ఒంటి మీద నూలు పోగు లేకుండా, కుక్క బిస్కెట్లే ఆహారంగా చిన్నగదిలో 15 నెలలు బతికారు

నసుబి

ఫొటో సోర్స్, Hulu

ఫొటో క్యాప్షన్, టీవీ రియాలిటీ షో కోసం గదిలో ఒంటరిగా గడిపిన నసుబిపై రూపొందించిన డాక్యుమెంటరీ విడుదలైంది

ఒక వ్యక్తిని నగ్నంగా ఒక చిన్న గదిలో ఒంటరిగా వదిలేశారు. ఆ గదికి తలుపులు, కిటికీలు లేవు. అందులో ఓ పెన్ను, కొన్ని పోస్ట్‌ కార్డులు, టెలిఫోన్, మ్యాగజీన్‌లు మాత్రమే ఉన్నాయి. అంతకు మించి అందులో ఇంకే వస్తువూ లేదు. తినడానికి తిండి లేదు. తాగడానికి, కడుక్కోవడానికి నీళ్లు లేవు. టాయిలెట్ పేపర్ కూడా లేదు.

1998లో జపాన్‌లోని ఓ టీవీ రియాలిటీ షో కోసం ఇలా చేశారు. అప్పట్లో పెను సంచలనం సృష్టించిన ఆ టీవీ షోలో పాల్గొన్న కంటెస్టెంట్‌ పేరు నసుబి. ఆయన అసలు పేరు టొమోకి హమత్సు.

ఒక వ్యక్తి రకరకాల పోటీల్లో గెలుస్తూ, అందుకు ప్రతిఫలంగా బహుమతుల రూపంలో వచ్చే వస్తువులు, ఆహార పదార్థాలతో ఒంటరిగా జీవించగలరా? అన్నది పరీక్షించడం ఆ షో ఉద్దేశం.

ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఆ కార్యక్రమం, టీవీ రియాలిటీ షోలలో కొత్త ధోరణులకు నాంది పలికింది.

ఇటీవలి కాలంలో భారత్‌లో బాగా పాపులరైన బిగ్‌‌బాస్ రియాలిటీ షోల గురించి చాలామందికి తెలుసు. కానీ, దాదాపు మూడు దశాబ్దాల కిందటే ఇలాంటి షోను జపాన్‌లోని ఓ టీవీ చానల్ ప్రసారం చేసింది. ఆ షో పేరు ‘సుసును! దెంపా షోనెన్’.

నెదర్లాండ్స్‌లో ‘బిగ్ బ్రదర్’ లాంటి సూపర్ హిట్ రియాలిటీ షోలు ప్రారంభం కాకముందే జపాన్‌లో ఈ షో పెను సంచలనం సృష్టించింది.

బిగ్ బాస్‌ షోలలో కంటెస్టెంట్లకు రకరకాల టాస్క్‌లు ఇస్తుంటారు కదా.. అలాగే ఆ జపాన్ టీవీ షోలోనూ కంటెస్టెంట్‌‌కు పోటీలు పెట్టారు. వాటిలో గెలిస్తే బహుమతులు ఇచ్చేవారు.

మొత్తం ఛాలెంజ్‌లో విజయం సాధించాలంటే.. కంటెస్టెంట్ గెలుచుకున్న మొత్తం బహుమతుల విలువ తప్పనిసరిగా నిర్దిష్ట స్థాయికి చేరుకోవాలి. అప్పుడు ఆ పరిమితి 10 లక్షల యెన్‌లు అని చెప్పారు. ప్రస్తుత మారకపు విలువ ప్రకారం, అది 6,36,000 రూపాయలతో సమానం. టైటిల్ గెలవాలంటే.. ఆ లక్ష్యం పూర్తయ్యే దాకా ఆయన ఆ గదిలోనే ఉండాలి.

BBC Telugu WhatsApp channel
నసుబి

ఫొటో సోర్స్, Hulu

ఫొటో క్యాప్షన్, నసుబిపై రూపొందించిన డాక్యుమెంటరీ ‘ది కంటెస్టెంట్’ అమెరికాలోని హులు ఓటీటీలో విడుదలైంది

నసుబి చాలా పోటీల్లో బహుమతులు గెలుచుకున్నారు. కానీ, వాటిలో చాలావరకు ఆయనకు పెద్దగా ఉపయోగపడేవి కాదు.

టైర్లు, గోల్ఫ్ బాల్స్, టెంట్, మోడల్ గ్లోబ్, టెడ్డీ బేర్ బొమ్మ, సినిమా టిక్కెట్ల లాంటివి ఆయన గెలుచుకున్నారు.

ఈ షోలోనూ ఆయన చాలా రోజులు ఆహార పదార్థాలు గెలవకోలేకపోయారు. దాంతో, బాగా బక్కచిక్కిపోయారు. అప్పుడు ఆయన బియ్యం గెలుచుకోలేకపోతే చనిపోయే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

ఆ తరువాత, చక్కెర కలిపిన పానీయాలను, కుక్కలకు పెట్టే బిస్కెట్లను సంపాదించారు. కొన్ని వారాల పాటు ఆయన వాటితోనే ప్రాణాలను నిలబెట్టుకున్నారు. తర్వాత 5 కిలోల బియ్యం వచ్చాయి. కానీ, అన్నం వండేందుకు పాత్ర లేదు. దాంతో, ఆయన బియ్యం తిన్నారు.

అలా ఏది దొరికితే అది తింటూ.. దాదాపు 15 నెలల పాటు ఆ గదిలోనే, బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేకుండా గడిపారు.

ఆ గదిలో ఆయన ఏం చేస్తున్నారో అంతా కెమెరాతో చిత్రీకరించేవారు.

అప్పట్లో జపాన్‌‌లో ఆ టీవీ షోను చూసేందుకు లక్షల మంది టీవీలకు అతుక్కుపోయేవారు. చాలామంది విమర్శకులు ఆ కార్యక్రమాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కానీ, అది యువతను బాగా ఆకర్షించింది. ఆయనకు ఏమవుతుందోననే ఆందోళన, ఆయన ఏం బహుమతి సాధిస్తారో, ఆయన జీవితం ఎలా మారిపోతుందో చూడాలనే ఆసక్తి వీక్షకుల్లో ఉండేది.

అప్పుడు నసుబి వయసు 22 ఏళ్లు.

ఆ షోలో ఉన్నంత కాలం ఆయన నగ్నంగానే ఉన్నారు. ఎందుకంటే, ఆయన గెలుచుకున్న బహుమతుల్లో ఒక్కటి కూడా వస్త్రం లేదు. దాంతో, నగ్నంగానే ఉన్న ఆయన్ను మొత్తంగా చూపించేటప్పుడు వంకాయ చిత్రంతో కవర్ చేసేవారు.

నసుబి తీవ్రమైన క్షోభను ఎదుర్కొన్నప్పటికీ, ఆ షోతో ఆయన పెద్ద సెలబ్రెటీగా మారిపోయారు.

నసుబి

ఫొటో సోర్స్, Hulu

నసుబిపై డాక్యుమెంటరీ..

‘ది కంటెస్టెంట్’ పేరుతో నసుబిపై ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని బ్రిటన్‌కు చెందిన డైరెక్టర్ క్లెయిర్ టిట్లీ తెరకెక్కించారు. జపాన్ టీవీ షో కోసం అలా చేసిన నసుబి అనుభవాలను, అప్పుడు ఆయన పడ్డ వేదనను ఇప్పటి ప్రపంచానికి తెలియజేసేందుకు ఈ డాక్యుమెంటరీని రూపొందించామని టిట్లీ చెప్పారు.

అప్పట్లో ఆ టీవీ షోను జపాన్, దక్షిణ కొరియాలలో మాత్రమే చూపించేవారని, అప్పటికి యూట్యూబ్, సోషల్ మీడియా లాంటివి లేవు కాబట్టి ఆయన గురించి మిగతా ప్రపంచానికి పెద్దగా తెలియలేదని టిట్లీ అన్నారు.

ఆయన ఆ గదిలో ఎందుకు ఉన్నారు? అందులో ఉన్నప్పుడు ఆయనలో ఎలాంటి మార్పులు వచ్చాయి? అవి ఆయనపై ఎలాంటి ప్రభావం చూపించాయి? వంటి విషయాలన్నీ స్వయంగా ఆయనతో మాట్లాడి తెలుసుకున్నాక, ఆయనపై డాక్యుమెంటరీ తీయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.

1990లలో జపాన్‌లో పనిచేసిన బీబీసీ ప్రతినిధి చెప్పిన విషయాలను కూడా ఈ డాక్యుమెంటరీ కోసం వాడుకున్నారు.

ఈ డాక్యుమెంటరీని ఇప్పటికే అమెరికాలోని హులు స్ట్రీమింగ్ సర్వీస్‌లో విడుదల చేశారు. బ్రిటన్‌లో ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.

నసుబి

ఫొటో సోర్స్, Hulu

ఫొటో క్యాప్షన్, కుక్కలకు పెట్టే ఆహారం తిని ఆయన కొన్ని వారాలు గడిపారు

'భయంకరమైన అనుభవం'

‘‘ఆ గదిలో అలా గడపడం భయంకరమైన అనుభవం. అందులో ఆనందం ఉండదు, స్వేచ్ఛ ఉండదు' అని నసుబి ఇటీవల చెప్పారు.

‘‘మానసికంగా, శారీరకంగా ఎంతో క్షోభను అనుభవించాను. ఆకలితో అలమటించిపోయాను. తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లాను. కానీ, నన్ను వినోద వస్తువుగా చూశారు’’ అని నసుబి చెప్పారు.

"వారం రోజులు నేనేం చేశానన్న దాంట్లోంచి వారు కొన్ని నిమిషాలను మాత్రమే టీవీలో చూపించి ఉంటారు. నేను బహుమతిని గెలుచుకున్నప్పుడు ఆనందపడ్డ క్షణాలను 'ఎడిట్' చేసి చూపించి ఉంటారు" అని ఆయన చెప్పారు.

అయితే, తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి ఈ డాక్యుమెంటరీలో పెద్దగా మాట్లాడలేదు. తాను జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని, ప్రస్తుతం మాత్రం చాలా సంతోషంగా ఉన్నానని నసుబి అన్నారు.

ఆ గదికి తలుపు లేదు, తాళం లేదు. కాబట్టి, ఆయనకు ఇబ్బంది అనిపించినా, నచ్చకపోయినా ఎప్పుడంటే అప్పుడు బయటికి వెళ్లిపోయే వీలుంది. అయినా ఆయన బయటికి ఎందుకు వెళ్లలేదు? అంటే.. అందుకు చాలా కారణాలు ఉన్నాయని దర్శకురాలు క్లెయిర్ టిట్లీ చెప్పారు.

"ఒక కారణం ఏంటంటే.. ఆయన చాలా ధైర్యవంతుడు. పైగా ఆయన స్వస్థలం జపాన్‌లోని ఫుకుషిమా. ఆ ప్రాంత ప్రజలు కష్టాన్ని మాత్రమే నమ్ముకుంటారు. విజయం సాధించేందుకు ఎంతైనా పోరాడుతారు. వెనకడుగు వేయరు. అలాంటి సంకల్పం వల్లే ఆయన గెలిచేవరకూ ఆ గదిలోంచి బయటికి రాలేదు’’ అని ఆమె వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)