Paytm ఫాస్టాగ్ యూజర్లు ఇప్పుడు ఏం చేయాలి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కొటేరు శ్రావణి
- హోదా, బీబీసీ ప్రతినిధి
హైవేల మీద వాహనాల్లో వెళ్తున్నప్పుడు టోల్-ఫీ చెల్లించడానికి ఫాస్టాగ్ వాడుతున్నాం. ఈ ఫాస్టాగ్ సేవలను రకరకాల బ్యాంకులు అందిస్తున్నాయి. వాటితో పాటు పేటీఎం ఫాస్టాగ్‌ను కూడా చాలా మంది యూజర్లు ఉపయోగిస్తున్నారు. అయితే, వీరు మార్చి 15 నుంచి తమ ఫాస్టాగ్‌ను వాడలేరు. మరి పేటీఎం ఫాస్టాగ్ యూజర్లు తక్షణమే చేయాల్సి పని ఏంటి?
యూజర్లకు జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) 2024 మార్చి 15 లోగా పేటీఏం ఫాస్టాగ్ యూజర్లు మరొక బ్యాంకు నుంచి కొత్త ఫాస్టాగ్‌ను పొందాలని సూచించింది.
టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు కొత్త ఫాస్టాగ్‌లను తీసుకోవాలని తెలిపింది. దీని వల్ల, పెనాల్టీలు లేదా రెట్టింపు చార్జీల నుంచి తప్పించుకోవచ్చని తెలిపింది.
దీనికి కారణం, ఫాస్టాగ్ జారీ చేసే తమ అధికారిక బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంకును ఎన్‌హెచ్ఏఐ తొలగించడమే.
పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆంక్షలు విధిస్తూ భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్ఏఐ పేటీఎం ఫాస్టాగ్ యూజర్లు వేరే బ్యాంకులకు మారిపోవాలని సూచించింది.
ఆర్‌బీఐ విధించిన ఆంక్షలతో పేటీఎం ఫాస్టాగ్‌ను 2024 మార్చి 15 తర్వాత నుంచి పే రీఛార్జ్ లేదా టాప్-అప్ చేసుకోవడం సాధ్యం కాదు.
అయితే, పేటీఎం ఫాస్టాగ్‌లో మిగిలి ఉన్న బ్యాలెన్సును మాత్రం గడువు తేదీ తరువాత కూడా వాడుకోవచ్చని ఎన్‌హెచ్ఏఐ చెప్పింది.
ఫాస్టాగ్‌లు జారీకి అధికారికంగా ఒప్పందం కుదుర్చుకున్న బ్యాంకుల జాబితాను ఎన్‌హెచ్ఏఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
ఈ జాబితాలో ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు లిమిటెడ్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు, ఎస్‌బీఐ బ్యాంకు, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, కరూర్ వైశ్య బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకు, ఇండస్‌ఇండ్ బ్యాంకు, కొటక్ మహింద్రా బ్యాంకులు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై నిషేధం విధించిన సందర్భంగా, పేటీఎం ఫాస్టాగ్‌ల గురించి తరచుగా అడిగే ప్రశ్నలలో ఆర్‌బీఐ కొన్ని వివరణలు ఇచ్చింది. ఆ ప్రశ్నలేంటి, వాటికి ఆర్‌బీఐ ఇచ్చిన సమాధానాలేంటన్నది ఇప్పుడు చూద్దాం..
నా వద్ద పేటీఎం పేమెంట్స్ బ్యాంకు జారీ చేసిన ఫాస్టాగ్ ఉంది? 2024 మార్చి 15 తర్వాత దీన్ని వాడుకోవచ్చా?
అవును. బ్యాలెన్స్ ఉన్నంత వరకు టోల్ కట్టేందుకు మీ ఫాస్టాగ్ వాడకాన్ని కొనసాగించుకోవచ్చు. 2024 మార్చి 15 తర్వాత మాత్రం పేటీఎం పేమెంట్స్ బ్యాంకు జారీ చేసిన ఫాస్టాగ్‌ల్లోకి ఎలాంటి టాప్ అప్‌లకు లేదా ఫండింగ్‌కు అనుమతి ఉండదు. అందుకే, ఈ అసౌకర్యం నుంచి తప్పించుకునేందుకు మార్చి 15 లోపల మరో బ్యాంకు జారీ చేసే కొత్త ఫాస్టాగ్ తీసుకుంటే మంచిది.
2024 మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంకు జారీ చేసిన ఫాస్టాగ్‌కు బ్యాలెన్స్ రీఛార్జ్ చేసుకోవచ్చా?
లేదు. 2024 మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంకు జారీ చేసిన మీ ఫాస్టాగ్‌కు టాప్ అప్ లేదా రీఛార్జ్ చేసుకోలేరు.
పేటీఎం పేమెంట్స్ బ్యాంకు జారీ చేసిన నా పాత ఫాస్టాగ్ నుంచి బ్యాలెన్స్‌ను మరో బ్యాంకు నుంచి పొందిన కొత్త ఫాస్టాగ్‌లోకి బదిలీ చేసుకోవచ్చా?
ఫాస్టాగ్ ప్రాడక్ట్‌కు క్రెడిట్ బ్యాలెన్స్ ఫీచర్ అందుబాటులో లేదు. కానీ, పేటీఎం పేమెంట్స్ బ్యాంకు జారీ చేసిన మీ పాత ఫాస్టాగ్‌ను క్లోజ్ చేసుకుని, రీఫండ్ కోసం బ్యాంకు వద్ద అభ్యర్థన పెట్టుకోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్‌హెచ్ఏఐ సైట్లో కూడా సందేహాలు-సమాధానాల(ఎఫ్ఏక్యూ)లో ఈ సమాధానాలే వివరించింది.
ఫాస్టాగ్‌ను బ్లాక్ చేసేందుకు జారీ చేసిన ఏజెన్సీ కస్టమర్ కేర్ నెంబర్‌కు కాల్ చేయాల్సి ఉంటుందని, ఒకసారి మీరు కొత్త ఫాస్టాగ్ అకౌంట్ తీసుకున్న తర్వాత, జారీ సంస్థ లేదా బ్యాంకు కొత్త అకౌంట్‌కు మీ బ్యాలెన్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేస్తుందని ఎన్‌హెచ్ఏఐ చెప్పింది.
ఫాస్టాగ్‌లు బ్లాక్ చేసుకున్నప్పుడు అకౌంట్ బ్యాలెన్స్‌ల పరిస్థితేంటని అడిగే ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
సాధారణంగా ఒక వాహనానికి ఒకటే ఫాస్టాగ్ వాడతారు. అయితే, బ్యాంకు అందించే సర్వీసుల్లో వెహికిల్ ఓనర్‌కి సంతృప్తికరంగా లేకపోతే, మరో బ్యాంకు జారీ చేసే కొత్త ఫాస్టాగ్‌ను పొందవచ్చు.
అయితే, ఒక వాహనం కోసం తీసుకున్న ఫాస్టాగ్‌ను మరో వెహికిల్‌కు వాడుకోవడానికి వీలు లేదని కూడా చెప్పింది.
అంతకుముందు కొనుగోలు చేసిన ఫాస్టాగ్‌లో డబ్బులున్నంత వరకు దాన్ని వాడుకోవచ్చని కూడా తెలిపింది. వాటిని ట్యాంపర్ చేయడానికి వీలుండదని చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఎందుకీ నిషేధం?
పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్(పీపీబీఎల్) వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్‌కు చెందినది. ఇది 2017 మే 23న తన కార్యకలాపాలు ప్రారంభించింది.
సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్స్, భాగస్వామ్య బ్యాంకులతో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, వాలెట్ సేవలు అందించడమే కాకుండా ఆర్‌బీఐ అనుమతితో ఫాస్టాగ్ వంటి సేవలను కూడా ప్రారంభించింది.
అయితే, ఈ బ్యాంకు తన మార్గదర్శకాలను ఉల్లంఘించిందని ఆర్‌బీఐ తెలిపింది. పలుమార్లు హెచ్చరికలు చేసిన తరువాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవలపై ఆర్‌బీఐ నిషేధం విధించింది. ఫలితంగా ఈ సంస్థ నుంచి ఫాస్టాగ్ సేవలు కూడా రద్దయ్యాయి.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: వెలిగొండ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఎప్పుడు వస్తాయి?
- కోటిన్నర జీతం, ఇల్లు, ఇతర సౌకర్యాలు.. ఈ దీవుల్లో ఉద్యోగం చేస్తారా?
- గజనీ మహ్మద్: సోమనాథ్ ఆలయం నుంచి కొల్లగొట్టిన ధనమెంత?
- శ్రీశైలం: దట్టమైన నల్లమల అడవిలో వేలమంది జరిపే ఈ యాత్ర ఏంటి, ఎలా సాగుతుంది?
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














