‘లక్షణమైన మహిళలకు మాత్రమే అనుమతి’ అంటూ ఆ జిమ్ చేసిన ప్రకటన ఎందుకు వివాదాస్పదంగా మారింది?

దక్షిణ కొరియా, సోల్, జిమ్, ఆంటీలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ‘లక్షణమైన మహిళలకు మాత్రమే ప్రవేశం’ అని దక్షిణ కొరియాలో ఓ జిమ్ నిర్వాహకులు బోర్డు పెట్టారు
    • రచయిత, కెల్లీ నాగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సభ్యత లేని “ఆంటీలకు” జిమ్‌లోకి ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు దక్షిణ కొరియాలోని ఓ జిమ్ ప్రకటించింది. ఈ ప్రకటన మహిళల పట్ల వివక్షపూరితంగా ఉందని దేశంలోని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సోల్‌కు సమీపంలోని ఇంచియోన్ నగరంలోని ఓ జిమ్ బోర్డుపై “అజుమ్మా( కొరియన్ పదం) లందరూ దూరంగా ఉండండి. లక్షణంగా ఉండే మహిళలకు మాత్రమే అనుమతి” అని రాసి పెట్టింది.

అజుమ్మా అనే పదానికి అర్థం వయసు పైబడిన వాళ్లకు ఉద్దేశించింది. ప్రత్యేకంగా 30 ఏళ్లు దాటిన వారికి. అలాగే అసహ్యకరంగా, అమర్యాదకరంగా ప్రవర్తించే వారి గురించి ప్రస్తావించేందుకు ఉపయోగించే అవమానకరమైన పదం కూడా.

ఈ జిమ్ పేరు, దాని యజమాని గురించి స్థానికంగా ఎలాంటి సమాచారం లేదు. అయితే కొందరు మహిళల ప్రవర్తన వల్ల జిమ్ నష్టాల్లో చిక్కుకున్నందు వల్లే యజమాని ఇలాంటి బోర్డు పెట్టినట్లు చెబుతున్నారు.

“(కొంతమంది మహిళా కస్టమర్లు) బట్టలు మార్చుకునేందుకు ఛేంజింగ్ రూమ్‌లో గంట, రెండు గంటలు గడిపేవారు. ఆ గదిలో ఉన్న టవల్స్, సబ్బులు, హెయిర్ డ్రైయర్స్‌ను దొంగిలించేవారు” అని ఆ జిమ్ యజమాని సౌత్ కొరియన్ న్యూస్ ఏజన్సీ యోన్హాప్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

“వాళ్లంతా వరుసగా కూర్చుని ఇతరుల శరీరాల గురించి వారి ఆకృతి గురించి కామెంట్లు చేస్తూ, తీర్పులు ఇస్తుంటారు. వారి కామెంట్ల కొంతమంది యువతులు జిమ్‌కు రావడం మానేశారు. బహుశా వాళ్లు ఆ కామెంట్లు విని బాధ పడి ఉంటారు” అని ఆయన అన్నారు.

ఈ జిమ్ చేసిన ప్రకటన మహిళల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఎందుకంటే ఇటీవల సౌత్ కొరియాలోని కొన్ని బహిరంగ ప్రదేశాల్లోకి పిల్లలు, వృద్ధుల రాకపై నిషేధం విధించడంతో వ్యాపారాలు దెబ్బ తిన్నాయి.

ఇలాంటి నిషేధం వల్ల సంబంధింత వయసు వారిలో ఆగ్రహం పెరుగుతోంది. ఒక వయసుకు చెందిన మహిళలు అసహ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ జిమ్ చేసిన ప్రకటనపై కూడా విమర్శలు వస్తున్నాయి.

“బ్యాడ్ కస్టమర్ అనే పదం ‘అసహ్యకరంగా ప్రవర్తించే మహిళ’ ( అజుమ్మ)గా ఎలా మారింది? అని నెటిజన్ ఒకరు సోషల్ మీడియా వెబ్‌సైట్ ఇన్సిజ్‌లో కామెంట్ పెట్టారు.

“మీరు సర్వీస్ ఇండస్ట్రీలో పని చేసి ఉంటే, కేవలం వృద్ధ మహిళలు మాత్రమే కాకుండా ఇంకా అనేక మంది ఈ కేటగిరీలోకి వస్తారనే విషయం మీకు తెలిసి ఉంటుంది. 2,000 కాలం నాటి సెంటిమెంట్స్” అంటూ వీటన్నింటినీ పాత ఆలోచనలుగా కొట్టి పారేస్తూ మరో కామెంట్ పెట్టారు.

జిమ్, మహిళలు
ఫొటో క్యాప్షన్, యువతుల శరీరాకృతికి గురించి ఆంటీలు కామెంట్లు చేస్తున్నారన్న జిమ్ యజమాని

ఆ జిమ్ తన చర్యను సమర్థించుకుంటూ మరో ప్రకటన విడుదల చేసింది.

“ఆంటీలు తమ వయసుకు తగినట్లు కాకుండా అంతా తమదే అన్నట్లు ప్రవర్తిస్తారు. వాళ్లు తమ సొంత డబ్బు బయటకు తీయాలంటే విలవిల్లాడిపోతారు. కానీ ఇతరుల సొమ్ముని ఇష్టం వచ్చినట్లు వాడేస్తారు” అని అందులో పేర్కొంది.

తన అభిప్రాయాలను గౌరవించే జిమ్ యజమానులు ఇంకా చాలా మంది ఉండవచ్చని, అయితే వాళ్లు బయటకు మాట్లాడేందుకు ఇష్టపడకపోవచ్చని ఆయన అన్నారు.

“ఆంటీలు లేదా సాధారణ మహిళల్ని అవమానించాలనే ఉద్దేశంతో నేను ఈ ప్రకటన చెయ్యలేదు. మా ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వారంతా మేము ప్రకటనలో ప్రస్తావించిన కేటగిరీకి చెందిన వారై ఉండవచ్చు” అని ఆయన యోన్హప్‌తో చెప్పారు.

జిమ్‌లోకి “ఆంటీలను” నిషేధించడాన్ని ఆన్‌లైన్‌లో కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. వీరిలో కొంతమంది “ఆంటీల” ప్రవర్తనతో బాధ పడుతున్నవారు కూడా ఉన్నారు. కొంత మంది దీనిని “ఒక ప్రాంతానికి పరిమినత వ్యవహారం” అని చెబుతున్నారు. మరి కొంతమంది మహిళల పట్ల ఉపయోగించిన భాషను మతిలేనితనంగా అభివర్ణిస్తున్నారు.

“మహిళల్లో ఆగ్రహం పెరుగుతోంది. వాళ్లు తమ పిల్లలను రెస్టారెంట్లు, కెఫేలకు తీసుకువస్తారు. అక్కడ వారు నిర్లక్ష్యంగా, అసహ్యంగా ప్రవర్తిస్తారు” అని ఈ ఇంటర్వూకి సంబంధించి యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన వీడియో కింద ఒకరు కామెంట్ చేశారు.

కట్టుబాట్లకు పరిమితం చేయాలని చూస్తున్న సమాజంలో జుట్టు కత్తిరించుకోవడం నుంచి ఒంటరిగా జీవించడం వరకు, సంప్రదాయ విధానాలకు దూరంగా తమకు నచ్చినట్లు జీవించేందుకు దక్షిణ కొరియా మహిళలు చాలాకాలం నుంచి పోరాడుతున్నారు.

పురుషుల్లో ఇలాంటి ప్రవర్తన గురించి చాలా అరుదుగా ప్రస్తావిస్తారని మహిళలు ఆరోపిస్తన్నారు.

మహిళలు ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదనేది కొంతమంది అభిప్రాయం.

పురుషుల్లోనూ పెద్దవాళ్ల ప్రవర్తన ‘ఆంటీల’ మాదిరిగానే అసభ్యంగా ఉంటుందనేది వారి వాదన.

“పురుషుల్లోనూ వయసు పైబడినవారి ప్రవర్తన అలాగే ఉంటుంది” అని సైకాలజీ ప్రొఫెసర్ పార్క్ సంగ్ హీ జేటీబీసీ నెట్‌వర్క్‌కు ఇచ్చిన టెలివిజన్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ ఇంటర్వ్యూని నిషేధించారు.

“వాళ్లు ఉచితంగా వచ్చే వాటికోసం పాకులాడుతుంటారు. అది మళ్లీ మళ్లీ తమకే కావాలంటారు. ప్రత్యేకించి ముసలి మహిళల ప్రవర్తన అసభ్యకరంగా ఉంటుంది” అని పార్క్ సంగ్ హీ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)