చంద్రబాబు స్టయిల్ మారిందా? కొత్త కేబినెట్ కూర్పు ఏం చెబుతోంది?

ఫొటో సోర్స్, I&PR
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో అత్యధికులు కొత్తవారే.
గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవమే కాదు.. కనీసం చట్టసభల్లో అడుగుపెట్టని వారి సంఖ్య కూడా పెద్దదే.
పాలక కూటమిలో అనేక మంది సీనియర్లు ఉన్నప్పటికీ వారందరినీ పక్కన పెట్టేసి యువతరానికి ప్రాధాన్యం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
సుదీర్ఘకాలంగా టీడీపీలో కొనసాగుతున్న నాయకులు, విపక్షంలో ఉండగా పార్టీ కార్యక్రమాలు భుజాన మోసిన నేతలు ఈసారి తమకు మంత్రి పదవులు ఖాయమని భావించారు. కానీ, అనూహ్యంగా అనేక మంది సీనియర్లకు మొండిచేయి ఎదురైంది.
వారి స్థానంలో కొత్తవారి వైపు మొగ్గుచూపారు. దీంతో ఏపీలో ఎన్డీయే ప్రభుత్వ కూర్పు ఆసక్తికరంగా కనిపిస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుగా మరో 24 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
వారిలో 17 మందికి గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు.
కేవలం ఏడుగురికి మాత్రమే గతంలో వివిధ సందర్భాల్లో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.


ఫొటో సోర్స్, I&PR
తొలి అడుగుతోనే అమాత్య పదవి..
ఇప్పటి వరకూ అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించని వారికి సైతం చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు. అనుభవం కన్నా వారి పనితీరుకే పెద్ద పీట వేసినట్టుగా చెబుతున్నారు.
తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి గెలిచిన వారిని కూడా మంత్రి పదవి వరించింది.
అందులోడాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన వాసంశెట్టి సుభాష్ ఒకరు.
ఆయనకు గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం కూడా లేదు. ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరారు.
అమలాపురం పట్టణానికి చెందిన ఆయనకు రామచంద్రాపురం సీటు దక్కింది. అక్కడి నుంచి తన ప్రత్యర్థి, సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్‌ని ఓడించారు. వెంటనే ఆయనకు అనూహ్యంగా మంత్రి పదవి దక్కింది.
వాస్తవానికి ఈ ఎన్నికల్లో శెట్టిబలిజ కులస్తులు ఇద్దరికి కూటమి టికెట్లు ఇచ్చింది. వారిలో సీనియర్ నేత, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నుంచి గెలిచారు.
దీంతో ఆయనకే మరోసారి మంత్రి పదవి కట్టబెడతారని అంతా అంచనా వేశారు.
కానీ, చంద్రబాబు మాత్రం యువనేత వైపు మొగ్గారు. రామచంద్రాపురం అసెంబ్లీ స్థానం నుంచి జగన్ కేబినెట్‌లో కూడా చెల్లుబోయిన వేణుగోపాల్ ప్రాతినిథ్యం వహించారు.

ఫొటో సోర్స్, I&PR
శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నుంచి గెలిచిన సంజీవరెడ్డిగారి సవిత కూడా అదే తీరులో అనూహ్యంగా కేబినెట్ బెర్త్ దక్కించుకున్నారు.
ప్రస్తుత శాసన సభలో ఏకైక కురుబ ఎమ్మెల్యే ఆమె. తొలిసారి ఆమె పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఏపీ మంత్రిగా పనిచేసిన ఉషశ్రీ చరణ్ ను ఓడించారు.
విపక్షంలో ఉండగా వివిధ కార్యక్రమాలతో అధిష్టానం దృష్టిలో పడ్డారు సవిత. దీంతో గెలిచిన వెంటనే ఆమెకు మంత్రి పదవి దక్కింది.
గతంలో ఆమె తండ్రి రామచంద్రారెడ్డి మంత్రిగా పనిచేశారు. గత ప్రభుత్వంలో కూడా పెనుగొండ నుంచి గెలిచిన శంకర నారాయణ మంత్రిగా పనిచేశారు.

ఫొటో సోర్స్, I&PR
విజయనగరం జిల్లా గజపతినగరం నుంచి గెలిచిన కొండపల్లి శ్రీనివాస్‌కి కూడా ఎన్నికల బరిలో దిగిన తొలిసారి విజయం వరించింది. ఆ వెంటనే ఆయనకు మంత్రి పదవి దక్కింది.
వాస్తవానికి తూర్పు కాపుల్లో సీనియర్లు కళా వెంకటరావు వంటి వారు గెలవడంతో మంత్రి పదవి రేసులో ఆయన ముందుంటారని భావించారు.
మరో సీనియర్ నేత బొండా ఉమా వంటి వారు కూడా మంత్రి పదవి కోసం వేచిచూశారు. కానీ, అనూహ్యంగా యువనేత కొండపల్లి శ్రీనివాస్‌కు మంత్రి పదవి దక్కడం ఆసక్తికరంగా కనిపిస్తోంది.
రాజకీయ వారసత్వంతో తెరపైకి వచ్చిన శ్రీనివాస్ గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టకముందే ఏపీ కేబినెట్‌లో చోటు దక్కించుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ఫొటో సోర్స్, I&PR
అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా అనూహ్యంగా తెరమీదకు వచ్చారు.
బరిలో దిగిన తొలిసారి విజయం సాధించారు. ఆ వెంటనే మంత్రి హోదా దక్కడం ఆసక్తిగా మారింది.
ఈసారి ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ తరఫున కీలక నేతలు విజయం సాధించారు. కానీ, అనూహ్యంగా యువ నేతకు ఛాన్స్ దక్కింది.

ఫొటో సోర్స్, Satya Kumar Y/facebook
చంద్రబాబు కేబినెట్ మంత్రుల్లో బీజేపీ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక నేత సత్యకుమార్ యాదవ్ కూడా తొలిసారి చట్టసభలో అడుగుపెడుతున్నారు.
ఆయన శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. పార్లమెంట్ సీటు ఆశించిన ఆయనకు చివరి నిమిషంలో అసెంబ్లీ సీటు దక్కింది.
అక్కడ గెలిచిన వెంటనే అమాత్య హోదా వరించింది. బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న ఆయన తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి, నేరుగా మంత్రి పదవి దక్కించుకున్నారు.
ఓడి, గెలిచిన నేతలు..

ఫొటో సోర్స్, I&PR
కొత్త మంత్రుల్లో మరికొందరు తొలిసారి గెలుపు రుచిచూసిన నేతలున్నారు. వివిధ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ అసెంబ్లీలో అడుగుపెట్టని వారిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒకరు.
గతంలో గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి నియోజకవర్గం మారి కాకినాడ జిల్లా పిఠాపురం సీటు ఎంచుకున్నారు. కూటమిగా బరిలో దిగడం కూడా ఆయన విజయానికి తోడ్పడింది. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం వచ్చింది.
ఇక తాజా కేబినెట్‌లో ఆయన జనసేన పార్టీ అధినేతగా కీలక భూమిక పోషించనున్నారు. ఉప ముఖ్యమంత్రి హోదా దక్కుతుందన్న ప్రచారం ఉంది. దీంతో అసెంబ్లీకి ఎన్నికైన తొలిసారే ఆయనకు కీలక పదవి దక్కబోతోంది.

ఫొటో సోర్స్, I&PR
అల్లూరి జిల్లా సాలూరు నుంచి గెలిచిన గుమ్మడి సంధ్యారాణి ప్రస్తుత కేబినెట్‌లో ఏకైక ఎస్టీ నేత. ఆమె గతంలో 2009లో కూడా సాలూరు నుంచి పోటీ చేశారు.
కానీ, ఓటమి పాలయ్యారు. తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన ఆమెకు మంత్రి పదవి దక్కింది.
ఈసారి ఎన్నికల్లో ఆమె డిప్యూటీ సీఎంగా పనిచేసిన పీడిక రాజన్నదొరను సాలూరులో ఓడించారు.

ఫొటో సోర్స్, I&PR
టీజీ భరత్ కర్నూలు జిల్లా కేంద్రం నుంచి 2019లో ఓటమి పాలై ఈసారి విజయం రుచిచూశారు.
తండ్రి టీజీ వెంకటేష్ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన భరత్ ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే వైశ్య కోటాలో మంత్రి పదవి వరించింది.
వాస్తవానికి వైశ్య కులానికి చెందిన సీనియర్ నేత శ్రీరామ్ తాతయ్య జగ్గయ్యపేట నుంచి గెలిచినప్పటికీ యువనేతగా భరత్‌కి అవకాశం ఇచ్చారు.

ఫొటో సోర్స్, I&Pr
జనసేన నుంచి కేబినెట్‌లో ఉన్న ముగ్గురు మంత్రుల్లో కందుల దుర్గేష్ ఒకరు. ఆయన గతంలో కాంగ్రెస్ తరఫున శాసన మండలికి ఎన్నికయ్యారు.
ఆ తర్వాత జనసేనలో చేరిన ఆయన 2024 ఎన్నికల్లో రాజమహేంద్రవరం రూరల్ సీటు ఆశించారు. కానీ, పొత్తులో భాగంగా ఆయనకు నిడదవోలు అసెంబ్లీ స్థానం దక్కింది.
అక్కడి నుంచి గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన ఈ సీనియర్ నేతకు మొదటి సారి మంత్రి పదవి దక్కింది.
ఎదురుచూపులు ఫలించి..

ఫొటో సోర్స్, I&PR
మొదటిసారి గెలిచి మంత్రులైన వారితో పాటు చాలాకాలంగా ఎదురుచూస్తున్న నేతలకు కూడా ఈసారి మంత్రివర్గంలో అవకాశం దక్కింది.
అలాంటి వారిలో పయ్యావుల కేశవ్ ఒకరు. ఆయన 5వ సారి గెలిచారు.
ఉరవకొండలో గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారానికి దూరమవుతుందనే అభిప్రాయం చాలాకాలంగా ఉండేది.
కానీ, ఈసారి దానిని అధిగమించి కేశవ్ విజయం సాధించారు. 2019-24 మధ్య పీఏసీ చైర్మన్‌గా వ్యవహరించిన ఆయనకు ప్రస్తుత కేబినెట్‌లో కీలకపాత్ర వహించే అవకాశం దక్కింది.

ఫొటో సోర్స్, I&PR
గొట్టిపాటి రవికుమార్ కూడా ఐదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ తరఫున పోటీ చేసిన రవి వరుసగా గెలుస్తూ వచ్చారు.
అద్దంకి నుంచి ఆయన మరోసారి విజయం సాధించారు.
దీంతో ఆయనకు కూడా తొలిసారి మంత్రి పదవి దక్కింది.

ఫొటో సోర్స్, I&PR
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నుంచి గెలిచిన వంగలపూడి అనిత కూడా తొలిసారి మంత్రి అయ్యారు.
2014లో గెలిచిన ఆమె 2019లో సీటు మారి ఓటమి పాలయ్యారు. ఈసారి మళ్లీ పాయకరావుపేట నుంచి విజయం సాధించి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా విపక్షంలో ఉండగా కీలకంగా వ్యవహరించిన ఆమెకు ఎస్సీ కోటాలో ఛాన్స్ లభించింది.
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉద్దండులైన నేతలందరినీ పక్కన పెట్టేసి ఏకైక మంత్రిగా అనితకు అవకాశం దక్కడం చెప్పుకోదగ్గ అంశం.

ఫొటో సోర్స్, I&PR
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడిని కూడా మొదటిసారి మంత్రి పదవి వరించింది.
ఆయన ఇక్కడి నుంచి హ్యాట్రిక్ విజయాలు సాధించారు. విపక్షంలో ఉండగా అటు సభలోనూ, ఇటు వెలుపలా అనేక పోరాటాలు సాగించారు.
అధిష్టానం అండదండలతో ఆయన మంత్రి హోదా చేజిక్కించుకున్నారు.

ఫొటో సోర్స్, I&PR
ప్రకాశం జిల్లా కొండెపి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయాలు సాధించిన ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి కూడా తొలిసారి మంత్రి పదవి దక్కించుకున్న వారి జాబితాలో ఉన్నారు.
2014, 2019, 2024 ఎన్నికల్లో ఈయన వరుస విజయాలు సాధించారు. ప్రారంభం నుంచి టీడీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసి వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నారు.
చంద్రబాబు కేబినెట్లో ఇద్దరు ఎస్సీ నేతలకు అవకాశం దక్కగా వారిలో స్వామి ఒకరు. ఎస్సీ మాల కోటాలో స్వామి ఒక్కరికే అవకాశం దక్కింది.

ఫొటో సోర్స్, I&PR
బీసీ జనార్దన్ రెడ్డి నంద్యాల జిల్లా బనగానపల్లె నుంచి రెండోసారి గెలిచారు.
2014లో గెలిచిన ఆయన 2019లో ఓటమి పాలయ్యారు.
ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వంటి వారు గెలిచినప్పటికీ వారిని పక్కనబెట్టి జనార్దన్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
బనగానపల్లె అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఆయన తొలిమంత్రి అయ్యారు.

ఫొటో సోర్స్, I&PR
బాపట్ల జిల్లా రేపల్లె నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూడా మొదటిసారి మంత్రి అయ్యారు.
పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌కి సన్నిహితులనే పేరుంది. బీసీ కోటాలో అనగానికి అవకాశం దక్కింది.

ఫొటో సోర్స్, I&PR
మరో సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కూడా మొదటిసారి మంత్రి అయ్యారు.
ఆయన కూడా డిప్యూటీ స్పీకర్, స్పీకర్‌గా పనిచేసినప్పటికీ మంత్రి పదవి మాత్రం దక్కలేదు.
2014, 19 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఆయన తెనాలి నుంచి ఓటమి పాలయ్యారు.
కానీ, మూడోసారి పోటీ చేసి విజయం సాధించారు. జనసేన కోటాలో ఆయనకు అవకాశం వచ్చింది.
'టీడీపీ నాయకత్వంలో మార్పునకు సంకేతంగా కనిపిస్తోంది..'
చంద్రబాబు కేబినెట్ చూస్తుంటే గడచిన ఐదేళ్లలో పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు నాయకుల పనితీరుని ప్రామాణికంగా తీసుకున్నట్టు కనిపిస్తోందని సీనియర్ జర్నలిస్ట్ ఆర్.రామచంద్ర రావు అన్నారు.
"చంద్రబాబు కేబినెట్ పాత, కొత్త కలయికగా ఉంది. యువతరానికి ప్రాధాన్యం ఇచ్చారు. దీనివెనుక రెండు లక్ష్యాలు కనిపిస్తున్నాయి. టీడీపీ నాయకత్వంలో మార్పునకు సంకేతంగా ఉంది. కొత్త తరాన్ని ప్రోత్సహించడం ద్వారా, రాబోయే కాలంలో వారి నాయకత్వంలో పార్టీని నడిపించే ప్రయత్నం చేయబోతున్నట్టు కనిపిస్తోంది. అదే సమయంలో పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచిన వారికి పార్టీలో ప్రాధాన్యం ఉంటుందన్న సంకేతం పంపించినట్టు భావించాల్సి ఉంటుంది" అని ఆయన వ్యాఖ్యానించారు.
టీడీపీకి నాలుగు దశాబ్దాల ప్రస్థానం పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతం మూడోతరం హవా మొదలైనట్టుగా ఈ కేబినెట్ చెబుతుందని రామచంద్ర రావు అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- కేఏ పాల్, లక్ష్మీనారాయణలకు ఎన్ని ఓట్లు వచ్చాయి.. ఎన్నికల్లో చిన్న పార్టీల ప్రభావమెంత?
- మొదటిసారి పోటీ చేసి, గెలిచి, కేంద్ర మంత్రి పదవి సాధించిన పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరు?
- సైబర్ సెక్స్ వర్కర్: పోర్న్ ఇండస్ట్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఎలా ఉండబోతోంది?
- 26 ఏళ్లకే ఎంపీ, 36 ఏళ్లకు కేంద్రమంత్రి.. కింజరాపు రామ్మోహన్ నాయుడు గురించి ఈ విషయాలు తెలుసా?
- పవన్ కళ్యాణ్ జీతం ఎంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














