పన్నెండు రోజుల్లో 1,000 కిలోమీటర్లు పరుగెత్తిన 52 ఏళ్ల మహిళ, ఇంత సాహసం ఎందుకంటే...

ఫొటో సోర్స్, Project 1000
- రచయిత, కెల్లీ ఎన్జీ
- హోదా, బీబీసీ న్యూస్
‘‘నేను ఒక్కో అడుగు, ఒక్కో కిలోమీటర్ పరుగెత్తాలి. అల్ట్రా రన్నింగ్ అనేది కష్టంతో కూడిన ఇష్టమైన పని’’ అని మలేసియా తూర్పు తీరం దగ్గర రికార్డు చేసిన వాయిస్ మెసేజ్‌లో నటాలీ దావ్ అన్నారు.
52 ఏళ్ల నటాలీ తన వెయ్యి కిలోమీటర్ల పరుగులో మూడోవంతు పూర్తి చేశాక, ముందుకు సాగడం ఆమెకు కష్టంగా మారుతోంది. థాయ్‌లాండ్ నుంచి సింగపూర్ వరకు 1000 కిలోమీటర్ల పరుగును ఆమె ప్రారంభించారు.
12 రోజుల్లో ఈ వెయ్యి కిలోమీటర్లు పూర్తిచేయాలనేది ఆమె లక్ష్యం.
‘‘అసలు నేను ఈ పరుగును పూర్తిచేస్తానా? అని ఈ నాలుగు రోజుల్లో ఈ రోజే నాకు మొదటిసారిగా అనిపించింది. క్రీడల్లో ఎదురయ్యే సవాళ్లు అంటే నాకిష్టం. కానీ, ఇలా కుంగిపోవడం నాకు నచ్చదు. తరచుగా ఇలా అనిపిస్తుంటుంది.’’ అని ఆమె తన వాయిస్ మెసేజ్‌లో అన్నారు.
12 రోజుల్లో తాను అనుకున్న లక్ష్యాన్ని పూర్తిచేయడానికి నటాలీ రోజుకు కనీసం 84 కి.మీ పరుగెత్తాలి. అంటే రెండు మారథాన్లతో సమానం.
నటాలీ ఒక అల్ట్రా రన్నర్. మారథాన్ లక్ష్యమైన 42.2 కి.మీ కంటే ఎక్కువ దూరం అల్ట్రా రన్నర్లు పరిగెడతారు. కానీ, ఆమె మామూలు అథ్లెట్లలా శిక్షణ తీసుకోలేదు. ఫిట్‌నెస్ కోసం ఆమె పరుగెత్తడం మొదలుపెట్టారు. అది కూడా 35 ఏళ్లు దాటాకా (లేట్ థర్టీస్).

ప్రపంచవ్యాప్తంగా రన్నింగ్‌కు ప్రాధాన్యం పెరిగింది. పశ్చిమ దేశాల్లో దీని వృద్ధి మరింత ఎక్కువ ఉన్నట్లు చాలా గణాంకాలు చూపిస్తున్నాయి.
తైవాన్, కంబోడియా, జపాన్ వంటి పలు దేశాలు పాపులర్ మారథాన్లకు ఆతిథ్యం ఇస్తున్నప్పటికీ ఆసియాలో రన్నింగ్‌కు సంబంధించి ఇలాంటి గణాంకాలు రావడం కష్టం.
నటాలీ తరహాలో సవాళ్లను స్వీకరించే మరింత మంది అథ్లెట్లను గుర్తించడమే పెద్ద సవాలు.
‘‘రేసులో విజేతగా నిలుస్తామా? అందరి కంటే ఆఖరున రేసును ముగిస్తామా? అనేది ముఖ్యం కాదు. దాదాపు మానవాతీతమైన పని చేయడం ముఖ్యం. ఇలాంటి పనుల్ని ప్రపంచ జనాభాలో కేవలం 0.05 శాతం మాత్రమే చేయగలరు’’ అని ఆమె అన్నారు.
ఈ రేసులో ఆమెకు చాలా అవస్థలు ఎదురయ్యాయి. ఎండలో గంటల పాటు పరిగెత్తడంతో ఆమె వడదెబ్బ బారిన పడ్డారు. చాలా అలసిపోయారు. రేసు మొదలుపెట్టిన తొలిరోజే ఆమె తుంటి ఎముక ఇబ్బంది పెట్టింది. మూడో రోజున యూరినరీ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారు.
అయినప్పటికీ, ఆమె జూన్ 5వ తేదీన రేసును విజయవంతంగా ముగించారు. ఆరోజున వీకెండ్ కానప్పటికీ ఆమెకు మద్దతుగా వందలమంది రన్నర్లు ఆమెతో కలిసి పరుగెత్తారు.

ఫొటో సోర్స్, Project 1000
పన్నెండు రోజుల కష్టాలు
‘‘ఈ రేసు కంటే ముందు నేను పరుగెత్తిన అత్యధిక దూరం 200 కి.మీ. ఆ తర్వాత నాకు నేను ఇంతకుమించిన లక్ష్యాన్ని పెట్టుకోవాలనుకున్నా.’’ అని వెయ్యి కిలోమీటర్ల రేసును ముగించిన తర్వాత బీబీసీతో నటాలీ చెప్పారు.
థాయ్ సరిహద్దుల నుంచి మలేసియా మీదుగా సింగపూర్ వరకు పరుగెత్తాలని ఆమె సెప్టెంబర్‌లో అనుకున్నారు. ఆమె స్నేహితులు చాలామంది ఈ పరుగులో ఆమెకు సహాయపడ్డారు. దీనికి ‘ప్రాజెక్ట్ 1000’ అనే పేరు పెట్టారు.
‘‘అప్పట్లో నాకేమీ తెలియదు. ఇలాంటి పరుగు కోసం ఎలాంటి ప్రణాళికలు అనుసరించాలో నాకు తెలియదు. నా దృష్టిలోకి రాని విషయాలను కూడా నా స్నేహితులు ఆలోచించి నాకు చెప్పేవారు. ఒకవేళ ఏదైనా జరిగితే ఆసుపత్రి అందుబాటులో ఉండకపోతే ఎలా? సరిహద్దులు దాటడానికి ఏం చేయాలి ? ఇలాంటి ప్రశ్నలు నా స్నేహితులు చర్చించేవారు’’ అని నటాలీ చెప్పారు.
అల్ట్రా మారథాన్ చేస్తున్నప్పుడు తనకు ఎదురైన అనుభవాల గురించి ఆమె బీబీసీకి వాయిస్ నోట్స్ పంపించేవారు.

ఫొటో సోర్స్, Project 1000
మారథాన్ మూడో రోజున, ఆమెతో పాటు ఆమె బృందం రోజూ రాత్రి 2 నుంచి 3 గంటలే నిద్రపోవాలని నిర్ణయించుకున్నారు. ఎండ నుంచి తప్పించుకోవడానికి అర్ధరాత్రి దాటాక పరుగు ప్రారంభించాలని అనుకున్నారు.
‘‘ రాత్రి 8 గంటలకు భోజనం చేసి, అలారం పెట్టుకొని 11:30 గంటలకు లేచి పరుగెత్తడం సరదా ఏం కాదు’’ అని ఆమె మరో వాయిస్ మెసేజ్‌లో పేర్కొన్నారు.
ప్రతిరోజూ ఉదయం లేచాక, ఒకవేళ నేను ఈరోజు పరిగెత్తలేకపోతే ఎలా? అనే భయమేసేది అని ఆమె చెప్పారు.
‘‘రేసు ముగింపు లైను చాలా దూరంలో ఉంది. దరిదాపుల్లో కూడా లేదు. అది ఎక్కడ ఉందో కూడా తెలియకుండానే మనసుకు ధైర్యం చెప్పుకొని పరిగెత్తడం అంత సులువు కాదు. రేసు ముగింపుకు వచ్చే సమయానికి నా శరీరంలో ఏమాత్రం శక్తి లేకుండా పోయింది. నిలువునా కూలినట్లు అయింది’’ అని ఆమె తెలిపారు.
కాళ్లకు బొబ్బలు రావడంతో ఆమె ప్లాస్టర్లు వేసుకున్నారు.
‘‘నడవడం కూడా చాలా కష్టంగా మారింది. పూర్తిగా అలసిపోయాను. ఇంటికి వెళ్లి నా కుటుంబాన్ని చూస్తే చాలు అనుకున్నా. నిజం చెప్పాలంటే ఎప్పుడెప్పుడు ఈ రేసు ముగింపు లైను దాటుతానా అని ఉత్సాహంగా ఎదురుచూశా’’ అని పదో రోజు పరుగు తర్వాత ఆమె వాయిస్ నోట్స్‌లో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Project 1000
రూ. 30 లక్షలు విరాళాల సేకరణ
‘ప్రాజెక్టు 1000’ని పూర్తి చేయడం ద్వారా వ్యక్తిగత ఘనత చేరడమే కాకుండా ఒక మంచి పని కోసం విరాళాలు సమకూరాయని ఆమె చెప్పారు. ఈ ప్రాజెక్టు మహిళలను శక్తిమంతం చేస్తుందని ఆశించినట్లు ఆమె తెలిపారు.
మరింత మంది మహిళలు, బాలికలు క్రీడల్లోకి వచ్చేలా ప్రోత్సహిస్తూ, వారికి ఆర్థికంగా సహాయం చేసే జీఆర్‌ఎల్‌ఎస్ చారిటీ కోసం ‘ప్రాజెక్టు 1000’ పరుగు ద్వారా రూ. 30 లక్షల విరాళాలు సేకరించినట్లు చెప్పారు.
‘‘ప్రజలు విరాళం ఇచ్చినా, ఇవ్వకపోయినా మా వైపు నుంచి ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఇది ఒక వేదిక. బాలికల కోసమే కాదు వృద్ధులైన మహిళల కోసం కూడా నేను ఈ పని చేస్తున్నా. కొత్త సవాళ్లను మనం స్వీకరించగలమని నేను నిరూపించాలనుకున్నా’’ అని ఆమె అన్నారు.
ఇంత సుదీర్ఘ దూరం అల్ట్రా రన్నింగ్ చేయడానికి స్పాన్సర్లు, సహాయక సిబ్బంది అవసరం ఉంటుంది.
అల్ట్రా రన్నింగ్ కాకపోయినా, అందరూ మామూలు రన్నింగ్ క్రీడల్లో పాల్గొనవచ్చని ఇలాంటి రేసుల్లో పాల్గొనే ఇతర అథ్లెట్లు చెబుతున్నారు.
‘‘పరిగెత్తడానికి ఒక జత బూట్లు తప్ప ఇంకేం అవసరం లేదు’’ అని హాంకాంగ్‌కు చెందిన అల్ట్రా రన్నర్ జాన్ ఎల్లిస్ అన్నారు.
‘‘రన్నింగ్ రేసుల పోటీలు సరదాగా ఉంటాయి. రేసు బరిలో దిగి కొత్త లక్ష్యాలను అధిగమిస్తుంటే చాలా బాగుంటుంది’’ అని హాంకాంగ్ జర్నలిస్ట్ మేరీ హుయ్ అన్నారు. మేరీ కూడా సుదూర ట్రయల్ రన్ రేసుల్లో పాల్గొంటారు.
ఇవి కూడా చదవండి:
- టీడీపీ, వైసీపీ మధ్య ఓట్ల తేడా ఎంత? అది ఫలితాలను ఎలా మార్చేసింది?
- చంద్రబాబు కేబినెట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..
- భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు
- చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతిలో ఎందుకు చేయడం లేదు
- ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














