చెంచాతో జైలు గోడలు తవ్వి తప్పించుకున్న ఖైదీలు, తర్వాత ఏమైంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మైల్స్ బర్క్
- హోదా, బీబీసీ కల్చర్
అది 1962వ సంవత్సరం. జూన్ 12వ తేదీన అల్కాట్రాజ్ జైలు నుంచి ముగ్గురు వ్యక్తులు తప్పించుకున్నారు. వారు మళ్లీ ఎప్పుడూ, ఎవరికీ కనిపించలేదు. అప్పటి నుంచి ఫ్రాంక్ మోరిస్, ఆంగ్లిన్ సోదరుల జాడ మిస్టరీగానే మిగిలిపోయింది.
అమెరికాలోని అత్యంత కట్టుదిట్టమైన జైలు నుంచి సాహసోపేతంగా వారు తప్పించుకున్న విధానం, వారి దృఢచిత్తం, చాతుర్యం ఇట్టే కట్టిపడేస్తాయి. ఇది జరిగిన రెండేళ్ల తర్వాత నేరం జరిగిన ప్రదేశానికి బీబీసీ వెళ్లింది.
ఖైదీలు తప్పించుకోవడంతో భయంకరమైన ప్రదేశంగా పేరున్న 'అల్కాట్రాజ్' అనే జైలు దీవిని చూసేందుకు బీబీసీ పనోరమకు చెందిన మైకేల్ చాల్టన్ 1964లో శాన్‌ఫ్రాన్సిస్కో తీరం నుంచి ''నేర ప్రపంచంలో అత్యంత భయంకరమైన చోటుకు’’ వెళ్లారు.
''ది రాక్''గా పిలిచే ఈ అమెరికన్ జైలులో అత్యంత ప్రమాదకర నేరస్తులు ఉండేవారు. దుర్బేధ్యమైన కోటగా దీనిని భావించేవారు. కానీ, 1962 జూన్ 12 తెల్లవారుజాము సమయంలో ముగ్గురు వ్యక్తులు అసాధ్యమనుకున్న దానిని సాధ్యం చేసి చూపించారు. అక్కడి నుంచి వారు తప్పించుకున్నారు.
మొదట్లో సముద్ర జలాల ద్వారా ఎవరూ లోపలికి ప్రవేశించకుండా పర్యవేక్షించేందుకు నౌకాదళ స్థావరంగా అల్కాట్రాజ్ ఉండేది. సముద్రంలో ఎత్తైన కొండలు, చల్లని నీటి ప్రవాహాల మధ్య ఏకాకిలా ఉండే ఈ జైలులో అమెరికా అంతర్యుద్ధం సమయంలో చాలా మంది ఖైదీలను ఉంచారు. 20వ శతాబ్దపు తొలినాళ్లలో దీనిని మిలిటరీ జైలుగా మార్చారు.
ప్రొహిబిషన్ సమయంలో పేట్రేగిపోయిన వ్యవస్థీకృత నేరాలను అరికట్టేందుకు 1930లలో అమెరికా చర్యలు చేపట్టిన సమయంలో, న్యాయ శాఖ ఈ జైలును స్వాధీనం చేసుకుంది. అనంతరం అత్యంత భయంకరమైన నేరస్తులు ఈ జైలుకు రావడం మొదలైంది.
కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్లు అల్ కాపోన్, మిక్కీ కోహెన్, జార్జ్ 'మెషీన్ గన్' కెల్లీ, హంతకుడు రాబర్ట్ స్ట్రౌడ్ (ఆ తర్వాత బర్డ్‌మ్యాన్ ఆఫ్ అల్కాట్రాజ్‌గా పేరుపొందారు) వంటి వారిని ఈ జైలులో ఉంచారు.
''దుర్మార్గులు, అత్యంత సమస్యాత్మక వ్యక్తులను సాధారణ జైలులో ఎలా ఉంచుతారు?'' అన్న ప్రశ్నలు వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
బీబీసీ పనోరమ బృందం అక్కడికి వెళ్లడానికి నాలుగేళ్ల ముందు ఫ్రాంక్ లీ మోరిస్ ఈ జైలుకు వచ్చారు. ఆయన 11 ఏళ్లకే అనాథగా మారారు. 13 ఏళ్ల వయసులో మొదటి నేరం చేశారు. మోరిస్ తన జీవితంలో ఎక్కువ భాగం జైళ్లలో, లేదా జైలు బయట పరివర్తన కేంద్రాల్లోనే గడిపారు.
చాలా తెలివైనవాడిగా, నేరాల్లో అనుభవం కలిగిన వ్యక్తిగా మోరిస్‌ని చెబుతారు. మాదక ద్రవ్యాల దగ్గరి నుంచి మారణాయుధాలతో బెదిరించి దోపిడీ, మరీముఖ్యంగా జైలు నుంచి తప్పించుకోవడం వరకూ ఆయనపై చాలా నేరాభియోగాలు ఉన్నాయి.
లూసియానా జైలు నుంచి తప్పించుకున్న తర్వాత 1960లో ఆయన్ను 'ది రాక్'కి తరలించారు. అల్కాట్రాజ్‌కి వచ్చినప్పటి నుంచి అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించడం మొదలుపెట్టారు.
బ్యాంకు దోపిడీ కేసులో అల్కాట్రెజ్‌లో 1957 నుంచి ఖైదీలుగా ఉన్న జాన్ ఆంగ్లిన్, క్లారెన్ ఆంగ్లిన్ సోదరులు, అలెన్ వెస్ట్ జైలులో అదే బ్లాక్‌లో ఉండేవారు. గతంలోనే వేరే జైలులో వారికి పరిచయం ఉండడం, పక్కపక్క గదుల్లోనే ఉండటంతో రాత్రిళ్లు వారంతా మాట్లాడుకునేవారు.
జైలు మూతపడిన ఏడాది తర్వాత బీబీసీ ప్రతినిధి చాల్టన్ అల్కాట్రాజ్‌ని సందర్శించారు. అప్పటికే ఈ జైలు ఖైదీలు అనుభవించిన కఠిన పరిస్థితులు, క్రూరులైన కాపలాదారులు, సముద్రం నుంచి హోరున వీచే గాలుల వంటి వాటి గురించి ఆయనకు బాగా తెలుసు.

ఫొటో సోర్స్, Getty Images
పారిపోయేందుకు పక్కా ప్రణాళిక
మోరిస్ నాయకత్వంలో జైలు నుంచి తప్పించుకుని పారిపోయేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. నెలల తరబడి శ్రమించి, తమ సింక్‌ల వెనక గాలి వెళ్లే రంధ్రం చుట్టూ ఉప్పుతో దెబ్బతిని కనిపించే కాంక్రీట్‌ను కొద్దికొద్దిగా పగలగొడుతూ వెళ్లారు.
భోజనశాల నుంచి ఎత్తుకొచ్చిన చెంచాలతో, వాక్యూమ్ క్లీనర్ మోటార్, వాడిపడేసిన రంపపు బ్లేడ్లు ఉపయోగించి తయారు చేసిన ఒక పరికరంతో కాపలా లేని యుటిలిటీ కారిడార్ వైపు తవ్వడం మొదలుపెట్టారు.
తవ్వుతున్నప్పుడు శబ్దం వినిపించకుండా ఉండేందుకు ఖైదీల కోసం మ్యూజిక్ పెట్టే సమయంలో మోరిస్ తన అకార్డియన్ (హార్మోనియం పెట్టె లాంటి సంగీత సాధనం)ని రోజూ వాయించేవారు.
కారిడార్‌లోకి వెళ్లేందుకు అనువైనంత పెద్ద రంధ్రం చేసిన తర్వాత, వారు జైలు గదులపైన ఖాళీ ప్రదేశంలో రహస్య వర్క్‌షాప్ ఏర్పాటు చేసుకున్నారు. జైలు గదులకు చేసిన రంధ్రాలు కనపడకుండా జైలు లైబ్రరీలోని మేగజైన్లతో తయారు చేసిన పేపర్ వాల్‌ను అడ్డుగా పెట్టేవారు.
అలాగే, 50కి పైగా రెయిన్‌కోట్‌లను దొంగిలించి, వాటితో 6x14 అడుగుల తాత్కాలిక రబ్బరు తెప్పను, లైఫ్ జాకెట్లను ఆ రహస్య వర్క్‌షాప్‌లో తయారు చేసుకున్నారు. వేడిగా ఉండే ఆవిరి పైపులను ఉపయోగించి ఆ రబ్బరు తెప్పకు అతుకులు వేశారు. వారి వద్ద ఉన్న సంగీత సాధనాన్ని రబ్బరు తెప్పలో గాలి నింపే వస్తువుగా మార్చారు. ప్లైవుడ్ ముక్కలతో తెడ్లు తయారుచేసుకున్నారు.
అయితే, ఈ పనులు చేసే సమయంలో, రాత్రిళ్లు కాపలాదారులు తనిఖీలకు వచ్చినప్పుడు వారు గదుల్లో లేని విషయం బయటపడకుండా చూడాలి. అందుకోసం వారు సబ్బులు, టూత్‌పేస్టులు, టాయిలెట్ పేపర్‌ను ఉపయోగించి మనిషి తలల మాదిరిగా బొమ్మలను తయారు చేశారు.
అవి నిజమైన మనిషి తలల్లా కనిపించేందుకు జైలులో జుత్తు కత్తిరించే అంతస్తు నుంచి నిజమైన వెంట్రుకలను సేకరించి బొమ్మలకు అంటించారు. దొంగిలించిన పెయింట్ వస్తువులను ఉపయోగించి చర్మం రంగులో కనిపించేలా ఆ బొమ్మలకు రంగులేశారు.
రహస్య వర్క్‌షాప్‌లో పనిచేసే సమయంలో, ఆ బొమ్మ తలలను మంచాలపై ఉంచేవారు. నిద్రపోతున్న శరీరాకృతిలో ఉంచి, అందుకు అనుగుణంగా దుప్పట్లు, తువ్వాళ్లు, దుస్తులను పేర్చేవారు.
ఈ పనులు చేస్తూ, తప్పించుకునేందుకు అనువైన మార్గం కోసం వెతికారు. పైకి ఎక్కేందుకు ప్లంబింగ్ పైపును వాడుకున్నారు. పైపుని 30 అడుగులు (9.1 మీటర్లు) ఎగబాకి పైవైపున ఉన్న వెంటిలేటర్‌ను తెరిచారు. సబ్బుతో తయారు చేసిన నకిలీ బోల్టును తాత్కాలికంగా బిగించారు.

ఫొటో సోర్స్, Getty Images
చివరికి, 1962 జూన్ 11వ తేదీ రాత్రి తమ ప్లాన్ ప్రకారం అక్కడి నుంచి తప్పించుకునేందుకు సిద్ధమయ్యారు. జైలు గార్డులను నమ్మించేందుకు బొమ్మల తలలను మంచాలపై పెట్టి, మోరిస్, ఆంగ్లిన్ సోదరులు జైలు గోడలకు ఉన్న రంధ్రాల ద్వారా బయటికి వచ్చారు. గదిలో నుంచి బయటపడలేకపోవడంతో వెస్ట్ తప్పించుకోలేకపోయారు. దీంతో మిగిలిన ముగ్గురూ అతన్ని వదిలేసి వెళ్లిపోయారు.
జైలు గది పైకప్పు ఎక్కి పరుగెత్తడం ప్రారంభించారు. వారితో పాటు తాము తయారు చేసుకున్న తాత్కాలిక రబ్బరు తెప్పను కూడా మోసుకెళ్లారు. టవర్ గార్డు దృష్టిలో పడకుండా డ్రైన్ పైపు మాటుగా వెళ్లి జైలు యార్డు దాటి, 12 అడుగుల (3.7 మీటర్ల) మేర రక్షణ కంచెను కట్ చేశారు. దీవికి ఈశాన్యం దిశ వైపున నీళ్లలో తమ రబ్బరు తెప్పను దించి, ఆ చీకటిలో అక్కడి నుంచి అదృశ్యమయ్యారు.
మరుసటి రోజు ఉదయం ఆ బొమ్మ తలలు బయటపడే వరకు అలారం కూడా మోగలేదు.
ఈ జైలులో పనిచేసే గార్డుల కుటుంబాలు కూడా అదే దీవిలో నివాసం ఉండేవి. ఆ సమయంలో అల్కాట్రాజ్‌లో వార్డెన్ అయిన జోలీన్ బబ్యాక్ తండ్రి అలారం మోగించారు. ''నేను లేచేటప్పటికి, సైరన్ మోగుతూనే ఉంది. పెద్ద శబ్దంతో, భయంకరంగా ఉంది'' అని జోలీన్ బబ్యాక్ 'బీబీసీ విట్‌నెస్ హిస్టరీ'తో 2013లో చెప్పారు. ''చాలా షాకయ్యాను. ఎందుకంటే, తప్పించుకుని పారిపోవడం వల్ల సైరన్ మోగిందని నేను మొదట అనుకోలేదు'' అన్నారామె.
జైలు అధికారుల ఇళ్లతో సహా అన్ని భవనాల్లో తనిఖీలతో జైలు లాక్‌డౌన్ అయింది. జోలీన్ తండ్రి వందల మంది సిబ్బందితో చుట్టుపక్కల ప్రాంతాలను అణువణువూ గాలించడం మొదలుపెట్టారు. జూన్ 14న ఖైదీలు తప్పించుకోవడానికి ఉపయోగించిన ఒక తెడ్డును కోస్టు గార్డ్స్ గుర్తించారు. వారం రోజులకు తెప్ప భాగాలు గోల్డెన్ గేట్ వంతెన సమీపంలో కొట్టుకెళ్లడం కనిపించింది. ఆ మరుసటి రోజు సొంతంగా తయారు చేసుకున్న లైఫ్ జాకెట్ ఒకటి దొరికింది. కానీ, పారిపోయిన ముగ్గురూ ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పటికీ విచారణలోనే ఆ కేసు..
ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నప్పటికీ, దీవిని దాటే క్రమంలో ఈ ప్రమాదకర జలాల్లో పడి మరణించి ఉంటారని అధికారులు నిర్ధరణకు వచ్చారు. 1964లో జైలు వార్డెన్ రిచర్డ్ విల్లార్డ్‌ను బీబీసీ ఇంటర్వ్యూ చేసిన సమయంలో ఆయన అభిప్రాయం ఇది.
''అవును, కొద్దిమంది అలా చేశారు. కానీ, వారు దాని గురించి గొప్పగా చెప్పుకోవడం లేదు. మరోమాటలో చెప్పాలంటే, తప్పించుకుపోయిన వారు, ఆ ప్రయత్నంలో నీళ్లలో మునిగిపోయారు. అల్కాట్రాజ్ నుంచి తప్పించుకున్నట్లు బయట ఎవరూ చెప్పుకుంటున్నట్లు తెలియదు'' అని ఆయన అన్నారు.
''నేనెందుకు అంత బలంగా చెబుతున్నానంటే, ఈ గాలి హోరు విన్నారు కదా, ఈ నీళ్లను చూస్తున్నారు, వాటిని దాటగలరని మీరు అనుకుంటున్నారా?'' అని ప్రశ్నించారు.
అయితే, వారు తప్పించుకున్న ఏడాది తర్వాత 1963లో అల్కాట్రాజ్ జైలు మూతపడింది. జైలు భవనాలు దెబ్బతినడం, దాని నిర్వహణ ఖర్చు కూడా ఎక్కువగా ఉండడంతో దానిని మూసివేశారు. జైలు అధికారుల అనుసరించిన క్రూర విధానాలపై చాలాకాలం వివాదం నడించింది.
1939లోనే అమెరికా అటార్నీ జనరల్ ఫ్రాంక్ మర్ఫీ ఈ జైలు మూసివేతకు ప్రయత్నించారు. "ఇది మానసిక ప్రవర్తనపై ప్రభావం చూపుతోంది, ఖైదీల్లో చెడు, దుర్మార్గపు వైఖరిని పెంచుతోంది'' అని ఆయన పేర్కొన్నారు.
అప్పటికే అక్కడి కఠిన పరిస్థితులు తట్టుకోలేక ఖైదీలు కొందరు తమలో తాము చంపుకున్నారు, మరికొందరు వికలాంగులయ్యారు. 1960లలో అమెరికా పురోగమిస్తున్న కొద్దీ ఖైదీలకు కేవలం శిక్ష మాత్రమే కాకుండా, పునరావాసం వైపు కూడా దృష్టి పెట్టింది.
ఇక తప్పించుకున్న ముగ్గురి విషయానికొస్తే, సముద్రంలో మృతదేహాలేవీ బయటపడకపోయినప్పటికీ, వారు చనిపోయినట్లు 1979లో అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఎఫ్‌బీఐ కేసును మూసేసింది. యూఎస్ మార్షల్స్‌కు ఈ కేసును అప్పగించింది. కానీ, వారు బతికున్నారా లేదా అనే విషయాలపై ఎప్పుడూ ఊహాగానాలు నడిచేవి.
వారు చనిపోయినట్లు ప్రకటించిన అదే ఏడాది, ఫ్రాంక్ మోరిస్ పాత్రలో క్లింట్ ఈస్ట్‌వుడ్ నటించిన ‘ఎస్కేప్ ఫ్రమ్ అల్కాట్రాజ్’ చిత్రం విడుదలైంది. వారు తప్పించుకు పారిపోయిన 1962 నుంచి ఎక్కడో ఒకచోట కనిపించారని, వాళ్ల నుంచి సందేశం వచ్చిందన్న కథనాలు చాలానే ఉన్నాయి.
అయితే, తమకు ఐదేళ్ల కిందట జాన్ ఆంగ్లిన్ పేరిట ఒక రహస్య లేఖ వచ్చినట్లు 2018లో శాన్‌ఫ్రాన్సిస్కో పోలీసులు వెల్లడించారు. ఆ లేఖలో ''నేను 1962 జూన్‌లో అల్కాట్రాజ్ నుంచి తప్పించుకున్నాను. మేమంతా ఆ రాత్రి వచ్చేశాం. మేమంతా రహస్యంగా బతికాం. 2005 అక్టోబర్‌లో ఫ్రాంక్ మోరిస్ చనిపోయారు. 2008లో క్లారెన్ ఆంగ్లిన్ మరణించారు'' అని అందులో పేర్కొన్నారని చెప్పారు.
తాను లొంగిపోతానని, అందుకు బదులుగా క్యాన్సర్ చికిత్స అందించాలని లేఖ రాసిన వ్యక్తి కోరినట్లు తెలిపారు. ఆ లేఖ వచ్చిందని ఎఫ్‌బీఐ నిర్ధరించినప్పటికీ, అది నిజమైనదా, కాదా అని ధ్రువీకరించలేకపోయింది.
యూఎస్ మార్షల్స్ సర్వీస్ వద్ద ఈ కేసు ఇంకా ఓపెన్‌గానే ఉంది. వారి గురించి ఏదైనా సమాచారం అందితే ఈ మిస్టరీకి తెరపడుతుందన్న ఆశతో, అల్కాట్రాజ్ నుంచి తప్పించుకుపోయిన ఖైదీలు ఇప్పుడు ఎలా ఉంటారనే చిత్రాలను 2022లో విడుదల చేసింది.
ఇవి కూడా చదవండి:
- కేఏ పాల్, లక్ష్మీనారాయణలకు ఎన్ని ఓట్లు వచ్చాయి.. ఎన్నికల్లో చిన్న పార్టీల ప్రభావమెంత?
- మొదటిసారి పోటీ చేసి, గెలిచి, కేంద్ర మంత్రి పదవి సాధించిన పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరు?
- సైబర్ సెక్స్ వర్కర్: పోర్న్ ఇండస్ట్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఎలా ఉండబోతోంది?
- 26 ఏళ్లకే ఎంపీ, 36 ఏళ్లకు కేంద్రమంత్రి.. కింజరాపు రామ్మోహన్ నాయుడు గురించి ఈ విషయాలు తెలుసా?
- పవన్ కళ్యాణ్ జీతం ఎంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














