ఇస్లామిక్ స్టేట్ నాయకుడు అబూ బకర్ అల్-బాగ్దాదీ గురించి జైలులోని ఆయన భార్య ఏమన్నారంటే?

- రచయిత, ఫెరాస్ కిలానీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) గ్రూప్ నాయకుడు అబూ బకర్ అల్-బాగ్దాదీ భార్య, ఆయనకు సంబంధించిన వివరాలను జైలు నుంచి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
అబూ బకర్ మొదటి భార్య ఉమ్ హుదైఫా. ఇస్లామిక్ స్టేట్ సిరియా, ఇరాక్ భూభాగాలపై క్రూరమైన పాలనను సాగిస్తున్నపుడు హుదైఫా ఆయనను వివాహం చేసుకున్నారు.
తీవ్రవాద సంబంధిత నేరాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ప్రస్తుతం ఇరాక్ జైలులో ఉన్నారు.
2014 వేసవిలో ఉమ్ హుదైఫా తన భర్తతో కలిసి సిరియాలో నాటి ఇస్లామిక్ స్టేట్‌కు బలమైన కోటగా ఉన్న రక్కాలో నివసించేవారు.
తీవ్రవాద జిహాదిస్ట్ గ్రూప్‌నకు చెందిన మోస్ట్ వాంటెడ్ లీడర్‌గా, అబూ బకర్ అల్-బాగ్దాదీ తరచుగా రహస్య ప్రదేశాలలో గడిపేవారు, అలాంటి ఒకానొక సందర్భంలో ఆయన తన ఇద్దరు కుమారులను తీసుకురావడానికి ఒక గార్డును ఇంటికి పంపారు.
"అబ్బాయిలకు ఈత నేర్పడానికి వాళ్లను విహారయాత్రకు తీసుకువెళ్తున్నానని ఆయన నాతో చెప్పారు" అని హుదైఫా తెలిపారు.
ఇంట్లో హుదైఫా రహస్యంగా టీవీని చూసేవారు. "ఆయన ఇంట్లో లేనప్పుడు టీవీ ఆన్ చేసేదాన్ని" అని ఆమె గుర్తుచేసుకున్నారు.
ఆ టీవీ పని చేయడం లేదని అబూ బకర్ అనుకునేవారు. తనకు ప్రపంచంతో నేరుగా సంబంధాలు లేవని, 2007 నుంచి తనను టెలివిజన్ చూడనివ్వలేదని, మొబైల్ ఫోన్‌ల వంటి వాటిని ఉపయోగించనివ్వలేదని హుదైఫా చెప్పారు.
గార్డు పిల్లలను తీసుకెళ్లిన కొన్ని రోజుల తర్వాత ఆమె టీవీ చూసి, చాలా ఆశ్చర్యపోయారు.
తన భర్త తనను తాను మొదటిసారిగా ఇస్లామిక్ కాలిఫేట్ అధిపతిగా చెప్పుకుంటూ ఉత్తర ఇరాక్ నగరమైన మోసుల్‌లోని అల్-నూరి మసీదు దగ్గర ప్రసంగించడం ఆమె చూశారు. ఇస్లామిక్ స్టేట్ ఆ ప్రాంతంపై పట్టు సాధించిన కొన్ని వారాల తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది.
అల్-బాగ్దాదీ నల్లని వస్త్రాలు ధరించి తన పొడవాటి గడ్డంతో, చాలా ఏళ్ల తర్వాత మొదటిసారి బహిరంగంగా కనిపించిన దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసారం అయ్యాయి. తన కుమారులు యూఫ్రేట్స్‌లో ఈత నేర్చుకోకుండా, మోసుల్‌లో ఉన్నారని తెలుసుకుని ఆశ్చర్యపోయానని హుదైఫా చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
బాలికలను హుదైఫా బానిసలుగా మార్చారా?
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఆమెను బంధించిన జైలులో ఇరాకీ అధికారులు ఇస్లామిక్ స్టేట్, దాని నేరాలలో ఆమె పాత్రను పరిశోధిస్తున్నారు.
లైబ్రరీలో నిశ్శబ్దంగా ఉండే ప్రదేశంలో ఆమెతో మేం దాదాపు 2 గంటలపాటు మాట్లాడాం. మా సంభాషణలో ఆమె తాను తన భర్త నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినట్లు తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ క్రూర కార్యకలాపాలతో తనకు సంబంధం లేదని హుదైఫా అన్నారు.
కిడ్నాప్ అయిన బాలికలు, మహిళలను లైంగిక బానిసలుగా మార్చడంలో ఆమె సహకరించారని యాజిదీలు ఆమెపై కోర్టులో కేసు వేశారు. అయితే హుదైఫా దీనిని కొట్టి పారేశారు.
ఉమ్ హుదైఫా 1976లో ఇరాక్‌లోని ఒక సంప్రదాయ కుటుంబంలో జన్మించారు, 1999లో అబూ బకర్ అల్-బాగ్దాదీ అని మారుపేరుతో పిలిచే ఇబ్రహీం అవద్ అల్-బద్రీని ఆమె వివాహం చేసుకున్నారు.
యూనివర్శిటీ ఆఫ్ బాగ్దాద్‌లో షరియా చట్టాన్ని అబూ బకర్ అభ్యసించారు.
ఆ సమయంలో ఆయన "మతవాది కానీ తీవ్రవాది కానీ కాదు, కేవలం సంప్రదాయవాదే. కానీ దేనినైనా చర్చించడానికి సిద్ధంగా ఉండేవారు" అని హుదైఫా అన్నారు.
2004లో ఇరాక్‌పై అమెరికా నేతృత్వంలో దాడి జరిగిన ఏడాది తర్వాత, అమెరికన్ దళాలు అల్-బాగ్దాదీని క్యాంప్ బుక్కాలోని నిర్బంధ కేంద్రంలో దాదాపు ఒక సంవత్సరం పాటు బంధించాయి.
విడుదలైన కొన్నేళ్ల తర్వాత ఆయనలో చాలా మార్పు వచ్చిందని హుదైఫా చెప్పారు. అయితే "ఆయనకు చిన్న విషయాలకే కోపం వచ్చేది" అని ఆమె గుర్తుచేసుకున్నారు.
అల్-బాగ్దాదీ గురించి తెలిసిన మరికొందరు ఆయన బుక్కాలో ఉన్న సమయానికి ముందు నుంచి అల్ ఖైదాతో సంబంధాలు ఉన్నాయని చెబుతారు, కానీ ఆమె మాత్రం బుక్కా నిర్భంధం తరువాతే ఆయనలో మార్పు వచ్చిందని అన్నారు.
"ఆయన మానసిక సమస్యలతో బాధపడటం మొదలైంది" అని హుదైఫా చెప్పారు. ఆమె దీనిపై అల్-బాగ్దాదీని ప్రశ్నిస్తే, 'నీకు అర్థం కాదులే’ అనేవారని చెప్పారు.
స్పష్టంగా చెప్పకున్నా "నిర్బంధ సమయంలో ఆయనను లైంగికంగా హింసించారు’’ అని హుదైఫా నమ్ముతున్నారు.
విడాకులు కోరిన హుదైఫా
ఆ ఏడాది అమెరికా ఆధ్వర్యంలోని అబూ ఘ్రైబ్ జైలులో ఖైదీలపై జరుగుతున్న అమానుష లైంగిక చర్యలు వెలుగులోకి వచ్చాయి.
అప్పుడే ఆయన ఏదైనా మిలిటెంట్ గ్రూప్‌కి చెందినవాడా అనే అనుమానం తనకు మొదలైందని హుదైఫా చెప్పారు. “ఆయన ఇంటికి వచ్చినప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు లేదా నిద్రపోయేటప్పుడు నేను ఆయన బట్టలు వెతికేదాన్ని. ఆయన శరీరం మీద గాయాలు ఉన్నాయా అని పరిశీలించేదాన్ని, కానీ ఏ ఆనవాళ్లు కనిపించలేదు’’అని ఆమె చెప్పారు.
వాళ్లు తరచుగా ఇల్లు మారడం, నకిలీ గుర్తింపు కార్డులు, ఆయన రెండో భార్యను ఎలా వివాహం చేసుకున్నారో ఇవన్నీ ఆమె వివరించారు. ఆయనను హుదైఫా విడాకులు కోరారు, అయితే పిల్లలను వదిలి వెళ్లాలనే అబూ బకర్ షరతుకు ఆమె అంగీకరించలేదు. దాంతో ఆమె ఆయనతోనే ఉండిపోయారు.
ఇరాక్‌లో 2006 నుంచి 2008 వరకు సాగిన రక్తపాతంతో కూడిన వర్గాల పోరులో ఆయన సున్నీ జిహాదిస్ట్ గ్రూపులో ఉన్నారని హుదైఫాకు తెలిసింది. 2010లో ఆయన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ నాయకుడయ్యారు, 2006లో ఏర్పడిన ఈ సంస్థ ఇరాకీ జిహాదీ సంస్థల గ్రూపులకు కేంద్రంగా ఉండేది.
" 2012 జనవరిలో మేం సిరియాలోని ఇడ్లిబ్ గ్రామీణ ప్రాంతానికి వెళ్లాం, అక్కడ ఆయన ఎమిర్ [నాయకుడు] అని నాకు పూర్తిగా అర్థమైంది" అని ఉమ్ హుదైఫా చెప్పారు.
ఆ సమయంలో అల్ బాగ్దాదీ అఫ్గానిస్తాన్ దుస్తులు ధరించడం ప్రారంభించారని, గడ్డం పెంచారని, తుపాకీ పట్టుకునేవారని ఆమె చెప్పారు.
దేశ అంతర్యుద్ధ సమయంలో వాయువ్య సిరియాలో భద్రతా పరిస్థితి క్షీణించడంతో, వాళ్లు తూర్పున రక్కా నగరానికి వెళ్లారు. తన భర్తను టెలివిజన్‌లో చూసినప్పుడు ఆమె ఇక్కడే ఉండేవారు.

ఫొటో సోర్స్, Reuters
యూఎన్ నివేదిక
ఐఎస్‌గా ఏర్పడిన గ్రూపుల దారుణాలు 2014, 2015లో తీవ్రమయ్యాయి.
ఇరాక్‌లోని యాజిదీ మైనారిటీలపై ఇస్లామిక్ స్టేట్ మారణహోమానికి పాల్పడిందని, ఐక్యరాజ్య సమితి పరిశోధనా బృందం నివేదించింది. బందీలను చంపడం, జోర్డాన్ పైలట్‌ను కాల్చిచంపడం వంటి దురాగతాలను ఐఎస్ తన సోషల్ మీడియాలో ప్రసారం చేసింది. మరొక సంఘటనలో బాగ్దాద్‌కు ఉత్తరాన ఉన్న స్పీచర్ ఆర్మీ స్థావరం నుంచి వారి స్వస్థలాలకు తిరిగి వెళుతున్న దాదాపు 1,700 మంది షియా ట్రైనీ ఇరాక్ సైనికులను ఐఎస్ చంపేసింది.
ఐఎస్‌తో కలిసి జీవించడానికి వెళ్లిన కొందరు మహిళలు, అసలు ఎందుకు వెళ్లారో అర్థం కాలేదు. అందుకే ఆ సమయంలో ఉమ్ హుదైఫాను అడిగాం. అయితే, అప్పుడు ఆ ఫోటోలను చూడలేకపోయానని ఆమె తెలిపారు. ఆ దాడులు అమానవీయమని హుదైఫా అభిప్రాయపడ్డారు.
"అన్యాయంగా రక్తం చిందించడం చాలా భయంకరమైన విషయం, వాళ్లు కనీస మానవత్వం మరిచారు" అని అన్నారామె.
‘మీ చేతులపై ఆ అమాయక ప్రజల రక్తం ఉంది’ అని భర్తకు చెప్పానని హుదైఫా అన్నారు.
"ఇస్లామిక్ చట్టం ప్రకారం ప్రజలను పశ్చాత్తాపం వైపు నడిపించడం వంటి ఇతర చేయదగిన పనులు ఉన్నాయి" అని ఆయనతో చెప్పానని ఆమె గుర్తుచేసుకున్నారు.
తన భర్త ల్యాప్‌టాప్‌లో ఇతర ఐఎస్ నాయకులతో మాట్లాడేవారని తెలిపారు. ఆయన తన కంప్యూటర్‌ను ఒక బ్రీఫ్‌కేస్‌లో దాచేవారని తెలిపారు.
"ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి దాన్ని తెరవడానికి ప్రయత్నించాను, కానీ అదెప్పుడూ పాస్‌వర్డ్ అడిగేది" అని హుదైఫా చెప్పారు.
తప్పించుకోవడానికి ప్రయత్నించగా, చెక్‌పాయింట్‌లోని సాయుధులు తనను ఇంటికి తిప్పి పంపారని ఆమె చెప్పారు.
పోరాటాల విషయానికొస్తే, ఆమె తన భర్త గురించి చెబుతూ, నాకు తెలిసినంత వరకు "ఆయన ఏ పోరాటంలో లేదా యుద్ధంలో పాల్గొనలేదు" అని అన్నారు.
మోసుల్‌ను ఇస్లామిక్ స్టేట్ ఆధీనంలోకి తీసుకున్నప్పుడు ఆయన రక్కాలో ఉన్నారని, తరువాతే మోసుల్ వెళ్లారని ఆమె చెప్పారు.
ఆ తర్వాత, అల్-బాగ్దాదీ తమ 12 ఏళ్ల కూతురు ఉమైమాను తన స్నేహితుడైన మన్సూర్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. దీన్ని అడ్డుకునేందుకు తాను ప్రయత్నించినా పట్టించుకోలేదని ఉమ్ హుదైఫా అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అమ్మాయిలను ఇంటికి తీసుకొచ్చి..
ఆ తర్వాత 2014 ఆగస్టులో ఉమ్ హుదైఫా మరో కూతురికి (నసీబా) జన్మనిచ్చారు. ఆ పాప పుట్టుకతోనే గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడేది. ఇదే సమయంలో మన్సూర్ 9 మంది యాజిదీ అమ్మాయిలు, మహిళలను ఇంటికి తీసుకువచ్చారు. వాళ్ల వయస్సు దాదాపు 9 నుంచి 30 వరకు ఉండేది.
కొన్ని వేలమంది యాజిదీ స్త్రీలు, పిల్లలను ఇస్లామిక్ స్టేట్ బానిసలుగా చేసుకున్నారు, ఇంకా వేలమందిని చంపారు. మన్సూర్ తీసుకువచ్చిన వాళ్లు వీళ్లలోని వాళ్లే.
ఆ యాజిదీ స్త్రీల సమూహంలో ఇద్దరు యువతులు ఉండేవారు – సమర్, జెనా(అసలు పేర్లను మార్చాం). వాళ్లు రక్కాలోని తన ఇంట్లో కొన్ని రోజులు మాత్రమే ఉన్నారని హుదైఫా తెలిపారు. కానీ మోసుల్‌కు వెళ్లినపుడు సమర్ మళ్లీ కనిపించింది, వాళ్లతో పాటు రెండు నెలలు ఉంది.

నేను సమర్ తండ్రి హమీద్‌ని వెతికి పట్టుకున్నాను, సమర్‌ను బలవంతంగా పట్టుకుపోయిన క్షణాలను ఆయన కన్నీటితో గుర్తుచేసుకున్నారు.
తనకు ఇద్దరు భార్యలు ఉన్నారని, వాళ్లతో పాటు తన 26 మంది పిల్లలు, ఇద్దరు సోదరులు, వాళ్ల కుటుంబ సభ్యులను సింజార్‌లోని ఖాన్‌సోర్ పట్టణంలో కిడ్నాప్ చేశారని హమీద్ చెప్పారు. ఆ తర్వాత ఆయన సమీపంలోని పర్వతాలలోకి పారిపోయానని చెప్పారు.
సమర్‌తో సహా ఆయన ఆరుగురు పిల్లలు ఇంకా కనిపించలేదు. డబ్బులివ్వడంతో కొందరిని విడుదల చేశారు, మరికొందరు వాళ్లు నిర్బంధించిన ప్రాంతాలు విముక్తి అయ్యాక ఇంటికి చేరుకున్నారు.
సమర్‌తో పాటు ఉన్న మరో అమ్మాయి, ఆయన మేనకోడలైన జెనా, ఆమె ఉత్తర సిరియాలో చిక్కుకుపోయిందని భావిస్తున్నారు. జెనా సోదరి సోద్‌ను ఏడుసార్లు విక్రయించారు, ఆమెపై అత్యాచారం చేశారు.

హుదైఫాకు మరణశిక్ష వేయాలి
యాజిదీ బాలికలను కిడ్నాప్ చేసి బానిసలుగా మార్చడంలో సహకరించినందుకు ఉమ్ హుదైఫాపై హమీద్, సోద్‌లు సివిల్ దావా వేశారు.
హుదైఫా కూడా బాధితురాలు అంటే వాళ్లు నమ్మడం లేదు, ఆమెకు మరణశిక్ష విధించాలంటూ వాళ్లు డిమాండ్ చేశారు.
"ఆమె అబూ బకర్ అల్-బాగ్దాదీ భార్య, ఆమె ఆయనలాగే నేరస్తురాలు" అని సోద్ అన్నారు.
మేము సోద్‌తో మా ఇంటర్వ్యూను ఉమ్ హుదైఫాకు వినిపించగా ఆమె "నా భర్త నేరస్తుడు కాదనడం లేదు. వాళ్లకు జరిగిన దానికి చాలా చింతిస్తున్నాను" అన్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఆమె ఖండించారు.
ఇంటర్వ్యూ సందర్భంగా ఉమ్ హుదైఫా, తాను జనవరి 2015లో కిడ్నాప్ అయిన అమెరికా సహాయ కార్యకర్త కైలా ముల్లర్‌ను కలుసుకున్నానని తెలిపారు, ఆమె 18 నెలలపాటు బందీగా ఉండి మరణించారని హుదైఫా చెప్పారు.
కైలా మరణం చుట్టూ ఉన్న పరిస్థితులు ఇప్పటికీ తెలియవు - ఆ సమయంలో ఆమె జోర్డాన్ వైమానిక దాడిలో మరణించారని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. అయితే అమెరికా దీనిని ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆమె ఇస్లామిక్ స్టేట్ చేతుల్లో మరణించారని మాకు తెలిసింది.

ఫొటో సోర్స్, Iraqi Intelligence Service
అల్ బాగ్దాదీ ఎలా చనిపోయారు?
2019లో వాయువ్య సిరియాలో అల్-బాగ్దాదీ, ఆయన కుటుంబ సభ్యులు దాక్కున్న ప్రదేశంపై అమెరికా దళాలు దాడి చేశాయి. ఆత్మాహుతి చేసుకునే క్రమంలో అల్ బాగ్దాదీ పేలుళ్లకు పాల్పడటంతో ఆయనతో పాటు ఇద్దరు పిల్లలు మరణించారు. ఆయన నలుగురు భార్యలలో ఇద్దరు అమెరికా దళాల కాల్పుల్లో మరణించారు.
అయితే ఆ సమయంలో ఉమ్ హుదైఫా అక్కడ లేరు - ఆమె మారు పేరుతో తుర్కియేలో ఉన్నారు. ఆమెను 2018లో అరెస్టు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమెను ఇరాక్‌కు తిరిగి పంపించారు, అక్కడ ఆమెను జైలులో ఉంచి, ఇస్లామిక్ స్టేట్‌లో ఆమె పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు.
ఆమె పెద్ద కుమార్తె ఉమైమా ఆమెతో పాటు జైలులో ఉండగా, మరో కుమార్తె 12 ఏళ్ల ఫాతిమా నిర్బంధ కేంద్రంలో ఉంది. ఆమె కొడుకులలో ఒకరు సిరియాలోని హామ్స్ సమీపంలో రష్యా వైమానిక దాడిలో మరణించారు. అందరికన్నా చిన్న కుమారుడు అనాథాశ్రమంలో ఉన్నారు.
మేం మాట్లాడటం ముగించాక హుదైఫా తల పైకెత్తారు, అప్పుడు నేను ఆమె పూర్తి ముఖాన్ని కొద్ది సేపు చూశాను, కానీ ఆమె ముఖంలో ఎలాంటి భావాలూ లేవు.
ఇంటెలిజెన్స్ అధికారి ఆమెను దూరంగా నడిపించుకుపోతున్నప్పుడు, ఆమె తన పిల్లల గురించి మరింత సమాచారాన్ని చెప్పాలని ఆయనను అభ్యర్థించడం వినిపించింది.
తన సెల్‌కు తిరిగి వెళ్లిన హుదైఫా, తనపై క్రిమినల్ నేరారోపణలు చేస్తారో లేదో తెలుసుకోవడానికి వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి:
- 2024 ఎన్నికలు: తీహార్ జైలు ఖైదీ ఒక రాష్ట్ర మాజీ సీఎంను ఓడించారు... ఇలాంటి విశేషాలు ఇంకా ఎన్నంటే...
- ఆంధ్రప్రదేశ్: చంద్రబాబు, పవన్, జగన్‌ల కంటే భారీ మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరంటే..
- తెలంగాణ: ఒక్క సీటూ గెలవని బీఆర్ఎస్, ఎన్నికలకు ముందే ఆశలు వదిలేశారా
- కంగనాపై దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ మహిళా జవాన్ ఎవరు, ఎయిర్ పోర్టులో అసలేం జరిగింది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















