కీబోర్డుపై నొక్కుతూ పనిచేస్తున్నట్లు నటిస్తున్న వారిని ఉద్యోగాల నుంచి తొలగించిన ప్రముఖ బ్యాంకు

రిమోట్ వర్కింగ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నటాలీ షెర్మన్
    • హోదా, బీబీసీ న్యూస్

కంప్యూటర్ కీ బోర్డుపై పనిచేస్తున్నట్లు నటిస్తూ సంస్థను మోసం చేస్తున్నారని తేలడంతో అమెరికాకు చెందిన వెల్స్‌ ఫార్గో బ్యాంకు ఇటీవల కొందరిని ఉద్యోగాల నుంచి తొలగించింది.

ఫైనాన్షియల్ ఇండస్ట్రీ రెగ్యులేటరీ అథారిటీ (ఫిన్రా)కు సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.

అమెరికాలోని మూడో అతిపెద్ద బ్యాంకు వెల్స్ ఫార్గో.

అయితే, దీనిని ఎలా గుర్తించారు? ఇది రిమోట్ వర్క్‌కి సంబంధించినదా? అనే ప్రశ్నలకు ఆ సంస్థ స్పందించలేదు.

''వెల్స్ ఫార్గో సంస్థ తన ఉద్యోగుల నుంచి అత్యున్నత ప్రమాణాలను ఆశిస్తోంది. అనైతిక ప్రవర్తనను సహించదు'' అని సంస్థ ప్రతినిధి లారీ కైట్ ఒక ప్రకటనలో తెలిపారు.

కోవిడ్ మహమ్మారి తర్వాత, రిమోట్ విధానంలో పని చేయడం పెరిగినప్పటి నుంచి కొన్ని పెద్ద కంపెనీలు తమ ఉద్యోగుల పనితీరును పర్యవేక్షించేందుకు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి.

ఇవి కీబోర్డ్, కంటి కదలికలను పసిగట్టగలవు, స్క్రీన్‌షాట్‌లు తీయగలవు, అలాగే, వెబ్‌సైట్లను కూడా లాక్ చేయగలవు.

మరోవైపు కంపెనీల నిఘాను తప్పించుకునే విషయంలోనూ టెక్నాలజీ వాడకం పెరిగిపోయింది.

కంప్యూటర్‌పై పనిచేస్తున్నట్లు అనిపించేలా చేసే 'మౌస్ జిగ్లర్స్' వంటివి ఇప్పుడు విరివిగా అందుబాటులో ఉన్నాయి.

అమెజాన్‌లో ఇలాంటివి కేవలం 10 డాలర్ల కంటే తక్కువ ధరకే దొరుకుతున్నాయి. ఇవి గత నెలలో వేలల్లో అమ్ముడయ్యాయి.

''కొందరు ఉద్యోగులు కీబోర్డుపై పనిచేస్తున్నట్లు నటిస్తున్నారని వచ్చిన ఆరోపణలపై సమీక్ష జరిపాం. అనంతరం వారిలో కొందరు రాజీనామా చేశారు. మరికొందరిని తొలగించాం'' అని వెల్స్ ఫార్గో సంస్థ తెలిపింది.

US bank Wells Fargo fires employees for simulating being at their keyboards

ఫొటో సోర్స్, Getty Images

ఉద్యోగులను తొలగించినట్లు ముందుగా రిపోర్ట్ చేసిన బ్లూమ్‌బర్గ్, డజనుకు పైగా ఉద్యోగులపై ప్రభావం పడినట్లు తెలిపింది.

సమీక్ష అనంతరం సిబ్బందిని తొలగించడం వంటి ఘటనలతో పాటు పనిచేస్తున్నట్లు నటిస్తున్నారన్న వాదనల కారణంగా ఒక వ్యక్తి రాజీనామా చేయడాన్ని బీబీసీ ధ్రువీకరించింది. వారిలో చాలా మంది ఐదేళ్ల కంటే తక్కువ కాలంగా ఆ సంస్థలో పనిచేస్తున్నారు.

అనేక సంస్థలు, ముఖ్యంగా ఆర్థిక రంగ సంస్థలు తిరిగి ఆఫీసులకు వచ్చేయాలని ఉద్యోగులను ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఇలాంటివి వెలుగులోకి వస్తున్నాయి.

స్టాన్‌ఫోర్డ్, షికాగో యూనివర్సిటీలకు చెందిన పరిశోధకుల ప్రకారం, గత నెలలో అమెరికాలో వేతనాల చెల్లింపుల్లో 27 శాతం మాత్రమే రిమోట్ విధానంలో పనికి చెల్లింపులు జరిగాయి. అది 2020లో 60 శాతంగా ఉంది.

ఈ సీజన్‌లో అమెరికాలో 13 శాతం మంది పూర్తిగా రిమోట్ విధానంలో పనిచేస్తుండగా, 26 శాతం మంది హైబ్రిడ్ విధానంలో పనిచేస్తున్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు.

తన ఉద్యోగులలో చాలా మందికి హైబ్రిడ్ ఫ్లెక్సిబుల్ మోడల్‌ అమలు చేస్తున్నట్లు వెల్స్‌ ఫార్గో 2022లో తెలిపింది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)