స్మార్ట్‌ఫోన్ వాడటం మానేసిన 10 మంది టీనేజర్లు, ఆ తర్వాత ఏమైందంటే..

ఫొటో సోర్స్, BBC News/Kristian Johnson
- రచయిత, క్రిస్టియాన్ జాన్సన్
- హోదా, బీబీసీ న్యూస్
డిజిటల్ డిటాక్స్‌లో భాగంగా 10 మంది టీనేజర్లు అయిదు రోజులపాటు స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా బేసిక్ ఫోన్‌కు మారారు.
ఈ బేసిక్ ఫోన్‌తో కేవలం ఫోన్‌కాల్స్, టెక్ట్స్ మెసేజ్‌లు మాత్రమే చేయవచ్చు.
ఇంగ్లండ్‌లోని సాల్‌ఫోర్డ్‌కు చెందిన ఈ టీనేజర్లు తమ చాలెంజ్‌ను ఎలా తీసుకున్నారు? వారి అనుభవాలు ఏం చెబుతున్నాయి? అన్నది చూద్దాం.
విల్ అనే కుర్రాడు రోజూ 8 గంటలకు పైగా తన స్మార్ట్‌ఫోన్‌తోనే గడుపుతుండేవాడు.
చిన్నతనంలో విల్, సైకిల్ తొక్కడాన్ని చాలా ఇష్టపడేవాడు. ఇప్పుడు అతని వయసు 15 ఏళ్లు. స్కూల్ నుంచి వచ్చాక దాదాపు ఖాళీ సమయం అంతా టిక్ టాక్ వీడియోలు చూస్తూనే ఉంటాడు.
కిందటి వారంలో కేవలం సోషల్ మీడియా యాప్‌లలోనే విల్ 31 గంటల సమయాన్ని వెచ్చించాడు. ఆ తర్వాత వారంలో డిజిటల్ డిటాక్స్‌లో భాగంగా అయిదు రోజులు అతనికి సోషల్ మీడియా యాక్సెస్ లేదు.
‘‘అయిదు రోజులు సోషల్ మీడియా లేకుండా ఎలా గడపాలో అని ఆందోళన చెందాను. ఇక అమ్మానాన్నలతో మాట్లాడుతూనే కాస్త సమయం గడపాలి’’ అని విల్ అన్నాడు.
డిటాక్స్ అనేది యువత స్మార్ట్‌ఫోన్ అలవాట్లను పరిశీలిస్తోన్న బీబీసీ ప్రాజెక్ట్‌లో ఒక భాగం.
స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా బేసిక్ నోకియా ఫోన్‌ను వాడేందుకు ఒప్పుకున్న మీడియా సిటీ యూనివర్సిటీ టెక్నికల్ కాలేజీకి చెందిన 10 మంది విద్యార్థుల్లో విల్ ఒకరు.


ఫొటో సోర్స్, BBC News/Kristian Johnson
విద్యార్థుల జీవితంలోని దాదాపు ప్రతీ అంశం ఇప్పుడు ప్రభావితం అవుతుంది. వారు స్మార్ట్‌ఫోన్లతోనే పెరిగారు. ప్రతి విషయానికీ ఇంటర్నెట్ పైనే ఆధారపడుతున్నారు. ముఖ్యంగా స్నాప్‌చాట్, ఫేస్‌టైమ్ వంటి యాప్‌లలో కమ్యూనికేట్ అవుతుంటారు. గూగుల్ మ్యాప్ వాడతారు. ప్రయాణాల్లో ఫోన్‌లో మ్యూజిక్ వింటుంటారు.
విద్యార్థులకు ఇది నిజంగా ఒక పెద్ద సవాలు కాబోతుందని కాలేజీ ప్రిన్సిపాల్ కోలిన్ గ్రాండ్ అన్నారు. ఈ ప్రయోగం జరుగుతున్నంత కాలం విద్యార్థుల స్మార్ట్ ఫోన్లను ప్రిన్సిపాల్ జాగ్రత్తగా భద్రపరిచారు.
రూబీ కల నటి అవ్వడం. తాను ఎక్కువగా ఫోన్‌తోనే కాలక్షేపం చేస్తానని, టిక్‌టాక్ చూస్తూ తల్లిదండ్రుల్ని కూడా పెద్దగా పట్టించుకోనని ఆమె చెప్పారు.
ఈ ప్రయోగంలో రూబీ కూడా పాల్గొన్నారు. రూబీ బేసిక్ ఫోన్ వాడుతున్న రోజుల్లో నేను వారి కుటుంబాన్ని కలిశాను.
నేను వారింటికి వెళ్లినప్పుడు 16 ఏళ్ల రూబీ తన మేకప్‌కు తుది మెరుగులు దిద్దుకుంటున్నారు. కాలేజీకి వెళ్లడం కోసం ఆమె తయారవుతున్నారు.
రూబీ తల్లి మమ్మల్ని ట్రామ్ స్టాప్ దగ్గర దిగబెట్టారు.

ఫొటో సోర్స్, BBC News/Kristian Johnson
స్మార్ట్‌ఫోన్ నుంచి విరామం పొందడం వల్ల తన తల్లిదండ్రులతో ఎక్కువగా మాట్లాడే సమయం దొరికిందని రూబీ చెప్పారు. డిటాక్స్ వల్ల రూబీ ప్రవర్తన సానుకూలంగా మారినట్లు ఆమె తల్లి ఎమ్మా అన్నారు.
‘‘రూబీకి ఫోన్ వాడకం ఒక వ్యసనంలా మారింది. డిటాక్స్ వల్ల ఇప్పుడు ఆమె మాతో ఎక్కువగా మాట్లాడుతోంది. త్వరగా నిద్ర పోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ విరామం చాలా బాగుంది’’ అని ఎమ్మా చెప్పారు.
మేం ట్రామ్ స్టేషన్‌కు చేరుకుంటున్నాం. అంతలోనే ఒక ట్రామ్ వెళ్లిపోతుండటం మాకు కనిపించింది.
రూబీ సాధారణంగా యాప్‌లో చూసి తర్వాతి ట్రామ్ ఏ సమయానికి వస్తుందో తెలుసుకునేవారు. ట్రామ్ స్టాప్‌లోని డిస్‌ప్లే బోర్డు మీద టైమ్ టేబుల్‌ను చూడటం ఈ తరం పిల్లలకు పెద్దగా అలవాటు లేని పని.
‘‘ఫోన్ లేకపోతే తర్వాతి ట్రామ్ ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు’’ అని రూబీ అన్నారు.
మరో ట్రామ్ కోసం మేం ఎదురుచూస్తుండగా రూబీ తాను ఒక పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నట్లు నాకు చెప్పారు. వారానికి రెండుసార్లు ఆ ఉద్యోగానికి వెళ్లాల్సి ఉంటుందని అన్నారు. కానీ, ఈ రోజు తనకు ఆ పని ఉందో, ఉంటే ఎన్ని గంటల పాటు చేయాలో అనే వివరాలు గుర్తు లేవని చెప్పారు. ఆ వివరాలన్నీ యాప్‌లో ఉంటాయని, వాటి ఆధారంగా అక్కడికి వెళ్తుంటానని రూబీ తెలిపారు.
పని విషయంలో లేదా ఎప్పుడైనా ఏదైనా సమాచారం కోసం సంప్రదించాల్సిందిగా మేనేజర్ తనకు ఒక ఫోన్ నంబర్ ఇచ్చారని చెప్పారు. కానీ, ఫోన్ చేసి వివరాలు కనుక్కునేందుకు ఆమె ఇబ్బంది పడుతున్నారు.
‘‘నాకు ఏ షిఫ్టు ఉందో యాప్‌లో కనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఏ షిప్ట్‌లో వెళ్లాలో తెలియట్లేదు. నెనెప్పుడూ వారికి ఫోన్ చేయలేదు’’ అని రూబీ అన్నారు.
కొంతమంది టీనేజర్లకు స్మార్ట్‌ఫోన్‌కు దూరంగా ఉండటం నిజంగా చాలా కష్టమైన పని.
డిటాక్స్ ప్రాజెక్టులో చేరిన 27 గంటల తర్వాత, 14 ఏళ్ల చార్లీ తాను ఇక ఈ ప్రయోగంలో పాల్గొనలేనని, తన స్మార్ట్‌ఫోన్‌ను తిరిగి ఇచ్చేయాలని అడిగారు.
‘‘నా ఫోన్ మా కాలేజీ భవనంలోనే ఉందని నాకు తెలుసు. కానీ, నా ఫోన్‌కు ఎవరి మెసేజ్‌లు వస్తున్నాయో చూడలేకపోవడం, ఆన్‌లైన్‌లో లేకపోవడం చాలా ఒత్తిడిగా అనిపించింది’’ అని చార్లీ అన్నారు.
వారందరినీ ఒత్తిడికి గురి చేసిన మరో అంశం స్నాప్‌స్ట్రీక్ గతి తప్పడం. స్నాప్‌చాట్‌లో ఒకరికొకరు క్రమం తప్పకుండా మెసేజ్‌లు చేసుకున్న రోజుల సంఖ్యను స్నాప్‌స్ట్రీక్‌గా పరిగణిస్తారు.
ఈ స్ట్రీక్ గతి తప్పుతుందని చాలా ఆందోళనగా ఉందని చాలామంది విద్యార్థులు ఒప్పుకున్నారు. ఒక్కొక్కరు వరుసగా వెయ్యి రోజులకు పైగా ఈ స్ట్రీక్‌ను కొనసాగిస్తున్నారు. డిటాక్స్ ప్రాజెక్టులో ఉన్నప్పుడు తమ ఖాతాల నుంచి స్ట్రీక్ కొనసాగించాలని తమ మిత్రులకు చెప్పినట్లు కొంతమంది విద్యార్థులు వెల్లడించారు.
చార్లీలాగే, ఈ ప్రయోగంలో పాల్గొంటున్న ఇతర విద్యార్థులు కూడా స్ట్రీక్ కోల్పోతామనే భయాన్ని వ్యక్తం చేశారు.
కొంతమంది మాత్రం డిటాక్స్ కారణంగా చక్కగా నిద్రపోతున్నామని, ఫోన్లు లేకపోవడంతో మరింత ఎక్కువగా పని చేసుకోగలుగుతున్నామని చెప్పారు.
‘‘నేను కొత్త విషయాలు నేర్చుకుంటున్నా. ఉత్సాహంగా అన్ని పనుల్లో భాగమవుతున్నా. ఏదో కోల్పోతున్నట్లుగా నాకేమీ అనిపించడం లేదు’’ అని 15 ఏళ్ల గ్రేస్ అన్నారు.
ప్రయోగంలో చేరిన మొదటి రోజు, పాఠశాల నుంచి వచ్చిన తర్వాత స్నేహితులతో కలిసి కొన్ని వస్తువులు కొనడానికి బజారుకు వెళ్లినట్లు ఆమె చెప్పారు.
షాపింగ్‌కు వెళ్లడం వల్ల స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఆలోచనలు రాలేదని, ఇంకో ప్రయోజనం కూడా కలిగిందని ఆమె అన్నారు.
‘‘చాలా ప్రశాంతంగా అనిపించింది. ఫోన్ లేకపోవడం వల్ల మళ్లీ నాలోని సృజనాత్మకతను బయటకు తీయగలిగాను. ఇంటికి రాగానే పేయింటింగ్ వేశాను. నాకు నచ్చిన పనులు మళ్లీ చేయడానికి ఇది బాగా ఉపయోగపడింది’’ అని గ్రేస్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పాఠశాలలో విద్యార్థులు ఫోన్లు వాడకుండా ఆపేందుకు ఫిబ్రవరిలో యూకే ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
పాఠశాలలో మాత్రమే కాకుండా 16 ఏళ్ల లోపు వారందరూ స్మార్ట్‌ఫోన్లు వాడకుండా నిషేధించాలని పార్టీలకు అతీతంగా పలువురు ఎంపీలు డిమాండ్ చేశారు.
13 నుంచి 18 ఏళ్ల వయస్సు ఉన్న 2,000 మందిపై బీబీసీ రేడియో 5, బీబీసీ బిట్‌సైజ్ ఒక సర్వేను నిర్వహించింది.
ఆ సర్వేలో 23 శాతం మంది 16 ఏళ్ల లోపు వారికి స్మార్ట్‌ఫోన్లను నిషేధించాలని చెప్పారు. 35 శాతం మంది 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియాను నిషేధించాలని అన్నారు. 50 శాతం మంది మాత్రం స్మార్ట్‌ఫోన్ చేతిలో లేకపోతే యాంగ్జైటీగా ఉంటుందని చెప్పారు. 74 శాతం మంది స్మార్ట్‌ఫోన్ నుంచి బేసిక్ ఫోన్‌కు మారడం కుదరని పని అని అన్నారు.
అయిదు రోజుల డిటాక్స్ ప్రయోగం తర్వాత, మళ్లీ స్మార్ట్‌ఫోన్లు చేతికి రాగానే విద్యార్థుల కళ్లన్నీ స్క్రీన్లకు అతుక్కుపోయాయి.
కానీ, వారిలో చాలామంది ఇక స్క్రీన్‌టైమ్ తగ్గించుకోవడానికి మార్గాలు వెదుక్కుంటామని చెప్పారు.
‘‘నేను ఎంత సమయం సోషల్ మీడియాలో వృథా చేస్తున్నానో నాకు అర్థమైంది. ఇది తగ్గించుకోవాలి. టిక్‌టాక్ వాడకాన్ని కచ్చితంగా తగ్గిస్తాను’’ అని విల్ అన్నారు.
డిటాక్స్ సమయంలో చాలా కష్టంగా అనిపించిందని, ముఖ్యంగా మ్యూజిక్‌కు దూరంగా ఉండలేకపోయానని విల్ చెప్పారు. కానీ, తనకు ఎంతో ఇష్టమైన సైక్లింగ్‌ను మళ్లీ మొదలుపెట్టానని సంతోషం వ్యక్తం చేశారు.
‘‘రోజుకు 8 గంటలు ఫోన్ వాడటం నిజంగా చాలా పిచ్చితనం’’ అని విల్ అన్నాడు.
ఇవి కూడా చదవండి:
- కేఏ పాల్, లక్ష్మీనారాయణలకు ఎన్ని ఓట్లు వచ్చాయి.. ఎన్నికల్లో చిన్న పార్టీల ప్రభావమెంత?
- మొదటిసారి పోటీ చేసి, గెలిచి, కేంద్ర మంత్రి పదవి సాధించిన పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరు?
- సైబర్ సెక్స్ వర్కర్: పోర్న్ ఇండస్ట్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఎలా ఉండబోతోంది?
- 26 ఏళ్లకే ఎంపీ, 36 ఏళ్లకు కేంద్రమంత్రి.. కింజరాపు రామ్మోహన్ నాయుడు గురించి ఈ విషయాలు తెలుసా?
- పవన్ కళ్యాణ్ జీతం ఎంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














