సమ్మర్@ 52డిగ్రీస్: పిల్లలు స్పృహ తప్పి పడిపోయేంత ఉష్ణోగ్రతతో పోరాడుతున్న ఓ నగరం కథ

- రచయిత, రియాజ్ సోహైల్
- హోదా, బీబీసీ ఉర్దూ
"రోజంతా చాలా వేడిగా, పొడి వాతావరణం ఉంటుంది. చాలా నిస్సత్తువ ఆవరిస్తుంది. అందుకే ఏ పని చేయలేకపోతున్నాం.’’ఇది హక్ నవాజ్ పరిస్థితి.
ఆయన పాకిస్తాన్‌లోని అత్యంత వేడిగా ఉండే జాకోబాబాద్ నగరంలో పని చేస్తారు. ఉదయం సూర్యకిరణాలు భూమిని తాకకముందే ఇతర కూలీలతో కలిసి బట్టీలో ఇటుకల తయారీని మొదలుపెడతారు.
సూర్యోదయం అయ్యాక గంటలు గడుస్తున్న కొద్దీ ఈ కార్మికులు పని చేయడం చాలా కష్టంగా మారుతుంది.
ఉత్తర సింధ్‌లోని జాకోబాబాద్ నగరంలో ఎనిమిది కంటే ఎక్కువ ఇటుక బట్టీలు ఉన్నాయి. వాటిల్లో 5 వందల మందికి పైగా కార్మికులు పని చేస్తుంటారు.
పాకిస్తాన్‌లో అత్యంత వేడిగా ఉండే నగరాల్లో జాకోబాబాద్ ఒకటి. ఇక్కడ ఉష్ణోగ్రత 52 డిగ్రీల వరకు చేరుకుంటుంది.
బట్టీలో పని చేసే కూలీ అయినా, పొలంలో పనిచేసే రైతు అయినా ఇంత వేడిలో, తీవ్ర ఎండలో పని చేయడం చాలాకష్టం.
పాకిస్తాన్ ఆర్థిక సర్వే-2024 వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రపంచ ఉష్ణోగ్రతల కంటే పాకిస్తాన్‌లో వేడి ఎక్కువగా పెరుగుతుందని అంచనా. ఇక్కడ 2060 నాటికి ఉష్ణోగ్రతలు కనీసం 1.4 నుంచి 3.7 డిగ్రీ సెల్సియస్ పెరుగుతుందని అంచనా.
మరి జాకోబాబాద్‌లోని సామాన్య ప్రజలు తీవ్రమైన ఎండ, వేడిని తట్టుకోవడానికి ఏం చేస్తారు? ఎండాకాలంలో వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఈ విషయాలు తెలుసుకోవడానికి బీబీసీ ప్రయత్నించింది.


ఫొటో సోర్స్, SHAHID ALI/AFP VIA GETTY IMAGES
ఎండ కారణంగా పని మీద ఎలాంటి ప్రభావం పడుతుందని అడిగినప్పుడు నగరంలోని సుమారు ఎనిమిది ఇటుక బట్టీలలో పనిచేస్తున్న కార్మికులందరూ వేడి కారణంగా తీవ్రమైన అనారోగ్యం పాలయ్యారని హక్ నవాజ్ అనే వ్యక్తి చెప్పారు.
ఒకవైపు పని చేసేటప్పుడు వేడి, దాహంతో అలసిపోయి ఎక్కువ పని చేయలేకపోతుంటే, మరోవైపు వేడి కారణంగా అరపూట మాత్రమే పనిచేయగలుగుతున్నామని అన్నారు. ఆదాయంపై ప్రభావం పడుతుందని తెలిపారు.
బట్టీలో పని చేసే కూలీలందరూ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి 8-9 గంటల వరకు పనిచేస్తారని నవాజ్ చెప్పారు.
ఒక కూలీ 500-600 ఇటుకలు తయారు చేస్తే అతనికి 500 రూపాయల కూలీ అందుతుందని ఆయన తెలిపారు.
చలి కాలంలో ఒక కార్మికుడు ఒక రోజులో 900-1000 ఇటుకలను తయారు చేయగలడని, ఆ సమయంలో సంపాదన రెట్టింపు అవుతుందని చెప్పారు.
హక్ నవాజ్, మట్టి ముద్దను బయటకు తీసి ఒక అచ్చులో వేసి ఇటుకను తయారు చేస్తారు. ఆయన తన నైపుణ్యం, వేగాలతో ఎక్కువ ఇటుకలను తయారు చేస్తారు.
మధ్యాహ్న సమయంలో విపరీతమైన వేడి ఉంటుందని, పని చేయడం కుదరదని, అందుకే తెల్లవారకముందే పని మొదలుపెడతామని ఆయన అన్నారు.
“అప్పుడే తయారు చేసిన ఇటుకలను బట్టీలో కాల్చుతారు. అప్పుడు చాలా వేడి పుడుతుంది. ఉదయం వేళలో కూడా అక్కడ చాలా వేడిగా అనిపిస్తుంది’’ అని ఆయన చెప్పారు.

‘పిల్లలకు తరచుగా స్నానం చేయిస్తాం’
జాకోబాబాద్‌లో బట్టీల్లో కూలీ పనితోపాటు చాలామంది వ్యవసాయం కూడా చేస్తారు. ఇక్కడ గోదుమలు, వరి సాగు చేస్తారు.
జాకోబాబాద్‌లోని కస్బా గోత్ అరికాప్‌కు చెందిన మహిళలు పొలాల్లో పని ముగించుకుని త్వరగా ఇంటికి చేరుకుంటారు. మిగిలిన సమయమంతా ఎండ నుంచి పిల్లలను రక్షించుకోవడానికే సరిపోతుంది.
చలికాలంలో పొలాల నుంచి తిరిగొచ్చిన తర్వాత ఈ మహిళలు తమ ఇళ్లలో కుట్టుపని, అల్లికలు చేస్తుంటారు. కానీ, వేసవిలో ఎండ వేడి నుంచి పిల్లల ఆరోగ్యాన్ని కాపాడటంపైనే వారు దృష్టి సారిస్తున్నారు. వేసవిలో వారి దినచర్య మారుతుంది.
మట్టి ఇంటి వరండాలో కూర్చున్న జన్నత్ ఖాతూన్ తాను ఉదయం 10 గంటలకు పని ముగించుకొని ఇంటికి తిరిగి వస్తానని చెప్పారు.
ఎండవేడికి పిల్లలు నిద్రపోలేకపోతున్నారని, అందుకే తరచూ స్నానం చేయించడమో, లేదా దుస్తులపై నీళ్లు చల్లడం చేయాల్సి వస్తోందని జన్నత్ ఖాతూన్ చెప్పారు.
పిల్లలే కాకుండా పెద్దలు కూడా ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం చేతిపంపు కింద స్నానం చేస్తారని ఆమె చెప్పారు.
జాకోబాబాద్‌తో పాటు, దాని శివారు ప్రాంతాలు తరచుగా విద్యుత్ కోతలను ఎదుర్కొంటున్నాయి. ఈ తీవ్రమైన ఎండాకాలంలో కూడా రోజుకు పది గంటల విద్యుత్ కోతలు ఉంటున్నాయని తెలిపారు.
ఇక్కడి ధనవంతులు సౌరశక్తి కోసం చూస్తున్నారు. కానీ, పేదలు ఎండాకాలంలో విద్యుత్ కోతలు ఎదుర్కోవడానికి సంప్రదాయ, స్వదేశీ మార్గాలను అవలంబిస్తున్నారు.

నిహాల్ ఖాన్ లాషారి అనే గ్రామంలో గాడిదతో నడిచే ఫ్యాన్, పిండి మిల్లును మేం చూశాం. గుండ్రంగా తిరిగే ఒక పోల్ మీద అడ్డంగా కర్రను ఉంచి దాని రెండు కొనల మీద బెడ్‌షీట్లను అమర్చారు. పోల్‌కు కట్టేసిన గాడిద గుండ్రంగా తిరిగినప్పుడు ఆ కర్ర కూడా తిరుగుతూ దానిపై ఉన్న బెడ్‌షీట్లు ఎగురుతాయి. ఫలితంగా గాలి వస్తుంది. విద్యుత్ సౌకర్యం లేనప్పటి నుంచి ఇక్కడ ఇదే వ్యవస్థను వాడుతున్నారు.
రిటైర్డ్ టీచర్ షఫీ మహ్మద్ లాషారీ మాట్లాడుతూ, ‘‘మధ్యాహ్నం విసనకర్ర, సాయంత్రం ఫ్యాన్ వాడతాం. రాత్రిపూట గాడిదకు మూడు కిలోల బియ్యం లేదా గింజలు తినిపిస్తాం. తర్వాత అది రాత్రంతా తిరుగుతుంటే, బెడ్‌షీట్ల ద్వారా వచ్చే గాలికి నిద్రపోతాం’’ అని చెప్పారు.
అదే గ్రామంలో, ప్రజలు పిండి రుబ్బుకోవడానికి గాడిదతో నడిచే మిల్లును కూడా నిర్మించారు. ఇక్కడ కూడా గాడిదనే వాడతారు.
స్థానిక వ్యక్తి మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ, కరెంటు రాకపోతే తమ వద్ద ఉన్న ఏకైక పరిష్కారం ఇదేనని అన్నారు.

‘ఐస్ లేకపోతే పిల్లలు తట్టుకోలేరు’
విపరీతమైన ఎండ కారణంగా జాకోబాబాద్ నగరంలో షర్బత్, ఐస్ వ్యాపారం పెరిగింది.
మామూలు రోజుల్లో మొహమ్మద్ దానిష్ మూడు నుంచి నాలుగు ఐస్ ప్యాక్‌లను అమ్ముతారు. వేసవిలో ఆయన వద్ద ఐస్ అమ్మకాలు చాలా పెరుగుతాయి.
జాకోబాబాద్‌లో తగినంత విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల, ఇతర నగరాల నుంచి ఐస్ గడ్డలను ఆర్డర్ చేస్తామని ఆయన అన్నారు.
జాకోబాబాద్ ప్రజలు ఐస్‌ను రూ.50 నుంచి రూ.300 వరకు వెచ్చించి కొనుగోలు చేస్తారని చెప్పారు.
కరెంటు లేకపోవడంతో ఏసీ, రిఫ్రిజిరేటర్లు పనిచేయడం లేదని, అందుకే బయటి నుంచి ఐస్ కొంటున్నామని స్థానికుడు అబ్దుల్ రజాక్ చెప్పారు.
ఎండవేడి కారణంగా పిల్లలు స్పృహతప్పి పడిపోతున్నారని ఆయన అన్నారు.
18వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ సైన్యానికి చెందిన జనరల్ జాన్ జాకబ్ ఈ నగరాన్ని నిర్మించారు. ఆయన పేరు మీదుగా ఆ నగరానికి జాకోబాబాద్ అని పేరు పెట్టారు.

ఫొటో సోర్స్, AFP VIA GETTY IMAGES
సాయంత్రమే షాపింగ్
ఈ ప్రాంతాల్లో మహిళలు సూర్యాస్తమయం తర్వాత ఇళ్ల నుంచి బయటకు వెళ్లేవారు కాదు. కానీ, వాతావరణంలో మార్పుల కారణంగా మహిళలు సాయంత్రం నుంచి రాత్రి వరకు షాపింగ్ చేస్తారు.
మధ్యాహ్నం మూడింటికి జాకోబాబాద్ మెయిన్ బజార్‌కు చేరుకున్నాం.
ఈద్‌కు ఇంకా కొన్ని రోజులే ఉన్నప్పటికీ, ఇక్కడ కర్ఫ్యూ లాంటి వాతావరణం నెలకొంది. మార్కెట్ నిశ్శబ్దంగా ఉంది. ఒక్క కొనుగోలుదారుడు కూడా కనిపించలేదు.
సాయంత్రం ప్రార్థనల తర్వాత మహిళలు వస్తారని, తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు దుకాణదారులు ఖాళీగా కూర్చుంటారని కాస్మెటిక్ దుకాణం యజమాని మొహసిన్ అలీ చెప్పారు.
“జాకోబాబాద్ నగరంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో చెట్లు చాలా పరిమితంగా ఉన్నాయి. అక్కడ ఉన్న కొన్ని చెట్లను ప్రజలు రక్షించారు. కానీ, చాలా చెట్లు ఎండిపోయాయి’’ అని వాతావరణ మార్పుల ప్రభావాలపై పనిచేస్తున్న ఎన్జీవో టెంటిమ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ కార్యకర్త జాన్ ఒధానో అన్నారు.
వాతావరణ మార్పులు, రాబోయే రోజుల్లో దాని ప్రభావం గురించి ఇక్కడి ప్రజలకు తగినంత అవగాహన లేదని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- టీడీపీ, వైసీపీ మధ్య ఓట్ల తేడా ఎంత? అది ఫలితాలను ఎలా మార్చేసింది?
- చంద్రబాబు కేబినెట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..
- భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు
- చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతిలో ఎందుకు చేయడం లేదు
- ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














