వారణాసిలో ప్రధాని మోదీ మెజారిటీ ఎందుకు తగ్గింది? అక్కడి ప్రజలు ఏమంటున్నారు? - గ్రౌండ్ రిపోర్ట్

లల్లూ అన్సారీ
ఫొటో క్యాప్షన్, బనారస్‌లోని జలాలీపురానికి చెందిన లల్లూ అన్సారీ గతంలో చేనేతతో చీరలు తయారు చేసేవారు, కానీ ఇప్పుడు టీ దుకాణాన్ని నడుపుతున్నారు.
    • రచయిత, రజనీష్ కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సార్వత్రిక ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెజార్టీ 1.52 లక్షలకు పడిపోవడంపై చర్చ ఇప్పటికీ కొనసాగుతోంది.

డజను మంది కేంద్రమంత్రులు ప్రచారం చేసినా అక్కడ మెజార్టీ తక్కువగా వచ్చింది. 2019లో జరిగిన ఎన్నికల్లో మోదీ బనారస్ నుంచే 4.80 లక్షల ఓట్లతో గెలిచారు.

ఇక్కడ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు సీరియస్‌గా ప్రయత్నించి ఉంటే మోదీ ఓడిపోయి ఉండేవారని చాలామంది భావిస్తున్నారు.

రాయ్‌బరేలీ పర్యటన సందర్బంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీపై తన సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేసి ఉంటే కనీసం రెండు, మూడు లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచి ఉండేవారని వ్యాఖ్యానించారు. వారణాసిలో నరేంద్ర మోదీ స్థాయికి తగ్గ వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ పోటీలో పెట్టలేదని రాహుల్ వ్యాఖ్యల సారాంశంగా కొందరు అభిప్రాయపడ్డారు.

బనారస్‌ ‌లోక్‌సభ నియోజకవర్గానికి 2014, 2019, 2024లలో జరిగిన ఎన్నికల్లో అజయ్‌రాయ్ పోటీ చేశారు. ఆయన ఒక్కసారి కూడా గెలవలేదు.

2014, 2019లో అజయ్‌రాయ్ భారీ తేడాతో ఓడిపోయారు. 2009లో సమాజ్‌వాదీ పార్టీ తరపున ఆయన బనారస్ నుంచి పోటీ చేశారు. అప్పుడు కూడా ఓడిపోయారు. ఆయన ఎన్నికల్లో అనేకసార్లు పోటీ చేసి ఓడిపోయినా.. కాంగ్రెస్ పార్టీ ఆయనకు నాలుగోసారి అవకాశం ఇచ్చింది.

వారణాసిలో మోదీ మీద గట్టి అభ్యర్థిని పోటీకి నిలపలేదని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అజయ్‌రాయ్‌ని అడిగినప్పుడు.. "వారణాసి నుంచి పోటీ చేయాలని ప్రియాంక గాంధీని కోరాం. ప్రియాంక గాంధీ అయితే మోదీని ఓడించి ఉండేవారన్న రాహుల్ గాంధీ అభిప్రాయాన్ని నేను కూడా సమర్థిస్తాను" అని ఆయన చెప్పారు.

సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ తరపున ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు అజయ్ రాయ్ బీజేపీలోనూ పని చేశారు.

వాట్సాప్
మణికర్ణిక ఘాట్‌
ఫొటో క్యాప్షన్, బనారస్‌లోని గంగా నది ఒడ్డున ఉన్న మణికర్ణిక ఘాట్‌పై విశ్వనాథ్ ఆలయ కారిడార్ నిర్మించారు.

మోదీ మెజార్టీ ఎందుకు పడిపోయింది?

మధ్యాహ్నం పూట మండుతున్న సూర్యుడు వారణాసిలోని నిష్రద్‌ ఘాట్ నుంచి గంగానది వైపు మళ్లుతున్నాడు. గంగా నది ఘాట్లలో మెట్ల మీద నీడ విస్తరించే కొద్దీ పడవ నడిపేవారు చుట్టు పక్కల ఉన్న తమ ఇళ్లలో నుంచి బయటకు వచ్చి మెట్ల మీద కూర్చుంటున్నారు.

గంగానదిలో విహారానికి తీసుకెళ్లమని అడిగే యాత్రికుల కోసం వారు ఎదురుచూస్తున్నారు. గౌరీ శంకర్ నిషాద్ రెండు గంటలుగా అక్కడే కూర్చుని ఉన్నా, ఆయన దగ్గరకు ఒక్కరు కూడా రాలేదు.

సాయంత్రం అయ్యే కొద్దీ ఆయనలో నిరుత్సాహం పెరుగుతోంది. ఉదయం నుంచి ఆయన ఒక్క రూపాయి కూడా సంపాదించలేకపోయారు. ఈ రోజు ఆహారం, నీరు ఎలా అనే దానిపై ఆయనకు బెంగ పెరిగింది.

కొన్నేళ్లుగా వారణాసిలో పడవలు నడపుకునేవారి ఆదాయం అమాంతం తగ్గిపోయిందని గౌరీశంకర్ నిషాద్ చెప్పారు.

గౌరీ శంకర్
ఫొటో క్యాప్షన్, గౌరీశంకర్ నిషాద్ 2014 , 2019లలో మోదీకి మద్దతుగా ఉన్నారు, కానీ ఈసారి కాంగ్రెస్‌ వెంట నడిచారు.

"2014లో నరేంద్ర మోదీ గుజరాత్ నుంచి వారణాసికి వచ్చినప్పుడు మేం ఆయనకు చాలా ఉత్సాహంగా మద్దతిచ్చాం. మా పరిస్థితులు మారుతాయని భావించాం. 2019లోనూ ఆయనపై మాకు ఆశలు ఉండేవి. అయితే ఆయన అజెండా ఏమిటో మాకిప్పుడు తెలిసొచ్చింది. 2024లో మేం కాంగ్రెస్‌కు ఓటేశాం. మాకిప్పుడు మోదీ మీద ఎలాంటి ఆశ లేదు" అని గౌరీశంకర్ చెప్పారు.

"వాళ్లు గంగానదిలో పెద్ద పెద్ద మర పడవల్ని నడుపుతున్నారు. వాటిలో ప్రయాణం అంతా ఆన్‌లైన్‌లో బుక్ అవుతుంది. క్రూయిజ్ పడవలు వచ్చిన తర్వాత మా ఆదాయం పడిపోయింది. ఆ పెద్ద పడవలతో మేం ఎలా పోటీ పడగలం?" అని ఆయన ప్రశ్నించారు.

2018లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గంగా నదిలో విలావసంతమైన క్రూయిజ్ బోట్లను ప్రారంభించారు. క్రూయిజ్ ఎక్కి గంగానదిలో 82 ఘాట్లను చుట్టి వచ్చేందుకు ఒక్కో వ్యక్తికి 750 రూపాయలు వసూలు చేస్తున్నారు. 30 మీటర్ల పొడవుండే ఆ డబుల్ డెక్కర్ క్రూజ్‌లో ఒకేసారి 110 మంది ప్రయాణించవచ్చు.

అమిత్ సాహ్ని
ఫొటో క్యాప్షన్, నరేంద్ర మోదీ బనారస్‌కు వచ్చాక తన పడవ గిరాకీ తగ్గిపోయిందని అమిత్ సాహ్ని అంటున్నారు.

పడవ నడిపేవారిలో ఆగ్రహం

"కేవలం క్రూయిజ్ గురించే కాదు. మణికర్ణిక ఘాట్ నుంచి విశ్వనాథ్ టెంపుల్ వరకు వాళ్లొక కారిడార్ నిర్మించారు. మేం మణికర్ణిక ఘాట్‌లో దుకాణాలు ఏర్పాటు చేసుకుని చేపలు అమ్ముకునే వాళ్లం. ఈ కారిడార్ నిర్మించడం మొదలు పెట్టిన తర్వాత వాళ్లు మా షాపుల్ని తొలగించాలని చెప్పారు. కారిడార్ నిర్మించిన తర్వాత అందరికీ షాపులు ఇస్తామని అన్నారు. అయితే షాపులు నిర్మించిన తర్వాత షాపు కావాల్సిన వారు 25 లక్షలు చెల్లించాలని చెప్పారు. రెక్కాడితే కానీ డొక్కాడని మేం 25 లక్షల రూపాయలు ఎక్కడ నుంచి తేగలం? ఇలా అక్కడి పేదలను వెళ్లగొట్టారు. మీరిప్పుడు అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ అమూల్ డైరీ బూత్, బ్రాండెడ్ షోరూమ్‌లు కనిపిస్తాయి. మోదీ బనారస్‌లో కూడా గుజరాతీల సంక్షేమం కోసమే పని చేస్తున్నారు. అమూల్ గుజరాత్‌కు చెందిన సంస్థ. యూపీకి చెందిన పరాగ్ డెయిరీ ఏమైపోయింది? గంగానదిలో తిరుగుతున్న క్రూయిజ్ బోట్లను కూడా గుజరాత్‌ నుంచే కొనుక్కొచ్చారు" అని గౌరీశంకర్ చెప్పారు.

"అభివృద్ధి జరిగినప్పుడు కొంతమందికి ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకని అభివృద్ధిని ఆపలేం కదా. చట్టబద్ధంగా షాపులు ఉన్న వారికి పరిహారం అందించాం" అని బీజేపీ నేత దిలీప్ పటేల్ చెప్పారు.

అమిత్ సాహ్ని కూడా గంగానదిలో పడవ నడుపుతున్నారు. క్రూయిజ్ పడవల విషయంలో ఆయన కూడా అసంతృప్తితో ఉన్నారు.

"ప్రధాని మోదీ ఇక్కడికి వచ్చారు కాబట్టి నదిలో మా పడవలు తిరిగేందుకు అనుమతించరు. ఎందుకంటే మర బోట్లను (క్రూయిజ్) నడుపుతోంది గుజరాత్ వారే" అని అమిత్ సాహ్ని అన్నారు.

పడవలు నడుపుకునే వారు మాత్రమే కాదు, నేత కార్మికులు కూడా బహిరంగంగానే మోదీని విమర్శిస్తున్నారు.

బనారస్

బనారస్ బ్రాండ్ తీసుకున్నారు: నేతన్నలు

లక్ష్మీ శంకర్ రాజ్‌భర్ అనే వ్యక్తి గతంలో పవర్ లూమ్ మెషీన్లతో బనారస్ చీరలను తయారు చేసేవారు. కానీ ఆయన గత ఐదేళ్లుగా రిక్షా నడుపుతూ జీవితం గడుపుతున్నారు.

పేదరికం, శ్రమ కారణంగా 55 సంవత్సరాల వయసులోనూ లక్ష్మీ శంకర్ 85 సంవత్సరాల వ్యక్తిగా కనిపిస్తారు.

లక్ష్మీ శంకర్ మాట్లాడుతూ.. “బనారసీ చీరలు ఇప్పుడు సూరత్‌లో తయారవుతున్నాయి. అక్కడ నుంచి బనారస్‌కు తీసుకొస్తున్నారు. ఇక్కడి నేతన్నలు నిరుపయోగంగా మారారు. బనారసీ చీరను ఒకప్పుడు బ్రాండ్‌గా పిలిచేవారు, దానిని గుజరాతీలు స్వాధీనం చేసుకున్నారు’’ అని ఆరోపించారు.

‘’ఆదాయానికి మించి జీఎస్టీ వసూలు చేస్తున్నారు. పవర్ లూమ్ మెషిన్ ఉన్న ఇంటిపై కమర్షియల్ ట్యాక్స్ విధిస్తారు. ఆదాయం లేకపోతే పన్నులు ఎలా చెల్లిస్తారు? కరెంటు కూడా వస్తూ పోతూ ఉంటుంది, దానిపై సబ్సిడీ వస్తుందన్న గ్యారెంటీ లేదు’’ అని వారణాసిలోని జలాలీపురానికి చెందిన లల్లూ అన్సారీ అనే వ్యక్తి చెబుతున్నారు.

లల్లూ ఇంట్లో నాలుగు పవర్ లూమ్ మెషీన్లు నడిచేవి, కానీ ఇప్పుడు అక్కడ టీ దుకాణం ప్రారంభమైంది.

2014లో మోదీ వారణాసి నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వచ్చినప్పుడు నేత కార్మికుల స్థితిగతులను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. ఆ ఏడాది జూన్ 27న తొలిసారిగా టెక్స్‌టైల్ రంగంపై సమీక్ష చేయాలని మోదీ అధికారులకు సూచించారు.

చేనేతను ఫ్యాషన్‌తో అనుసంధానం చేసే మార్గాన్ని కనుగొనాలని అధికారులకు చెప్పారు. అయినా, నేటికీ పరిష్కారానికి నోచుకోలేదు. వారణాసిలో నరేంద్ర మోదీకి మెజారిటీ తగ్గడంపై అక్కడి ప్రజలను అడిగితే.. ‘రోడ్లు, కారిడార్‌లు కడుపు నింపవు’ అని చాలామంది బదులిచ్చారు.

లక్ష్మీ శంకర్ రాజ్‌భర్
ఫొటో క్యాప్షన్, లక్ష్మీ శంకర్ రాజ్‌భర్ గతంలో పవర్ లూమ్ మెషీన్‌తో బనారసీ చీరలను తయారు చేసేవారు, కానీ ఆయన గత ఐదేళ్లుగా రిక్షా తొక్కుతున్నారు.

గుజరాతీల చేతుల్లోకి వ్యాపారాలు?

బనారస్‌లోని వ్యాపార, అభివృద్ధి పనుల కాంట్రాక్టులు పూర్తిగా గుజరాతీల చేతుల్లోకి వెళ్లాయని కొందరు ఆరోపిస్తుండటాన్ని బనారస్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు హన్సరాజ్ విశ్వకర్మ ఖండించారు. ట్రేడ్ ఫెసిలిటీ సెంటర్ గుజరాతీ వారికి ఇచ్చారని, తనకు తెలిసి మిగతావి ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు.

‘’నేను నివాసం ఉండే కంచన్‌పూర్‌ వార్డులో దాదాపు 3,500 ఓట్లు పోలవ్వగా, అజయ్‌రాయ్‌కి 1,100 ఓట్లు రావడం ఎంత మూర్ఖత్వం’’ అని విశ్వకర్మ అసంతృప్తి వ్యక్తం చేశారు.

యాదవ్, కుష్వాహా, పటేల్, ముస్లింలు అజయ్ రాయ్‌కి ఓటు వేశారని ఆయన అభిప్రాయపడ్డారు. మోదీ వారణాసిలో ఓడినా ప్రధాని అయ్యేవారని, కానీ అది తమకు ఇబ్బందిగా ఉండేదని విశ్వకర్మ అన్నారు.

బనారస్‌
ఫొటో క్యాప్షన్, జగన్నాథ్ కారిడార్ కోసం బనారస్‌లోని అస్సీ ఘాట్ నివాసితుల ఇళ్లను కూల్చివేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

జగన్నాథ్ కారిడార్

బనారస్‌లోని అస్సీ ఘాట్‌లో నివసిస్తున్న దాదాపు 300 మందిలో జయనరణ్ మిశ్రా కూడా ఒకరు. వారి ఇళ్లు ప్రభుత్వ భూమిలో ఉన్నాయని జిల్లా అధికారులు చెప్పారని మిశ్రా తెలిపారు.

“స్వాతంత్య్రానికి ముందు నుంచి మేం నివసిస్తున్న ఇల్లు, ఏళ్లుగా ఆస్తి పన్ను చెల్లిస్తున్న ఇల్లు, ఇప్పుడు ప్రభుత్వ భూమిలో ఉందని చెబుతున్నారు. ఇక్కడ జగన్నాథ్ కారిడార్ నిర్మించాలనే ఆలోచన గుజరాత్ బీజేపీ నేత సునీల్ ఓజాది. ఈ కారిడార్ నిర్మించాలనుకుంటున్న జగన్నాథ దేవాలయం పురాతనమైనది కాదు, అభివృద్ధి పేరుతో విధ్వంసం చేయాలనుకునే వారిని ఎవరు ఆపగలరు? ఈ కారిడార్‌ను ఆపి ప్రజల ఇళ్లను రక్షించాలని స్థానిక వారణాసి సౌత్ బీజేపీ ఎమ్మెల్యే సౌరభ్ శ్రీవాస్తవను అడిగాను, అప్పుడు ఆయన మీ ఓట్లు మాకొద్దన్నారు’’ అని జయనారాయణ్ మిశ్రా అన్నారు.

ఆ 300 ఇళ్లూ అక్రమ నిర్మాణాలేనని, అయితే, నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల విషయంలో ప్రజల్లో కొంత అసంతృప్తి ఉందని బీజేపీ కాశీ అధ్యక్షుడు దిలీప్ పటేల్ అంటున్నారు.

బనారస్‌లో గుజరాతీల ప్రభావం పెరుగుతోందన్న ఆరోపణలపై దిలీప్ స్పందిస్తూ.. "ఇది స్థానిక ప్రజలను బీజేపీకి వ్యతిరేకంగా రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షాలు పన్నిన ఎత్తుగడ" అని అన్నారు. పేపర్ లీకేజీ కూడా ప్రజల ఆగ్రహానికి కారణమైందని ఆయన భావిస్తున్నారు.

కాంట్రాక్టులపై దిలీప్ స్పందిస్తూ.. కొన్ని గుజరాతీలు చేపట్టిన మాట వాస్తవమేనని అయితే, ఇది ప్రాంతానికి సంబంధించినది కాదని, సమర్థతకు సంబంధించిన విషయమని తెలిపారు.

అజయ్ రాయ్
ఫొటో క్యాప్షన్, అజయ్ రాయ్

విపక్షం ఐక్యత

బనారస్‌లో మొత్తం 19 లక్షల 97 వేల 578 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో అక్కడ 56.35 శాతం మంది ఓటు వేశారు. అంటే కేవలం 11 లక్షల 30 వేల 143 మంది ఓటర్లు మాత్రమే ఓటు వేయగా వీరిలో నరేంద్ర మోదీకి 54.24 శాతం అంటే 6 లక్షల 12 వేల 970 ఓట్లు వచ్చాయి. మరోవైపు కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌ రాయ్‌కి 40.74 శాతం అంటే 4 లక్షల 60 వేల 457 ఓట్లు వచ్చాయి. మోదీ మెజారిటీ లక్షా 52 వేల 513 ఓట్లు.

2019 ఎన్నికల్లో మోదీకి బనారస్‌లో 63.6 శాతం ఓట్లు రాగా, అంతకు ముందు 2014లో 56.4 శాతం ఓట్లు వచ్చాయి. 2019లో నరేంద్ర మోదీ 4,79,505 ఓట్లతో విజయం సాధించారు. 2014లో 3,71,784 ఓట్లతో గెలిచారు.

బనారస్‌లో 2014తో పోలిస్తే 2019లో ప్రధాని మోదీ ఓట్ల శాతం 7.25 శాతం పెరిగింది, అయితే 2019తో పోలిస్తే 2024లో మోదీ ఓట్ల శాతం 9 శాతానికి పైగా తగ్గింది.

2014లో బనారస్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ సొంతంగా ఎన్నికల బరిలో నిలిచింది. 2019లో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ, ఆర్‌ఎల్‌డీ పొత్తు పెట్టుకున్నాయి. 2024లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి.

2024లో మోదీకి వ్యతిరేకంగా బనారస్‌లో విపక్షాల ఓట్లు చీలిపోలేదు, ఇది మోదీ మెజార్టీపై ప్రభావం చూపిందని డేటా ద్వారా స్పష్టమవుతోంది.

2014, 2019తో పోలిస్తే ఈసారి రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థికి అత్యధికంగా 40.4 శాతం ఓట్లు రాగా, 2014లో రెండో స్థానంలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌కు 20.3 శాతం ఓట్లు వచ్చాయి. 2019లో 18.4 శాతం ఓట్లతో షాలినీ యాదవ్ రెండో స్థానంలో నిలిచారు.

బనారస్‌ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రోహానియా, వారణాసి నార్త్, వారణాసి సౌత్, వారణాసి కంటోన్మెంట్, సేవాపురి. ఈ అసెంబ్లీ నియోజకవర్గాలలో 2019తో పోలిస్తే నరేంద్ర మోదీ ఓట్లు తగ్గగా, అజయ్ రాయ్ ఓట్లు పెరిగాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)