ప్రపంచవ్యాప్తంగా వడగాలులు, కరవులు, వరదలు తీవ్రమవడానికి కారణమదేనా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మార్క్ పాయింటింగ్, ఎస్మే స్టాలార్డ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
గత నెలరోజులుగా దిల్లీ, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ సహా ఉత్తర, మధ్య భారతంలో భరించలేనంత ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
మంగళవారం దిల్లీలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇంత తీవ్రమైన ఎండలను ఎప్పుడూ చూడలేదని దిల్లీ వాసులు చెబుతున్నారు. మరోవైపు, సిక్కిం, అస్సాం రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వేల మంది నిరాశ్రయులయ్యారు.
భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగానూ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి.
అమెరికాలోనూ చాలా ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 41 డిగ్రీల సెల్సియస్ వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దీంతో, పలు ప్రాంతాల్లో వాతావరణ అధికారులు హీట్‌వేవ్ హెచ్చరిక జారీ చేశారు.
వాతావరణ మార్పుల ఫలితంగానే ఇలా జరుగుతోందా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?


ఫొటో సోర్స్, Reuters
1. భారీ వర్షాలు
సగటు ఉష్ణోగ్రతలో ప్రతి 1 డిగ్రీ సెల్సియస్ పెరుగుదలకు, వాతావరణంలో 7 శాతం తేమ పెరుగుతుంది. దీని కారణంగా భారీ వర్షాలు కురిసే వీలుంటుంది. కొన్నిసార్లు తక్కువ వ్యవధిలో, చిన్న ప్రాంతంలోనూ కుండపోత వర్షం కురవొచ్చు.
ఐక్యరాజ్య సమితి వాతావరణ సంస్థ, ఐపీసీసీ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మానవ కార్యకలాపాల వల్ల అనూహ్యంగా భారీ వర్షాలు పడటం, వరదలు ముంచెత్తడం లాంటి సమస్యలు పెరుగుతున్నాయి. భూమి వేడెక్కుతున్న కొద్దీ ఈ ట్రెండ్ కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు.
2024 ఏప్రిల్‌లో దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఒమన్‌లలో కురిసిన భారీ వర్షాల విషయంలో వాతావరణ మార్పు ఎంత మేరకు ప్రభావం చూపించిందో ఖచ్చితంగా నిర్ధారించడం కష్టం. ఈ ప్రాంతంలో భారీ వర్షాలు చాలా అరుదు, కాబట్టి పోల్చడానికి గత సంఘటనలు తక్కువ.
కానీ ఈ రకమైన సంఘటనలు 10-40 శాతం పెరిగాయి. దీనికి వాతావరణ మార్పులే కారణమని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ (డబ్ల్యూడబ్ల్యూఏ) చెబుతోంది.

2024 మేలో దక్షిణ బ్రెజిల్‌లో భారీ వర్షాలు కురిశాయి. భారీ వరదలు ముంచెత్తాయి. దాంతో, సుమారు 1,50,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
అది ఉష్ణమండల, ధ్రువ వాయు ద్రవ్యరాశి (పోలార్ ఎయిర్ మాస్)లు కలిసే ప్రాంతం కాబట్టి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
"ఈ పరస్పర చర్యలు వాతావరణ మార్పులతో తీవ్రమయ్యాయి" అని వాతావరణ నిపుణులు ఫ్రాన్సిస్కో ఎలిసియు అక్వినో ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో చెప్పారు.
2023 సెప్టెంబర్‌లో ఉత్తర లిబియాలో కురిసిన భారీ వర్షం తీవ్రమైన వరదలకు దారితీసింది. అయితే, వాతావరణ మార్పుల కారణంగానే ఇది అక్కడ 50 రెట్లు ఎక్కువగా ప్రభావం చూపిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP
2. వేడి, వడగాలులు
సగటు ఉష్ణోగ్రతలలో చిన్న పెరుగుదల కూడా తీవ్రమైన వేడిని వ్యాప్తి చేస్తుంది.
2024 ఏప్రిల్‌లో ఆఫ్రికాలోని సహెల్ ప్రాంతంలోని మాలిలో ఉష్ణోగ్రతలు 48.5 డిగ్రీల సెల్సియస్‌కి చేరుకున్నాయి. విపరీతమైన వడగాలులు వీచాయి. వడదెబ్బతో అనేక మంది ఆసుపత్రిలో చేరారు. పలువురు ప్రాణాలు కోల్పోయారు.
డబ్ల్యూడబ్ల్యూఏ ప్రకారం.. ఈ విపత్కర వాతావరణ మార్పుల వెనుక మానవ ప్రమేయం ఉంది. అందుకే వేడి ఇంతగా పెరిగిపోతోంది. ప్రపంచం వేడెక్కే కొద్దీ ఇలాంటి విపత్కర పరిస్థితులు కొనసాగుతాయి.

ఫొటో సోర్స్, US EPA
యూకేలో ఉష్ణోగ్రతలు మొదటిసారిగా 2022 జులైలో 40 డిగ్రీల సెల్సియస్‌ను మించిపోయాయి. వాతావరణ మార్పు లేకుండా ఇది అసంభవమని డబ్ల్యూడబ్ల్యూఏ అంటోంది.
యూకే సహా చాలాచోట్ల వడగాలులు ఎక్కువయ్యాయి. అధిక పీడనం ఉన్న హీట్ డోమ్‌ల కారణంగా ఇది జరుగుతుంది. ఇవి వేడి గాలిని కిందికి నెట్టివేసి దానిని ట్రాప్ చేస్తాయి, దీనివల్ల ఆయా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
ఆర్కిటిక్‌లో అధిక ఉష్ణోగ్రతలు ప్రపంచ సగటు కంటే దాదాపు నాలుగు రెట్లు వేగంగా వేడెక్కడం వల్ల ‘జెట్ స్ట్రీమ్’ అని పిలిచే బలమైన గాలులు నెమ్మదిస్తున్నాయని, ఇది హీట్ డోమ్స్ ఎక్కువవడానికి దారితీస్తుందని ఒక సిద్ధాంతం ఉంది.
కాలిఫోర్నియా, నెవాడా, ఉటా, అరిజోనాలోని 3.4 కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేసే హీట్ డోమ్ ఈ వారంలో పశ్చిమ అమెరికాను తాకుతుందని భావిస్తున్నారు.
ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 10 నుంచి 20°F (5.5-11°C) ఎక్కువగా ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది కార్చిచ్చులకు దారితీసి మానవ ఆరోగ్యానికి, పర్యావరణానికి హాని కలిగిస్తుందని భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
3. కరవులు
వాతావరణ మార్పును కొన్ని ప్రాంతాల్లో సంభవించే కరవులతో అనుసంధానించడం కష్టం. నీటి లభ్యతలో కేవలం ఉష్ణోగ్రత, వర్షపాతమే కాదు సహజ వాతావరణ వ్యవస్థలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. 2024 ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో కరవు సంభవించినప్పుడు ఇలాంటి పరిస్థితే తలెత్తింది.
అయితే, వాతావరణ మార్పు.. నేల ఎండిపోయేలా వేడి గాలులను సృష్టించడం ద్వారా కరవును మరింత తీవ్రతరం చేస్తుంది. అంతేకాదు ఇది పైన ఉన్న గాలిని వేగంగా వేడెక్కేలా చేస్తుంది. అది వేడి మరింత పెరిగేందుకు దారి తీస్తుంది.
వేడి వాతావరణంలో ముఖ్యంగా పంటలకు నీటి డిమాండ్ భారీగా పెరుగుతుంది. నీరు చాలక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంటుంది.
తూర్పు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో 2020, 2022ల మధ్య వరుసగా ఐదు వర్షాకాలాల్లో వర్షపాతం భారీగా తగ్గింది. ఇది గత 40 సంవత్సరాలలో ఎన్నడూ చూడనంత తీవ్రమైన కరవు ఏర్పడేలా చేసింది. దీంతో ఒక్క సోమాలియాలోనే 12 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. డబ్ల్యూడబ్ల్యూఏ ప్రకారం, వాతావరణ మార్పు వల్ల ఇలాంటి కరవులు కనీసం 100 రెట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది.
2023 ద్వితీయార్థంలో అమెజాన్ వర్షారణ్యాలలో 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కరవు ఏర్పడడానికి మానవ ప్రమేయంతో భూమి వేడెక్కడం కూడా ప్రధాన కారణం.

4. కార్చిచ్చులు..
ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో కార్చిచ్చులు చెలరేగుతాయి. అయితే, ఫలానా చోట సంభవించిన కార్చిచ్చుకు వాతావరణ మార్పు కారణమైందని, లేదా కార్చిచ్చును మరింత తీవ్రతరం చేసిందని స్పష్టంగా తెలుసుకోవడం కష్టం. ఎందుకంటే, అడవుల్లో మంటలు చెలరేగడానికి, అవి వ్యాప్తి చెందడానికి ఇతర కారణాలు కూడా చాలానే ఉంటాయి.
అయితే, కార్చిచ్చులు వ్యాప్తి చెందడానికి సహాయపడే వాతావరణ పరిస్థితులకు వాతావరణ మార్పులే కారణమని ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) చెబుతోంది.
విపరీతమైన వేడి వల్ల భూమి పొడిబారుతుంది. చెట్లు ఎండిపోతాయి. దాంతో కార్చిచ్చులు సులువుగా వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా గాలులు బలంగా ఉంటే ఈ మంటలు త్వరగా వ్యాపిస్తాయి. 2023లో కెనడాలో కార్చిచ్చులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.

ఫొటో సోర్స్, Reuters
డబ్ల్యూడబ్ల్యూఏ ప్రకారం.. వాతావరణ మార్పుల కారణంగా 2023 మే, జూన్ నెలల్లో తూర్పు కెనడాలో విపరీతమైన వేడి రెట్టింపయ్యింది. ఇది మంటలు ఎక్కువగా వ్యాప్తి చెందడానికి కారణమైంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అడవుల్లో పిడుగులు పడే అవకాశాన్ని పెంచుతాయి. దాంతో, మంటలు చెలరేగే ప్రమాదం ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భూ వినియోగ పద్ధతులు, వాతావరణ మార్పుల ప్రభావాలతో కార్చిచ్చులు మరింత తీవ్రమవుతాయని ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్ఈపీ) హెచ్చరిస్తోంది.
2,100 నాటికి అత్యంత తీవ్రమైన కార్చిచ్చుల సంఖ్య 50 శాతం దాకా పెరుగుతుందని ఆ సంస్థ అంచనా వేస్తోంది.
ఇవి కూడా చదవండి:
- మెదక్: బక్రీద్ సందర్భంగా ఇక్కడ జరిగిన గొడవేంటి? ఎందుకు జరిగింది?
- చంద్రబాబు కేబినెట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..
- భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు
- చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతిలో ఎందుకు చేయడం లేదు
- ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















