ఏపీ కేబినెట్‌లో మహిళా మంత్రులు.. ఒకప్పుడు ఏం చేసేవారు, ఇప్పుడు ఏయే శాఖలకు మంత్రులయ్యారు

ఫొటో సోర్స్, Anitha Vangalapudi/facebook
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రులకు పోర్ట్‌ఫోలియోల కేటాయింపు కూడా పూర్తయింది.
ఈ కూటమి ప్రభుత్వంలో ముగ్గురు మహిళలకు మంత్రులుగా అవకాశం దక్కింది.
వారిలో ఇద్దరు ఉత్తరాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా, మరొకరు రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఈ ముగ్గురికీ మంత్రి పదవి ఇదే తొలిసారి.
కేబినెట్‌లో చోటుదక్కిన వారిలో అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వంగలపూడి అనిత, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి, అనంతపురం జిల్లా పెనుగొండ ఎమ్మెల్యే ఎస్.సవిత ఉన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గానికి చెందిన మహిళలకు మంత్రివర్గంలో చోటుకల్పించారు.
మంత్రులైన ఈ ముగ్గురిలో అనిత రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
మిగిలిన ఇద్దరు సవిత, సంధ్యారాణి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.


ఫొటో సోర్స్, facebook
వంగలపూడి అనిత: టీచర్ నుంచి హోంమంత్రి వరకు
టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉన్న అనిత పాయకరావుపేట నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఆమెకు హోం వ్యవహారాలు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ శాఖ బాధ్యతలు అప్పజెప్పారు.
ఈమె 2014లో పాయకరావుపేట ఎస్సీ రిజర్వుడ్ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి చెంగల వెంకటరావుపై 2,828 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తానేటి వనిత చేతిలో 25,248 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
2024లో తిరిగి పాయకరావుపేట నుంచి పోటీ చేసి, వైసీపీ అభ్యర్థి కంబాల జోగులుపై 43 వేల ఓట్ల మెజార్టీతో గెలిచి మంత్రి అయ్యారు.
ఎస్సీ-మాదిగ సామాజిక వర్గానికి చెందిన అనితఎమ్మెల్యేగా ఎన్నిక కావడం ఇది రెండోసారి.
వంగలపూడి అనిత విశాఖపట్నం జిల్లాలోని ఎస్.రాయవరం మండలం, లింగరాజుపాలెం గ్రామంలో 1984 జనవరి 1న జన్మించారు.
ఈమె 2009లో ఏయూ నుంచి దూరవిద్య ద్వారా ఎంఈడీ కోర్సు పూర్తి చేశారు.
ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అనిత, 28 ఏళ్ల వయసులో తన ఉద్యోగానికి రాజీనామా చేసి 2012లో గ్రామస్థాయి రాజకీయాల్లో అడుగుపెట్టారు.
ఆ తర్వాత 2014లో టీడీపీ తరఫున పాయకరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.
2018లో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలిగా అనిత నియామకం వివాదాస్పదమైంది. ఆమె క్రైస్తవ మతానికి చెందినవారంటూ వివాదం చెలరేగడంతో ఆ పదవి వదులుకోవాల్సి వచ్చింది.
2017లో అసెంబ్లీలో అనిత, వైసీపీ ఎమ్మెల్యే రోజా మధ్య జరిగిన వాగ్వాదం అప్పట్లో సంచలనమైంది.
వైసీపీ ఎమ్మెల్యే రోజా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, ఆమెను సభ నుంచి సస్పెండ్ చేయాలంటూ అప్పటి సభాపతి కోడెల శివప్రసాదరావుకి టీడీపీ ఫిర్యాదు చేసింది.
దానిపై స్పందించిన సభాపతి రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

ఫొటో సోర్స్, Gummidi Sandhyarani/facebook
మంత్రిపై నెగ్గి... మహిళా శిశు సంక్షేమ మంత్రి అయిన సంధ్యారాణి
సాలూరు ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టడమే కాకుండా మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు గుమ్మడి సంధ్యారాణి. ఆమెకు మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ బాధ్యతలను అప్పగించారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన సంధ్యారాణి ఈసారి ఎన్నికల్లో విజయం సాధించారు.
డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొరపై విజయం సాధించి సంధ్యారాణి మంత్రి అయ్యారు.
ఎస్టీ కొండదొర వర్గానికి చెందిన సంధ్యారాణి సాలూరు నియోజకవర్గంలో వైసీపీ వరుస విజయాలకు చెక్ పెట్టి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
1973 మార్చి 15న జన్ని ముత్తాలు, పార్వతమ్మ దంపతులకు జన్మించారు సంధ్యారాణి. విజయనగరంలోని ఎంఆర్ మహిళా కళాశాల నుంచి బీఎస్సీ పూర్తి చేశారు.
1999లో సంధ్యారాణి కాంగ్రెస్ పార్టీతో రాజకీయ అరంగేట్రం చేశారు. 1999లో సాలూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.
తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాజేంద్ర ప్రతాప్ భంజ్‌దేవ్ చేతిలో 14,970 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు.
అనంతరం ఆమె కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పీడిక రాజన్నదొర చేతిలో 1,656 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు.
2014 సాధారణ ఎన్నికల్లో అరకు లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
2015లో, టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. 2021 వరకూ ఎమ్మెల్సీగా కొనసాగారు.
వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా రాజన్నదొరను గెలిపించారని, తనకు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ సంధ్యారాణి ఈసారి చేసిన ప్రచారం బాగా పనిచేసిందని అంటున్నారు.

ఫొటో సోర్స్, Savitha (Sanjeevareddygari Savitha)/facebook
తొలి గెలుపుతోనే కేబినెట్‌లో చోటు
కేబినెట్‌లో చోటు దక్కించుకున్న మరో మహిళా ఎమ్మెల్యే సంజీవరెడ్డిగారి సవిత (ఎస్.సవిత). ఈమె తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి సొంతం చేసుకున్నారు.
తాజాగా ప్రకటించిన పోర్ట్‌ఫోలియోలలో ఆమకు బీసీ సంక్షేమం, ఆర్ధికంగా వెనకబడిన వర్గాల సంక్షేమంతోపాటు, చేనేత, జౌళి శాఖల బాధ్యతలు అందుకున్నారు.
1977లో శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండలో సవిత జన్మించారు. ఈమె గతంలో హిందూపురం ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన సోమందేపల్లి రామచంద్రారెడ్డి కుమార్తె. అనంతపురం శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి 1998లో బీఏ పూర్తి చేశారు.
టీడీపీ ఆవిర్భావం నుంచి సవిత కుటుంబం ఆ పార్టీతోనే కొనసాగుతోంది.
సవిత 2015 నుంచి టీడీపీలో క్రియాశీల సభ్యురాలిగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు.
పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సవిత.. వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్‌పై 33 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకున్నారు.
బీసీ మహిళ కోటాలో కురుబ సామాజిక వర్గానికి చెందిన సవితకు చంద్రబాబు మంత్రిగా అవకాశం కల్పించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ కురుబ సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్‌గా సవిత పనిచేశారు.
ఇవి కూడా చదవండి:
- కేఏ పాల్, లక్ష్మీనారాయణలకు ఎన్ని ఓట్లు వచ్చాయి.. ఎన్నికల్లో చిన్న పార్టీల ప్రభావమెంత?
- మొదటిసారి పోటీ చేసి, గెలిచి, కేంద్ర మంత్రి పదవి సాధించిన పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరు?
- సైబర్ సెక్స్ వర్కర్: పోర్న్ ఇండస్ట్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఎలా ఉండబోతోంది?
- 26 ఏళ్లకే ఎంపీ, 36 ఏళ్లకు కేంద్రమంత్రి.. కింజరాపు రామ్మోహన్ నాయుడు గురించి ఈ విషయాలు తెలుసా?
- పవన్ కళ్యాణ్ జీతం ఎంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














