యుక్రెయిన్‌లో శాంతి స్థాపనకు పుతిన్ షరతులను తిరస్కరించిన ఇటలీ, జర్మనీ

యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ

ఫొటో సోర్స్, EPA

యుక్రెయిన్‌లో యుద్ధానికి ముగింపు పలికేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పెట్టిన షరతులను ఇటలీ, జర్మనీ తిరస్కరించాయి.

యుక్రెయిన్‌లో శాంతి స్థాపనకు ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై చర్చించేందుకు స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న సదస్సులో ఇటలీ, జర్మనీ తమ నిర్ణయాన్ని ప్రకటించాయి.

రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన శాంతి ప్రతిపాదన ఒక ‘తప్పుడు ప్రచారం’ అని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వ్యాఖ్యానించారు.

పుతిన్ ప్రతిపాదించింది ‘నియంతృత్వ శాంతి’ అని జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ అన్నారు.

యుక్రెయిన్ భూభాగం నుంచి యుక్రెయిన్ బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని పుతిన్ చెప్పడం శాంతి ప్రతిపాదనగా తనకు ఏమాత్రం అనిపించడంలేదని మెలోనీ వ్యాఖ్యానించారు.

రష్యా వైఖరి అసంబద్ధంగా ఉందని బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ఆక్షేపించారు. రష్యాకు ఆయుధాలను సరఫరా చేస్తూ, ఆ దేశానికి అండగా నిలబడుతున్న వారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఆయన అన్నారు.

స్విట్జర్లాండ్‌లో శనివారం ప్రారంభమైన ఈ రెండు రోజుల సదస్సులో 90కి పైగా దేశాల నాయకులు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. యుక్రెయిన్ - రష్యా యుద్ధం మొదలైన తర్వాత జరుగుతున్న అతిపెద్ద శాంతి సదస్సు ఇదే.

శాంతి స్థాపన కోసం ‘దౌత్యానికి ఒక అవకాశం’ ఇస్తున్నామని, ఐక్యంగా పని చేస్తే యుద్ధాన్ని ఆపొచ్చన్నది నిరూపించాలని కోరుకుంటున్నట్లు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ చెప్పారు.

‘‘ఈ కీలక సదస్సు వేదికగా చరిత్ర సృష్టిస్తామని విశ్వసిస్తున్నాను. వీలైనంత త్వరగా శాంతి నెలకొల్పాలని కోరుకుంటున్నాను’’ అని ఆయన అన్నారు.

ఈ సమావేశానికి రష్యాకు అహ్వానం అందలేదు. రష్యాకు మిత్రపక్షంగా మెలుగుతున్న చైనా కూడా ఈ సదస్సుకు వెళ్లలేదు.

BBC News Telugu Whatsapp Channel
స్విట్జర్లాండ్‌లో యుక్రెయిన్ శాంతి సదస్సు

ఫొటో సోర్స్, EPA

పుతిన్ ప్రతిపాదన ఏంటి? యుక్రెయిన్ ఏమన్నది?

ఈ సదస్సు ప్రారంభం కాకముందు శుక్రవారం నాడు రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ రాయబారులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. రష్యా పాక్షికంగా స్వాధీనం చేసుకున్నట్టు చెబుతున్న నాలుగు ప్రాంతాల నుంచి యుక్రెయిన్ తన బలగాలను ఉపసంహరించుకుంటే, కాల్పుల విరమణకు అంగీకరిస్తామని పుతిన్ అన్నారు.

అలాగే, రష్యా మరింత ముందుకు చొచ్చుకుపోకుండా ఉండాలంటే యుక్రెయిన్ నాటో కూటమిలో చేరాలనే ప్రయత్నాలను అధికారికంగా విరమించుకోవాలని పుతిన్ చెప్పారు.

‘‘యుక్రెయిన్ ఎప్పుడైతే అలాంటి నిర్ణయానికి తాము సిద్ధమని ప్రకటిస్తుందో.. ఆ మరుక్షణమే, మావైపు నుంచి కాల్పుల విరమణకు, చర్చలకు ఆదేశాలు వెలువడతాయి’’ అని పుతిన్ అన్నారు.

అయితే, పుతిన్ చేసిన ఈ ప్రతిపాదనను యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ ‘హిట్లర్ అల్టిమేటమ్‌’గా అభివర్ణించారు.

క్రైమియా సహా యుక్రెయిన్ భూభాగాల నుంచి రష్యా బలగాలు వెనక్కి వెళ్లిపోయే వరకు రష్యాతో సంప్రదింపులు జరిపే ప్రసక్తే లేదని జెలియెన్‌స్కీ చాలాకాలంగా చెబుతున్నారు.

పుతిన్ ప్రతిపాదన ‘‘బూటకం, హానికరం’’ అని యుక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు మైఖైలో పోడోల్యాక్ అన్నారు. తాము ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడబోమని ఆయన చెప్పారు.

రష్యా డిమాండ్లను అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ కూడా తోసిపుచ్చారు.

‘‘యుక్రెయిన్ సార్వభౌమాధికారం ఉన్న భూభాగాలను పుతిన్ ఆక్రమించుకున్నారు. శాంతి స్థాపనకు యుక్రెయిన్ ఏం చేయాలో నిర్దేశించే స్థితిలో పుతిన్ లేరు’’ అని ఆస్టిన్ అన్నారు.

పుతిన్ ప్రతిపాదన సదుద్దేశంతో చేసింది కాదని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ వ్యాఖ్యానించారు.

యుక్రెయిన్‌లో శాంతి స్థాపన కోసం స్విట్జర్లాండ్ సదస్సులో ఉమ్మడి ప్రణాళికను రూపొందించి, దానిని రష్యాకు పంపే అవకాశం ఉంది.

నరేంద్ర మోదీ, జెలియెన్‌స్కీ

ఫొటో సోర్స్, Getty Images

భారత్ ఏమంటోంది?

ఇటలీలో జరిగిన జీ-7 దేశాల సమావేశంలో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీతో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.

స్విట్జర్లాండ్‌లో జరిగే శాంతి సదస్సుకు భారత్‌ తన ప్రతినిధిని పంపినట్లు జెలియెన్‌స్కీ తెలిపారు.

రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా జరిగే చర్చలకు, దౌత్యానికి భారత్ మద్దతు కొనసాగిస్తుందని జెలియెన్‌స్కీతో భేటీ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.

భారత విదేశాంగ శాఖకు చెందిన సెక్రటరీ (వెస్ట్ ) పవన్ కపూర్ ఈ శాంతి సదస్సుకు వెళ్లారని 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పత్రిక రాసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)