఆర్‌ను గోప్యంగా ఉంచారు. ఫిర్యాదు చేసిన వ్యక్తికి కాపీ కూడా ఇవ్వలేదు’ అని కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ ఆరోపించారు.
ఈవీఎంలను తెరవడానికి మొబైల్ ఓటీపీని జనరేట్ చేయాలని వినడం ఇదే మొదటిసారి అని చవాన్ అన్నారు. అలాగే, సర్వీస్ ఓటర్ల కోసం ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ గురించి తాను వినడం ఇదే మొదటిసారి అని ఆయన అన్నారు. ఈ సిస్టమ్‌ను హ్యాక్ చేశారా? అని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
48 ఓట్లతో ఓడిపోయిన కీర్తికర్ అంతకుముందు రౌండ్‌లో ఆధిక్యంలో ఉన్నారని పృథ్వీరాజ్ చవాన్ తెలిపారు. ఎన్నికల సంఘం ఒక సమావేశం ఏర్పాటు చేసి దీనిపై వివరణ ఇవ్వాలని ఆయన కోరారు.
ఎలాంటి ఎలక్ట్రానిక్ మెషీన్‌ను అయినా హ్యాక్ చేయవచ్చని స్వయంగా ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారని చవాన్ గుర్తు చేశారు. ఈ అపోహలన్నీ తొలగించడానికి, ఎన్నికల సంఘం ప్రతిపక్ష పార్టీల నేతలందరినీ సమావేశపరిచి, తిరిగి ఎన్నికల ప్రక్రియపై విశ్వాసాన్ని నెలకొల్పడానికి ప్రయత్నించాలని చవాన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty, ANI
మస్క్, చంద్రశేఖర్ మధ్య మాటల యుద్ధం
అంతకుముందు టెస్లా, స్పేస్‌ఎక్స్‌ల అధినేత ఎలాన్ మస్క్ శనివారం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం)లపై చేసిన ట్వీట్‌తో కొత్త వివాదం తలెత్తింది. ఈవీఎంల వినియోగాన్ని నిలిపివేయాలని మస్క్ ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే గత ఎన్‌డీఏ ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా ఉన్న రాజీవ్ చంద్రశేఖర్ మస్క్ వాదనను తోసి పుచ్చారు.
సాంకేతిక రంగంలో పనిచేసిన రాజీవ్ చంద్రశేఖర్ చిప్ డిజైనింగ్ రంగంతోనూ పరిచయం ఉంది. ఎక్స్‌లో(ట్విట్టర్) వారిద్దరి మధ్యా వాదోపవాదాలు జరిగాయి.
మస్క్ అమెరికా అధ్యక్ష అభ్యర్థి రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ, మనం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఉపయోగించడం మానేయాలి. ఇది మానవులు లేదా ఏఐ ద్వారా హ్యాక్ అయ్యే అవకాశం ఉంది," అన్నారు.
మస్క్ ట్వీట్‌కు సమాధానమిస్తూ రాజీవ్ చంద్రశేఖర్, "మస్క్ మాట్లాడుతున్నది అమెరికాలో లేదా మరెక్కడైనా కావచ్చు. అక్కడ ఇంటర్నెట్‌తో కనెక్ట్ చేసిన ఓటింగ్ యంత్రాలు ఉన్నాయి. కానీ భారతీయ ఈవీఎంలు భిన్నమైనవి. వాటిని ప్రత్యేకంగా రూపొందించారు. అవి సురక్షితమైనవి, వాటిని నెట్‌వర్క్ లేదా మీడియాకు కనెక్ట్ చేయరు" అని వివరించారు.
"ఈవీఎంలను భారతదేశంలో మాదిరి తయారు చేయాలి. అందుకోసం వాటిని ఎలా తయారు చేయాలో చెప్పే ట్యుటోరియల్‌ను పంపమంటే సంతోషంగా ఆ పని చేస్తాం" అని చంద్రశేఖర్ అన్నారు.
చంద్రశేఖర్ వివరణకు మస్క్ క్లుప్తంగా, "దేనినైనా హ్యాక్ చేయవచ్చు" అంటూ సమాధానమిచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఫలితాల రోజు ఏం జరిగింది?
ముంబయిలోని వాయువ్య లోక్‌సభ నియోజకవర్గం తొలి రౌండ్ కౌంటింగ్‌లో రవీంద్ర వాయకర్ ఆధిక్యంలో ఉన్న సమయంలో రాత్రి 9.30 గంటల వరకు ఫలితం తేలలేదు. అయితే ఆ తర్వాత అమోల్ కీర్తికర్ ఆధిక్యం సాధించారంటూ 2 వేల ఓట్ల తేడాతో విజేతగా ప్రకటించారు.
పోస్టల్ ఓట్లలో కీర్తికర్ 2100 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. దీంతో పోస్టల్ ఓట్లను మళ్లీ లెక్కించాలని రవీంద్ర వాయకర్ డిమాండ్ చేశారు. రీకౌంటింగ్‌లో రవీంద్ర వాయకర్ 48 ఓట్ల తేడాతో గెలుపొందారు.
ఈవీఎం ఓట్ల లెక్కింపులో కీర్తికర్, వాయకర్ మధ్య ఒక్క ఓటు తేడా వచ్చింది. కీర్తికర్‌కు 4 లక్షల 995 ఓట్లు రాగా, రవీంద్ర వాయకర్‌కు 4 లక్షల 994 ఓట్లు వచ్చాయి.
అయితే పోస్టల్ ఓట్ల లెక్కింపు అనంతరం వాయకర్‌ను విజేతగా ప్రకటించారు. మొత్తం 3 వేల 49 పోస్టల్ ఓట్లు ఉన్నాయి. ఇందులో కీర్తికర్‌కు 1500 ఓట్లు రాగా, వాయకర్‌కు 1549 ఓట్లు వచ్చాయి.
అమోల్ కీర్తికర్ కేవలం 48 ఓట్ల తేడాతో ఓడిపోవడంతో ఓట్ల లెక్కింపు సమయంలో మోసం జరిగిందని శివసేన ఠాక్రే వర్గం అనుమానిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- టీడీపీ, వైసీపీ మధ్య ఓట్ల తేడా ఎంత? అది ఫలితాలను ఎలా మార్చేసింది?
- చంద్రబాబు కేబినెట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..
- భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు
- చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతిలో ఎందుకు చేయడం లేదు
- ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














