ఈ ఓడలు వేల మెగావాట్ల విద్యుత్‌ను ఎలా ఉత్పత్తి చేస్తున్నాయంటే..

ఆఫ్రికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, ఆరోన్ అకిన్యేమి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆఫ్రికాలో దాదాపు 60 కోట్ల మందికి విద్యుత్ అందుబాటులో లేదు. ఈ కొరత ఆఫ్రికా ఖండంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిణామాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

విద్యుత్‌కు డిమాండ్ పెరిగే కొద్దీ, కొన్ని దేశాలు తుర్కిష్ కంపెనీ కార్‌పవర్‌ షిప్ వంటి సాంప్రదాయేతర వనరుల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇవి వివిధ దేశాలకు ప్రయాణిస్తూ విద్యుత్‌ను అందించే నీళ్లపై తేలే 'ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్ల' సముదాయాలు.

ఇస్తాంబుల్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీకి చెందిన 40 ‘పవర్ షిప్‌లు’ ఆఫ్రికా దేశాలైన గాంబియా, ఘనా, గినియా-బిస్సావ్, ఐవరీ కోస్ట్, మొజాంబిక్, సెనెగల్, సియెర్రా లియోన్‌లతో సహా 14 దేశాలకు, దాదాపు 6 వేల మెగావాట్లకు పైగా విద్యుత్‌ను అందిస్తున్నాయి.

ఈ నౌకలు హెవీ ఫ్యూయల్ ఆయిల్, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, బయో ఫ్యూయల్‌ వంటి పలు రకాల ఇంధనాలతో నడిచే ఇంజిన్‌లతో పనిచేస్తాయి.

విద్యుత్ సబ్‌స్టేషన్ అందుబాటులో ఉన్న తీరప్రాంతాలలో వీటిని నడిపించొచ్చు. ఇవి జంక్షన్లలా పనిచేస్తాయి. ఇక్కడ సర్క్యూట్లను ఒకదానితో మరోటి అనుసంధానం చేస్తారు. దీంతో ఇక్కడ అధిక వోల్టేజ్ విద్యుత్ ప్రవహించే నెట్‌వర్క్‌ ఏర్పాటు అవుతుంది.

ఆన్‌బోర్డ్ హై-వోల్టేజ్ సబ్‌స్టేషన్ నుంచి నేరుగా ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్‌లోకి విద్యుత్ సరఫరా అవుతుంది.

బీబీసీ న్యూస్ తెలుగు
ఆఫ్రికా

ఫొటో సోర్స్, Getty Images

ఘనా

ఘనాలో, దాదాపు దశాబ్ద కాలంగా దేశం మొత్తం విద్యుత్ సరఫరాలో పావు భాగాన్ని కార్‌పవర్‌షిప్ సంస్థ ఉత్పత్తి చేస్తోంది.

ఘనా నిరంతర విద్యుత్ కోతలతో సతమతమవుతోంది. ఈ కోతలను అక్కడ ‘డంసర్‌’ అని పిలుస్తారు. ఎలక్ట్రిసిటీ కంపెనీ ఆఫ్ ఘనా (ఈసీజీ)పై సుమారు 133 వేల కోట్ల రూపాయల అప్పుల భారం ఉంది. ఈ రుణాలను తిరిగి చెల్లించలేకపోవడంతో దేశవ్యాప్తంగా విద్యుత్ సంక్షోభం నెలకొంది.

ఈసీజీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ విలియం బోటెంగ్ మాట్లాడుతూ, ఘనా పార్లమెంట్ తమకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించడానికి నిరాకరించడంతో తాము విద్యుత్ కోత విధించాల్సి వచ్చిందని అన్నారు.

"ఎవరు బకాయిలు చెల్లించకున్నా, లేదా అలాంటి ఏర్పాట్లు చేసుకోకున్నా, మా బృందం డిస్‌కనెక్ట్ చేస్తుంది" అని బోటెంగ్ అన్నారు.

ఘనా ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను పరిష్కరించడంలో తాము సాయపడుతున్నట్లు కార్‌పవర్‌షిప్ చెబుతోంది.

"ఘనాలో మా పవర్‌షిప్ 'డంసర్' లేదా కరెంట్ కోతలను చాలా తగ్గించింది. ఇది స్థానిక ప్రజల సామాజిక- ఆర్థిక పరిస్థితులపై సానుకూల ప్రభావాన్ని చూపుతోంది" అని కార్‌పవర్‌షిప్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ జైనెప్ హరేజీ అన్నారు.

"ఉదాహరణకు, విద్యుత్ కోతలు స్థానిక మత్స్యకారులకు చాలా నష్టం కలిగిస్తాయి. వాళ్లు పట్టిన చేపలను భద్రపరచాలంటే నిరంతర విద్యుత్ సరఫరా అవసరం. మా వల్ల మత్స్యకారులు చాలా ప్రయోజనం పొందారు" అని హరేజీ చెప్పారు.

ఏది ఏమైనప్పటికీ, ఇప్పటికీ విద్యుత్ కోతలు ఉన్నా, ప్రభుత్వం వాటిని నివారించడానికి ప్రయత్నిస్తోంది.

ఘనాలో మూడు జలవిద్యుత్ డ్యామ్‌లతో సహా ముఖ్యమైన సహజ విద్యుత్ వనరులు ఉన్నాయి. ఇవి ఆ దేశ మూడో వంతు విద్యుత్ అవసరాలను తీరుస్తాయి. ఘనా తీరప్రాంతంలో ఆయిల్, గ్యాస్ నిల్వలు ఉన్నా, వాటిని ఇంకా పూర్తిగా వినియోగించుకోవడం లేదు.

దేశంలోని సహజ వాయువును అందుబాటులోకి తీసుకురావడానికి జాతీయ విద్యుత్ సంస్థ కార్యకలాపాలను లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఆధారితంగా మార్చడానికి ఘనా జాతీయ విద్యుత్ సంస్థతో కలిసి పనిచేస్తునట్లు కార్‌పవర్‌షిప్ తెలిపింది. దీనివల్ల దీర్ఘకాలిక స్థిరత్వంతో పాటు, తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి అవుతుందని భావిస్తున్నారు.

సహజవాయువును వెలికితీసే ప్రదేశం నుంచి నీటిలో తేలే ఓడ వద్దకు రవాణా చేయడానికి ఈ కంపెనీ 11కి.మీ. పొడవైన పైప్‌లైన్‌ను ఉపయోగిస్తోంది. దీని వల్ల ఘనాకు నెలకు సుమారు 160 కోట్ల రూపాయలు ఆదా అవుతోందని పేర్కొంది.

"ఈ 11 కి.మీ. పైప్‌లైన్ అబోడ్జే నుంచి సెకొండి నావల్ బేస్ వరకు ఉంది. ఇక్కడే మా పవర్‌షిప్‌ నిలిచి ఉంది" అని హరేజీ చెప్పారు.

ఆమె ఇంకా మాట్లాడుతూ, “మా పవర్‌షిప్ దేశంలోని సహజ వాయువును సరఫరా చేసేందుకు పైప్‌లైన్ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి చాలా కీలకం. సముద్రతీరంలో దీర్ఘకాలికంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని గుర్తించాం. ఈ ప్రయత్నంలో మా భాగస్వాములకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తాం’’ అని అన్నారు.

తమ పవర్‌షిప్‌లలో ద్రవరూపంలోని సహజ వాయువును ఉపయోగించడం ద్వారా ఇతర రకాల శిలాజ ఇంధనాలకు పరిశుభ్రమైన ప్రత్యామ్నాయంగా నిలవడంతో పాటు విద్యుత్ గ్రిడ్‌లను స్థిరీకరించడం, సరఫరా కొరతను తగ్గించడం, కర్బన ఉద్గారాలను తగ్గించడంలలో సాయపడుతున్నట్లు కార్‌పవర్‌షిప్ చెబుతోంది.

"పర్యావరణంపై తక్కువ ప్రభావం పడేలా మా పవర్‌షిప్‌లను సమర్థవంతంగా రూపొందించాం. పర్యావరణ హితంగా ఉండేలా వాటిని వైబ్రేషన్ డంపర్‌లతో ఇన్సులేట్ చేశాం" అని హరేజీ చెప్పారు.

ఆఫ్రికా

ఫొటో సోర్స్, Getty Images

సుస్థిరత

అయితే, కార్‌పవర్‌షిప్ అందించే విద్యుత్ సుస్థిరమైన, దీర్ఘకాలిక పరిష్కారం కాకపోవచ్చని కొంతమంది విద్యుత్ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే, పవర్ షిప్‌ను లీజుకు తీసుకోవడం భూఉపరితలంపై నిర్మించే శాశ్వత పవర్ ప్లాంట్ కంటే ఖరీదైన వ్యవహారం కావొచ్చు.

"విద్యుత్ కొరతకు త్వరితమైన, సౌకర్యవంతమైన పరిష్కారాన్ని అందిస్తున్నందుకే ఆఫ్రికన్ దేశాలు ఈ పరిష్కారం వైపు మొగ్గు చూపుతున్నాయి" అని ఆఫ్రికాలోని గ్రీన్ ఎనర్జీ కంపెనీ రెన్యూవబుల్స్ సీఈవో టోనీ టియో అన్నారు.

"కానీ, ఆఫ్రికా ఇంధన సమస్యలను పరిష్కరించడానికి వాటినే కీలకమైనవిగా చూడకూడదు. ఐదేళ్ల తర్వాత, పవర్‌షిప్ చూపుతున్న పరిష్కారం, శాశ్వత పరిష్కారం కంటే ఖరీదైనది అవుతుంది. మనకు కావాల్సింది ఆఫ్రికన్ దేశాలు సౌర, వాయు, జల విద్యుత్, ఇలా భిన్నరకాల విద్యుత్ ఉత్పత్తిపై పెట్టుబడి పెట్టడం.’’

కార్‌పవర్‌షిప్ మాత్రం తమ పరిష్కారాలు భూఆధారిత ప్రత్యామ్నాయాల కంటే చౌక అని పేర్కొంది.

"అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అలాంటి పవర్ ప్లాంట్‌ను నిర్మించడం కంటే మంచి క్రేన్ సామర్థ్యాలు ఉన్న షిప్‌ యార్డ్‌లో పూర్తి నియంత్రిత వాతావరణంలో, నీటిలో తేలే పవర్ ప్లాంట్‌లను నిర్మించడం చాలా చవక" అని హరేజీ చెప్పారు.

ఆఫ్రికా

ఫొటో సోర్స్, Getty Images

విద్యుత్ బకాయిలు

ఘనా, ఇతర ఆఫ్రికన్ దేశాలలో సానుకూల ప్రభావం చూపించినట్లు కార్‌పవర్‌షిప్ చెబుతున్నా, విద్యుత్ బకాయిలు చెల్లించని కారణంగా ఈ సంస్థ కొన్ని దేశాలకు విద్యుత్ సరఫరాను నిలిపేసింది.

నిరుడు 125 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించలేకపోవడంతో కార్‌పవర్‌షిప్ సంస్థ విద్యుత్ సరఫరా నిలిపేసింది. దీంతో గినియా-బిస్సావ్‌లో దాదాపు రెండు రోజుల పాటు అంధకారం అలుముకుంది.

విద్యుత్ సరఫరా నిలిపివేత నీటి సరఫరా, ఆసుపత్రులు, మీడియా సంస్థలను ప్రభావితం చేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే రేడియో నేషనల్ ప్రసారాలను సైతం నిలిపివేయాల్సి వచ్చింది.

అయితే, ప్రభుత్వం సుమారు 50 కోట్ల రూపాయలను చెల్లించడంతో కార్‌పవర్‌షిప్ తిరిగి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించింది.

దాదాపు 330 కోట్ల రూపాయల రుణం చెల్లించని కారణంగా కార్‌పవర్‌షిప్ విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో, సియెర్రా లియోన్ రాజధాని ఫ్రీటౌన్‌ గత సంవత్సరం విద్యుత్ కోతను ఎదుర్కొంది.

కార్‌పవర్‌షిప్‌తో ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఖర్చులు దాదాపు రెండింతలు కావడంతో ఆ సంస్థతో మళ్లీ చర్చలు జరపాల్సిన అవసరం ఉందని ఆ దేశ ఇంధన శాఖ మంత్రి ఇసుఫ్ బాల్డ్ అన్నారు.

ఆఫ్రికన్ ఖండం తమ ముఖ్యమైన మార్కెట్‌లలో ఒకటి కావడం వల్ల ఆఫ్రికా దేశాలకు విద్యుత్‌ను అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని కార్‌పవర్‌షిప్ పేర్కొంది.

"మేము గాబన్ జాతీయ గ్రిడ్‌కు 150 మెగావాట్లను అందించడానికి ఆ దేశ అధికారులతో ఒప్పందాలపై సంతకం చేశాం" అని హరేజీ చెప్పారు.

"మేము ఆఫ్రికా ఖండంలోని పౌరులందరికీ విద్యుత్‌ను అందించడంలో సాయపడగలమని నమ్ముతున్నాం."

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)