రుషికొండ ‘రహస్య’ భవనాల్లో ఏముందంటే?

రుషికొండ
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

“విదేశాల నుంచి దిగుమతి అయిన మార్బుల్స్, టైల్స్‌తో నిర్మించిన గదులు, దాదాపు 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో బాత్రూంలు, భవనం లోపల విలాసవంతమైన నడకదారులు, ఖరీదైన షాండ్లియర్లు, 400 మంది ఒకేసారి సమావేశమయ్యేలా మీటింగ్ రూమ్స్, భవనాల బయట ఎటుచూసినా పచ్చదనం, భవనాల లోపల నుంచి ఎటు చూసినా సముద్రం కనిపించేలా నిర్మాణం’’

ఈ వర్ణనంతా విశాఖ రుషికొండపై గత ప్రభుత్వం నిర్మించిన భవనాలు, అందులోని హంగులు, సదుపాయాల గురించే.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారడంతో టీడీపీ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. రుషికొండపై నిర్మించిన భవనాల్లో ఏముందో మీడియాకు చూపించారు.

గత మూడేళ్లుగా రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలు ఎందుకో తెలియనివ్వలేదు. అసలు అందులో ఏం నిర్మిస్తున్నారో చెప్పలేదు.

ఇంతకాలం అంతా రహస్యంగా ఉంచారని టీడీపీ నేతలు ఆరోపించారు.

అయితే, ఈ భవనాలు అప్పటి సీఎం జగన్ నివాసం లేదా క్యాంప్ ఆఫీసు కోసమే అని విపక్షాలు తరచూ ఆరోపణలు చేస్తుండేవి.

రుషికొండ రెండు తెలుగు రాష్ట్రాల్లో నిత్యం వార్తల్లో ఉండేది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో ఈ భవనాలు ఏమవుతాయి? అసలు రుషికొండపై నిర్మించిన భవనాలను రహస్యంగా ఉంచడంపై వైసీపీ ఏం చెప్పింది? ఈ భవనాలను సీఎం క్యాంప్ ఆఫీసుగానో, నివాసంగానో మార్చే అవకాశం ఉందా?

వాట్సాప్ చానల్
రుషి కొండ

రుషికొండ భవనాలు ఎలా ఉన్నాయి?

గత మూడేళ్లుగా రుషికొండలో ఏం జరుగుతుంది? అక్కడ ఏం నిర్మిస్తున్నారు? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం దొరికింది.

ప్రభుత్వం మారడానికి ముందు వరకు ఈ భవనాల లోపలకి ఎవరినీ అనుమతించలేదు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ నేత లోకేష్, వామపక్ష నాయకులు ఇలా ఎందరు ఇక్కడకి వచ్చినా ‘నో ఎంట్రీ’.

దీంతో రుషికొండపై మూడేళ్లుగా నిర్మిస్తున్న భవనాల్లో ఏముందా అనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది.

మొత్తం 9.88 ఎకరాల్లో కళింగ, వేంగి, గజపతి బ్లాకులుగా రుషికొండపై భవనాల నిర్మాణం జరిగింది. నిజానికి ఇవి కొత్తగా నిర్మించిన భవనాలు కావు.

గతంలో టూరిజం డిపార్ట్‌మెంట్ నిర్వహించే రిసార్టులనే రూ. 452 కోట్లతో ఆధునికీకరణ చేయడం ప్రారంభించారు.

పనులు మొదలైన తర్వాత అక్కడేం జరుగుతుందో అంతా రహస్యంగా ఉంచారు.

అవసరమైతే సీఎం క్యాంప్ కార్యాలయంగా లేదంటే టూరిజం విభాగంవారు వాడుకునే విధంగా నిర్మించామని మాజీ మంత్రులు ఆర్కే రోజా, అమర్నాథ్ ఎన్నికలకు ముందు చెప్పారు.

రుషి కొండ

ఫొటో సోర్స్, UGC

ఇంతకాలం రహస్యంగా ఉంచిన ఆ భవనాల నిర్మాణం ఎలా ఉందో, వాటిలో ఏమున్నాయో తెలుసుకుందాం.

  • కళింగ బ్లాకులో 400 మందికి తగిన విధంగా అత్యధునిక సౌకర్యాలతో మీటింగ్ రూం
  • అలాగే 100 మంది వరకు సరిపడే మరో నాలుగు సమావేశ మందిరాలు
  • కళింగ, గజపతి, వేంగి బ్లాకులలో అత్యంత ఆధునికంగా నిర్మించిన గదులు
  • చూడగానే కళ్లు మిరిమిట్లు గొలిపే విధంగా ఉన్న ఖరీదైన ఫర్నీచర్
  • ఖరీదైన షాండ్లియర్లు
  • దాదాపు 500 చదరపు అడుగుల వైశాల్యంతో బాత్రూంలు
  • బాత్రుంలలో బంగారం రంగు షవర్లు, కుళాయిలు, టీవీలు
  • వినూత్నమైన డిజైన్లతో సీలింగ్ ఫ్యాన్లు, హాళ్లలో బిగ్ స్క్రీన్లు
  • ఖరీదైన కుర్చీలు, డిజైన్డ్ గ్లాస్ డోర్లు,ఆటోమెటిక్ కర్టెన్లతో విలాసవంతమైన పడక గదులు
  • భవనాల బయట, రోడ్డుపై నుంచి భవనాల వద్దకు చేరుకునే దారిపొడవునా కళ్లు తిప్పుకోలేని ల్యాండ్ స్కేపింగ్
రుషి కొండ

టీడీపీ, వైసీపీలు ఏమన్నాయి?

రుషికొండపై నిర్మించిన భవనాల లోపల ఏమున్నాయో ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో వీటిని పోస్ట్ చేస్తూ టీడీపీ కామెంట్లు చేసింది.

‘‘రుషికొండ మీద రూ.500 కోట్లతో జగన్ రెడ్డి కట్టుకున్న జల్సా ప్యాలెస్‌లోని రూ. 26 లక్షల బాత్ టబ్ ఇది. అధికారంలోకి వస్తే తన భార్యకి బీచ్ సైడ్ ప్యాలెస్ గిఫ్ట్‌గా ఇస్తా అని చెప్పి, ప్రభుత్వ సొమ్ముతో ఇలా విచ్చలవిడితనం చేశారు. దేశాధినేతలు కట్టుకునే రాజప్రాసాదాలకు వాడే మెటీరియల్‌తో, జగన్ రెడ్డి రుషికొండలో కట్టుకున్న బీచ్ వ్యూ ప్యాలెస్ ఇది. ఇంకా ఎన్ని ఘోరాలు బయట పడతాయో..!’’ అని టీడీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

‘‘రుషికొండ ప్యాలెస్‌లో వాడిన ఇటాలియన్ మార్బుల్, టైల్స్ చూస్తే దిమ్మ తిరుగుతుంది. ఈ ఇటాలియన్ మార్బుల్స్ కోసం ఒక్కో అడుగుకి పెట్టిన ఖర్చుతో, మధ్య తరగతి ప్రజలు, ఒక చిన్న సైజ్ అపార్ట్‌మెంట్ కొనేయొచ్చు’’ అని కూడా ఆ పోస్టులో ఉంది.

రుషి కొండ

ఫొటో సోర్స్, UGC

ఈ పోస్టుకు స్పందించిన వైసీపీ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చింది.

‘‘రుషికొండలో నిర్మించినవి ప్రైవేట్ ఆస్తులు కావు, ప్రభుత్వ భవనాలే. విశాఖపట్నానికి మా ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలను నిర్మించాం. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ఈ ప్రభుత్వం ఇష్టం.

అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీయించి, వాటికి వక్రీకరణలకు జోడించి బురద జల్లాలని ప్రయత్నించడం సరైనది కాదు. 1995 నుంచి కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ఊదరగొడుతూనే ఉన్నారు.

విశాఖ నగరానికి ఒక ప్రధానమంత్రి, ఒక రాష్ట్రపతి వచ్చినా, ముఖ్యమంత్రి, గవర్నర్‌లాంటి వ్యక్తులు వెళ్లినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించండి’’ అని వైసీపీ ట్వీట్ (ఎక్స్ లో) చేసింది.

రుషికొండ

ఈ భవనాలను ఏం చేస్తామంటే: గంటా శ్రీనివాసరావు

ఈ భవనాన్ని ఎలా వినియోగించుకోవాలన్న దానిపై ఇంకా ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాలేదని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. సమీక్షలు నిర్వహించేందుకు అనుగుణంగా ఈ భవన నిర్మాణం ఉందన్నారు.

అయితే వీటిని రహస్యంగా నిర్మించి, వివాదాస్పదం ఎందుకు చేశారో అర్థం కావడం లేదని గంటా చెప్పారు. రుషికొండపై హరిత రిసార్ట్స్ ఉండేవని, వీటి ద్వారా ఏడాదికి ఎనిమిది కోట్లకుపైగా ఆదాయం వచ్చేదని గంటా శ్రీనివాసరావు తెలిపారు.

“ఈ నిర్మాణాలను కూలదోసి, రుషికొండపై ఉన్న పచ్చదనాన్ని నాశనం చేసి నిబంధనలకు విరుద్ధంగా ఈ భవనాలను నిర్మించారు. ఈ నిర్మాణంపై కొందరు హైకోర్టుకు వెళ్లారు.

హైకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫార్సులను ఏమాత్రం లెక్క చేయకుండా ఈ నిర్మాణాలు చేపట్టారు. ఈ భవనాన్ని ఎలా వినియోగించుకోవాలి అనే అంశంపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారు” అని గంటా చెప్పారు.

రుషికొండ

ఎందుకు రహస్యంగా ఉంచామంటే: గుడివాడ అమర్నాథ్

రుషికొండపై గత మూడేళ్లుగా తెలుగుదేశం పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, అక్కడ నిర్మాణాలు సాగకుండా పర్యావరణం పేరుతో కోర్టులకు ఎక్కారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.

రాష్ట్ర ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న విశాఖ నగరానికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లు వచ్చినప్పుడు వారికి సరైన విడిది సౌకర్యం లేదని దీనిని దృష్టిలో పెట్టుకుని సదరు భవనాలను నిర్మించామని చెప్పారు.

“విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి భావించారు. ఈసారి అధికారంలోకి వస్తే ఇక్కడి నుంచే పరిపాలన సాగించాలన్న ఆలోచన కూడా చేశారు.

రుషికొండపై నిర్మించిన భవనాలు వీఐపీలు, వీవీఐపీలకు కేటాయించే అవకాశం ఉండటంతో భద్రతను దృష్టిలో పెట్టుకుని, ఇప్పటివరకు ఆ భవనాలను బహిర్గతం చేయలేదు. అయితే, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ విషయాన్ని పట్టించుకోకుండా వీటిని బహిర్గతం చేశారు” అని గుడివాడ అమర్నాథ్ అన్నారు.

2014-19 సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని పేరుతో వేల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారని అమర్నాథ్‌ వ్యాఖ్యానించారు.

రుషికొండ

అధికారికంగా సీఎం క్యాంప్ ఆఫీస్ సాధ్యం కాదు: ఎం. యుగంధర్ రెడ్డి

ప్రభుత్వం మారగానే రుషికొండ నిర్మాణాలను టీడీపీ అందరికి చూపించింది. ఈ పనిని గత ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ చేయాల్సిందని రాజకీయ విశ్లేషకుడు ఎం. యుగంధర్ రెడ్డి అన్నారు.

“ఈ భవనాల నిర్మాణం, వినియోగం విషయంలో సీఆర్‌జెడ్ నిబంధనలతో పాటు పర్యావరణం, అటవీ మంత్రిత్వ శాఖ నిబంధనలు పాటించాలి.

రుషికొండపై నిర్మించిన భవనాలు టూరిజం శాఖకు చెందినవి. వాటిని టూరిజం శాఖ ఉపయోగించుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు.

అలా కాకుండా సీఎం క్యాంప్ కార్యాలయంగానో, మరేదైనా ఆఫీసుగానో వినియోగించుకోవాలంటే కుదరదు.

టూరిజం శాఖ నుంచి అనుమతి తీసుకుని వారికి కావలసిన విధంగా వాడుకోగలరేమోగానీ, నేరుగా “ఇది సీఎం క్యాంప్ కార్యాలయం లేదా నివాసం” అని బోర్డు పెట్టి వాడుకునే అవకాశమే లేదు” అని యుగంధర్ రెడ్డి వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)