సీఎంగా చంద్రబాబు తొలి సంతకం మెగా డీఎస్సీపైనే... అసలు ఈ సంప్రదాయం ఎప్పుడు మొదలైంది?

ఫొటో సోర్స్, FB/TDP
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బాధ్యతలు స్వీకరించారు.
ఆయన బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలి సంతకం ‘మెగా డీఎస్సీ’ ఫైలుపై చేశారు.
నిజానికి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మెగా డీఎస్సీకి అనుమతిస్తూ తొలి సంతకం చేస్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
కానీ, తాజాగా సచివాలయంలో బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన ‘మెగా డీఎస్సీ’పై తొలి సంతకం చేశారు.
రెండో సంతకం ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు’కు సంబంధించిన ఫైల్‌పై చేశారు.
పింఛన్లు రూ. 4 వేలకు పెంచుతూ మూడో సంతకం , అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై నాలుగో సంతకం, స్కిల్ సెన్సస్‌పై అయిదో సంతకం చేశారు.
ఇంతకీ మొదటి సంతకాల సంప్రదాయం ఎప్పటి నుంచి మొదలైంది?
ప్రతి ముఖ్యమంత్రీ ఏదో ఒక ఫైల్‌పై తొలి సంతకం చేయాల్సిందే. కానీ, తొలి సంతకం అంటూ అందరిలో ఆసక్తి కలిగే పరిస్థితులు ఎప్పటి నుంచి మొదలయ్యాయో చూద్దాం.

ఫొటో సోర్స్, bbc

ఫొటో సోర్స్, YSRCP/FB
వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచిత కరెంట్ హామీపై..
ఒకప్పుడు ప్రత్యేకంగా ఈ ట్రెండ్ లేకపోయినా తెలుగునాట వైయస్ రాజశేఖర రెడ్డి ఈ తొలి సంతకం సెంటిమెంటుకు నాంది పలికారు.
ఇప్పుడు దాదాపు ప్రతి ముఖ్యమంత్రీ అది కొనసాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఏయే ముఖ్యమంత్రి తొలి సంతకాలు దేనిపై చేశారో చూద్దాం.
2004 మే 14న ఎల్బీ స్టేడియంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైయస్ రాజశేఖర రెడ్డి, రైతులకు ఉచిత కరెంటు హామీపై తొలి సంతకం చేశారు.
సీఎంగా రాజశేఖర రెడ్డి ప్రమాణం పూర్తి కాగానే, ఐఎఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ ఉచిత కరెంట్ ఫైలును తీసుకురాగా వేదికపైనే వైయస్ సంతకం చేశారు.

ఫొటో సోర్స్, TDP
నారా చంద్రబాబు నాయుడు (2014)
2014 జూన్ 8న చంద్రబాబు నాయుడు విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.
పంట రుణాల మాఫీ, స్వయం సహాయక బృందాల రుణ మాఫీ, బెల్టు షాపుల రద్దు, పెన్షన్ల పెంపు, గ్రామాలకు మంచినీరు ఇచ్చే ఎన్టీఆర్ సుజల స్రవంతి ఫైళ్లపై అప్పట్లో ఆయన తొలి సంతకం పెట్టారు.

ఫొటో సోర్స్, YS Jagan Mohan Reddy/X
వైయస్ జగన్మోహన్ రెడ్డి
2019 మే 30న జగన్ తన మొదటి సంతకం పెన్షన్ల పెంపు ఫైలుపై పెట్టారు.
వైయస్సార్ పెన్షన్ కానుక పేరుతో 2250కు పెంచిన పెన్షన్ల ఫైలుపై సంతకం చేశారు.

రేవంత్ రెడ్డి
2023 డిసెంబరు 7న రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆరు గ్యారంటీల మీద తొలి సంతకం చేశారు.
మహిళకు నెలకు రూ. 2,500, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, రూ. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ , రైతు భరోసా 15 వేలు, యువ వికాసం, చేయూత, ఇందిరమ్మ ఇళ్ళు ఫైళ్లపై తొలి సంతకం పెట్టారు.
వైకల్యంతో ఉన్న రజినికి అదే ప్రమాణ స్వీకార వేదిక మీద నుంచి ఉద్యోగం ఇస్తూ రెండో సంతకం పెట్టారు.
కేబినెట్‌లో చర్చించాలి
కేసీఆర్, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పటికీ వారు ఇలా సభా వేదికల మీద ప్రత్యేకంగా తొలి సంతకం అంటూ చేయలేదు.
వాస్తవానికి ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలన్నింటినీ మంత్రివర్గంలో చర్చించి నిర్ణయించాలి. అందుకే కేబినెట్ సమావేశం పెడతారు.
వేదిక మీద లాంఛనంగా సంతకాలు పెట్టిన ఫైళ్లలో కొన్నిటిని తిరిగి, మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదిస్తారు.
కేబినెట్ నిర్ణయాలు కూడా అవసరం లేని చిన్న విషయాలు చర్చించక్కర్లేదు. కానీ కీలకమైన విధానపరమైన నిర్ణయాలు కేబినెట్లో పెట్టాలి. ఇంకా పెద్దవిషయాలు అసెంబ్లీలో చట్టంగా చేయాలి.
ఉదాహరణకు అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ అది చట్టం. దాన్ని ఒక్క సంతకంతో రద్దు చేయలేరు.
అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టి, ఎమ్మెల్యేలు ఓట్లు వేశాకే రద్దవుతుంది.
అందుకే తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ భూహక్కు చట్టాన్ని రద్దు చేసేలా మరో చట్టం చేస్తామని చంద్రబాబు చెప్పారు.
ముందే ఫైళ్ల తయారీ
సాధారణంగా గెలిచిన నాయకుల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్న స్పష్టత వచ్చిన తరువాత, సాధారణ పరిపాలన శాఖ , పోలీసు శాఖ ముఖ్యమంత్రి కానున్న నాయకులను కలుస్తారు.
అధికారిక సంభాషణల్లో వారిని చీఫ్ మినిస్టర్ డిజిగ్నేట్ అని పిలుస్తారు.
వారి సూచనల మేరకు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు తదితర పనులు చేస్తుంటారు.
ఆ క్రమంలోనే వారు చెప్పిన విధంగా ముందే ఫైళ్లను సిద్ధం చేసి ఉంచి, అప్పుడు వాటిని సభా వేదిక మీద సంతకానికి అందుబాటులో ఉంచుతారు.
అయితే ఇలా సీఎంలు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రజల ముందే సంతకాలు పెట్టడం అనేది ప్రజలకు ఒక నమ్మకం కలిగించడం లేదా, తాము చెప్పింది వెంటనే చేశామని చెప్పుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. వాస్తవ పరిస్థితుల్లో కీలక నిర్ణయాలు మంత్రిమండలి ఆమోదించిన తరువాత మాత్రమే అమలవుతాయి. చిన్న నిర్ణయాలు మాత్రమే నేరుగా సీఎం సంతకంతో వస్తాయి.
సాధారణంగా సచివాలయంలో ఫైళ్లను ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు, అనుమతి కోసం ప్రధాన కార్యదర్శికి పంపితే తరువాత అది ముఖ్యమంత్రి ఆమోదంతో, మంత్రివర్గంలో చర్చ జరిగిన తరువాత బయటకు వస్తుంది. ఇది కాకుండా అనేక పద్ధుతుల్లో కూడా ఫైళ్లు కదులుతూ ఉంటాయి.
ఫలానా ఫైల్ విషయంలో నేరుగా జీవో ఇవ్వవచ్చా లేదా మంత్రివర్గంలో చర్చించాలా అన్న నిర్ణయం సాధారణంగా చీఫ్ సెక్రటరీ లేదా సీనియర్ ఐఏఎస్ అధికారులు తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో అసెంబ్లీలో బిల్లు పెట్టాల్సి రావచ్చు కూడా.
వీటికి ఉదాహరణగా చూస్తే, చంద్రబాబు ప్రమాణం చేసిన వెంటనే వేదిక మీద కాకుండా, సీఎంగా బాధ్యతలు తీసుకున్న తరువాత ఆయన కార్యాలయంలో కూర్చుని అప్పటికే వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు పంపి, తరువాత సీఎస్ సంతకం కూడా అయిన ఫైళ్లపై తాను సంతకం పెట్టారు.
కేసీఆర్ అయితే ఎప్పుడూ ఇలా బహిరంగ సంతకాల జోలికి అసలు పోలేదు. అదే సమయంలో రేవంత్ ఆరు గ్యారెంటీల మీద సంతకం పెట్టినప్పటికీ ఇప్పటికీ పూర్తిగా అమలు కాలేదు.
రేవంత్ సంతకం పెట్టిన తరువాత కూడా వాటిని మంత్రివర్గంలోనూ చర్చించారు.
ఇవి కూడా చదవండి:
- టీడీపీ, వైసీపీ మధ్య ఓట్ల తేడా ఎంత? అది ఫలితాలను ఎలా మార్చేసింది?
- చంద్రబాబు కేబినెట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..
- భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు
- చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతిలో ఎందుకు చేయడం లేదు
- ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














