పవన్ కల్యాణ్: ‘డిప్యూటీ సీఎం’ అని ఎందుకు ప్రమాణం చేయలేదు, ఈ పదవి గురించి రాజ్యాంగంలో ఏముంది?

- రచయిత, బళ్ల సతీష్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం నడుమ బుధవారంనాడు గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో జరిగిన ఏపీ రాష్ట్రమంత్రి వర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఆయన మంత్రిగా మాత్రమే ప్రమాణం చేశారు.
తాజాగా ఆయనకు శాఖను కేటాయించారు. ఇందులో ఆయనను ఉపముఖ్యమంత్రిగా పేర్కొంటూ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల బాధ్యతలను అప్పగించారు.
అయితే, పవన్ కల్యాణ్ వేదిక మీద ఉపముఖ్యమంత్రిగా ఎందుకు ప్రమాణస్వీకారం చేయలేదు. ఆయనకు ఉపముఖ్యమంత్రి పదవి ఖాయమైనట్టుగా అప్పటికే కథనాలు వచ్చాయి. కానీ ఆయన ‘‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా’’ అనే ప్రమాణ స్వీకారం ఎందుకు చేశారు?
భారత రాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎవరు నడపాలన్నది స్పష్టంగా రాశారు. అందులో రాష్ట్రంలో ముఖ్యమంత్రి, కేంద్రంలో ప్రధాన మంత్రి ప్రభుత్వాలను నడపాలని పేర్కొన్నారు.
వీరికి మంత్రి మండలి సహకరిస్తుంది. ఇంగ్లీషులో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటారు. రాజ్యాంగంలో ప్రధాని, ముఖ్యమంత్రి వారి కింద ఉండే మంత్రుల ప్రస్తావన ఉందే తప్ప, ఉప ముఖ్యమంత్రి, ఉప ప్రధాన మంత్రి అనే పదాలు లేవు.
అంటే ఆ పదవులకు రాజ్యాంగబద్ధత లేదు. డిప్యూటీ సీఎం, డిప్యూటీ పీఎం పదవులు రాజ్యాంగపరమైనవి కావు, కానీ రాజకీయపరమైనవి.

ఫొటో సోర్స్, Telugu Desam Party (TDP) /FB
డిప్యూటీ సీఎం ఎవరికిస్తారు?
కేంద్రంలోనూ, వివిధ రాష్ట్రాల్లోనూ రాజకీయ పరంగా పలువురికి మంత్రి కంటే పెద్ద స్థానం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు, అంటే ప్రధాని లేదా ముఖ్యమంత్రి తరువాత స్థానాన్ని చూపడానికి డిప్యూటీ సీఎం, డిప్యూటీ పీఎం అనే హోదాలు సృష్టించారు.
మంత్రి వర్గంలో చాలా సీనియర్ అయి ఉండి, దాదాపు సీఎంతో సమాన స్థాయి ఉన్న నాయకులు ఉన్నప్పుడు ఒకరిని సీఎంగా చేశాక, రెండో వారికి డిప్యూటీ సీఎం అనే హోదా ఇవ్వడం కూడా చాలా రాష్ట్రాల్లో కనిపిస్తుంది.
రాజకీయ అనివార్యత, అధికారాన్ని సమంగా ఉన్నట్టు చూపించడం కోసం ఈ పదవులు ఇస్తారు. అలాగని డిప్యూటీ సీఎం పదవి పూర్తిగా శక్తి లేనిది అనుకోవడానికి లేదు.
‘‘వాస్తవానికి డిప్యూటీ సీఎం అని ఇచ్చినా ఇవ్వకున్నా రాజకీయాల్లో నంబర్ టూ అని ఉంటుంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ అదే. ఉదాహరణకు ఎన్టీఆర్ డిప్యూటీ సీఎం పదవిని ఎవరికీ ఇవ్వలేదు. కానీ నాదెండ్ల భాస్కర రావు తనను తాను నంబర్ టూ అనేవారు. తనను కోపైలెట్ గా చెప్పుకునేవారు.’’ అన్నారు సీనియర్ పాత్రికేయుడు నాంచారయ్య,
‘‘ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు కూడా మళ్లీ డిప్యూటీ సీఎంలుగా చేసిన చరిత్ర ఉంది. సీఎంలుగా పనిచేసిన వారు తప్పుకున్న తరువాత, వాళ్లను మళ్లీ కేబినెట్ లో ఉంచాల్సి వస్తే వారిని డిప్యూటీ సీఎంలుగా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో 1979లో రామ్ నరేశ్ యాదవ్ అలా ముఖ్యమంత్రి చేసి, తరువాత డిప్యూటీ సీఎం చేశారు. ఇక మన కళ్లముందే మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా పని చేసి, మళ్లీ డిప్యూటీ సీఎం అయ్యారు.’’ అన్నారు నాంచారయ్య.
డిప్యూటీ సీఎంగా ఉండే వ్యక్తి ముందుగా అందరిలానే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి. అప్పుడు అతను/ఆమె మంత్రివర్గంలో సభ్యులు అవుతారు.
తరువాత ప్రభుత్వం ప్రత్యేకంగా ఆ వ్యక్తికి డిప్యూటీ సీఎం అని పిలవడం ప్రారంభిస్తుంది. దానికి సంబంధించిన నోట్ ఇస్తారు. అంతే. అంతకుమించి జీవో కానీ గెజిట్ కానీ ఇవ్వరు.
అయితే, కొన్ని రాష్ట్రాల్లో గెజిట్ ఇస్తారు. కొన్ని రాష్ట్రాల్లో ఇవ్వరు. ఇప్పుడు ఆంధ్రలో గెజిట్ ప్రత్యేకంగా ఇవ్వకుండా, మంత్రుల శాఖలకు సంబంధించిన గెజిట్లో డిప్యూటీ సీఎం అని మెన్షన్ చేశారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన మంత్రులు-శాఖల జాబితా నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగానూ, కొణిదెల పవన్ కల్యాణ్‌ను ఉప ముఖ్యమంత్రిగా పేర్కొంది.

ఫొటో సోర్స్, UGC
‘డిప్యూటీ ’అధికారాలేంటి?
సాధారణ కేబినెట్ మంత్రికి ఉండే అన్ని హక్కులూ, అధికారాలూ, బాధ్యతలూ డిప్యూటీ సీఎంకు ఉంటాయి. అయితే రాజ్యాంగ పరమైన పదవికాకపోవడంతో రాజ్యాంగపరమైన హక్కులు, అధికారాలు, బాధ్యతలూ ఏవీ అదనంగా డిప్యూటీ సీఎం, డిప్యూటీ పీఎంలకు ఉండవు.
కానీ, పాలనలో ప్రాధాన్యం ఉంటుంది.
ఫస్ట్ ఎమాంగ్ ఈక్వల్స్ అంటే ఉన్నవారిలో మొదటి వారు లేదా మొదటి ప్రాధాన్యంగా డిప్యూటీ సీఎం ఉంటారు.
ప్రభుత్వ ప్రకటనల్లో ముఖ్యమంత్రి తరువాత పేరు, ఫోటో డిప్యూటీ సీఎంలదే ముందుగా వేస్తారు.
ప్రభుత్వా కార్యక్రమాల్లో వేదికపైనా, శిలాఫలకాలపైనా ముఖ్యమంత్రి తరువాత, మంత్రుల కంటే ముందు స్థానంలో ఉప ముఖ్యమంత్రి ఉంటారు.
సమావేశాలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి పక్కనే కుర్చునేలా సీటింగ్ ఏర్పాటు ఉంటుంది.
ఇతర మంత్రుల్లానే శాఖ కూడా కేటాయిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏపీ, తెలంగాణ మధ్య గొడవ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణను వేరు చేయాలనే ఉద్యమం జరిగినప్పడు తరచూ ఈ డిప్యూటీ సీఎం పదవి ప్రస్తావన వచ్చింది.
1956కి ముందు అసలు ఆంధ్రా, తెలంగాణను కలపొద్దు అనే వాదన ఉండేది. ఆంధ్రతో తెలంగాణను కలిపేందుకు ఓ ఒప్పందం కుదిరింది.
దాన్ని జెంటిల్మన్ పాక్ట్ లేదా పెద్దమనుషుల ఒప్పందం అంటారు.
ఆ ఒప్పందం ప్రకారం ఆంధ్ర వారు సీఎం అయితే తెలంగాణ వారికి డిప్యూటీ, తెలంగాణ వారు సీఎం అయితే ఆంధ్రా వారికి డిప్యూటీ ఇవ్వాలి.
‘‘1956లో తెలంగాణతో కూడిన ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. తొలి ముఖ్యమంత్రిగా నీలం సంజీవ రెడ్డి ప్రమాణం చేశారు. కానీ ఆయన ఎవర్నీ డిప్యూటీ సీఎంగా నియమించలేదు. తెలంగాణ వారికి డిప్యూటీ సీఎం గురించి ప్రశ్నించగా, ‘‘డిప్యూటీ సీఎం పదవి ఆరో వేలు వంటిది. ఉపయోగం లేదు.’’ అని సంజీవ రెడ్డి వ్యాఖ్యానించినట్టుగా తెలంగాణ ఉద్యమకారులు తరచూ తమ సమావేశాల్లో చెప్పేవారు. చిత్రం ఏంటంటే అదే సంజీవ రెడ్డి ఆంధ్ర, తెలంగాణ కలవక ముందు ఆంధ్ర రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా చేశారు.’’ అని సీనియర్ పాత్రికేయులు నాంచారయ్య బీబీసీతో అన్నారు.
‘‘విశాలాంధ్ర ఏర్పడినప్పటి నుంచే పదవుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపించేవారు తెలంగాణ వాదులు. తరువాత కొంత కాలానికి అంటే 1959లో సంజీవ రెడ్డి చెన్నారెడ్డిని డిప్యూటీ సీఎం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరిసారి తెలంగాణకు చెందిన దామోదర రాజనరసింహకు కిరణ్ కుమార్ రెడ్డి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు.’’ అని చెప్పారు నాంచారయ్య.

ఫొటో సోర్స్, FACEBOOK/PUSHPASREEVANI
‘డిప్యూటీ’ విలువను జగన్ తగ్గించారా?
ఏపీలో జగన్మోహన్‌రెడ్డి కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉండేవారు.
‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు – ఈ ఐదు వర్గాలకూ డిప్యూటీ సీఎం ఇవ్వడం ద్వారా, తమ ప్రభుత్వం అన్ని వర్గాలకూ ప్రాధాన్యత ఇస్తోంది’’ అని వైయస్ జగన్ తరచూ చెప్పేవారు.
అయితే ఆ ఐదుగురు డిప్యూటీ సీఎంలను పూర్తి కాలం కొనసాగనివ్వలేదు.
జగన్ హయాంలో మొత్తం 9 మంది డిప్యూటీ సీఎంలుగా పనిచేశారు.
వారిలో నారాయణ స్వామి, అంజద్ బాషా మాత్రమే ఐదేళ్ళు డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు.
పాముల పుష్పశ్రీవాణి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని, ధర్మాన కృష్ణదాస్, బూడి ముత్యాల నాయుడు, కొట్టు సత్యనారాయణ, పీడిక రాజన్నదొర, రెండు నుంచి మూడేళ్ల మధ్య డిప్యూటీ సీఎంలుగా పనిచేశారు.
‘‘చంద్రబాబు ఇద్దర్ని డిప్యూటీలను చేస్తే జగన్ ఐదుగుర్ని చేశారు. ఇంత మంది డిప్యూటీ సీఎంలు ఉండడం, వారు కూడా రెండున్నరేళ్ల తరువాత ముగ్గురు రాజీనామా చేసి, మరో ముగ్గురు రావడంతో ఆ పదవులపై ఆంధ్ర రాష్ట్రంలో ఆసక్తి తగ్గింది. అసలు డిప్యూటీ సీఎంల పేర్లు చెప్పలేని స్థితి ఏర్పడింది.’’ అని వ్యాఖ్యానించారు నాంచారయ్య.

ఫొటో సోర్స్, Bhatti Vikramarka Mallu /FB
గతంలో డిప్యూటీ సీఎంలు
తెలంగాణ కలవని ఆంధ్ర రాష్ట్రంలో అంటే 1953-56 మధ్య నీలం సంజీవ రెడ్డి రెండుసార్లు డిప్యూటీ సీఎంగా పనిచేశారు.
అప్పటి తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు, రెండో ముఖ్యమంత్రి బెజవాడ గోపాల రెడ్డి వద్ద నీలం సంజీవ రెడ్డి డిప్యూటీ సీఎంగా చేశారు.
నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో కొండా వెంకట రంగారెడ్డి డిప్యూటీ సీఎంగా చేశారు.
కాసు బ్రహ్మానంద రెడ్డి హయాంలో జేవీ నరసింగ రావు, భవనం వెంకట్రామ్ హయాంలో సి. జగన్నాథ రావు, కోట్ల విజయ భాస్కర రెడ్డి హయాంలో కోనేరు రంగా రావు, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో దామోదర రాజ నరసింహ డిప్యూటీ సీఎంలుగా చేశారు.
విభజిత ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు దగ్గర నిమ్మకాలయ చిన రాజప్ప, కేఈ కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు.
తెలంగాణలో కేసీఆర్ దగ్గర మహమూద్ అలీ, రాజయ్య, కడియం శ్రీహరి ఉపముఖ్యమంత్రులయ్యారు.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి దగ్గర భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నారు.

ఫొటో సోర్స్, UGC
ఇతర రాష్ట్రాల్లో..
ఏపీలో పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడంతో ఆ పదవి ఉన్న రాష్ట్రాల సంఖ్య 13కు చేరింది.
గతంలో ఆంధ్ర, తెలంగాణలో ఇద్దరూ అంత కంటే ఎక్కువ మంది ఒకేసారి డిప్యూటీ సీఎంలుగా పనిచేశారు.
ప్రస్తుతం బిహార్, ఛత్తీస్‌గఢ్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, నాగాలాండ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ లో ఇద్దరు చొప్పున డిప్యూటీ సీఎంలు ఉన్నారు.
2019లో కర్ణాటకలో ముగ్గురికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు.

ఒకేసారి ఇద్దరు ఉప ప్రధానులు
కేంద్రంలో ఇప్పటిదాకా ఏడుగురు ఉప ప్రధానులుగా పనిచేశారు. మొట్టమొదట సర్దార్ వల్లభాయ్ పటేల్, చివరగా ఎల్.కె. అడ్వాణీ ఈ పదవుల్లో ఉన్నారు.
అయితే ఈ ఏడుగురూ కలపి కూడా మొత్తంగా పదేళ్ల కంటే ఎక్కువగా ఆ పదవిలో లేరు.
అందులో ఎక్కువ కాలం అంటే దాదాపు మూడేళ్లకు పైగా ఆ పదవిలో ఉన్నది సర్దార్ పటేల్ మాత్రమే.
స్వాతంత్య్రం వచ్చిన రోజు నుంచి చనిపోయే వరకూ ఆయన ఆ పదవిలో ఉన్నారు.
అప్పుడు నెహ్రూ ప్రధాని.
సర్దార్ వల్లభాయ్ పటేల్ తరువాత ఏ ఉప ప్రధానీ అంత కాలం పదవిలో లేరు. పటేల్ తరువాత, మొరార్జీ దేశాయ్ ఇందిరా గాంధీ దగ్గర ఉప ప్రధానిగా చేశారు.
ఆయన సుమారు రెండేళ్లకు పైగా ఆ పదవిలో ఉన్నారు.
మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు చరణ్ సింగ్, జగ్జీవన్ రామ్ డిప్యూటీ పీఎంలుగా పనిచేశారు. వీరిద్దరూ ఏకకాలంలో ఉప ప్రధానులుగా ఉన్నారు.
అంటే ఒకేసారి దేశానికి ఇద్దరు ఉప ప్రధానులు అన్నమాట.
చరణ్ సింగ్ ప్రధాని అయిన తరువాత, యశ్వంత్ రావ్ చవాన్ ఉప ప్రధానిగా చేశారు.
తరువాత వీపీ సింగ్, చంద్రశేఖర్లు ప్రధానిగా ఉన్నప్పుడు దేవీలాల్ ఉపప్రధానిగా చేశారు.
చివరగా వాజపేయి దిగిపోయే ముందు 2002లో ఎల్.కె. అడ్వాణీ ఉప ప్రధాని చేయగా, 2004లో బీజేపీ ఓడిపోయే వరకూ ఆయన ఆ పదవిలో ఉన్నారు.
ఉప ప్రధానిగా చేసి వారిలో చరణ్ సింగ్, మొరార్జీ దేశాయ్ ప్రధానులు అయ్యారు.

ఫొటో సోర్స్, COURTESY KC YADAV
దేవీలాల్ ‘ఉపప్రధాని’ ప్రమాణంపై రగడ
దేవీలాల్ ‘ఉపప్రధాని’ ప్రమాణంపై రగడ
గతంలోని ఉప ప్రధానులు అంతా మంత్రులుగా ప్రమాణం చేసి,, తరువాత డిప్యూటీ పీఎం హోదా పొందారు. కానీ దేవీలాల్ మాత్రం అందుకు ససేమిరా అన్నారు. తాను డిప్యూటీ పీఎంగానే ప్రమాణం చేస్తానన్నారు.
ఆర్.వెంకట్రామన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఇది జరిగింది.
అప్పట్లో దేవీలాల్ ప్రమాణం సందర్భంగా వెంకట్రామన్ మంత్రి అని రెండోసారి చదివినా దేవీలాల్ మాత్రం ఉపప్రధాని అనే చదివారు. కానీ రాష్ట్రపతి ఆ విషయాన్ని వివాదం చేయకుండా వదిలేశారు.
ఇది 1989 డిసెంబరులో జరిగింది.
కానీ కేఎం శర్మ అనే వ్యక్తి ఈ అంశంపై సుప్రీం కోర్టులో కేసు వేశారు.
రాజ్యాంగంలో లేని ఉప ప్రధాని అనే పదం చదివారు కాబట్టి దేవీలాల్ ప్రమాణ స్వీకారం చెల్లదనేది పిటిషన్ సారాంశం.
దేవీలాల్ తరపున వాదించిన ప్రభుత్వ న్యాయవాది మాత్రం, ప్రమాణ స్వీకారంలో చదివే పాఠం సారాంశం చూడాలి తప్ప, పదాలతో పెద్ద పనిలేదని వాదించారు.
దీంతో ఏకీభవించిన సుప్రీం కోర్టు, డిప్యూటీ ప్రైమ్ మినిష్టర్ అనేది కేవలం లిఖితపూర్వకంగానే ఉంది తప్ప, ఏ నిబంధనలు ఉల్లంఘించడం లేదనీ, దేవీలాల్ కూడా అందరు మంత్రుల్లాగానే వారిలో ఒకరనీ, ఆయన్ను ఉప ప్రధాని అని పిలిచినంత మాత్రాన ఏ ప్రత్యేక అదనపు అధికారం రావడం లేదు కాబట్టి, దాన్ని తప్పు పట్టడానికి ఏమీ లేదని తీర్పు ఇచ్చింది.
కర్ణాటక వివాదం
2012లో కర్ణాటకలో ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు. వీరిద్దరు కూడా
ప్రమాణ స్వీకారం సమయంలో మంత్రి అని కాకుండా ఉప ముఖ్యమంత్రి అనే చదువుతామని పట్టుబట్టారు.
దీనిపై కర్ణాటక గవర్నర్, ముఖ్యమంత్రి కార్యాలయం మధ్య చర్చ జరిగింది.
చివరకు వారు ఉపముఖ్యమంత్రి అనే చదివారు.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కర్ణాటకలో గతంలో కూడా డిప్యూటీ సీఎంలను అదే రీతిలో డిప్యూటీలుగానే ప్రమాణం చేయించారని తెలుస్తోంది.
నిజానికి అది రాజ్యాంగంలోని 164వ ఆర్టికల్ కి విరుద్ధం అయినప్పటికీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
అయితే 2018లో శేఖర్ అయ్యర్ అనే వ్యక్తి దీనిపై కర్ణాటక హైకోర్టుకు వెళ్లారు.
రాజ్యాంగంలో లేని డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం సరికాదనేది ఆయన పిటిషన్ సారాంశం.
కానీ గతంలో సుప్రీం తీర్పును గుర్తుంచుకున్న కర్ణాటక హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది.
ఇవి కూడా చదవండి:
- కేంద్ర కేబినెట్, స్వతంత్ర, సహాయ మంత్రి హోదాల మధ్య తేడాలేంటి?
- సన్‌స్క్రీన్ లోషన్లు వాడుతున్నారా, ఈ ఎనిమిది విషయాలు తెలుసుకోండి...
- సత్యకుమార్ యాదవ్: వెంకయ్యనాయుడి పర్సనల్ సెక్రటరీ నుంచి చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి వరకు
- కువైట్‌లో అగ్నిప్రమాదం: ‘మంటల్లో చిక్కుకుని కొందరు, పొగలో ఊపిరాడక మరికొందరు చనిపోయారు’
- వంటకు ఏ పాత్రలు వాడాలి? పోషకాలు కోల్పోకుండా ఆహారం ఎలా వండాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














