సత్యకుమార్ యాదవ్: వెంకయ్యనాయుడి పర్సనల్ సెక్రటరీ నుంచి చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి వరకు

సత్యకుమార్ యాదవ్

ఫొటో సోర్స్, Satya Kumar Y/facebook

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్‌లో బీజేపీ నుంచి ఒకే ఒక్కరికి అవకాశం దక్కింది. ఆయనే ధర్మవరం నుంచి గెలిచిన వై.సత్యకుమార్ యాదవ్.

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ఒకప్పుడు పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన సత్యకుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వరకూ ఎదిగారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యదర్శిగానూ ఉన్నారు.

మంత్రిగా ప్రమాణం చేశాక.. తాను ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు సత్యకుమార్.

‘‘సామాన్య కార్యకర్తలకు, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి భారతీయ జనతా పార్టీలో ఎప్పుడూ గుర్తింపు లభిస్తుంది. ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే రాష్ట్ర క్యాబినెట్లో నాకు అవకాశం దక్కడం చాలా సంతోషంగా ఉంది.

నాపై నమ్మకం ఉంచిన పార్టీ నాయకత్వానికి, నన్ను ఆదరించిన ధర్మవరం ప్రజలకు రుణపడి ఉంటాను. వారు నాపై పెట్టిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తాను’’ అని ఆయన ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

 బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
సత్యకుమార్ యాదవ్

ఫొటో సోర్స్, Satya Kumar Y/facebook

ఫొటో క్యాప్షన్, సత్యకుమార్ యాదవ్

ఎవరీ సత్యకుమార్ యాదవ్?

సత్యకుమార్ యాదవ్ స్వస్థలం అనంతపురం జిల్లా విడపనకల్లు మండలానికి చెందిన గడేకల్లు.

కడప జిల్లా ప్రొద్దుటూరు, తెలంగాణలోని నాగర్ కర్నూలులో పాఠశాల విద్య.. తర్వాత ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు.

మధురై కామరాజ్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, చెన్నైలోని ఐటీఎంలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివారు.

ప్రస్తుతం వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి లా కోర్సు చదువుతున్నారు.

సత్యకుమార్ యాదవ్

ఫొటో సోర్స్, Satya Kumar Y/facebook

వెంకయ్య నాయుడు పీఏగా..

సత్యకుమార్ యాదవ్‌కు తెలుగుతోపాటు హిందీ, ఇంగ్లిష్, మరాఠీలో మంచి పట్టుంది.

1993 సమయంలో వెంకయ్య నాయుడు తన కోసం పర్సనల్ అసిస్టెంట్‌ను వెతుకుతున్న క్రమంలో సత్యకుమార్ యాదవ్ పరిచయం అయ్యారు.

అలా ఆయన వద్ద వ్యక్తిగత సహాయకుడిగా చేరారు. దాదాపు పాతికేళ్ల పాటు పనిచే‌శారు.

వెంకయ్య నాయుడు వివిధ హోదాల్లో ఉన్నప్పుడు ప్రైవేటు కార్యదర్శిగా, అదనపు ప్రైవేటు కార్యదర్శిగా, సీనియర్ ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా ఉన్న సమయంలో కొద్దిరోజులు ఓఎస్డీగానూ చేశారు.

ఆ తర్వాత బీజేపీలో చేరారు. 2018లో జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు సత్యకుమార్. ఇప్పటి వరకు మూడుసార్లు ఆ పదవి చేపట్టారు.

కేరళ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరిశీలికుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. బీజేపీ తరఫున ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సహ ఇన్ఛార్జిగా, అండమాన్-నికోబార్ ఇన్ఛార్జిగానూ ఉన్నారు. సంస్కృతి ఫౌండేషన్ తరఫున వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

సత్యకుమార్‌కు మంత్రి పదవి దక్కడంపై ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ బీబీసీతో మాట్లాడారు.

‘‘ఏబీవీపీలో విద్యార్థి నాయకుడిగా సత్యకుమార్ ప్రయాణం మొదలైంది. వెంకయ్య నాయుడు వద్ద పనిచేసి బయటకు వచ్చాక.. బీజేపీలో చేరిన అనంతరం వివిధ రాష్ట్రాల్లో పనిచేశారు. బీజేపీ సిద్ధాంతం తెలిసిన వ్యక్తిగా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి పార్టీ అవకాశం కల్పించింది. ఎన్నో ఏళ్ల నుంచి పార్టీతో కొనసాగిన వ్యక్తి కావడంతో.. ఆ గుర్తింపుగా పదవి ఇచ్చింది అధిష్ఠానం. అదీగాక, ధర్మవరం వంటి నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు’’ అన్నారు జయప్రకాష్.

సత్యకుమార్ యాదవ్

ఫొటో సోర్స్, Satya Kumar Y/facebook

అనూహ్యంగా తెరపైకి..

ధర్మవరం అసెంబ్లీ సీటు విషయంలో సత్యకుమార్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుని.. అసెంబ్లీకి పోటీ చేశారు.

అప్పటికే అక్కడ టీడీపీ తరఫున పరిటాల శ్రీరామ్ ఇన్చార్జిగా ఉన్నారు. ఆయన బరిలో దిగుతారని పార్టీ నాయకులు భావించారు.

పొత్తుల్లో భాగంగా ధర్మవరం సీటును బీజేపీకి కేటాయించింది టీడీపీ. అప్పటికే మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారయణ (వరదాపురం సూరి) బీజేపీలో ఉన్నప్పటికీ మధ్యేమార్గంగా సత్యకుమార్‌కు టికెట్ కేటాయించింది అధిష్ఠానం.

అప్పటికే ప్రచారంలో దూకుడు మీదున్న ధర్మవరం సిట్టింగ్ ఎమ్మెల్యే , వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై చివరి నిమిషంలో బరిలో నిలిచారు సత్యకుమార్ యాదవ్. పోటాపోటీగా జరిగిన పోరులో కేతిరెడ్డిపై 3,734 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

‘‘ధర్మవరం నియోజకవర్గానికి నాలుగేళ్లుగా టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేశాను. సత్యకుమార్ పేరు ప్రకటించిన తర్వాత.. ఆయన గురించి తెలిసిన తర్వాత ధర్మవరం రూపురేఖలు మారుస్తారని నమ్మాను. ఆయనకు పూర్తిగా మద్దతు ప్రకటించడం జరిగింది’’ అని బీబీసీతో చెప్పారు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం సత్యకుమార్‌‌కు రూ.11.04 కోట్ల ఆస్తులు, రూ.2.14 కోట్ల అప్పులు ఉన్నాయి.

ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

సత్యకుమార్ యాదవ్

ఫొటో సోర్స్, Satya Kumar Y/facebook

సీనియర్లను కాదని..

బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచిన వారిలో కామినేని శ్రీనివాస్, సీహెచ్.ఆదినారాయణ రెడ్డి, పి.విష్ణుకుమార్ రాజు, సుజనా చౌదరి, నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి వంటి సీనియర్లు ఉన్నారు.

వీరిలో కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డికి గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం కూడా ఉంది.

సుజనా చౌదరి కేంద్ర సహాయ మంత్రిగానూ పనిచేశారు.

అయినప్పటికీ, క్యాబినెట్‌లో చోటు విషయంలో మొదటిసారి గెలిచిన సత్యకుమార్ వైపే బీజేపీ అధిష్ఠానం మొగ్గుచూపింది.

‘‘సత్యకుమార్ ఎంపిక విషయంలో బీజేపీ అధిష్ఠానం ప్రధానంగా ఒక విషయాన్ని చూసింది. మొదట్నుంచి పార్టీకి విధేయతతో ఉన్నారాయన. అందుకే మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రిగా అవకాశం ఇచ్చింది. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ ఎంపిక విషయంలోనూ ఇదే సూత్రాన్ని పాటించింది’’ అని అన్నారు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాశ్.

సత్యకుమార్ యాదవ్

ఫొటో సోర్స్, Satya Kumar Y/facebook

2014లో రెండు మంత్రి పదవులు..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అనంతరం, ఏపీలో 2014లోనూ జనసేన మద్దతుతో టీడీపీ, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది.

ఆ ఎన్నికల్లో టీడీపీ 102 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ నాలుగుచోట్ల గెలిచింది.

అప్పట్లోనూ బీజేపీ పది స్థానాల్లో పోటీ చేయగా కామినేని శ్రీనివాస్(కైకలూరు), ఆకుల సత్యనారాయణ(రాజమండ్రి సిటీ), పైడికొండల మాణిక్యాలరావు(తాడేపల్లి గూడెం), పి.విష్ణుకుమార్ రాజు(విశాఖపట్నం నార్త్) స్థానాల్లో గెలిచారు.

వీరిలో కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావు అప్పటి చంద్రబాబు క్యాబినెట్‌లో బెర్తులు దక్కించుకున్నారు. ఈసారి కేవలం ఒక్కరికే ఆ అవకాశం దక్కింది.

‘‘మంత్రివర్గంలో స్థానాల విషయంలో ప్రస్తుతం బీజేపీ అధిష్ఠానం నిర్ధిష్టమైన అభిప్రాయంతో ఉంది. గెలిచిన ప్రతి ఏడు స్థానాలకు ఒక మంత్రి పదవి అనే సూత్రాన్ని పాటిస్తోంది. ఏపీలో ఎనిమిది ఎమ్మెల్యేలు గెలిచినందున ఒక మంత్రి పదవిని తీసుకుంది. టీడీపీ, జనసేన కూడా మంత్రి పదవులు తీసుకునే విషయంలో అదే సూత్రం పాటించాయి. అందుకే 2014తో పోల్చితే బీజేపీలో ఒక్కరికే అవకాశం దక్కింది’’ అని వల్లూరి జయప్రకాష్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)