ఒడిశా: నవీన్ పట్నాయక్ కోట కూలడానికి కారణం ఆ మాజీ అధికారేనా

నవీన్ పట్నాయక్‌తో వీకే పాండియన్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, నవీన్ పట్నాయక్‌తో వీకే పాండియన్
    • రచయిత, సంపద్ పట్నాయక్
    • హోదా, బీబీసీ కోసం

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సన్నిహితుడైన వీకే పాండియన్ ఆదివారం క్రియాశీల రాజకీయాలకు వీడ్కోలు పలికారు.

"రాజకీయాల్లోకి రావాలనే నా ఉద్దేశం కేవలం నవీన్ బాబుకు సహాయం చేయడం. ఇక క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నా. ఈ ప్రయాణంలో నేను ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి" అంటూ సోషల్ మీడియాలో విడుదల చేసిన ఒక వీడియో క్లిప్‌లో పాండియన్ తెలిపారు.

ముఖ్యమంత్రి కార్యాలయంలో ఐఏఎస్ అధికారిగా దశాబ్ద కాలం పాటు సేవలందించిన పాండియన్ గత నవంబర్‌లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి బిజూ జనతాదళ్‌లో చేరారు. అయితే, ఏడు నెలల్లోనే రాజకీయాలకు గుడ్ బై చెప్పాల్సి వచ్చింది.

నిజానికి, పాండియన్ నిష్క్రమణ ఒడిశా ఎన్నికల ఫలితాల ప్రభావంగా భావించాలి, ఎందుకంటే ఆయన బీజేడీ ప్రచారాన్ని ముందుండి నడిపించారు.

ఒడిశాలో పాండియన్ విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రసంగాలు చేశారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులతో గొడవ కూడా పడ్డారు, ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై విమర్శలూ గుప్పించారు.

ఒడిశాలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బిజూ జనతాదళ్‌ పరాజయాన్ని చవిచూసింది. మొత్తం 21 లోక్‌సభ స్థానాలకు గానూ 20 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. 2019లో బీజేడీ గెలుచుకున్న 12 లోక్‌సభ స్థానాలలో ఈసారి ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు.

మరోవైపు 147 అసెంబ్లీ స్థానాలకు గాను 78 స్థానాలు గెలుచుకున్న బీజేపీ తొలిసారిగా ఒడిశాలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేడీ కేవలం 51 సీట్లు మాత్రమే సాధించి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించబోతోంది. 2019లో బీజేడీ 117 సీట్లు గెలుచుకుంది.

బీబీసీ తెలుగు వాట్సాప్ చానల్
నవీన్ పట్నాయక్, పాండియన్

ఫొటో సోర్స్, ANI

కారణం ఆయనేనంటూ..

ఫలితాల తర్వాత ఒడిశాలో ఒక కథనం ఊపందుకుంది. దేశంలో ఎక్కువ కాలం పనిచేసిన రెండో ముఖ్యమంత్రి, అత్యంత ప్రజాదరణ పొందిన నాయకులలో ఒకరిగా పేరుగాంచిన నవీన్ పట్నాయక్ ఓటమికి పాండియన్‌ కారణమంటూ చాలామంది నిందించారు.

తాము ముందుగానే విజయం సాధించామంటూ పాండియన్ ఎన్నికల ప్రసంగాలు, మీడియా ఇంటర్వ్యూలలో రాజకీయ ప్రత్యర్థులను ఎగతాళి చేయడంపై, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.

అంతేకాదు ఒకవేళ, నవీన్ పట్నాయక్ వరుసగా ఆరోసారి ముఖ్యమంత్రి కాకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎన్నికల ప్రచారంలో ఒడిశా ఓటర్లకు పాండియన్ చెప్పారు.

వాస్తవానికి ఈ నెల ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఒడిశాలో బీజేపీ చేపట్టిన 24 ఏళ్ల బీజేడీ ప్రభుత్వం 'ఎక్స్‌పైరీ డేట్' ప్రచారంపై పాండియన్ కూడా కౌంటర్ ఇచ్చారు. నవీన్ పట్నాయక్ ప్రమాణ స్వీకార తేదీని పాండియన్ ప్రకటించారు.

ఒక దశ ఓటింగ్ ఇంకా పెండింగ్‌లో ఉన్నప్పటికీ, కేవలం మూడు దశల్లోనే బీజేడీ మెజారిటీని సాధించిందని, ఆయన పత్రికలకు కూడా ప్రకటనలు ఇచ్చారు.

నవీన్ పట్నాయక్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, గత నవంబర్‌లో పాండియన్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేడీలో చేరారు.

జూన్ 4తో పాండియన్ అదృశ్యం..

అయితే జూన్ 4 ఫలితాల తర్వాత కొద్ది రోజుల పాటు పాండియన్ బహిరంగంగా కనిపించలేదు. ఇంతలో పాండియన్ భార్య, ఐఏఎస్ అధికారి సుజాత కార్తికేయన్ పిల్లల సంరక్షణ సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నారు, దానిని ప్రభుత్వం అంగీకరించింది.

రాజకీయంగా సుజాతపై వివాదాలూ చుట్టుముట్టాయి, ఎన్నికలలో బీజేడీకి సహాయం చేశారని ఆమెపై ఆరోపణలున్నాయి.

ఒడిశాలో నాలుగు దశల ఎన్నికలు జరగడానికి ముందు ఎలక్షన్ కమిషన్ ఆమెను ఆర్థిక శాఖకు బదిలీ చేసింది.

రాష్ట్రంలోని దాదాపు 6 లక్షల స్వయం సహాయక బృందాలను (ఎస్‌హెచ్‌జీ) పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ మిషన్ శక్తి విభాగానికి సుజాత నేతృత్వం వహించేవారు. ఆమెకు ఒడియా భాష, సాహిత్యం, సాంస్కృతిక శాఖ అదనపు బాధ్యతలు కూడా ఉండేవి.

కాగా, బీజేడీ స్వయంశక్తి సంఘాల సభ్యులను ఓటు బ్యాంకుగా, దిగువ అధికారులను పార్టీ క్యాడర్‌లుగా ఉపయోగించుకుంటోందని బీజేపీ పదేపదే ఆరోపించింది.

ఈ ఎన్నికల్లో బీజేడీకి వ్యతిరేకంగా ఫలితాలు రావడం మొదలవడంతో, స్థానిక టెలివిజన్ ఛానెల్‌లు, బీజేపీని వ్యతిరేకించే పార్టీల నాయకులు, పలువురు వార్తా విశ్లేషకులు, వ్యాఖ్యాతలు పాండియన్ అంశం మరింత లేవనెత్తారు.

పాండియన్ దిల్లీ విమానం ఎక్కారంటూ ఆరోపిస్తూ ఒక వీడియో చక్కర్లు కొట్టింది, రాష్ట్రం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా వదంతులూ వ్యాపించాయి.

పాండియన్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, పాండియన్‌

ఎవరీ పాండియన్?

వీకే పాండియన్ 2019 నుంచి ఒడిశాలో నవీన్ పట్నాయక్ పరిపాలనా ముఖచిత్రంగా మారారు. నవీన్ పట్నాయక్ ఐదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, ఆయన '5టీ' గవర్నెన్స్ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించారు.

5టీ అనేది టీమ్ వర్క్, టెక్నాలజీ, పారదర్శకత, పరివర్తన, సమయ పరిమితిని సూచిస్తుంది.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, కార్యక్రమాలలో దీని అమలుకు పాండియన్‌ను 5టీకి కార్యదర్శిగా నియమించారు. ఆ పదవిలో పాండియన్.. ఏదైనా ప్రభుత్వ శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేయవచ్చు, ఏ ఫైల్‌ అయినా పరిశీలించవచ్చు, కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు.

టీమ్‌వర్క్ అనేది ఒడిశాలోని 5T అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్‌వర్క్‌లో ఎక్కువగా పట్టించుకోని అంశమనే వాదన ఉంది. అయితే, కొన్ని కీలక ప్రాజెక్టులపై పాండియన్ మంచి ఫలితాలను సాధించడంతో ఆందోళనలను పక్కన పెట్టారు. ఆయన పర్యవేక్షణలో నిర్ణీత గడువులోగా అనేక పనులు పూర్తయ్యాయి.

పూరీలోని జగన్నాథ దేవాలయం చుట్టూ హెరిటేజ్ కారిడార్‌ నిర్మాణం, ఒడిశాలోని ముఖ్యమైన దేవాలయాలు, మసీదులు, చర్చిలను పునరుద్ధరించడం, సుందరీకరించడం, గ్రాండ్ బస్ టెర్మినల్ నిర్మించడం, ప్రభుత్వ పాఠశాలల్లోని పాత తరగతి గదులను అత్యాధునికంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడం కోసం పాండియన్‌కు కీలక అధికారాలు ఇచ్చారు. రాజకీయ నాయకులు, ఇతర అధికారులు దీనిని వ్యతిరేకించారు. అయితే, ఒడిశా ప్రధాన మీడియాలలో ఆయనపై పెద్దగా విమర్శలు రాలేదు.

నవీన్ పట్నాయక్, పాండియన్

ఫొటో సోర్స్, ANI

పాండియన్‌కే సీఎం ఎందుకు అంత ప్రాధాన్యం ఇచ్చారు?

పాండియన్‌ ఎదుగుదల కేవలం ముఖ్యమంత్రి ఆశీస్సుల వల్లే జరిగిందనే విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు.

నవీన్ పట్నాయక్ తన చుట్టూ ఎటువంటి రాజకీయ శత్రుత్వాన్ని దరిచేరనివ్వని నాయకుడు. ఆయన పరిపాలనలో ముఖచిత్రంగా ఎల్లప్పుడూ బ్యూరోక్రాట్‌లపైనే ఆధారపడతారు.

నవీన్ పట్నాయక్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు, అతని కుడి భుజంగా మాజీ బ్యూరోక్రాట్ ప్యారీ మోహన్ మోహపాత్ర ఉన్నారు. 12 సంవత్సరాల పాటు నవీన్ దగ్గర పనిచేశారు.

తరువాత విభేదాలు రావడంతో, నవీన్ పట్నాయక్ ఆయనను బయటకు పంపారు. దీంతో నవీన్ ఒడియాయేతర ఐఏఎస్ అధికారి వీకే పాండియన్‌ను ఎంచుకున్నారు. అయితే, ఇది తన ముఖ్యమంత్రి పదవిని కోల్పోయేలా చేసిందని పలువురి అభిప్రాయం.

నవీన్ పట్నాయక్‌తో వీకే పాండియన్

ఫొటో సోర్స్, ANI

ప్రారంభమే ముగింపుగా మారింది

గత దశాబ్ద కాలంగా ప్రభుత్వంలో, పార్టీలో పాండియన్ ప్రభావం పెరిగింది, ఆయనే పరిపాలనకు నిజమైన అధిపతి అని చెప్పేలా ప్రతిపక్షాలను ప్రేరేపించింది.

అదేసమయంలో విమర్శలకు తావులేకుండా రాజకీయాల్లో మరింత క్రియాశీలక పాత్ర పోషించాలని పాండియన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి, బీజేడీలో చేరారు. వెంటనే పార్టీలో రెండో ముఖ్యమైన నాయకుడిగా ఎదిగారు. అయితే పాండియన్‌కు ముఖ్యమంత్రి మద్దతు ఉండటంతో బీజేడీ సీనియర్ నేతలు కూడా వ్యతిరేకించలేకపోయారు.

పాండియన్‌తో పాటు, బీజేడీలోని పలువురు ప్రభుత్వ ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని చెప్పడం ద్వారా ఈ పరిణామాలను సమర్థించడానికి ప్రయత్నించారు.

గత ఎన్నికల ప్రచారంలో పాండియన్ కీలక పాత్ర పోషించినప్పుడు, మీరు నవీన్ పట్నాయక్ వారసుడు అవుతారా? అని జర్నలిస్టులు ఆయనను చాలాసార్లు ప్రశ్నించారు. అంతేకాదు ప్రత్యర్థి పార్టీలు, ముఖ్యంగా బీజేపీ, దీనిపై ప్రచారం ప్రారంభించింది.

నవీన్ పట్నాయక్ స్థానంలో తమిళనాడులో జన్మించిన మాజీ బ్యూరోక్రాట్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవద్దని ఓటర్లకు బీజేపీ విజ్ఞప్తి చేసింది.

దీంతో, ఈ ఎన్నికల్లో ఒడియా గుర్తింపు ప్రధాన అంశంగా పుట్టుకొచ్చింది. పాండియన్ ఈ ప్రమాదాన్ని విస్మరించారు. వారసత్వం గురించిన ప్రశ్నలకు పాండియన్ సమాధానం ఇవ్వకుండా, ప్రజాదరణ, పరిపాలనలో సాధించిన విజయాల గురించి చెబుతూ వచ్చారు.

పాండియన్‌పై విచారణ?

ఒడిశా ఎన్నికలలో బీజేపీ గెలుపొందిన వెంటనే, ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు పాండియన్‌పై విచారణ కోరారు. దీంతో ఆయనను శిక్షిస్తారని, జైలుకు పంపుతారని చాలామంది భావిస్తున్నారు.

ఒడిశా కొత్త ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఎమ్మెల్యేల డిమాండ్‌ను ముందుకు తీసుకెళ్తాయా లేదా అనేది చెప్పడం కష్టం.

మరోవైపు, బీజేపీ కేంద్ర నేతలతో నవీన్‌ పట్నాయక్‌కు ఉన్న సత్సంబంధాలు పాండియన్‌కు అనుకూలంగా పనిచేస్తాయని కూడా భావిస్తున్నారు.

పాండియన్‌పై విమర్శలు "దురదృష్టకరం" అని నవీన్ పట్నాయక్ ఇటీవల మీడియాతో పేర్కొన్నారు.

అయితే పట్నాయక్ మద్దతు పాండియన్‌ను చట్టం నుంచి రక్షించగలదా? జవాబుదారీతనం లేకుండా అధికారం చెలాయించిన పాండియన్‌పై చాలామందిలో ఆగ్రహం ఉంది.

మొదట్లో పాండియన్ ముఖ్యమంత్రికి మాత్రమే జవాబుదారీగా కనిపించారు, ఎన్నికల ప్రచారంలో ఆయన నవీన్ పట్నాయక్‌ను కూడా నియంత్రించడం కనిపించింది. రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించినా ఒడిశా రాజకీయాల్లో వీకే పాండియన్‌ను అంత త్వరగా మరిచిపోలేరు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)