మెదక్‌లో ఉద్రిక్తత: ‘మేం ఏం తప్పు చేశామని మా హాస్పిటల్‌పై దాడి చేశారు?’

మెదక్

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

తెలంగాణలోని మెదక్‌లో శనివారం (జూన్ 15) ఇరువర్గాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు. కొందరు కత్తిపోట్లకు గురయ్యారని పోలీసులు చెప్పారు. ఈ ఘర్షణల్లో గాయపడినవారిలో పోలీసులు కూడా ఉన్నారు.

ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నాయని హైదరాబాద్ మల్టీజోన్-1 ఐజీ ఏవీ రంగనాథ్ తెలిపారు.

ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మెదక్‌లో 144 సెక్షన్ విధించారు. అదనపు పోలీస్ బలగాలను మోహరించారు.

ఈ ఘర్షణలకు కారణమైన వారిలో ఇరువర్గాలకు చెందిన కొందరిని గుర్తించి అరెస్టు చేశామని, మరికొందరిని పట్టుకునేందుకు గాలిస్తున్నామని ఐజీ రంగనాథ్ చెప్పారు.

మెదక్ ఆర్థోపెడిక్ ఆస్పత్రి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఓ ఆసుపత్రిపై రాళ్లతో దాడి చేస్తున్న అల్లరి మూకలు

మెదక్‌లో ఏం జరిగింది?

పోలీసుల కథనం ప్రకారం...పశువులను కబేళాకు తరలిస్తున్నారన్న ఆరోపణలతో శనివారం రాత్రి మెదక్ పట్టణంలో గొడవ మొదలైంది. పశువులను తరలిస్తున్న వాహనాలను కొందరు అడ్డుకున్నారు. తర్వాత వారు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఆ తర్వాత పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇరువర్గాల మధ్య పరస్పర దాడులు జరిగాయి.

అదే క్రమంలో పలు వ్యాపార సముదాయాలపై కూడా దాడులు జరిగాయి. ఓ ఆర్థోపెడిక్ ఆసుపత్రిపై ఒక గుంపు దాడి చేసింది.

ఆ ఆస్పత్రి యాజమానిగా చెబుతున్న ఓ వ్యక్తి వీడియో ఎక్స్ (ట్విట్టర్ )లో వైరల్ అయింది.

‘’బయట ఎవరి మధ్య గొడవ జరిగిందో మాకు తెలియదు. మానవత్వంతో మేం ఒక పేషెంట్‌కు లోపల చికిత్స అందిస్తున్న సమయంలో 150 నుంచి 200 మంది వచ్చి మా ఆసుపత్రిపై దాడి చేశారు. ఇది ఎంతవరకు న్యాయం? మా డాక్టర్ కారును పూర్తిగా ధ్వంసం చేశారు. చికిత్స చేయడం మా తప్పా? ఎవరు హిందూ, ఎవరు ముస్లిం? ఇందులో నష్టపోయింది ఎవరు? ఎందుకీ గొడవలు? రేపు మీ వాళ్లే మా ఆస్పత్రికి రావొచ్చు. మా హాస్పిటల్ ఏం తప్పు చేసింది? మా సిబ్బంది ఏం తప్పు చేశారు? మా దగ్గర పనిచేసే ఆయా కాలు విరిగితే ఆమెను చికిత్స కోసం మరో ఆస్పత్రికి పంపించాల్సి వచ్చింది.’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం వీడియోలో కనిపించింది.

మెదక్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఆదివారం మెదక్ పట్టణంలోబంద్‌కు ఒక వర్గం పిలుపునిచ్చింది

ఘర్షణలకు కారణం అయ్యారన్న అనుమానితుల్లో కొందరిని పోలీసులు అదే రోజు రాత్రి (శనివారం) అదుపులో తీసుకున్నారు.

ఈ ఘర్షణల్లో కొందరు కత్తిపోట్లకు గురయ్యారని ఐజీ రంగనాథ్ మీడియాతో తెలిపారు.

గాయపడిన ఇరు వర్గాల వారు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

అయితే, కత్తి పోట్లకు గురైనవారు, గాయపడ్డ వారి సంఖ్యపై మెదక్ పోలీసుల నుంచి స్పష్టత రాలేదు.

ఆదివారం మెదక్ పట్టణ బంద్‌ చేపట్టాలని ఒక వర్గం పిలుపునిచ్చింది. మరోవైపు, పోలీసుల వైఫల్యం వల్లే గొడవలు పెద్దవయ్యాయని బీజేపీ నాయకులు ఆరోపించారు.

శాంతిభద్రతలను పరిరక్షించడంలో మెదక్ పోలీసులు విఫలమయ్యారని, ఎస్సై,సీఐ, జిల్లా ఎస్పీలను సస్పెండ్ చేయాలని బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు.

మెదక్ ఘర్షణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడంలేదని ఎంబీటీ పార్టీ అధికార ప్రతినిధి అమ్జదుల్లా ఖాన్ ప్రశ్నించారు. ఈ ఘర్షణలను అడ్డుకోవడంలో విఫలమైన జిల్లా ఎస్పీతో పాటు, బాధ్యులైన ఇతర పోలీస్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు.

ఏవీ రంగనాథ్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, మెదక్‌లో ఘర్షణలకు కారణమైనవారిని ఎవరినీ వదిలిపెట్టబోమని ఐజీ ఏవీ రంగనాథ్ అన్నారు.

పోలీసులు ఏం చెబుతున్నారు?

పోలీసులు విఫలమయ్యారన్న ఆరోపణలను ఐజీ రంగనాథ్ తోసిపుచ్చారు.

‘’సరైన సమయంలో పోలీసులు స్పందించలేదన్నది నిజం కాదు. స్పందించకపోవడం అనేది ఉండదు. ఒకవేళ నిర్లక్షంగా వ్యవహరించారని తేలితే సంబంధిత పోలీసులను కూడా బాధ్యులను చేస్తాం. మొత్తం మూడు కేసులు నమోదు చేశాం. ఇప్పటికి తొమ్మిది మందిని అరెస్ట్ చేశాం. ఒక వర్గం వారిని మాత్రమే అరెస్ట్ చేస్తున్నామన్నది నిజం కాదు. మరో వర్గం వారిని అరెస్ట్ చేయడంలో కొంత ఆలస్యం ఉండొచ్చు కానీ, వదిలేయడం ఉండదు. పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం. సీసీ ఫూటేజేల ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నాం. సామాన్యులు మతసామరస్యం కావాలని, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. కొంతమంది ఆడే నాటకాన్ని అందరూ గుర్తించాలి’’ అని ఐజీ రంగనాథ్ అన్నారు.

‘‘పశువులను అక్రమంగా తరలిస్తున్నారని ఎవరికైనా తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి తప్ప వాళ్లే చర్యలు తీసుకోవాలనుకోవడం మంచిది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల చెక్ పోస్టులు పెట్టి పశువులను తరలిస్తున్న వందలాది వాహనాలను పట్టుకుంటున్నాం. ఈ విషయంలో ఎవరికీ అనుమానాలు వద్దు.’’ అని ఆయన అన్నారు.

రాజా సింగ్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌‌ను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు

మెదక్‌కు వెళ్తానని ప్రకటించిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ముందు జాగ్రత్తగా పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులో తీసుకున్నారు.

మరోవైపు మెదక్ ఘటనపై బీఆర్ఎస్ పార్టీ స్పందించింది.

‘‘కేసీఆర్ హయాంలో గత తొమ్మిదిన్నరేళ్లు ఎలాంటి మతఘర్షణలు లేకుండా తెలంగాణ ప్రశాంతంగా ఉంది. కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు కరువయ్యాయి’’ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ‘ఎక్స్’లో అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)