ఇల్లు కిరాయికి ఇస్తే గదుల్లో మట్టిపోసి గంజాయి సాగు చేశారు...

లండన్
ఫొటో క్యాప్షన్, చార్లెస్ రీవ్స్ ఇంటిలో గంజాయి సాగు కోసం దుండగులు 10 టన్నుల మట్టిని డంప్ చేశారు
    • రచయిత, గుయ్ లిన్, స్టీఫెన్ మీనన్
    • హోదా, బీబీసీ ఇన్వెస్టిగేషన్స్, లండన్

‘‘నేను లైట్లు వేసి చూసేసరికి, నా పడకగదిలో మూడు అడుగుల ఎత్తు మట్టి కనిపించింది. ఇంట్లోని అన్ని అంతస్థుల్లో ఇలాంటి దృశ్యాలే చూసి విస్తుపోయా’’ అని బీబీసీ బృందానికి తన ఇల్లును చూపిస్తూ చార్లెస్ రీవ్స్ చెప్పిన మాటలివి.

తన ఇంట్లో జరిగిన పరిణామాలను ఆయన ఇంకా నమ్మలేకపోతున్నారు.

రీవ్స్‌కు ఉత్తర లండన్‌లో ఒక ఇల్లు ఉంది. విదేశాల్లో పని చేసి ఇంటికి తిరిగొచ్చిన ఆయనకు తన ఇల్లు ఒక గంజాయి పొలంగా దర్శనమిచ్చింది.

ఇంట్లో అద్దెకు ఉంటామని వచ్చిన వారు, ఇంట్లో 10 టన్నుల మట్టిని డంప్ చేయడంతో పాటు తీవ్ర ఆస్తి నష్టానికి పాల్పడటంతో రీవ్స్ కుటుంబం దిగ్భ్రాంతికి గురైంది.

అద్దెకు ఉంటామంటూ వచ్చి గంజాయి సాగు చేయడం వంటి మోసాలు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు.

బీబీసీ న్యూస్ వాట్సాప్ చానల్
గంజాయి సాగు
ఫొటో క్యాప్షన్, 400 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

పని నిమిత్తం విదేశాలకు వెళ్తున్నందున తమ ఇల్లును అద్దెకిస్తామంటూ రీవ్స్ కుటుంబం ఆన్‌లైన్‌లో ప్రకటనలు ఇచ్చింది. ఇంటి యజమానులు చాలాకాలం పాటు దూరంగా ఉంటారనే విషయం తెలుసుకున్న ఒక ఎస్టేట్ ఏజెంట్ వారిని సంప్రదించారు. కిరాయిదారులుగా ఒక కుటుంబాన్ని రీవ్స్‌ ఫ్యామిలీకి పరిచయం చేశారు.

ఇంట్లోకి అద్దెకు వచ్చినవారు చివరకు స్కామర్లుగా తేలారు. వారు ఎప్పుడూ అద్దె చెల్లించకపోగా, నేర కార్యకలాపాల కోసం ఆ ఇంటిని వాడుకున్నారు. ఆ ఎస్టేట్ ఏజెంట్ ఒక నకిలీ సైట్‌ను నడుపుతున్నారని, అద్దెకు ఇంట్లోకి దిగినవారు బోగస్ అని ఆ తర్వాత తెలిసింది.

తాము చూసిన నేరాల్లో ఇది చాలా దారుణమైన కేసు అని రీవ్స్‌తో పోలీసులు చెప్పారు. ఆ ప్రాపర్టీ నుంచి పోలీసులు 400కు పైగా గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ వేల పౌండ్లలో ఉంటుంది.

గంజాయి సాగు
ఫొటో క్యాప్షన్, గంజాయి సాగు కోసం ప్రత్యేక వెంటిలేషన్ వ్యవస్థను వారు తయారు చేశారు
గంజాయి సాగు

ఇంట్లో ఉంటున్నవారు అద్దె చెల్లించకపోవడంతో రీవ్స్ ఆ ఇంటికి వెళ్లారు. ఇంట్లోకి ప్రవేశించడానికి కోర్టు ఆర్డర్ కూడా తీసుకున్నారు.

రీవ్స్ తలుపు తట్టగానే చాలామంది పురుషులు ఆయనకు కనిపించారు. అందులో ఒకరు ఇల్లు అంతా బాగానే ఉందని అన్నారు. అర్ధగంట తర్వాత వారందరూ కనిపించకుండా పోయారని, గంజాయి సాగులో వారి పాత్ర ఏంటో తనకు తెలియదని రీవ్స్ అన్నారు.

‘‘నేను చూస్తున్నదాన్ని నమ్మలేకపోయాను. గంజాయి స్మగ్లర్లు మా ఇంటి బెడ్ రూమ్‌లో 10 టన్నుల మట్టిని కుప్పగా పోశారు. ఇల్లును ఒక డ్రగ్ ఫ్యాక్టరీగా మార్చేశారు. సీలింగ్‌కు రంధ్రాలు చేశారు. ఎక్కడపడితే అక్కడ అన్నీ వైర్లు వేశారు. ఇల్లంతా దుర్వాసనే’’ అని ఇంట్లోని ప్రవేశించిన తర్వాత తాను చూసిన క్షణాలను రీవ్స్ గుర్తు చేసుకున్నారు.

గంజాయి సాగు
ఫొటో క్యాప్షన్, రీవ్స్ బెడ్ రూమ్‌లో మట్టి
గంజాయి సాగు

ఇంట్లో ఫ్యాన్లు, లైట్లు, వెంటిలేషన్ వ్యవస్థను అక్రమ విద్యుత్‌తో నడుపుతున్నట్లు రీవ్స్ గుర్తించారు. దుండగులు ఇంట్లోని విద్యుత్ వ్యవస్థను అంతా మార్చేశారని, మీటర్ పని చేయకుండా చేసి బయటి నుంచి దొంగతనంగా కరెంట్ కనెన్షన్ తీసుకున్నారని రీవ్స్ గుర్తించారు.

పై అంతస్థులో మట్టిని కుప్పగా పోయడంతో పాటు ఇల్లును నాశనం చేశారు. గంజాయి మొక్కలకు సరైన తేమ, ఉష్ణోగ్రతలు అందించడం కోసం ఇంటి సీలింగ్‌కు, గోడలకు రంధ్రాలు చేశారు.

ఇంట్లోని లైటింగ్ వ్యవస్థను నాశనం చేశారు. అద్దెకు ఉంటామంటూ వారు చేసిన మోసం, ఇల్లుకు కలిగించిన నష్టంతో రీవ్స్ కుటుంబం కుంగిపోయింది.

‘‘20 ఏళ్లుగా మేం ఈ ఇంట్లోనే ఉన్నాం. మా పిల్లలు ఇక్కడే పెరిగారు. ఇల్లును ఈ స్థితిలో చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఇది మాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం.’’ అంటూ రీవ్స్ భార్య జులియా ఉద్వేగానికి గురయ్యారు.

‘‘మా ఇల్లును అపవిత్రం చేశారు. ఇంట్లో ఎక్కడ చూసినా మురికి, ధూళి, పాడైపోయిన గోడలే కనిపిస్తున్నాయి. నాకు ఉన్న ఇల్లు ఇదొక్కటే. ఇలా చూసి తట్టుకోలేకపోతున్నాం’’ అని రీవ్స్ అన్నారు.

గంజాయి సాగు
ఫొటో క్యాప్షన్, అక్రమ విద్యుత్ సరఫరా కోసం వాడిన వైర్లు
గంజాయి సాగు

గత కొన్నేళ్లలో లండన్‌లో వెయ్యికి పైగా గంజాయి సాగు క్షేత్రాలను గుర్తించినట్లు మెట్రోపాలిటన్ పోలీసులు వెలువరించిన గణాంకాలు చూపుతున్నాయి. 2018-19 నుంచి 2022-23 మధ్య 1,056 గంజాయి సాగు క్షేత్రాలను గుర్తించినట్లు ఈ గణాంకాలు తెలుపుతున్నాయి. అయితే, ఈ గణాంకాలు ప్రస్తుతం తయారవుతున్న గంజాయి సాగు క్షేత్రాల్లో చాలా తక్కువ భాగాన్ని మాత్రమే సూచిస్తాయని నిపుణులు అంటున్నారు.

గంజాయి సాగుకు సంబంధించిన మోసాలు పెరుగుతున్నాయని మాజీ పోలీస్ అధికారి అలెన్ మోర్గాన్ అన్నారు. ఆయన ఇప్పుడు డ్రగ్ కన్సల్టెన్సీ సర్వీస్‌ను నడుపుతున్నారు.

‘‘ఈ తరహా నేరాల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. రెంటల్ మార్కెట్‌ను వాడుకుంటూ నేరస్థులు అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఈ నేరస్థులు చట్టవ్యవస్థను, ఇల్లు ఖాళీ చేయించే ప్రక్రియ (ఎవిక్షన్ ప్రాసెస్)ను తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. అద్దె చెల్లించనప్పటికీ ఇంటి నుంచి కిరాయిదారున్ని బయటకు పంపించడానికి నెలల సమయం పడుతుందని వారికి తెలుసు. ఈలోగా వారు తమ పనులను పూర్తి చేసుకొని లాభాలను ఆర్జించి అక్కడినుంచి జారుకుంటారు.’’ అని ఆయన చెప్పారు.

అద్దె ప్రాపర్టీ రంగంలో నియంత్రణ లేకపోవడంతో మోసగాళ్ల కార్యకలాపాలు సులభతరం అయ్యాయి. ఎస్టేట్ ఏజెంట్లకు ఎలాంటి అర్హతలు అక్కర్లేదు. దీనివల్ల ఇంటి యజమానులు ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకుంటున్నారు.

గంజాయి సాగు
ఫొటో క్యాప్షన్, ఇల్లు మరమ్మతులకు 20 వేల పౌండ్లకు (రూ. 21 లక్షలు)పైగా ఖర్చు అవుతుందని తెలిసి రీవ్స్ కుటుంబం నిరాశకు గురైంది
రీవ్స్ కుటుంబం

ఫొటో సోర్స్, Charles Reeves

ఫొటో క్యాప్షన్, అమెరికాకు వెళ్లడానికి ముందు నలుగురు సభ్యుల గల రీవ్స్ కుటుంబం ఈ ఇంటిలోనే సంతోషంగా జీవించింది

అంతర్జాతీయ నేర ముఠాలు నిర్వహించే గంజాయి వాణిజ్యం చిన్న స్థాయి నుంచి లక్షల పౌండ్లకు ఎదిగింది. విస్తారమైన స్థానిక మార్కెట్, రవాణా నెట్‌వర్క్ కారణంగా మాదక ద్రవ్యాల సరఫరాకు లండన్ కేంద్రంగా మారింది.

రీవ్స్ కుటుంబానికి సంబంధించిన అంశంపై ఇంకా దర్యాప్తు జరుగుతోందని పోలీసులు పేర్కొన్నారు. అయితే, లండన్‌లో పెరుగుతోన్న మాదకద్రవ్యాల సంబంధిత నేర సమస్యలకు అమాయకులైన ఇంటి యజమానులు బలి అవుతున్నారనేది వాస్తవం.

ఇలాంటి సమస్యను అందరూ షేర్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మోసాలపై అవగాహన కల్పించవచ్చని, ఇతర ఇంటి యజమానులు మోసపోకుండా కాపాడవచ్చని రీవ్స్ అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)