అఫ్గానిస్తాన్: ఆకలి, అణచివేత, పేదరికంతో అల్లాడుతోన్న ఈ దేశం క్రికెట్‌లో ఎలా సంచలనాలు సృష్టిస్తోంది?

అఫ్గానిస్తాన్ జట్టు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సంజయ్ కిశోర్
    • హోదా, సీనియర్ జర్నలిస్ట్, బీబీసీ కోసం

క్రికెట్ అనేది అనిశ్చితితో కూడిన ఆట. ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో భాగంగా కింగ్స్‌టౌన్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 21 పరుగుల తేడాతో పటిష్ట ఆస్ట్రేలియా జట్టును ఓడించి తన సత్తాను మరోసారి నిరూపించుకుంది.

అయితే, అఫ్గానిస్తాన్ సాధించిన ఈ విజయాన్ని గాలివాటమని భావించడం లేదా అనూహ్యమని పిలిస్తే అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టును తక్కువగా అంచనా వేసినట్లు కాదా?

అఫ్గానిస్తాన్ జట్టు ఈ స్థాయికి వచ్చిన పరిస్థితులు, వేగం నమ్మశక్యంగా ఉండవు.

అయితే, అఫ్గానిస్తాన్ ఇలాంటి విజయాలు సాధిస్తుందనే సంకేతాలు గత వన్డే ప్రపంచకప్‌లోనే కనిపించాయి.

తాజా మ్యాచ్‌లో రషీద్ ఖాన్ కెప్టెన్సీలో అఫ్గానిస్తాన్ జట్టు తొలిసారి ఆస్ట్రేలియాను ఓడించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
అఫ్గానిస్తాన్ జట్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో గుల్బదిన్ నైబ్ 4 వికెట్లు తీశారు

ఇరు జట్ల మధ్య నాలుగు వన్డేలు, రెండు టి20 మ్యాచ్‌లు జరిగాయి.

వన్డేల్లో అఫ్గాన్ జట్టు ఆస్ట్రేలియాపై ఎప్పుడూ నెగ్గలేదు. కానీ, టి20ల్లో ఆసీస్‌తో తలపడిన రెండో మ్యాచ్‌లోనే ఆ జట్టును ఓడించిన అఫ్గాన్ జట్టు చరిత్ర సృష్టించింది.

ఈ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌ల్లో న్యూజీలాండ్‌ను కూడా అఫ్గాన్ ఓడించింది.

2023లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లోనూ అఫ్గాన్ జట్టు ఆస్ట్రేలియాను ఓడించినంత పనిచేసింది. కానీ, ఆ మ్యాచ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ అద్భుత బ్యాటింగ్ కారణంగా ఆస్ట్రేలియా గెలిచింది.

అయితే, ఆ మ్యాచ్‌లో అఫ్గాన్ అంత తేలికగా ఓడిపోలేదనే సంగతి ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. అఫ్గానిస్తాన్‌ను ఓడించడానికి క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా పరిగణించే ఆటతీరును మ్యాక్స్‌వెల్ కనబరచాల్సి వచ్చింది.

అయితే ఈసారి అఫ్గానిస్తాన్ ఎక్కడా తగ్గలేదు. ఏ ఆస్ట్రేలియా ఆటగాడు ఈ పరాజయాన్ని తప్పించుకునేందుకు ఎలాంటి అద్భుత ఇన్నింగ్స్ ఆడలేదు.

అఫ్గానిస్తాన్ జట్టు

ఫొటో సోర్స్, Getty Images

గుర్బాజ్- జద్రాన్ భాగస్వామ్యం, నైబ్ స్పిన్

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకోగా అఫ్గాన్ తొలుత బ్యాటింగ్ చేసింది.

రహ్మనుల్లా గుర్బాజ్ 60, ఇబ్రహీం జద్రాన్ 51 పరుగులు చేయడంతో అఫ్గాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 148 పరుగులు చేసింది.

తర్వాత ఆస్ట్రేలియా జట్టు 19.2 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. గుల్బదిన్ నైబ్ 4 వికెట్లతో చెలరేగాడు. నవీన్ ఉల్ హక్ 3 వికెట్లు పడగొట్టాడు.

గ్లెన్ మ్యాక్స్‌వెల్ (59) టాప్ స్కోరర్.

అఫ్గానిస్తాన్ కచ్చితమైన బౌలింగ్‌ ముందు మ్యాక్స్‌వెల్‌ మినహా మరే ఆటగాడు కనీసం 15 పరుగులు చేయలేకపోయాడు.

2023లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్ మంచి ప్రదర్శన చేసింది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ చేతిలో 6 వికెట్లతో, దిల్లీలో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ చేతిలో 8 వికెట్ల తేడాతో అఫ్గాన్ ఓడిపోయింది.

కానీ, ఆ జట్టు నైతిక స్థైర్యం దెబ్బతినలేదు. తర్వాతి మ్యాచ్‌లో వరల్డ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను 69 పరుగులతో ఓడించిన అఫ్గాన్ ప్రకంపనలు సృష్టించింది.

ఆ తర్వాత పాకిస్తాన్‌పై గెలుపొందడం అఫ్గాన్ జట్టుకు పెద్ద ఘనతగా నిలిచింది.

అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అఫ్గాన్ క్రికెటర్లు గుర్బాజ్, జద్రాన్

హష్మతుల్లా షాహిదీ సారథ్యంలోఅఫ్గాన్ జట్టు చెన్నై వేదికగా తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించింది.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు 7 వికెట్లకు 282 పరుగులు చేసింది.

అఫ్గాన్ తరఫున తన తొలి ప్రపంచకప్ మ్యాచ్ ఆడిన 18 ఏళ్ల నూర్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టాడు.

తర్వాత 283 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే చేధించిన అఫ్గాన్ చరిత్ర సృష్టించింది.

అతి తక్కువ సమయంలోనే అఫ్గాన్ జట్టు వేగంగా అభివృద్ధి సాధించింది.

గత ప్రపంచకప్‌లో అఫ్గాన్ జట్టుకు మెంటార్‌గా ఉన్న అజయ్ జడేజా మాట్లాడుతూ, అఫ్గాన్ ఆటగాళ్లలో ఉన్న అతిపెద్ద స్పెషాలిటీ నిర్భయత్వం అని అన్నారు.

వారు ఎంతటి జట్టుతోనైనా భయం లేకుండా పోరాడగలరు అని చెప్పారు.

అఫ్గానిస్తాన్ రషీద్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అఫ్గానిస్తాన్ రషీద్ ఖాన్

తాలిబాన్ హెచ్చరికలు

అఫ్గాన్‌కు ఈ విజయం చాలా రకాలుగా ప్రత్యేకం. తాలిబాన్లకు అధికారాన్ని అప్పగించి, అమెరికా సైనికులు అఫ్గానిస్తాన్‌ను విడిచి వెళ్తున్నప్పటి ఫోటోలు ప్రపంచం దృష్టిలో ఇంకా తాజాజా ఉన్నాయి.

తాలిబాన్ల నుంచి తప్పించుకునేందుకు అఫ్గాన్ పౌరులు తమ దేశం నుంచి పారిపోయారు. కొంతమంది అమెరికా విమానం రెక్కల మీద ఎక్కి ప్రయాణించేందుకు వెనుకాడలేదు.

దేశం మానవతా సంక్షోభంలో చిక్కుకున్న ఈ సమయంలో, ప్రపంచ వేదికపై ఒంటరిగా ఉన్న ఈ కాలంలో అఫ్గాన్ ప్రజలు డబ్బు సంపాదించడం లేదా ప్రపంచ గౌరవాలను కోరుకోకూడదంటూ ఇటీవలే తాలిబాన్ అత్యున్నత నాయకుడు హెచ్చరించారు.

ఇలాంటి హెచ్చరికలు చేసినప్పటికీ అఫ్గాన్ జట్టు విజయాలు సాధించడం అభినందనీయం.

ప్రపంచ చరిత్రలో అఫ్గానిస్తాన్ పరిస్థితి చాలా భయానకంగా ఉంది.

ప్రచ్ఛన్నయుద్ధం సమయంలో దశాబ్దాల పాటు రెండు అగ్రరాజ్యాలైన అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య జరిగిన పోరుకు అఫ్గానిస్తాన్ బలైంది. నాలుగు దశాబ్దాలుగా ఆకలి, పేదరికం, నిస్సహాయత, అణచివేతలతో ఈ దేశం పోరాడుతోంది.

సహజ, మానవ విషాదాలతో పోరాడుతోన్న అఫ్గానిస్తాన్‌లో క్రికెట్ ఇప్పుడు ఒక ఆశాజ్యోతి.

క్రికెట్ విజయాల మధ్య అఫ్గాన్ ప్రజలు తమ బాధల్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతీ గెలుపు వారికి ఔషధం లాంటిది.

అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్‌లో క్రికెట్ నేర్చుకున్నా..

1979లో అఫ్గానిస్తాన్‌పై రష్యా దాడి చేసినప్పుడు లక్షలాది మంది ప్రజలు పాకిస్తాన్‌కు పారిపోయారు.

వారు శరణార్థి శిబిరాల్లో క్రికెట్ ఆడి, అక్కడే ఈ ఆటను నేర్చుకున్నారు. ఈ ప్రజలు మళ్లీ అఫ్గాన్ తిరిగి రావడంతో, వారితో పాటు క్రికెట్ కూడా ఈ దేశానికి తరలివచ్చినట్లయింది.

అనేక నిరసనలు, ఇబ్బందుల మధ్య 1995లో అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) ఏర్పడింది.

మొదట్లో తాలిబాన్లు, క్రికెట్ ఆటను నిషేధించినప్పటికీ దీనికి ఉన్న ప్రజాదరణ దృష్ట్యా 2000లో తాలిబాన్లు కూడా ఈ ఆటను అనుమతించారు.

చిన్న లీగ్‌లలో ఆడటం నుంచి టెస్ట్ హోదా సాధించే వరకు చూస్తే, అఫ్గాన్ జట్టు చాలా తక్కువ సమయంలోనే ఆటలో చాలా పురోగతి సాధించింది.

అఫ్గాన్ క్రికెట్ జట్టు వేగంగా పురోగమిస్తోంది. ఈ జట్టు 2010లో ఐసీసీ టి20 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది.

2012లో పాకిస్తాన్‌తో అఫ్గాన్ తమ మొదటి వన్డే మ్యాచ్‌ ఆడింది. ఈ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఓడింది. 2013 నాటికి అఫ్గాన్ జట్టు, ఐసీసీలో అసోసియేట్ సభ్యదేశంగా మారింది.

2017లో అఫ్గానిస్తాన్, ఐర్లాండ్ జట్లు టెస్ట్ హోదా పొందాయి. 2018లో అఫ్గాన్ తమ తొలి టెస్టును భారత్‌తో ఆడింది.

అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

క్రికెట్‌కు అత్యంత ప్రజాదరణ

అప్గానిస్తాన్‌లో గత 20 ఏళ్లలో క్రికెట్‌కు ప్రజాదరణ బాగా పెరిగింది. ఇప్పుడు అక్కడ ఎక్కువగా చూసే క్రీడ క్రికెట్. మ్యాచ్‌లో అఫ్గాన్ జట్టు గెలిస్తే దేశంలో పండుగ వాతావరణం నెలకొంటుంది.

అంతర్జాతీయ క్రికెట్‌లో అఫ్గాన్ ప్రయాణంలో భారత్, బీసీసీఐ అండగా ఉన్నాయి. అఫ్గాన్ జట్టు వన్డే, టెస్టు క్రికెట్ హోదాను పొందడంలో భారత్ కీలక పాత్ర పోషించింది.

అఫ్గాన్ జట్టుకు ఐసీసీ, ఇతర దేశాల మద్దతు కూడా అవసరం.

అఫ్గాన్‌లో క్రికెట్ మౌలిక సదుపాయాలు లేవు. ఒకే ఒక్క ప్రపంచ స్థాయి మైదానం కాబుల్‌లో ఉంది. ఇప్పటి వరకు కాబుల్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగలేదు. అఫ్గాన్ క్రికెట్ జట్టుకు భారత్ రెండో ఇల్లు.

తమ దేశంలో సౌకర్యాల కొరత కారణంగా అఫ్గాన్ జట్టు భారత్‌లోని లక్నో, గ్రేటర్ నోయిడా, డెహ్రాడూన్‌లను తమ సొంత మైదానంగా మార్చుకుంది. ప్రస్తుతం షార్జాను అఫ్గాన్ తన సొంత మైదానంగా మార్చుకుంది.

క్రికెట్ అనేది అఫ్గాన్ ప్రజల అంకితభావం, సంకల్పం, దృఢమైన స్ఫూర్తికి చిహ్నం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)