కువైట్‌లో అగ్నిప్రమాదం: ‘మంటల్లో చిక్కుకుని కొందరు, పొగలో ఊపిరాడక మరికొందరు చనిపోయారు’

ఫొటో సోర్స్, EPA
కువైట్‌లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 49 మంది మరణించారు.
వారిలో ఎక్కువ మంది భారత పౌరులేనని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ బీబీసీకి తెలిపారు.
ఈ అగ్నిప్రమాదంలో దాదాపు 50 మంది గాయపడ్డారు.
కువైట్‌లోని భారత రాయబారి ఆసుపత్రులను సందర్శించి క్షతగాత్రుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.
"ఈ ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అక్కడ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాం. క్షతగాత్రులకు, బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించేందుకు స్థానిక అధికారులతో కలిసి పని చేస్తున్నాం" అని ‘ఎక్స్’లో ప్రధాని తెలిపారు.


ఫొటో సోర్స్, @INDEMBKWT
బుధవారం తెల్లవారుజామున అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి. భవనం కిటికీల నుంచి దట్టమైన నల్లటి పొగలు కమ్ముకున్నాయి.
మంగాఫ్ ప్రాంతంలో ఉన్న ఆరు అంతస్తుల భవనంలోని వంటగదిలో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.
ఆ సమయంలో భవనంలో 160 మంది కార్మికులు ఉన్నారు. వారంతా ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కువైట్ మంత్రి ఫహద్ యూసెఫ్ అల్ సబా ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, భవన యజమానుల అత్యాశే దీనికి కారణమని అన్నారు.
కువైట్ మీడియా కథనాల ప్రకారం, ఆ భవనంలో సామర్థ్యానికి మించి నివసిస్తున్నారు.
ఈ ఘటనను కువైట్ హోం మంత్రి ధ్రువీకరించారు.
స్థిరాస్తి చట్టాల ఉల్లంఘనలపై విచారణ జరుపుతామని హోంమంత్రి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
నైట్ షిఫ్ట్‌ల నుంచి వచ్చాక..
ఎండల తీవ్రత కారణంగా కార్మికులు రాత్రి షిఫ్టులలో పనిచేస్తున్నారని.. అలా పనిచేస్తున్నవారిలో కొందరు ఉదయాన్న తిరిగొచ్చి వంట చేస్తుండగా ప్రమాదం జరిగిందని మణికందన్ అనే ప్రత్యక్ష సాక్షి బీబీసీకి చెప్పారు.
తమిళనాడకు చెందిన ఆయన, ప్రమాదం జరిగిన అపార్ట్‌మెంట్‌కు సమీపంలోని మరో అపార్ట్‌మెంట్లో తాను ఉంటానని చెప్పారు.
అక్కడున్నవారు మంటలను ఆర్పలేకపోయారని, దాంతో మంటల్లో చిక్కుకుని కొందరు, పొగలో ఊపిరాడక మరికొందరు మరణించారని మణికందన్ తెలిపారు.
చనిపోయినవారిలో ఎక్కువ మంది భారతీయులేనని, తమిళనాడు, కేరళకు చెందినవారు ఉన్నారని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్ నంబర్ +965-65505246ను ఏర్పాటు చేసింది. బాధిత కుటుంబసభ్యులు సాయం కోసం ఈ హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చని తెలిపింది.
కువైట్ జనాభాలో మూడింట రెండొంతుల మంది వలస కార్మికులే.
కువైట్ ఎక్కువగా విదేశీ కార్మికులపై ఆధారపడుతోంది. ముఖ్యంగా నిర్మాణ, గృహ రంగాల్లో ఎక్కువ మంది పనిచేస్తున్నారు.
కువైట్‌లోని వలస కార్మికుల జీవన ప్రమాణాలపై మానవ హక్కుల సంఘాలు పదేపదే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- కేఏ పాల్, లక్ష్మీనారాయణలకు ఎన్ని ఓట్లు వచ్చాయి.. ఎన్నికల్లో చిన్న పార్టీల ప్రభావమెంత?
- మొదటిసారి పోటీ చేసి, గెలిచి, కేంద్ర మంత్రి పదవి సాధించిన పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరు?
- సైబర్ సెక్స్ వర్కర్: పోర్న్ ఇండస్ట్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఎలా ఉండబోతోంది?
- 26 ఏళ్లకే ఎంపీ, 36 ఏళ్లకు కేంద్రమంత్రి.. కింజరాపు రామ్మోహన్ నాయుడు గురించి ఈ విషయాలు తెలుసా?
- పవన్ కళ్యాణ్ జీతం ఎంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














