లోక్‌సభ స్పీకర్ పదవి ఎందుకంత కీలకం, ఎలా ఎన్నుకుంటారు?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, అమృత దుర్వే
- హోదా, బీబీసీ ప్రతినిధి
జూన్ 24న 18వ లోక్‌సభ తొలి సెషన్ ప్రారంభం కానుంది. సమావేశ ప్రారంభంలో కొత్త ఎంపీలు ప్రమాణస్వీకారం చేస్తారు. తరువాత అత్యంత ముఖ్యమైన లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది.
అసలు లోక్‌సభ స్పీకర్‌ను ఎలా ఎన్నుకుంటారు? ఈ పదవి ఎందుకంత కీలకమైనది? ఇలాంటి సందేహాలు చాలామందిలో ఉంటాయి. ఆ సందేహాలకు సమాధానమేమిటో చూద్దాం.
బీజేపీ ఎంపీ ఓంబిర్లా 17వ లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. కానీ ఆయన పదవీ కాలం కొత్త లోక్‌సభ తొలి సమావేశాల దాకా మాత్రమే ఉంటుంది.
18వ లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్‌ను ఎన్నుకుంటారు.
పూర్తిస్థాయి స్పీకర్‌ను ఎన్నుకునే వరకు ప్రొటెం స్పీకరే సభా కార్యకలాపాలు నిర్వహించడంతోపాటు లోక్‌సభ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్నీ నిర్వహిస్తారు.
ప్రొటెం స్పీకర్‌గా సభలో అత్యంత సీనియర్ సభ్యుడిని ఎన్నుకుంటారు.
కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహక కమిటీ సభ్యుడు, కేరళలోని మావెలిక్కర నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన కొడికునిల్ సురేశ్ ఈసారి ప్రొటెం స్పీకర్ అయ్యే అవకాశం ఉంది.
సురేశ్ 8వ సారి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మావెలిక్కర నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా నాలుగుసార్లు గెలిచారు. ఎంపీగా ఆయనే సభలో అత్యంత సీనియర్.
ప్రొటెం స్పీకర్ ఎంపికలో సభ్యుడు లేదా సభ్యురాలు వయసురీత్యా సీనియారిటీ కాకుండా, లోక్‌సభ సభ్యుడు లేదా సభ్యురాలిగా సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారు.


ఫొటో సోర్స్, ANI
లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ఏంటి?
రాజ్యాంగంలోని 93వ ఆర్టికల్ ప్రకారం లోక్‌సభ స్పీకర్‌ను ఎన్నుకుంటారు.
కచ్చితంగా లోక్‌సభ ఎంపీ అయ్యుండటం తప్ప లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యే వ్యక్తికి ప్రత్యేకమైన అర్హతలు ఉండాల్సిన అవసరం లేదు.
లోక్‌సభ సభ్యుల నుంచే సభాపతిని సాధారణ మెజార్టీతో ఎన్నుకుంటారు. అంటే సభకు హాజరైన సభ్యులలో సగానికిపైగా సభ్యులు స్పీకర్ అభ్యర్ధికి ఓటు వేయాల్సి ఉంటుంది.
సహజంగా అధికార పక్షానికి చెందిన వ్యక్తే స్పీకర్‌గా ఎంపికవుతారు.
అధికార పక్షం సభలోని ఇతర పార్టీల నాయకులతో లాంఛనప్రాయంగా చర్చించి తన అభ్యర్థిని ఎంపిక చేస్తుంది.
ఒకసారి ఫలానా వ్యక్తే అభ్యర్థి అని నిర్ణయమయ్యాక, ఆ అభ్యర్థి పేరును సాధారణంగా ప్రధాని, లేదంటే పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రతిపాదిస్తారు.
లోక్‌సభ స్పీకర్ పదవి నిర్వహించడానికి ఎటువంటి అర్హతలు, షరతులు లేవుగానీ, సభాపతిగా ఎన్నికయ్యే వ్యక్తికి సభా కార్యకలాపాలపై అవగాహన ఉండాలి. అంటే సభా నియమాలు, రాజ్యాంగం,చట్టాల గురించి తెలిసి ఉండటం ముఖ్యం,
స్పీకర్ ఎన్నికయ్యాక, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు (ఒకవేళ ప్రతిపక్ష హోదా ఎవరికీ దక్కకపోతే ప్రతిపక్షంలోని అతిపెద్ద పార్టీ నాయకుడు) స్పీకర్‌ను ఆయన/ఆమె కుర్చీ వరకు తోడ్కోని వెళతారు.
లోక్‌సభ రద్దు అయినా స్పీకర్ మాత్రం, కొత్తసభ తొలిసమావేశాలు ప్రారంభమయ్యేవరకు కొనసాగుతారు.

ఫొటో సోర్స్, Getty Images
లోక్‌సభ స్పీకర్ విధులు ఏమిటి?
సభా కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడటం స్పీకర్ బాధ్యత. అందుకే ఈ పదవిని అత్యంత కీలకంగా పరిగణిస్తారు. పార్లమెంటరీ సమావేశాల అజెండాను స్పీకరే నిర్ణయిస్తారు.
సభలో ఏదైనా వివాదం ఏర్పడితే రూల్స్‌కు అనుగుణంగా స్పీకర్ చర్యలు తీసుకుంటారు.
సభలో అధికార, విపక్ష సభ్యులు ఉంటారు కనుక కార్యకలాపాల నిర్వహణలో స్పీకర్ తటస్థంగా ఉండాలని భావిస్తారు.
సభాధ్యక్షుడిగా ఏ విషయంపైనైనా స్పీకర్ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని ప్రకటించరు.
తీర్మానాలపై జరిగే ఓటింగ్‌లో సభాధ్యక్షుడు పాల్గొనరు.
కానీ ఏదైనా తీర్మానంపై ఓటింగ్ జరిగి, ఓట్లు సమానంగా వచ్చినప్పుడు స్పీకర్ ఓటు నిర్ణయాత్మకమవుతుంది.
లోక్‌సభ స్పీకర్ అనేక కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలన్నీ స్పీకర్ ఆదేశాల మేరకు పనిచేయాల్సి ఉంటుంది.
సభలో సభ్యులు అనుచితంగా ప్రవర్తిస్తే వారిని సస్పెండ్ చేసే హక్కు సభాపతికి ఉంటుంది.
2023లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో మొత్తం 141 మంది ప్రతిపక్ష సభ్యులు సభలో అనుచితంగా వ్యవహరించారనే కారణంతో సస్పెండయ్యారు.
వీరిలో లోక్‌సభ నుంచి 95మంది, రాజ్యసభ నుంచి 46 మంది సస్పెండయ్యారు.
ఈ సస్పెన్షన్ల వ్యవహారం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని ప్రతిపక్షాలు అప్పట్లో విమర్శించాయి.

ఫొటో సోర్స్, ANI
కొత్త స్పీకర్ ఎవరు?
సహజంగా అధికార పక్షానికి చెందిన ఎంపీకి స్పీకర్ పదవి, ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థికి ఉపాధ్యక్ష పదవి (డిప్యూటీ స్పీకర్) పదవి ఇస్తారు.
దేశానికి స్వతంత్ర వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా లోక్‌సభ స్పీకర్‌ను ఏకగీవ్రంగానే ఎన్నుకుంటున్నారు.
ఈసారి బీజేపీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో తెలుగుదేశం పార్టీ, జనతాదళ్ యునైటెడ్ సహకారంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అందుకే స్పీకర్ పదవిని బీజేపీ అట్టిపెట్టుకుంటుందా లేక మిత్రపక్షాలకు ఇస్తుందా అనే చర్చ నడుస్తోంది.
ప్రతిపక్షాలకు ఇచ్చే ఉపసభాపతి పదవి తమకు ఇవ్వాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తోంది.
బీజేపీకి 16,17వ లోక్‌సభలలో పూర్తి మెజార్టీ ఉంది.
16వ లోక్‌సభలో సుమిత్రా మహాజన్ స్పీకర్‌గా ఉండగా, ఏఐడీఎంకే నేత ఎం. తంబిదురై ఉపసభాపతిగా వ్యవహరించారు.
17వ లోక్‌సభలో బీజేపీకి చెందిన ఓంబిర్లా స్పీకర్‌గా ఉన్నారు. ఉపసభాపతి స్థానానికి ఎవరినీ ఎంపిక చేయకపోవడం వల్ల ఆ పదవి ఐదేళ్ళూ ఖాళీగానే ఉండిపోయింది.
లోక్‌సభలో ఈసారి ఎలాగైనా ఉపసభాపతి పదవిని దక్కించుకోవాలని ఇండియా కూటమి పట్టుదలగా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ఏళ్ళ తరబడి అధికార పక్షానికి చెందిన వ్యక్తే స్పీకర్‌గా ఎంపికయ్యే సంప్రదాయం ఉంది కానీ, కొన్నిసార్లు ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అటల్ బిహారి వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న 12వ లోక్‌సభకు తెలుగుదేశం పార్టీకి చెందిన జీఎంసీ బాలయోగి స్పీకర్‌గా వ్యవహరించారు.
తదుపరి 13వ లోక్‌సభ స్పీకర్‌గానూ ఆయనే ఎంపికయ్యారు. కానీ ఆయన పదవిలో ఉండగానే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.
బాలయోగి తరువాత శివసేన ఎంపీ మనోహర్ జోషి స్పీకర్ అయ్యారు.
ఇప్పటివరకు చరిత్రలో జీఎస్ దిల్లన్, బలరామ్ జాఖడ్, జీఎంసీ బాలయోగి వరుసగా రెండుసార్లు స్పీకర్లుగా ఎంపికయ్యారు.
వీరిలో బలరామ్ జాఖడ్ మాత్రమే స్పీకర్‌గా, 7, 8వ లోక్‌సభలలో తన పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు.
నాల్గవ లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నీలం సంజీవరెడ్డిని స్పీకర్‌గా నిర్ణయించిన తరువాత, స్పీకర్ పదవిలో ఉండే వ్యక్తి పక్షపాతం లేకుండా తటస్థంగా ఉండాలనే నియయానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
ఇక మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ తొలి ప్రభుత్వానికి సీపీఐ(ఎం) మద్దతు ఇచ్చింది. అప్పట్లో ఆ పార్టీ సీనియర్ నేత సోమనాథ్ చటర్జీకి స్పీకర్ పదవి దక్కింది.
కానీ అమెరికాతో అణుఒప్పందం వ్యవహారంపై సీపీఐ(ఎం) మన్మోహన్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది.
చటర్జీని కూడా స్పీకర్ పదవికి రాజీనామా చేయాలని సీపీఐ(ఎం) కోరింది. కానీ, ఆయన తిరస్కరించడంతో పార్టీ నుంచి తొలగించారు.
2009 నుంచి 2014వరకు 15వ లోక్‌సభ స్పీకర్‌గా మీరాకుమార్ ఎంపికయ్యారు. లోక్‌సభకు తొలి మహిళా స్పీకర్ ఆమె.
ఆమె తరువాత 16వ లోక్‌సభకు బీజేపీకి చెందిన సుమిత్రా మహాజన్ స్పీకర్ అయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
స్పీకర్‌ను తొలగించవచ్చా?
లోక్‌సభ స్పీకర్‌ను తొలగించే అధికారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 94 సభకు కల్పించింది. 14 రోజుల ముందు నోటీసు ఇవ్వడం ద్వారా సగానికి పైగా సభ్యుల మద్దతుతో చేసిన తీర్మానం ద్వారా లోక్‌సభ స్పీకర్‌ను తొలగించవచ్చు.
సగానికిపైగా సభ్యుల మద్దతు అంటే ఆరోజు సభలో హాజరైన సభ్యుల సంఖ్యలో 50% పైగా అని అర్థం.
దీంతోపాటు ప్రజాప్రాతినిథ్య చట్టంలోని 7,8 సెక్షన్ల కింద కూడా లోక్‌సభ స్పీకర్‌ను తొలగించవచ్చు.
ఒకవేళ స్పీకరే స్వచ్ఛందంగా వైదొలగానుకుంటే ఉపసభాపతికి రాజీనామా సమర్పించాలి.
ఇవి కూడా చదవండి:
- మెస్సాలినా: శృంగారంలో వేశ్యలతో పోటీపడి అపఖ్యాతి పాలైన రోమ్ సామ్రాజ్ఞి
- ముస్లిం మహిళకు ఇల్లు ఇవ్వడంపై నిరసనలు ఎందుకు?: గ్రౌండ్ రిపోర్ట్
- వోల్ఫ్ డాగ్: పుణెలో కుక్కల్లాంటి తోడేళ్లు, ఈ సంకరజాతి జంతువుల వల్ల రాబోయే ప్రమాదం ఏంటి?
- మెదక్: బక్రీద్ సందర్భంగా ఇక్కడ జరిగిన గొడవేంటి? ఎందుకు జరిగింది?
- Morning Walk: ఉదయాన్నే నడవాలని ఎందుకు చెబుతారు? సాయంత్రం, రాత్రి వేళల్లో నడిస్తే ఏం జరుగుతుంది? ఇది నిద్రవేళలను ఎలా ప్రభావితం చేస్తోంది?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














