మండే సూర్యుడికి.. చల్లని సమాధానం టెర్రకోట ఎయిర్ కూలర్లు

కూల్ యాంట్ ఫోటో

ఫొటో సోర్స్, Ant Studio

ఫొటో క్యాప్షన్, కూల్‌యాంట్ ‘‘తేనెతుట్టె’’ డిజైన్ సహజ వెంటిలేషన్ సూత్రాలపై ఆధారపడింది
    • రచయిత, కమలా త్యాగరాజన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నందితా అయ్యర్‌కు ఫ్రిజ్‌లో పెట్టిన చల్లని నీళ్లంటే ఇష్టం లేదు. ఆమె స్వస్థలం బెంగళూరు. మే నెలలో ఇక్కడ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరాయి. అప్పుడు ఈ వంటల రచయిత్రి, ఫుడ్ బ్లాగర్‌ చిన్ననాటి నుంచి తనకు ఇష్టమైన మట్కాను ఆశ్రయించారు. మట్కా అనేది రెండు రకాల మట్టితో తయారు చేసిన ఒక టెర్రకోట కుండ. దీనిని ఇంటిలో వాటర్ కూలర్‌గా పనిచేసేలా తయారు చేస్తారు.

"నా దంతాలు చాలా సెన్సిటివ్. అందుకని ఫ్రిజ్‌లోని నీళ్లు తాగలేను. మట్కా, నీటిని తగినంత చల్లగా ఉంచుతుంది. అవి తాగితే నాకు ఇబ్బంది ఉండదు" అని ఆమె చెప్పారు.

కుండ పైన ఉన్న తడి వస్త్రం నీళ్లను చల్లగా ఉంచడంలో సహాయపడుతుందని ఆమె తెలిపారు.

"వేడిగా ఉండే ముంబయిలో ఈ సహజసిద్ధంగా చల్లబరిచిన నీళ్లు ఎంత బాగుంటాయో నాకు జ్ఞాపకం వచ్చింది. అందుకే బెంగళూరు వాతావరణం ముంబయిలా మారడం ప్రారంభించినప్పుడు, నేను అలాంటి కుండను కొనాలనుకున్నాను."

మట్కాకు పురాతన మూలాలు ఉన్నాయి. టెర్రకోట కుండను నీటితో నింపినప్పుడు, అది ప్రతి రంధ్రం, పగుళ్లలో ఇంకుతుంది. ఈ రంధ్రాలలో ఉన్న నీరు ఆవిరి అవుతూ, ఆ ప్రక్రియలో లోపల ఉన్న నీటిలోని వేడిని కూడా బయటకు పంపుతుంది. నీరు ఆవిరైపోవడంతో వేడిని కోల్పోయిన తర్వాత కుండ చల్లబడి, దానిలో మిగిలిన నీరూ చల్లబడుతుంది.

శతాబ్దాలుగా, భారత దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో శీతలీకరణ అవసరాల కోసం మట్టి కుండలను ఉపయోగిస్తున్నారు. దీనికి రుజువుగా 3,000 సంవత్సరాల క్రితం నాటి హరప్పా నాగరికతకు చెందిన పురాతన రికార్డులూ ఉన్నాయి.

మట్టి కుండలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వందల ఏళ్లుగా, టెర్రకోట "మట్కా" కుండలను నీటిని చల్లబరచడానికి ఉపయోగిస్తున్నారు

ఇటీవల దేశంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

2019 నుంచి 2023 వరకు ఎండా కాలంలో ఏసీల వినియోగం భారీగా పెరిగింది. దీంతో దేశంలో సగటు విద్యుత్ డిమాండ్‌ 28% పెరిగింది.

ఇప్పుడు ఇళ్లను, పరిసరాలను చల్లగా ఉంచే ఆలోచనల అవసరం ఏర్పడడంతో, టెర్రకోట వంటి వస్తువుల వినియోగాలు వంటగదిని దాటి కొత్త ప్రదేశాలకు విస్తరిస్తున్నాయి.

మట్టి కుండ

ఫొటో సోర్స్, Nandita Iyer

ఫొటో క్యాప్షన్, కుండపై ఉన్న తడి వస్త్రం నీళ్లను చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది

పురాతన సాంకేతికతకు నవీన రూపం

ఇటాలియన్‌లో టెర్రకోట అంటే "కాల్చిన మట్టి" అని అర్థం. ఇది ఇటాలియన్, చైనీస్, గ్రీస్ కుండల నుంచి ఈజిప్టు కళల్లో చాలా ప్రముఖంగా కనిపిస్తుంది.

కానీ 2014లో దిల్లీ సమీపంలోని యాంట్ స్టూడియోస్‌లో భాగమైన కూల్‌యాంట్ వ్యవస్థాపకుడు, ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ మోనిష్ సిరిపురపు ఈ పురాతన వస్తువును కొత్త కళ్లతో చూశారు.

ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీదారు అయిన ఆయన క్లయింట్‌లలో ఒకరికి ఒక సమస్య వచ్చింది. తమ కంపెనీ ఆవరణలో ఉన్న డీజిల్ జనరేటర్ రెండు భవనాల మధ్య ఖాళీ ప్రదేశంలో వేడిగాలిని వదులుతుండడంతో ఉద్యోగులు ఆ వేడిని తట్టుకోలేకపోయారు.

మోనిష్ ఈ విషయంలో టెర్రకోట ఏమైనా సహాయపడుతుందా? అని చూడాలనుకున్నారు.

ఆయన మెదడులో మట్కా గురించి ఒక ఆలోచన మెదిలింది. "మట్టి కుండలోని నీరు సహజంగా చల్లగా ఉంటుంది, ఎందుకంటే అది ఆవిరైనప్పుడు, అది కుండ నుంచి వేడిని పీల్చుకుంటుంది. ఆ ప్రక్రియను రివర్స్ చేస్తే? టెర్రకోట చుట్టూ ఉన్న గాలిని మనం అదే విధంగా చల్లబరచగలమని నాకు అనిపించింది" అని ఆయన చెప్పారు.

ఆయన డిజైన్‌లో రీసైకిల్ చేసిన నీటిని టెర్రకోటపైకి పంపిస్తారు. టెర్రకోట రంధ్రాల లోపలి నీరు ఆవిరైపోతుంది కాబట్టి, అది దాని చుట్టూ ఉన్న గాలిని చల్లబరుస్తుంది.

కూల్‌యాంట్ చేతితో తయారు చేసిన దాదాపు 800-900 టెర్రకోట శంకు ఆకృతులను తేనెతుట్టె డిజైన్‌లో స్టెయిన్‌లెస్ స్టీల్ ఫ్రేమ్‌ చుట్టూ అమర్చింది. "తేనెతుట్టె వంటి శంకు ఆకృతులతో చల్లని వాతావరణానికి అవసరమైన ఉపరితల వైశాల్యం పెరుగుతుంది" అని మోనిష్ వివరించారు.

తమ మొదటి తేనెతుట్టె ఇన్‌స్టాలేషన్ తర్వాత, ఈ కంపెనీ పుణె నుంచి జైపూర్ వరకు దేశవ్యాప్తంగా పాఠశాలలు, బహిరంగ ప్రదేశాలు, విమానాశ్రయాలు, వాణిజ్య భవనాలలో ఇలాంటి 35 కూలింగ్ టవర్‌లను సృష్టించింది.

తేనెతుట్టె డిజైన్‌తో పాటు, వాళ్లు టెర్రకోటను వివిధ ఆకృతులలో పేర్చే ఇతర డిజైన్‌లతోనూ, నీటిని అస్సలు ఉపయోగించని వాటితోనూ ప్రయోగాలు చేశారు.

మట్టి కుండలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మట్టికుండల్లో నీటిని తాగడం భారతదేశంలో అనాదిగా ఉన్నదే.

టెర్రకోట కూలింగ్ ప్రోటోటైప్‌లపైనా ప్రయోగాలు జరిగాయి. మహారాష్ట్రకు చెందిన మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు టెర్రకోట ఎయిర్ కండిషనర్‌ను తయారు చేశారు.

ఇది ఫ్యాన్‌ని ఉపయోగించి గాలిని పీల్చుకుని, దానిని తడిగా ఉన్న టెర్రకోట పైకి పంపుతుంది.

దీని ఫలితంగా పరిసర ఉష్ణోగ్రతలు 1.5C (2.7F) వరకు తగ్గాయని వారు తెలిపారు.

దేశంలోని ఆర్కిటెక్చరల్ సంస్థలు తమ టెర్రకోట ఇన్‌స్టాలేషన్ల వల్ల ఉష్ణోగ్రతలు చాలా తగ్గాయని [6C (10.8F) కంటే ఎక్కువ], ఈ విధానం బహిరంగ ప్రదేశాలు, మొత్తం భవనాలను మరింత సహజంగా చల్లబరుస్తుందని చెబుతున్నాయి.

తాము తేనెతుట్టె వంటి డిజైన్‌లను ఉపయోగించి 15 C (27 F) వరకు తగ్గుదలను నమోదు చేసినట్లు కూల్‌యాంట్ తెలిపింది.

"మేము ఊహించిన దాని కంటే ఇది చాలా మెరుగ్గా పని చేసింది" అని మోనిష్ చెప్పారు.

అయినా, అప్పటికే అక్కడ వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉంటే, నీరు ఆవిరి అయ్యే అవకాశం తగ్గి, ఉష్ణోగ్రతలో తగ్గుదల మరీ అంత ఎక్కువగా ఉండదని ఆయన అన్నారు.

టెర్రకోట స్క్రీన్‌లు

ఫొటో సోర్స్, A Threshold/ Avinash Ankalge, Harshith Nayak

ఫొటో క్యాప్షన్, పాత పైకప్పు పెంకుల నుంచి తయారు చేసిన రీసైకిల్డ్ టెర్రకోట స్క్రీన్‌లు

గాలి పీల్చుకునే భవనాలు

యాంట్ స్టూడియోనే కాకుండా టెర్రకోటను కూలింగ్ సొల్యూషన్‌గా ఉపయోగించే పలు నిర్మాణ సంస్థలు ఉన్నాయి.

"గత 100 సంవత్సరాలలో, ఆధునిక సాంకేతికతలు మన ఎయిర్ కూలింగ్‌ను విప్లవాత్మకంగా మార్చాయి. అయినప్పటికీ, అవి పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపాయి," అని ఆర్కిటెక్ట్, బెంగుళూరులోని ఆర్కిటెక్చరల్ సంస్థ ఎ థ్రెషోల్డ్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన అవినాష్ అంకాల్గే చెప్పారు. ఈ సంస్థ భవనాలను శీతలీకరణ చేయడం కోసం రీసైకిల్డ్ టెర్రకోటతో ప్రయోగాలు చేస్తోంది.

"ఇటీవలి ప్రాజెక్టులలో మేము టెర్రకోట వైపు మొగ్గు చూపాం. మేం దానిని అనేక రకాలుగా ఉపయోగిస్తాం," అని అంకాల్గే చెప్పారు. "ఉదాహరణకు, టెర్రకోట స్క్రీన్‌లను తయారు చేయడానికి మేం సమీపంలోని కర్మాగారం నుంచి తెచ్చిన రిక్లెయిమ్డ్ రూఫ్ రిడ్జ్ టైల్స్‌ను ఉపయోగించాం’’ అని ఆయన చెప్పారు.

దక్షిణ బెంగుళూరులోని ఒక వాణిజ్య భవనంలో, ఒక థ్రెషోల్డ్ డిజైన్‌లో, సూర్యుని వేడి తగలకుండా ఉండడానికి భవనం దక్షిణ భాగంలో టెర్రకోట షేడ్‌ను అమర్చారు.

"మధ్యాహ్నం 12-3 గంటల సమయంలో, సూర్యుని వేడి తీవ్రంగా ఉన్నప్పుడు, పైభాగంలోని టైల్స్ నీడ కిందకు పడి, కాంతి భవనంలోకి ప్రవేశించకుండా ఉంటుంది" అని అంకాల్గే చెప్పారు. "మేము దీనిని మ్యూచువల్ షేడింగ్ సూత్రం అని పిలుస్తాం. దీనిని రాజస్థాన్‌లోని అనేక నగరాల్లో - ముఖ్యంగా జైపూర్, జైసల్మేర్‌లలో ఉపయోగించారు. దీన్ని దాదాపు 400 నుంచి 500 సంవత్సరాల క్రితం గృహాలు, రాజభవనాలలో ఉపయోగించారు" అని తెలిపారు.

ఈ సూత్రాన్ని ఉపయోగించే ఆధునిక డిజైన్లలో, ప్రధాన భవనం టెర్రకోట స్క్రీన్ నిర్మాణం వెనుక 3 నుంచి 4 అడుగుల (91 నుంచి 121 సెం.మీ.) నుంచి ప్రారంభమవుతుంది.

ఈ డిజైన్‌లో టైల్స్‌ను తెరిచిన పక్షి ముక్కులా అమరుస్తారు.

దీని పైనున్న ఓవర్‌హెడ్ స్ప్రింక్లర్ సిస్టమ్, రోజులో అత్యంత వేడిగా ఉండే సమయంలో ఆన్ అయి, శీతలీకరణ జరుగుతుంది.

"టెర్రకోట ఒక సహజ పదార్థం, దీనికి మొక్కల్లాంటివి తోడైతే అది మరింత చల్లదాన్ని ఇస్తుంది. దీని వల్ల మనకు కేవలం వేడి తగ్గడమే కాకుండా, ఇంటి లోపల కాంతి ప్రవాహం పుష్కలంగా ఉంటుంది. మేం ఇంటి లోపల మైక్రో-వాతావరణాన్ని సృష్టిస్తున్నాం, బయట ఉన్న విపరీతమైన వేడిని తగ్గిస్తున్నాం. ఇది బయటి నుంచి వచ్చే శబ్దాలను కూడా తగ్గిస్తుంది" అని అంకాల్గే చెప్పారు.

బెంగుళూరు నుంచి 25 మైళ్ల (40 కి.మీ.) దూరంలో ఉన్న ఒక పొలంలో, ఎ థ్రెషోల్డ్ శీతలీకరణ కోసం సాధారణ ఇటుకలకు ప్రత్యామ్నాయంగా టెర్రకోట ఇటుకలతో ప్రయోగాలు చేసింది. అవి చౌకైనవి, పర్యావరణహితమైనవి అని అంకాల్గే చెప్పారు. టెర్రకోట ఇటుకలను సాధారణ ఇటుకలను కాల్చడానికి అవసరమైన సగం ఉష్ణోగ్రత దగ్గర, 600 -700 C (1,112 - 1,292 F) మధ్య కాలుస్తారు. ఫలితంగా భవనాల లోపల 5-8 C (9-14.4F) ఉష్ణోగ్రత తగ్గుతుందని గుర్తించారు.

డోలన్ కుందు

ఫొటో సోర్స్, MeMeraki

ఫొటో క్యాప్షన్, టెర్రకోట కళాకారిణి డోలన్ కుందు పలు అవార్డులు గెలుచుకున్నారు.

కళాత్మక సృష్టి

వివిధ ప్రదేశాలను చల్లగా మార్చే తమ మిషన్‌లో, ఆర్కిటెక్చరల్ సంస్థలు దేశీయ టెర్రకోట కళాకారుల సహాయాన్నీ తీసుకుంటున్నాయి.

అలాంటి కళాకారుల్లో ఒకరు కోల్‌కతాకు చెందిన డోలన్ కుందు మోండల్, ఆమె టెర్రకోట కళాకృతులు జాతీయ అవార్డును గెలుచుకున్నాయి.

చిన్నతనంలో మోండల్ నది ఒడ్డు నుంచి మట్టిని సేకరించి చిన్న బొమ్మలు, జంతువులు, పక్షులు, గుడిసెలుగా తీర్చిదిద్దేవారు.

ఆమె సొంత ఇంటిని కూడా మట్టితో నిర్మించుకున్నారు.

తాను ఎప్పుడూ మట్టితో కొత్తవి చేయాలని కలలు కనేదాన్నని, ఇటీవల ఒక ఇంటి కోసం టెర్రకోట స్క్రీన్‌ మీద పని చేయడానికి ఆఫర్ వచ్చిందని తెలిపారు.

"చిన్నప్పటి నుంచి, నేను మట్టిలో పెరిగి, మట్టిలో జీవించాను" అని మోండల్ చెప్పారు.

ఉత్తర భారతదేశంలోని గురుగ్రామ్‌లో ఉన్న డెవలప్‌మెంట్ ఆల్టర్నేటివ్స్ అనే సంస్థ వైస్ ప్రెసిడెంట్ సౌమెన్ మైతీ మాట్లాడుతూ, టెర్రకోట నిర్మాణాలు గ్రామీణ కళాకారులకు జీవనోపాధిని కల్పిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.

అయితే కొన్ని లోపాలు ఉన్నాయన్న ఆయన, భవనాలపై ఉన్న స్క్రీన్‌లు, ప్యానెల్‌ళ్ళ వంటి అదనపు టెర్రకోట నిర్మాణాలు, ఇప్పటికే ఇరుగ్గా ఉన్న నగరాల్లో చాలా స్థలాన్ని ఆక్రమించవచ్చు అన్నారు. దానికి తోడు, టెర్రకోటలోని సూక్ష్మ రంధ్రాలు క్రమంగా మూసుకుపోతాయి కాబట్టి శీతలీకరణ సామర్థ్యం కాలక్రమేణా తగ్గుతుంది. అందుకని వాటిని శుభ్రపరచడం, సక్రమంగా నిర్వహించడం అవసరం.

టెర్రకోటను నిర్మాణ సామగ్రిగా విస్తృతంగా ఉపయోగిస్తే, వాటిని భారీ పరిమాణంలో కర్మాగారాల్లో తయారు చేయగలిగితే, దాని వల్ల మరో కనిపించని ఖర్చు పెరగవచ్చు. ఉదాహరణకు వాటి రవాణాకు మరింత ఇంధనం అవసరమవుతుంది అని దిల్లీలోని వరల్డ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ సంస్థ సీనియర్ అసోసియేట్ నియతి గుప్తా అభిప్రాయపడ్డారు.

"ఫ్యాక్టరీలలో తయారు చేసే టెర్రకోట టైల్స్, చేతివృత్తులవారు చేతితో తయారు చేసే సంప్రదాయ బంకమట్టి ఇటుకల కంటే బరువుగా ఉంటాయి, సారవంతమైన మట్టిని ఉపయోగించుకుంటాయి" అని గుప్తా చెప్పారు. స్థానికంగా రూపొందించిన టెర్రకోట టైల్స్ మరింత వాతావరణ-సానుకూల పరిష్కారాన్ని అందిస్తాయి. అయితే శీతలీకరణ అవసరాలు పెరిగేకొద్దీ, ఫ్యాక్టరీ ఉత్పత్తి అనివార్యం కావచ్చని ఆయన అన్నారు.

భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో సాధారణ మట్కాలో నీటిని నిల్వ చేయడం ఇప్పటికీ ఒక పురాతన అలవాటు.

నందితా అయ్యర్ తన ఎవ్రీడే సూపర్‌ఫుడ్స్ పుస్తకంలో మట్టి కుండలలో వంటలు ఎలా చేయాలో వివరిస్తారు. ఇప్పుడు నీటిని నిల్వ చేయడానికి మూతలతో కూడిన మట్టి సీసాలనూ ఉపయోగిస్తున్నారని ఆమె తెలిపారు.

‘‘టెర్రకోట వాటర్ బాటిళ్లను మంచి స్థితిలో ఉంచడానికి వాటిని ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి కొబ్బరి బ్రష్‌తో బాగా రుద్దండి, నాచు పేరుకుపోకుండా వాటిని ఎండలో ఉంచండి" అని ఆమె సలహా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)