సుసన్నా హెర్బర్ట్: ‘మా తాత కాలంలో జరిగిన వాటికి సిగ్గు పడుతున్నా’ అని ఈమె ఎందుకు అంటున్నారు?

సుసన్నా హెర్బర్ట్ Susannah Herbert
    • రచయిత, కవిత పూరి
    • హోదా, ప్రజెంటర్, బీబీసీ థ్రీ మిలియన్ పాడ్‌కాస్ట్

1943లో బెంగాల్‌లో 30 లక్షల మందికి పైగా ఆకలితో అలమటించి చనిపోయారు. దానినే బెంగాల్ క్షామం అంటారు.

అయితే, అంతమంది ప్రాణాలు తీసిన నాటి దుర్భిక్ష పరిస్థితులకు కారణమైన కీలక వ్యక్తుల్లో తన తాత కూడా ఉండటం దురదృష్టకరమని, అది తలచుకుంటేనే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోందని సుసన్నా హెర్బర్ట్ అంటున్నారు.

కరువు రోజుల నాటికి జాన్ హెర్బర్ట్ బెంగాల్‌ గవర్నర్‌గా పని చేస్తున్నారు. ఆయన సుసన్నా తాత (నాన్న తండ్రి).

బ్రిటిష్ వలస పాలనలో గవర్నర్లు అత్యంత కీలకంగా ఉండేవారు.

నాటి ఘోర పరిస్థితుల వెనుక తన తాతకు కీలక పాత్ర ఉందన్న విషయాలను సుసన్నా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు.

నేను ఆమెను తొలిసారి కలిసినప్పుడు, 1940లో క్రిస్మస్ రోజు బెంగాల్‌లోని గవర్నర్ బంగ్లాలో తీసిన ఫోటోను ఆమె చూపించారు. ఆ చిత్రంలో ఉన్నవారంతా సూట్లు, బూట్లు వేసుకుని, వరుసలుగా నిలబడి కెమెరాకు పోజిచ్చారు.

బ్రిటిష్ వలసపాలనలో అత్యంత కీలకమైన వ్యక్తుల్లో ఒకరైన వైస్రాయ్ లిన్‌లిత్‌గో తోపాటు బెంగాల్ గవర్నర్, సుసన్నా తాత సర్ జాన్ హెర్బర్ట్ ముందు వరుసలో నిలబడ్డారు. వారి ముందు తెల్లని షర్ట్, నిక్కరు, మోకాళ్ల దాకా సాక్సులు, మెరిసే బూట్లు ధరించిన చిన్న బాలుడు కూర్చున్నారు. ఆయన సుసన్నా తండ్రి.

బ్రిటిష్ ఇండియాలో పరిస్థితులను తన తండ్రి ఆమెకు చాలానే వివరించారు. కానీ, 1943 చివర్లో చనిపోయిన తన తాత గురించి, ఆయన తీసుకున్న నిర్ణయాల గురించి మాత్రం ఆమెకు పెద్దగా తెలియదు.

బెంగాల్‌ క్షామానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో క్లిష్టమైనవి కూడా ఉన్నాయి.

అప్పుడు బ్రిటిష్ వారి పాలనా వ్యవస్థ ఎలా ఉండేదంటే.. బెంగాల్‌లో పరిస్థితుల గురించి అక్కడి గవర్నర్ దిల్లీలోని నాయకత్వానికి చెప్పాలి. అక్కడి నుంచి ఆ సమాచారం లండన్‌కు వెళ్లేది.

బెంగాల్ క్షామంతో అప్పటి గవర్నర్‌‌ జాన్ హెర్బర్ట్‌కు ప్రత్యక్ష సంబంధం ఉంటుందని, ఎందుకంటే, అప్పుడు ఆ ప్రాంత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆయనేనని చరిత్రకారుడు, ‘హంగ్రీ బెంగాల్’ పుస్తకం రచయిత డాక్టర్ జానమ్ ముఖర్జీ చెప్పారు.

బీబీసీ తెలుగు వాట్సాప్ చానల్
గవర్నర్ జాన్ హెర్బర్ట్ ఫొటో

ఫొటో సోర్స్, Susannah Herbert

ఫొటో క్యాప్షన్, 1940 నాటి ఫొటో

బెంగాల్ క్షామానికి కారణం ఏంటి?

బెంగాల్‌లో అంత ఘోరమైన పరిస్థితులు తలెత్తడానికి కారణమేంటన్నది ఒక్కమాటలో చెప్పలేం. దాని వెనుక అనేక క్లిష్టమైన అంశాలు ఉన్నాయి.

అది రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలం. అప్పుడు తూర్పు భారత భూభాగం మీదకు జపాన్ దండెత్తుతుందేమోనని బ్రిటీష్ పాలకులు ఆందోళనపడ్డారు. అందుకే, ఆ ప్రాంతంలో ప్రత్యేక ఆంక్షలు విధించారు.

బెంగాల్‌‌లో గవర్నర్‌గా ఉన్న జాన్ హెర్బర్ట్ ‘నిరాకరణ’(Denial ఎవరికీ ఏదీ అందకుండా చేయడం) విధానాన్ని అమలు చేశారు. దీనివల్ల బెంగాల్‌లోని వేలాది గ్రామాల్లో ఉన్న బియ్యాన్ని, సరకు రవాణా చేసే పడవలను ఎక్కడికక్కడ జప్తు చేశారు. కొన్నింటిని ధ్వంసం చేశారు. అలా చేయడం వెనకున్న ఉద్దేశం ఏమిటంటే.. తూర్పు తీరప్రాంతంపైకి దండెత్తి వచ్చే సైనికులకు ఎలాంటి ఆహారం దొరక్కుండా చేయడం.

దాంతో, అప్పటికే కుదేలైన స్థానిక ఆర్థిక వ్యవస్థ మరింత అస్తవ్యస్థంగా మారింది. బియ్యం ధరలు అమాంతం పెరిగిపోయాయి. సామాన్యులకు ఆహార పదార్థాలు దొరకడమే కష్టమైపోయింది. మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలో అడుగుపెట్టలేకపోయారు. రైతులు పొలాల్లో పనిచేసుకోలేకపోయారు. చేతి వృత్తులు చేసుకునేవారు మార్కెట్‌ నుంచి సరుకులు తెచ్చుకునే వీలులేకుండాపోయింది.

అంతకుముందే బర్మా (మియన్మార్)పై జపాన్ దండెత్తింది. దీంతో, బర్మా నుంచి బియ్యం దిగుమతులు ఆగిపోయాయి. పైగా కలత్తాలో వేలమంది బ్రిటిష్ మిత్రరాజ్యాల సైనికులతోపాటు యుద్ధానికి సంబంధించిన పరిశ్రమలలో పనిచేసే కార్మికులు ఉండటంతో ఆహార పదార్థాలకు డిమాండ్ పెరిగింది.

యుద్ధం కారణంగా ద్రవ్యోల్బణం అమాంతం పెరగడంతో బియ్యం ధరలు ఆకాశాన్నంటాయి. దీనివల్ల అప్పటికే తీవ్రమైన దుర్బిక్ష పరిస్థితులతో అల్లాడుతున్న ప్రజలకు బియ్యం పూర్తిగా అందుబాటులో లేకుండా పోయాయి.

కొందరు ఆహార భద్రత పేరుతో లాభాలు ఆర్జించేందుకు బియ్యం నిల్వ చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. దీనికి తోడు, 1942 అక్టోబరులో వచ్చిన తుపాను వరి పంటల తుడిచి పెట్టింది. ఆ తరువాత చాలా కాలంపాటు పంటలకు చీడపీడలు కొనసాగాయి.

మరోవైపు, యుద్ధం జరుగుతున్న సమయంలో ఆహార ధాన్యాలు కావాలని పదేపదే కోరినా నాటి బ్రిటిష్ వార్ క్యాబినెట్, ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ సరిపడా ఆహార ధాన్యాలను పంపలేదనే విమర్శలు ఉన్నాయి.

ఫలితంగా లక్షల మంది ఆకలితో అలమటించి చనిపోయారు.

Herbert family

ఫొటో సోర్స్, Herbert family

ఫొటో క్యాప్షన్, బెంగాల్ క్షామానికి తన తాత విధానాలు కూడా కారణమయ్యాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని సుసన్నా అన్నారు.

‘ఆ విషయాలు తెలిశాక అసహ్యమేస్తోంది’

బ్రిటిష్ ఇండియా సామ్రాజ్యంతో తమ కుటుంబానికి అనుబంధం ఉండటాన్ని తన చిన్నతనంలో గొప్పగా భావించేదాన్నని, ఈ విషయాలన్నీ తెలిశాక అసహ్యమేసిందని సుసన్నా అన్నారు.

తన తాత వాడిన దుస్తులు, కండువాలపై ‘మేడ్ ఇన్ బ్రిటిష్ ఇండియా’ అనే ట్యాగ్‌ ఉండేదని, అలాంటి దుస్తులను ఎంతో ఇష్టపడి సేకరించేదాన్నని ఆమె చెప్పారు. కానీ, ఇప్పుడు కప్‌బోర్డులో వాటిని చూడబుద్ధి కూడా కావడంలేదని ఆమె అంటున్నారు.

తన తాత బ్రిటిష్ ఇండియాలో ఇంకా ఏం చేశారన్నది మరింత లోతుగా తెలుసుకోవాలనుకుంటున్నానని ఆమె చెప్పారు.

అందుకే ఆమె బెంగాల్ క్షామం గురించి తెలిపే అనేక పుస్తకాలను, పత్రికలను, పత్రాలను చదువుతున్నారు. వేల్స్‌లో వారి కుటుంబం ఒక ప్రత్యేక గదిలో అరుదైన పత్రాలను భద్రపరిచారు. వాటన్నింటినీ ఇప్పుడు ఆమె తిరగేస్తున్నారు.

బెంగాల్ క్షామం అంత తీవ్రరూపం దాల్చడం వెనుక తన తాత అమలు చేసిన విధానాలు కీలక పాత్ర పోషించాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని ఆమె అంటున్నారు.

‘‘ఆయన మంచి నైపుణ్యాలు, గౌరవం ఉన్న వ్యక్తి. ఆయన్ను బ్రిటిష్ రాజ్యంలోని ఒక మూలన ఆరు కోట్ల మంది ప్రజలను పాలించే పోస్టులో నియమించకుండా ఉంటే బాగుండేది. ఆయనకు ఆ గవర్నర్ పదవి ఇవ్వకుంటే బాగుండేది’’ అని సుసన్నా అన్నారు.

మేడ్ ఇన్ బ్రిటిష్ ఇండియా

ఫొటో సోర్స్, Herbert family

దశాబ్దాల కిందటి పత్రాలను తిరగేస్తుండగా, 1939లో తన నానమ్మ లేడీ మేరీ, ఆమె భర్త, తన తాత అయిన జాన్ హెర్బర్ట్‌కు రాసిన ఉత్తరం సుసన్నా‌కు దొరికింది. హెర్బర్ట్‌కు గవర్నర్ పోస్ట్ ఇచ్చారని తెలిసినప్పుడు ఆమె ఆ లేఖ రాశారు. అప్పుడు, ఆ పదవి పట్ల తమకు పెద్దగా ఆసక్తి లేదన్న విషయాన్ని అందులో వ్యక్తం చేశారు. కానీ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి దానిని స్వీకరించాలని లేడీ మేరీ తన భర్తకు సూచించారు.

నాటి పరిస్థితుల గురించి మరింత లోతుగా తెలుసుకునేందుకు ‘హంగ్రీ బెంగాల్’ పుస్తకం రచయిత జానమ్ ముఖర్జీని సుసన్నా కలిశారు.

జాన్ హెర్బర్ట్ మనుమరాలితో ముఖాముఖిగా చర్చిస్తానని తాను అసలు ఊహించలేదని జానమ్ అన్నారు.

తన తాత యువకుడిగా ఉన్నప్పుడు దిల్లీలో చిన్న అధికారిగా మాత్రమే పనిచేశారని, ఆయనకు భారత రాజకీయాల్లో ఎలాంటి అనుభవం లేకపోయినా, ఆయన్ను కీలకమైన రాజకీయ పదవి (గవర్నర్‌ పదవి)ని ఎందుకు అప్పగించారన్నది సుసన్నా తెలుసుకోవాలనుకుంటున్నారు.

అయితే, బ్రిటిష్ వలసపాలకుల ఆధిపత్య ధోరణికి హెర్బర్ట్ నియామకం ఒక ఉదాహరణ అని జానమ్ ముఖర్జీ అన్నారు.

బ్రిటన్ వెలుపల అధికారుల నియామకాలలో ఒక విధానం అంటూ ఉండేది కాదనీ, రాజకీయాలపై అవగాహన, అనుభవం లేకున్నా, స్థానిక భాష రాకపోయినా... ఎక్కడి నుంచో అధికారులను తీసుకొచ్చి కోల్‌కతా లాంటి సుదూర ప్రాంతాల్లో కోట్ల మందిని పాలించే బాధ్యతలను అప్పగించేవారని ఆయన వివరించారు.

నిజానికి, భారత రాజకీయాల్లో పెద్దగా గుర్తింపు లేని హెర్బర్ట్ పాలనా సామర్థ్యాల పట్ల, అప్పటి వైస్రాయ్ లిన్‌లిత్‌గో సహా చాలామంది అనుమానం వ్యక్తం చేశారు.

‘‘భారత్‌లో అత్యంత బలహీమైన గవర్నర్ హెర్బర్ట్ అని వైస్రాయ్ లిన్‌లిత్‌గో అనేవారు. ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించాలని కూడా అనుకున్నారు. కానీ, అలా చేస్తే ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయోనని వెనక్కి తగ్గారు’’ అని జానమ్ చెప్పారు.

‘‘అలా మా తాత గురించి, నాటి పరిస్థితుల గురించి జానమ్ ఎన్నో విషయాలను చెప్పారు’’ అని సుసన్నా తెలిపారు.

బెంగాల్ క్షామం

ఫొటో సోర్స్, Getty Images

నాటి దుర్భిక్షం కారణంగా 30 లక్షల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అంతమంది చనిపోతే, వారి కోసం ఎలాంటి స్మారకాలు నిర్మించ లేదు, మ్యూజియాలు లేవు, కనీసం ఓ ఫలకం కూడా లేదు.

కానీ, హెర్బర్ట్‌ను జ్ఞాపకాలను గుర్తు చేసేందుకు మాత్రం ఒక చర్చిలో శిలాఫలకం ఉంది. కోల్‌కతాలో ఆయన సమాధి ఎక్కడ ఉందన్నది మాత్రం తనకు తెలియదని సుసన్నా చెప్పారు.

ఆమె తన తాత వైఫల్యాలను అంగీకరిస్తూనే, ఆయన గురించి మాట్లాడేటప్పుడు గౌరవం అనే పదాన్ని సుసన్నా వాడారు.

నాటి పరిస్థితుల గురించి తాను తెలుసుకున్న విషయాలను తన కుటుంబంలోని ఇతరులతోనూ పంచుకోవాలని ఆమె అనుకుంటున్నారు. అయితే, తన అభిప్రాయాలను వారు ఎలా అర్థం చేసుకుంటారన్నది ఆమెకు తెలియట్లేదు.

వేల్స్‌లోని తన కుటుంబానికి చెందిన భవనంలో భద్రపరిచిన పత్రాలను పరిశోధించేందుకు తన పిల్లల సాయం కూడా తీసుకోవాలని ఆమె అనుకుంటున్నారు.

తనలాగే తన పిల్లలకు కూడా గతాన్ని పరిశోధించాలనే ఆసక్తి ఉందని ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)