టోల్ గేట్ దగ్గర ఇలా జరిగితే మీరు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలుసా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జక్కుల బాలయ్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయిన ఘటనలను తరచూ చూస్తుంటాం. సంక్రాంతి, దసరా వంటి పండుగల సమయంలో ఇది మరింతగా కనిపిస్తుంది.
మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయిన దృశ్యాలు ఎప్పుడూ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో టోల్ ప్లాజా దాటేందుకు చాలా సమయం పడుతుంది.
కానీ, టోల్ ప్లాజాల వద్ద నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు వాహనాలు వేచివుండాల్సి వచ్చినా, నిర్ణీత దూరం కంటే ఎక్కువ దూరం వాహనాల క్యూ ఉన్నా టోల్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదని మీకు తెలుసా?
ఎన్‌హెచ్ఏఐ మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయి?


ఎన్హెచ్ఏఐ సర్క్యులర్‌లో ఏముందంటే..
టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ నిలిచిపోకుండా, సాఫీగా సాగిపోయేందుకు అనుగుణంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ( ఎన్‌హెచ్ఏఐ) 2021లో కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.
టోల్ బూత్ వద్ద పది సెకన్ల కంటే ఎక్కువ సమయం వేచివుండాల్సి వచ్చినా, టోల్‌బూత్ నుంచి వంద మీటర్ల కంటే ఎక్కువ దూరం ట్రాఫిక్ నిలిచిపోయినా టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండానే వాహనాలు వెళ్లేందుకు అనుమతించాలని ఎన్‌హెచ్‌ఏఐ తన మార్గదర్శకాల్లో పేర్కొంది.
2021 మే 26న ఎన్‌హెచ్‌ఏఐ దీనికి సంబంధించి పత్రికా ప్రకటన విడుదల చేసింది.
టోల్ ప్లాజాల వద్ద కనీస నిరీక్షణ సమయాన్ని (మినిమల్ వెయిటింగ్ టైం) నిర్ధరిస్తూ ఎన్‌హెచ్‌ఏఐ మార్గదర్శకాలను జారీ చేసింది. టోల్ బూత్‌ల వద్ద ఒక్కో వాహనం పది సెకన్లకు మించి ఉండాల్సిన అవసరం లేదని, రద్దీ సమయాల్లోనూ ఇది వర్తిస్తుందని పేర్కొంది.
టోల్ బూత్‌ల వద్ద ట్రాఫిక్ నిలిచిపోకుండా, సాఫీగా సాగిపోయేందుకు ఈ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసినట్లు ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది.
అలాగే, వంద మీటర్ల కంటే ఎక్కువ దూరం వాహనాలు బారులుదీరే అవకాశం ఉండకూడదు. ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేయడంతో ఎక్కువ సమయం వేచివుండాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ వంద మీటర్ల కంటే ఎక్కువ దూరం వాహనాలు నిలిచిపోతే, టోల్ ఫీజు చెల్లించకుండానే వాహనం వెళ్లేందుకు అనుమతించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.
వాహనాల క్యూ వంద మీటర్ల లోపునకు వచ్చేంత వరకూ ముందున్న వాహనాలను టోల్ ఫీజు లేకుండానే వదిలేయాలని పేర్కొంది.
అందుకు తగినట్లుగా టోల్ బూత్ వద్ద ప్రతి లైనులో 100 మీటర్ల దూరంలో పసుపు రంగు గీతను ఏర్పాటు చేయాలని సూచించింది.
ప్రయాణికుల సమయం విలువైనదిగా భావిస్తామని, వారి ప్రయాణం సురక్షితంగా, సాఫీగా సాగేలా చూసేందుకు కట్టుబడి ఉన్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది.

ఫొటో సోర్స్, nhai.gov.in
ఈ మార్గదర్శకాలు అమలవుతున్నాయా?
ఎన్‌హెచ్‌ఏఐ జారీ చేసిన మార్గదర్శకాలు అమలవుతున్నాయా? అని అడిగినప్పుడు, అమల్లో ఉన్నాయని ఎన్‌హెచ్‌ఏఐ హైదరాబాద్ రీజనల్ ఆఫీస్, డీజీఎం జీవీ భీమసేనా రెడ్డి చెప్పారు.
''ఎన్‌హెచ్‌ఏఐ జారీ చేసిన మార్గదర్శకాలు అమల్లో ఉన్నాయి. దీనికి సంబంధించి ఎన్‌హెచ్‌ఏఐ 2021 మే 24న జారీ చేసిన సర్క్కులర్‌ను అందరూ పాటించాల్సిందే'' అని భీమసేనా రెడ్డి చెప్పారు. ఆయన బీబీసీకి వాట్సాప్ ద్వారా రిప్లై ఇచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
20 కిలోమీటర్ల నిబంధన ఏంటి?
స్థానికుల నుంచి టోల్ వసూళ్లకు సంబంధించి ఈ 20 కిలోమీటర్ల నిబంధన ముఖ్యమైనది.
టోల్ ప్లాజా నుంచి 20 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతవాసులకు టోల్ ఫీజులో రాయితీ కల్పిస్తారు. జాతీయ రహదారిపై రాకపోకలు సాగించేందుకు స్వల్ప ఫీజుతోనే వారికి నెలవారీ పాసులు మంజూరు చేస్తారు.
టోల్ బూత్ నుంచి 20 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలకు చెందిన వారికి వాహనాలు ఉన్నట్లయితే, అవసరమైన పత్రాలు సమర్పించి టోల్ రాయితీ పొందవచ్చు. ఫాస్టాగ్‌కూ ఇది వర్తిస్తుంది.
అయితే, ఆయా ప్రాంతాల వారికి సర్వీస్ రోడ్డు అందుబాటులో ఉండడం, లేదా మరో రోడ్డు అందుబాటులో ఉండడం వంటి సందర్భాల్లో ఈ రాయితీలు కల్పించరు.

ఫొటో సోర్స్, Getty Images
పెరిగిన టోల్ ఫీజులు
జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల్లో పెరిగిన టోల్ ఫీజులు జూన్ 3వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రతి ఏటా ఏప్రిల్ ఒకటి నుంచి వార్షిక పెంపు అమలు చేస్తుంటారు.
అయితే, ఈసారి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా పెంపు అమలు వాయిదా పడింది. చివరి విడత ఎన్నికల పోలింగ్ కూడా పూర్తవడంతో జూన్ 3 నుంచి పెరిగిన టోల్ చార్జీలు అమల్లోకి వచ్చాయి.
దీంతో ప్రస్తుత టోల్ ఫీజులు సగటున 5 శాతం మేర పెరిగాయి. జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ వేలు ఉపయోగించే వారు 5 శాతం అదనంగా టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














