రక్త పిశాచాలు ఉన్నాయా? లేవా?

- రచయిత, మిలికా రాడెన్‌కోవిక్ జెరెమిక్
- హోదా, బీబీసీ ప్రతినిధి
సెర్బియాలో 18వ శతాబ్దపు ప్రారంభంలో డజన్ల కొద్దీ ప్రజలు అంతుపట్టని రీతిలో చనిపోతుండేవారు. అంతకు ముందు ఇక్కడ మరణించిన వ్యక్తులే తమను వెంటాడినట్లు చనిపోయేముందు కొందరు ఆరోపించారు. ఇలా చనిపోయినవారు ఎవరో గొంతు నులిమినట్లుగా, ఊపిరి అందనట్లుగా ప్రవర్తించేవారు.
మరీ ముఖ్యంగా రెండు చిన్న గ్రామాలు ఇలాంటి పుకార్లకు కేంద్రంగా మారాయి. సెర్బియాకు దక్షిణాన ఉన్న మెద్వెడ్జా, ఈశాన్య ప్రాంతంలోని కిసిల్జెవో గ్రామాల్లో ఈ అంతుపట్టని మరణాలు సంభవించాయని చెబుతారు.
ఈ గ్రామాలు ఒకదానికొకటి 200 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అయితే ఒక దశాబ్ద కాలంలో, ఇక్కడ జరిగిన సంఘటనలు ఒకే రకంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ మరణాలకు కారణాలను పరిశోధించడానికి ఆస్ట్రియన్ వైద్యులను అక్కడికి పంపగా, వాళ్లు తాము కనుగొన్న విషయాలన్నిటిపై కొన్ని రిపోర్టులు తయారు చేశారు. అవి మొదట ఆస్ట్రియన్ మీడియాకు, తరువాత పరిశోధకులకు అందాయి.
‘వాంపైర్స్: ది ఆరిజిన్ ఆఫ్ ది యూరోపియన్ మిత్’ అనే పుస్తక రచయిత, జర్మన్ చరిత్రకారుడు థామస్ ఎమ్. బోన్, 1725లో ‘వెయ్‌నెరిషెస్ డయారియమ్’ అనే ఆస్ట్రియన్ దినపత్రికలో 'వాంపైర్' (రక్తపిశాచి) అనే పదం మొదట కనిపించిందని అన్నారు.
రక్త పిశాచి అనే పౌరాణిక జీవి, బతికి ఉన్నవారి రక్తాన్ని తాగుతుందని అంటారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్కృతులలో రక్తపిశాచాలు కనిపించినట్లు చెబుతారు. అయితే 18వ శతాబ్దంలో, ఇలాంటి నివేదికల తర్వాత పశ్చిమ ఐరోపాలో 'రక్తపిశాచి’ అనే పదం ప్రాచుర్యం పొందింది.


అనువాదంలో పొరపాటు?
1725లో కిసిల్జెవో గ్రామంలో రెండు రోజుల్లో తొమ్మిది మంది మరణించారు. వారందరూ తాము మరణించడానికి ముందు ఒక పొరుగు వ్యక్తి గురించి మాట్లాడినట్లు చెబుతారు.
కొన్నాళ్ల ముందు మరణించిన పీటర్ బ్లాగోజెవిక్ అనే వ్యక్తి తమకు కలలో కనిపించి, తమ గొంతును నులిమినట్లు అనిపించిందని వాళ్లు చెప్పారు.
ఈ సంగతి కనుక్కోవడానికి, స్థానికులు బ్లాగోజెవిక్ సమాధిని తెరిచి, అందులో భద్రంగా ఉన్న అతని మృతదేహాన్ని చూశారు. దెయ్యం ప్రమేయం ఉందనడానికి ఇదే సాక్ష్యమని వాళ్లు భావించారు.
"ముఖం, చేతులు, కాళ్ళు, అతని శరీరం మొత్తం సజీవంగా ఉన్నట్లు కనిపించింది" అని సమాధిని తవ్విన సమయంలో అక్కడ ఉన్న ఆస్ట్రియన్ అధికారి రాశారు.
"ఆశ్చర్యకరంగా దాని నోటిలో నాకు ఇంకా తాజాగా ఉన్న రక్తం కనిపించింది. ఈ రక్తాన్ని అతను చంపిన వాళ్ల నుంచి పీల్చుకున్నట్లు భావిస్తున్నారు" అని ఆయన రాసుకొచ్చారు.
ఆస్ట్రియన్ వైద్యులు సమాధులను తెరిచి, ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి స్థానికులతో మాట్లాడుతున్న సమయంలో 'పిశాచం' అనే పదం ఉద్భవించి ఉండొచ్చని డబ్లిన్‌లోని ట్రినిటి కాలేజీకి చెందిన ప్రొఫెసర్ క్లెమెన్స్ రూత్నర్ అభిప్రాయపడ్డారు.
"అనువాదకుడు బహుశా 'ఉపిర్' లాంటి పదాన్ని గొణిగి ఉండొచ్చు. ‘ఉపిర్’ అంటే దెయ్యానికి స్లోవేనియన్ పదం. అలా ఆ అపార్థం నుంచి ‘వాంపైర్’ అనే పదం పుట్టింది" అని ఆయన చెప్పారు.
తమను తాము 'జ్ఞానవంతులుగా' భావించే ఆస్ట్రియన్ అధికారులు, 'ఆదిమ జాతి మనుషులు'గా భావించే స్థానిక గ్రామస్తుల మధ్య జరిగిన ఈ సంభాషణలో ఒక కొత్త జీవి ఉనికిలోకి వచ్చి ఉండొచ్చని ఆయన అన్నారు.
పీటర్‌ను ఆపడానికి, గ్రామస్తులు అతని గుండెలోకి ఒక కొయ్యను గుచ్చి, ఆ తర్వాత అతని శరీరాన్ని కాల్చేశారు. దీంతో ఆ గ్రామానికి రక్త పిశాచుల పీడ విరగడ అయిందని భావించారు.
ఈ సంఘటనకు కొంత ప్రాధాన్యం ఉన్నప్పటికీ, రక్తపిశాచులపై నమ్మకాన్ని సూచించడానికి ఉపయోగించే ‘వాంపైరిజం’ (పిశాచవాదం) అనే పదం ఇంకా అప్పటికి ఉనికిలోకి రాలేదని ప్రొఫెసర్ బోన్ పేర్కొన్నారు.
ఆ కాలంలో హేతుబద్ధంగా వివరించలేని ఏ విషయాన్నీ నాటి మానవుని వివేకం అంగీకరించేది కాదు.

రక్తపిశాచా లేక బలిపశువా?
ఏడు సంవత్సరాల తరువాత, 1732 జనవరిలో, మెద్వెద్జా గ్రామంలో ఇలాంటి సంఘటన పునరావృతమైంది.
మూడు నెలల్లో 17 మంది, వారిలో కొందరు ఆరోగ్యవంతులైన యువకులు, ఏ కారణం లేకుండా చనిపోయారు.
కిసిల్జెవోలో జరిగిన సంఘటనల మాదిరిగానే, ఇక్కడా మరణించిన వారిలో కొందరు ఊపిరాడలేదని, ఛాతీ నొప్పిగా ఉందని తమ మరణానికి ముందు చెప్పారు.
ఇక్కడి సమాధులను తవ్వి తీయాలనే ఆదేశాల తర్వాత, జోహన్నెస్ ఫ్లకింగర్ అనే డాక్టర్ ఒక నివేదిక రాశారు. ఈ రక్తపిశాచి కేసుల్లో ఒక సైనిక సంబంధిత వ్యక్తే ప్రధాన దోషి అని ఆయన తన నివేదికలో పేర్కొన్నారు.
ఆ వ్యక్తి శరీరం ఇంకా కుళ్ళిపోలేదని, ఆయన కళ్లు, ముక్కు, నోరు, చెవుల నుంచి తాజాగా ఉన్న రక్తం కారుతోందని నివేదికలో రాశారు.
మెద్వెడ్జా ప్రజలు అది రక్తపిశాచి అనడానికి ఈ ఆనవాళ్లను రుజువుగా భావించారు. అందుకే వాళ్లు అతని గుండెలో ఒక కొయ్యను గుచ్చి, అతని శరీరాన్నీ కాల్చేశారు.
"ఈ వ్యక్తి జీవితం గురించి అసలేమీ తెలియదు. అతను కింద పడిపోయి మరణించాడు, ఆ తర్వాత గ్రామస్తులు అతన్ని బలిపశువు చేశారు" అని థామస్ బోన్ తన పుస్తకంలో రాశారు.
ఈ వ్యక్తి కొసావో నుంచి వచ్చిన అల్బేనియన్ అయిన అర్నాట్ పావ్లీన్ అని ఆయన భావిస్తున్నారు.
"కిసిల్జెవోకు చెందిన పీటర్ బ్లాగోజెవిక్, మెద్వెడ్జాకు చెందిన అర్నాట్ పావ్లీన్. వీళ్లిద్దరూ మనకు తెలిసి రక్తపిశాచ జాతులకు మొదటి ప్రతినిధులు" అని బోన్ అన్నారు.

శాస్త్రీయ వివరణ
కుళ్ళిపోని మృతదేహాలను చూసి గ్రామస్తులు భయపడిన విషయంపై పాథాలజిస్టులు మాట్లాడుతూ, మరణించినవాళ్లు అలాంటి స్థితిలో కనిపించడం అసాధారణమేమీ కాదని అభిప్రాయపడ్డారు.
"ఈ కేసులన్నింటి వెనుక ఆంత్రాక్స్ మహమ్మారి ఉందని ప్రముఖ వియన్నా పాథాలజిస్ట్ క్రిస్టియన్ రైటర్ అభిప్రాయపడ్డారు. ఆనాటి యుద్ధ సమయాల్లోనూ, ఆ తర్వాతి కాలంలోను ఇలాంటివి సర్వసాధారణం" అని ప్రొఫెసర్ రూత్నర్ చెప్పారు.
ఆంత్రాక్స్ అనేది బ్యాక్టీరియా వ్యాధి. ఇది సోకిన జంతువుల నుంచి ప్రజలకు వ్యాపిస్తుంది. తరచుగా మరణానికి దారి తీస్తుంది.
మరణానికి ముందు ఊపిరాడనట్లు వచ్చిన నివేదికలు న్యుమోనియాకు సంబంధించినవి కావచ్చని రూత్నర్ భావిస్తున్నారు.
“మీరు నివేదికలను జాగ్రత్తగా పరిశీలిస్తే, రక్త పిశాచులను ఎవరూ ప్రత్యక్షంగా కళ్లతో చూడలేదని తెలుస్తుంది. వాళ్లు రక్తం పీల్చుకున్నారు అనడం, నిజానికి ఆస్ట్రియన్ వైద్యులు అభివర్ణన మాత్రమే’’ అని ఆయన చెప్పారు.
రక్తం తాగడం అనేది పాశ్చాత్య ప్రజలు సృష్టించిన అపోహ అని థామస్ బోన్ కూడా భావిస్తున్నారు.
మెద్వెడ్జాకు చెందిన స్థానిక చరిత్రకారుడు ఇవాన్ నెసిక్ ప్రకారం, ఇప్పటికీ రక్తపిశాచుల పట్ల నమ్మకం, భయం ప్రజల మనస్సులో కొనసాగుతున్నాయి.
పీటర్ బ్లాగోజెవిక్, అర్నాట్ పావ్లీన్‌లు మరణించిన చాలా కాలం తర్వాత కూడా స్థానికులు తమ ఇళ్లను రక్తపిశాచుల నుంచి రక్షించుకోవడానికి ప్రయత్నించారని ఆయన పేర్కొన్నారు.
"సెర్బియన్ రక్తపిశాచం, రక్తంతో నిండిన చర్మపు బుడగను పోలి ఉంటుందని నమ్ముతారు" అని ఆయన చెప్పారు.
“అవి ఒక బెలూన్‌లాగా ఉంటాయి, బెలూన్‌లాగే దానిని పంక్చర్ చేయొచ్చు అని ప్రజలు భావిస్తారు. అందుకే రక్తపిశాచుల నుంచి రక్షణ కోసం గేట్లు, కిటికీలు లేదా తలుపులపై ముల్లులు ఉండే చెట్టుకొమ్మలను ఉంచేవాళ్లు’’ అని ఆయన ఇవాన్ పేర్కొన్నారు.

'టర్కిష్ ముప్పు'కు ప్రత్యామ్నాయం
శతాబ్దాల ఒట్టోమన్ పాలన తర్వాత 1700లలో హబ్స్‌బర్గ్ రాచరికం కిందకి వచ్చిన సరిహద్దు ప్రాంతాలలో కిసిల్జెవో, మెద్వెద్జా రెండూ ఉన్నాయి.
అటువంటి వివాదాస్పద ప్రాంతాల్లో ఈ సంఘటనలు జరిగినట్లు బయటకు రావడంతో రక్తపిశాచాల ఆరోపణ ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని ప్రొఫెసర్ రూత్నర్ అభిప్రాయపడ్డారు.
"ఒట్టోమన్ సామ్రాజ్యం, పశ్చిమ దేశాల మధ్య జరిగిన ఘర్షణ ఈ సంఘటనలకు ఒక ముఖ్యమైన నేపథ్యం" అని ఆయన వివరించారు.
1683లో వియన్నాపై ఒట్టోమన్ ముట్టడి రెండవసారి విఫలమైన తర్వాత, క్రైస్తవమతానికి టర్కి (నేటి తుర్కియే) వైపు నుంచి ఉన్న ముప్పుకు, రక్తపిశాచాలను ప్రత్యామ్నాయంగా సూచించారని ప్రొఫెసర్ బోన్ పేర్కొన్నాడు.
18వ శతాబ్దం మధ్యలో, హబ్స్‌బర్గ్ రాచరికపు కాలంలో 'రక్త పిశాచాలు' కనిపించాయి అంటూ అనేకమంది తెలిపారు. అయితే మూఢ నమ్మకాలను అరికట్టడానికి అలాంటి ఊహాజనిత జీవులకు వ్యతిరేకంగా చేసే అన్ని రకాల పోరాటాలపై నిషేధం విధించారు.
కానీ, రక్తపిశాచాలు వెంటనే వేరే రూపంలో బయలుదేరాయి.
"రొమాంటిక్ కాలంలో పిశాచాలు అందంగా, పాలిపోయిన చర్మంతో ఉండేవి. అంతే కానీ, ఎర్రగా ఉబ్బిన ముఖంతో సెర్బియా గ్రామస్తుల్లా కాదు" అని రూత్నర్ చెప్పారు.
1819లో ఆంగ్ల రచయిత జాన్ పొలిడోరిచే 'ది వాంపైర్' ప్రచురణతో ఆధునిక కాల్పనిక సాహిత్యపు ఆకర్షణీయమైన, అధునాతన రక్త పిశాచి జన్మించింది.
బ్రామ్ స్టోకర్ 1897లో రాసిన నవల డ్రాకులాను అతి గొప్ప రక్తపిశాచి నవలగా పరిగణిస్తున్నారు. అది నేటికీ ఆధునిక రక్తపిశాచ పురాణగాథలకు ఆధారంగా ఉంది.
ఇవి కూడా చదవండి:
- టీడీపీ, వైసీపీ మధ్య ఓట్ల తేడా ఎంత? అది ఫలితాలను ఎలా మార్చేసింది?
- చంద్రబాబు కేబినెట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..
- భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు
- చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతిలో ఎందుకు చేయడం లేదు
- ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














