స్విట్జర్లాండ్: శ్రమ దోపిడీ కేసులో హిందూజా కుటుంబంలో నలుగురికి జైలు శిక్ష

ఫొటో సోర్స్, EPA
- రచయిత, ఇమోజెన్ ఫౌల్కెస్
- హోదా, బీబీసీ జెనీవా కరస్పాండెంట్
శ్రమదోపిడీ కేసులో ఆరోపణలు రుజువుకావడంతో బ్రిటన్‌లోని అత్యంత సంపన్న కుటుంబాలలో ఒకటైన హిందూజా కుటుంబంలోని నలుగురి సభ్యులకు కోర్టు జైలు శిక్ష విధించింది.
జెనీవాలోని తమ బంగ్లాలో పనిచేయడానికి భారత్ నుంచి సేవకులను పిలిపించుకుని, వారికి పనికి తగిన వేతనం ఇవ్వక శ్రమదోపిడీకి పాల్పడినట్టు హిందూజా కుటుంబంపై అభియోగాలు నమోదయ్యాయి.
ప్రకాశ్ హిందూజా, కమల్ హిందూజాతో పాటు వారి కుమారుడు అజయ్, ఆయన భార్య నమ్రతలను శ్రమ దోపిడీ, అక్రమ ఉపాధి కేసులో దోషులుగా నిర్ధరించిన స్విట్జర్లాండ్ కోర్టు నాలుగు నుంచి నాలుగున్నరేళ్ల వరకు జైలు శిక్ష విధించింది.
అయితే అత్యంత తీవ్రంగా పరిగణించే మానవ అక్రమ రవాణా కేసులో వారు నిర్దోషులుగా తేలారు.
కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళతామని ప్రతివాదుల తరపు న్యాయవాది చెప్పారు.
అనారోగ్య కారణాల వల్ల ప్రకాశ్ హిందూజా, కమల్ హిందూజా కోర్టుకు హాజరు కాలేదు. అజయ్, నమ్రతా హాజరైనప్పటికీ తీర్పు వెలువరించే సమయంలో వారు అక్కడ లేరు.
ప్రకాశ్ హిందూజా, కమల్ హిందూజా దంపతులకు ఒకొక్కరికి నాలుగేళ్ళ 6 నెలల జైలుశిక్ష , అజయ్, ఆయన భార్య నమ్రతకు నాలుగేళ్ళ జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పినట్టు ‘ది హిందూ’ కథనం పేర్కొంది.
కిందటివారం హిందూజా కుటుంబం ముగ్గురు సేవకులతో కోర్టు బయట ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో ఎంత మొత్తం చెల్లించారనే విషయంపై స్పష్టత లేదు.
అయినా అభియోగాలలోని తీవ్రత దృష్ట్యా కేసును కొనసాగించాలని ప్రాసిక్యూషన్ నిర్ణయించినట్టు ది హిందూ కథనం తెలిపింది.

ఏం జరిగింది?
హిందూజా కుటుంబానికి జెనీవా నగరం సమీపంలోని కొలోగ్నీలో ఓ విల్లా ఉంది. తమ పిల్లల సంరక్షణకు, ఇంటి పని కోసం భారత్ నుంచి పనివాళ్ళను తీసుకురావడంపై వీరి మీద అభియోగాలు నమోదయ్యాయి.
ప్రకాశ్, కమల్ హిందూజాతోపాటు వారి కుమారుడు అజయ్, ఆయన భార్య నమ్రత.. భారత్ నుంచి వచ్చిన సిబ్బంది పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారని, రోజూ 18 గంటలు పని చేయిస్తూ, వారికి రోజుకు అతితక్కువ మొత్తం 8 డాలర్లు (667 రూపాయలు) చొప్పున మాత్రమే చెల్లించారని, ఇల్లు వదిలి వెళ్లేందుకు వారికి పరిమితంగా అనుమతిచ్చేవారనే ఆరోపణలు ఉన్నాయి.
అయితే, తమపై వచ్చిన ఆరోపణలను హిందూజాలు ఖండించారు.
హిందూజా కుటుంబం, తమ కుక్క కోసం ఏడాదికి 10 వేల డాలర్లు (ప్రస్తుత మారక విలువ ప్రకారం సుమారు 8 లక్షల 30 వేల రూపాయలు) ఖర్చు చేసిందని, పనివాళ్లకు వారు చెల్లించినట్లు చెబుతున్న రోజువారీ వేతనంతో పోల్చి చూపారు జెనీవాలో ప్రముఖ న్యాయవాది వైవ్స్ బెర్టోస్సా.
అయితే, అత్యల్ప వేతనాలు ఇచ్చారనే ఆరోపణలను హిందూజాల న్యాయవాది నేరుగా తోసిపుచ్చలేదు, కానీ ఆ విషయాలను సందర్భోచితంగా చూడాలని, వారు తమ సిబ్బందికి వసతి, భోజన సదుపాయాలు కల్పించారని చెప్పారు.
ఎక్కువ పనిగంటల ఆరోపణలపై కూడా డిఫెన్స్ న్యాయవాది వాదించారు. హిందూజా పిల్లలతో కలిసి సినిమా చూడటాన్ని నిజమైన పనిగా లెక్క కట్టలేమని అన్నారు.
కొంతమంది మాజీ సిబ్బంది హిందూజా కుటుంబం ఎంతో స్నేహపూర్వకంగా ఉండేదని, వారు తమను గౌరవంగా చూసుకునేవారని సాక్ష్యమిచ్చారు.
పనివాళ్ళ పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకోవడం, అనుమతి లేకుండా ఇల్లు విడిచి వెళ్లకూడదనే విషయాలను స్విట్జర్లాండ్‌లో తీవ్రమైన అభియోగాలుగా పరిగణిస్తారు. వీటిని మానవ అక్రమ రవాణాగా పరిగణిస్తారు.
నిందితులకు జైలు శిక్ష విధించాలని, బాధితులకు మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని, దాంతోపాటు లీగల్ ఫీజులు కూడా చెల్లించాలని న్యాయవాది బెర్టోస్సా వాదించారు.
చమురు, గ్యాస్, బ్యాంకింగ్ రంగాలలో వ్యాపారాలు చేసే బహుళజాతి సంస్థ హిందూజా గ్రూప్ హిందూజా కుటుంబానిదే. ఆ కుటుంబానికి లండన్‌లో రాఫెల్స్ హోటల్ కూడా ఉంది.
జెనీవా చీకటి కోణం
పలు ప్రముఖ అంతర్జాతీయ సంస్థలకు చిరునామాగా, సంపన్నులకు కేంద్రంగా ఉండే జెనీవా.. పనివాళ్లను అగౌరవంగా చూసే విషయాలు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు.
లిబియా మాజీ నియంత మువమ్మర్ గడాఫీ కుమారుడు హన్నీబాల్ గడాఫీని 2008లో జెనీవాలోని ఫైవ్ స్టార్ హోటల్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. హన్నీబాల్ గడాఫీ, ఆయన బార్య తమ పనివాళ్లను కోటు హ్యాంగర్లతో తీవ్రంగా కొడుతున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. తరువాత ఆ కేసును ఉపసంహరించుకున్నారు.
ఆ ఘటనకు ప్రతీకారంగా ట్రిపోలీలో ఇద్దరు స్విట్జర్లాండ్ పౌరులను అరెస్ట్ చేయడం స్విట్జర్లాండ్, లిబియా మధ్య దౌత్య వివాదానికి కారణమైంది.
జెనీవాలోని అమెరికా దౌత్య కార్యాలయాలు ఏళ్ళ తరబడి తమకు జీతాలు చెల్లించడం లేదంటూ ఫిలిప్పీన్స్‌కు చెందిన నలుగురు కేసు వేశారు.
ప్రస్తుత హిందూజాలా హైప్రొఫైల్ కేసు మరోసారి ‘శాంతి నగరంగా’ పిలుచుకునే జెనీవాలోని చీకటి కోణాన్ని చూపుతోంది.
ఇవి కూడా చదవండి:
- రుషికొండ ‘రహస్య’ భవనాల్లో ఏముందంటే?
- మెదక్‌లో ఉద్రిక్తత: ‘మేం ఏం తప్పు చేశామని మా హాస్పిటల్‌పై దాడి చేశారు?’
- ‘స్త్రీ తన వస్త్రాలతో పాటు సిగ్గును కూడా విడిచేయాలి’ - సెక్స్ గురించి ప్రాచీన కాలంలో మహిళలు ఎలా చర్చించుకునేవారు?
- అపాయంలో ఉపాయం: ఎడారిలో సింహాలబారి నుంచి తప్పించుకున్న ఇద్దరు స్నేహితురాళ్ళ కథ...
- సన్‌స్క్రీన్ లోషన్లు వాడుతున్నారా, ఈ ఎనిమిది విషయాలు తెలుసుకోండి...
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














