రక్షా ఖడ్సే: 23 ఏళ్లకే సర్పంచ్‌, ఇప్పుడు మోదీ ప్రభుత్వంలో మంత్రి

RAKSHA KHADSE

ఫొటో సోర్స్, FB/RAKSHAKHADSE

కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైంది.

71 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

వీరిలో సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రక్షా ఖడ్సే, మోదీ ప్రభుత్వంలో అత్యంత పిన్న వయస్కురాలైన మహిళా మంత్రిగా గుర్తింపు పొందారు.

ఆమెకు యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు.

మోదీ మంత్రివర్గంలో మహారాష్ట్రకు చెందిన నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, రాందాస్ అఠౌలే, రక్షా ఖడ్సే, ప్రతాప్‌రావ్ జాదవ్, మురళీధర్ మోహోల్‌లకు చోటు దక్కింది.

మహారాష్ట్ర నుంచి రక్షా ఖడ్సే ఒక్కరే మహిళా మంత్రి. ఆమె లోక్‌సభకు ఎన్నిక కావడం ఇది వరుసగా మూడోసారి.

BBC News Telugu Whatsapp Channel

రాజకీయ ప్రవేశం

రక్షా ఖడ్సే తన వివాహం తరువాత రాజకీయాల్లోకి వచ్చారు.

ఏక్‌నాథ్ ఖడ్సే కుమారుడు, రక్షా ఖడ్సే భర్త నిఖిల్ ఖడ్సే 2012 లో మరణించిన అనంతరం ఆమె రాజకీయాల్లోకి వచ్చారు.

ఆమె మొదటి రాజకీయ పదవి ముక్తైనగర్ తాలూకాలోని కోథ్లీ గ్రామ సర్పంచ్.

2010 లో కోథ్లీ గ్రామ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె, నాటి నుంచి బీజేపీలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు.

దీని తరువాత, ఆమె 2010-2012 కాలంలో జల్గావ్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలిగా పనిచేశారు.

2014లో తొలిసారిగా రావేర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేసి గెలిచారు.

రక్షా ఖడ్సే తొలిసారి ఎంపీ అయినప్పుడు ఆమె వయసు 26 ఏళ్లు.

2014లో ఎన్సీపీ అభ్యర్థి మనీష్ జైన్‌పై మూడున్నర లక్షల ఓట్ల తేడాతో గెలుపొందిన ఆమె, 2019 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఉల్లాస్ పాటిల్‌పై మూడు లక్షలకు పైగా ఓట్లతో విజయం సాధించారు.

RAKSHA KHADSE

ఫొటో సోర్స్, FB/RAKSHAKHADSE

గుర్జర్ పాటిల్ - లేవా పాటిల్ వర్గాల ప్రభావం

ఉత్తర మహారాష్ట్రలో బీజేపీ నిలబెట్టుకోగలిగిన రెండు సీట్లలో రేవార్ ఒకటి.

రేవార్ నియోజకవర్గంలో లేవా-పాటిల్, గుర్జర్-పాటిల్ వర్గాల ఆధిపత్యం ఉంది.

రక్షా ఖడ్సే గుర్జర్ వర్గానికి చెందినవారు కాగా.. ఆమె మామయ్య ఖడ్సే లేవా-పాటిల్ వర్గానికి చెందినవారు.

శరద్ పవార్ ఆమెకు పోటీగా రక్షా ఖడ్సే బంధువైన రోహిణి ఖడ్సేను నిలబెడతారనే చర్చ జరిగింది.

అయితే ఎట్టకేలకు ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) నుంచి మరాఠా వర్గానికి చెందిన శ్రీరామ్ పాటిల్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.

ఏక్‌నాథ్ ఖడ్సే ఎన్‌సీపీ(శరద్ పవార్ వర్గం)కి రాజీనామా చేసి, తన కోడలి ప్రచార బాధ్యతను తీసుకున్నప్పుడు, ఆమెకు ఈ రెండు వర్గాల నుంచి మద్దతు లభించిందని అంటున్నారు.

ఏక్‌నాథ్ ఖడ్సే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఏక్‌నాథ్ ఖడ్సే

అంతర్గత రాజకీయాలు

కానీ రక్షా ఖడ్సేకి 2024లో టికెట్ అంత సులభంగా లభించలేదు. 2020లో ఏక్‌నాథ్ ఖడ్సే అసంతృప్తితో తన కూతురు రోహిణి ఖడ్సేతో కలిసి ఎన్సీపీలో చేరారు. అయితే రక్షా మాత్రం బీజేపీలోనే కొనసాగారు.

మహారాష్ట్ర టైమ్స్ నాసిక్ ఎడిషన్ స్థానిక ఎడిటర్ శైలేంద్ర తాన్‌పురే, "రక్షా ఖడ్సే రూపంలో బీజేపీకి తిరిగి రావడానికి ఏక్‌నాథ్ ఖడ్సే ఒక ద్వారాన్ని తెరిచి పెట్టుకున్నారు," అంటారు.

అయితే, రక్షా ఖడ్సే అభ్యర్థిత్వంపై అంతర్గతంగా వ్యతిరేకత ఉందని జల్గావ్‌లోని మీడియా వర్గాలు తెలిపాయి.

జిల్లాకు చెందిన ఒక సీనియర్ జర్నలిస్ట్, "రక్షా ఖడ్సే అభ్యర్థిత్వాన్ని మొదటి నుంచి గిరీష్ మహాజన్, దేవేంద్ర ఫడ్నవీస్ వ్యతిరేకించారు. అభ్యర్థి ఎవరో చెప్పలేమని గిరీష్ మహాజన్ కూడా చెప్పారు. కానీ బహుశా తన విధేయత వల్లే ఆమె లాభపడి ఉండవచ్చు. ఆమె మామయ్య, మిగతా బంధువులు ఇతర పార్టీల్లోకి వెళ్లినా ఆమె బీజేపీలోనే కొనసాగారు.’’ అన్నారు.

ఎన్నిక‌ల‌కు ముందు ఏక్‌నాథ్ ఖ‌డ్సే త‌న సొంత కోడ‌లిపై పోటీకి తిర‌స్క‌రించార‌న్న చ‌ర్చ రేవార్ నియోజ‌క‌వ‌ర్గంలో వినిపించింది.

రక్షా ఖడ్సే అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత, ఆయన శరద్ పవార్ వర్గానికి రాజీనామా చేసి తన కోడలి తరపున ప్రచారం చేశారు.

తాన్‌పురే మాట్లాడుతూ, "ఆ సమయంలో, ఏక్‌నాథ్ ఖడ్సే బీజేపీలో చేరడంపై బలమైన ఊహాగానాలు వెలువడ్డాయి. ఆయన బీజేపీలో చేరతానని కూడా ప్రకటించారు. కాని బహుశా గిరీష్ మహాజన్, దేవేంద్ర ఫడణవీస్ మధ్య అంతర్గత విభేదాల కారణంగా, అది వీలు కాలేదు" అన్నారు.

రక్షా ఖడ్సే ప్రమాణ స్వీకారానికి ముందు మీడియాతో మాట్లాడుతూ ఏక్‌నాథ్, "రక్షాకు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయమని దిల్లీ నుంచి పిలుపు వచ్చినప్పుడు నేను కన్నీళ్లను ఆపుకోలేకపోయాను. పార్టీ పట్ల విధేయురాలిగా ఉన్నందుకు ఆమెకు తగిన ప్రతిఫలం లభించింది’’ అన్నారు.

మహారాష్ట్రలోని ఖాందేష్ ప్రాంతం నుంచి కేంద్ర మంత్రివర్గంలో చేరిన తొలి మహిళ రక్షా ఖడ్సే.

రక్ష ఖడ్సే ప్రమాణ స్వీకారం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రక్ష ఖడ్సే ప్రమాణ స్వీకారం

ఏక్‌నాథ్ ఖడ్సే రాజకీయ వారసురాలు

రక్షా ఖడ్సే, ఏక్‌నాథ్ ఖడ్సే రాజకీయ వారసురాలిగా కనిపిస్తున్నారు.

దీని గురించి తాన్‌పురే మాట్లాడుతూ, "రక్షా ఖడ్సే భర్త నిఖిల్ 2012 లో మరణించారు. ఆయన (ఏక్‌నాథ్ ఖడ్సే) కుమార్తెలు ఆలస్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. కానీ రక్షా ఖడ్సే 22-23 సంవత్సరాల వయస్సు నుంచి ఏకనాథ్ ఖడ్సేతో కలిసి రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు" అని తెలిపారు.

"ఇప్పుడు ఆమెకు కేంద్ర రాజకీయాలలో అనుభవం ఉంది, అందుకే ఆమెను ఖడ్సే రాజకీయ వారసురాలిగా చూస్తున్నారు."

Raksha

ఫొటో సోర్స్, ANI

వ్యక్తిగత జీవితం

రక్షా ఖడ్సే నందుర్బార్ జిల్లా షాహదా తాలూకాలోని ఖేడ్‌దిగర్ గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి వచ్చారు.

ఆమెకు నిఖిల్‌ ఖడ్సేతో వివాహం జరగగా, ఆయన 2012లో చనిపోయారు. రక్షాకు ఇద్దరు పిల్లలు కృషికా, గురునాథ్ ఉన్నారు. రక్షా ఖడ్సే రూపంలో ఉత్తర మహారాష్ట్రలోని ఖాందేష్ ప్రాంతానికి మరోసారి కేంద్రంలో మంత్రి పదవి దక్కింది.

గతంలో కాంగ్రెస్ ఎంపీ విజయ్ నావల్‌కు కేంద్ర టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖను నిర్వహించారు.

1999లో అప్పటి ఎరండోల్‌ ఎమ్మెల్యే ఎంకే పాటిల్‌కు మంత్రి పదవి లభించింది.

నరేంద్ర మోదీ మంత్రివర్గంలో గత రెండు పర్యాయాలు ధూలే నుంచి ఎన్నికైన సుభాష్ భామరేకు సహాయ మంత్రి పదవి లభించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)