రష్యా-యుక్రెయిన్ వార్: కాల్పుల విరమణకు పుతిన్ షరతులు ఏంటి, యుక్రెయిన్ ఏమన్నది?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, హెన్రీ ఆస్టియర్
- హోదా, బీబీసీ న్యూస్
కాల్పుల విరమణకు ముందే తాము స్వాధీనం చేసుకున్నట్టు చెబుతున్నభూభాగాల నుంచి యుక్రెయిన్ తన బలగాలను ఉపసంహరించుకోవాలని రష్యా ప్రతిపాదించింది. అయితే, రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ఈ ప్రతిపాదనను యుక్రెయిన్ అధ్యక్షుడు ‘హిట్లర్ అల్టిమేటమ్’ గా పేర్కొన్నారు.
క్రైమియా సహా యుక్రెయిన్ భూభాగాలన్నింటినీ రష్యన్ బలగాలు వదిలి వెళ్ళేవరకూ మాస్కోతో సంప్రదింపులు జరిపే ప్రసక్తే లేదని వొలోదిమిర్ జెలియెన్‌స్కీ ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నారు.
శాంతి చర్చలు ప్రారంభం కావడానికి ముందే నాటోలో చేరాలనే ఆలోచనను యుక్రెయిన్ విరమించుకోవాలని రష్యన్ అధ్యక్షుడు చెప్పారు.
యుక్రెయిన్‌లో శాంతి స్థాపనకు ఉన్నఅవకాశాలపై చర్చించేందుకు 90 దేశాలకు చెందిన నాయకులు శనివారం స్విట్జర్లాండ్‌లో సమావేశం కానున్న వేళ పుతిన్ కాల్పుల విరమణ షరతులపై ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే స్విట్జర్లాండ్ సమావేశానికి రష్యాకు అహ్వానం అందలేదు.
తమ రాయబారులతో మాస్కోలో శుక్రవారం జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన పుతిన్ రష్యా పాక్షికంగా ఆక్రమించిన నాలుగు ప్రాంతాలు డోనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, జఫోర్జియా నుంచి యుక్రెయిన్ ప్రభుత్వం వైదొలగాలని అన్నారు.
రష్యా మరింత ముందుకు చొచ్చుకుపోకుండా ఉండాలంటే యుక్రెయిన్ నాటో సైనిక కూటమిలో చేరాలనే ప్రయత్నాలను అధికారికంగా విరమించుకోవాలని పుతిన్ చెప్పారు.
‘‘కీయేవ్ ఎప్పుడైతే అటువంటి నిర్ణయానికి తాము సిద్ధమని ప్రకటిస్తుందో వెంటనే, మావైపు నుంచి కాల్పుల విరమణకు, చర్చలకు ఆదేశాలు వెలువడతాయి. అది కూడా తక్షణమే’’ అని పుతిన్ తెలిపారు.


ఫొటో సోర్స్, TELEGRAM
‘బూటకం, హానికరం’
పుతిన్ ప్రతిపాదనను యుక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు మైఖైలో పోడోల్యాక్ ‘‘బూటకం, హానికరం’’ అని అభివర్ణించారు.
యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్‌స్కీ ఇటలీకి చెందిన స్కై టీజీ24 టెలివిజన్‌తో మాట్లాడుతూ ‘‘ఈ సందేశాలు హెచ్చరిక లాంటివి. చెకోస్లోవేకియాలో కొంత భాగాన్ని నాకు ఇవ్వండి అది ఇక్కడితో ముగుస్తుంది అని హిట్లర్ చెప్పినట్టే ఇది కూడా ఉంది’’ అన్నారు.
రష్యా డిమాండ్లను అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ కూడా తోసిపుచ్చారు.
‘‘యుక్రెయిన్ సార్వభౌమాధికారం ఉన్న భూభాగాలను పుతిన్ ఆక్రమించుకున్నారు’’ అని చెప్పారు.
‘‘శాంతి స్థాపనకు యుక్రెయిన్ ఏం చేయాలో నిర్దేశించే స్థితిలో పుతిన్ లేరు’’ అని ఆస్టిన్ అన్నారు.
పుతిన్ ప్రతిపాదన సదుద్దేశంతో చేసింది కాదని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ వ్యాఖ్యానించారు.
పుతిన్ పథకం ఎటువంటి రాయితీలు లేని గరిష్ఠ డిమాండ్ల సమాహారమని, శాంతి సదస్సు ప్రారంభానికి ముందే దాని విలువను తగ్గించారని రష్యా విశ్లేషకుడు టాటియానా స్టానోవాయా అన్నారు.

ఫొటో సోర్స్, UKRAINE DEFENSE MINISTRY
‘యుక్రెయిన్‌లో శాంతిస్థాపనకు ఓ వేదిక’
లూసెర్న్ సరస్సు సమీపంలో శనివారం జరిగే సదస్సుకు జెలియన్‌స్కీ హాజరవుతున్నారు. తనకు ఇప్పటికీ విస్తృతమైన అంతర్జాతీయ మద్దతు ఉందని చూపాలని ఆయన ఆశిస్తున్నారు.
‘‘యుక్రెయిన్‌లో న్యాయమైన, శాశ్వత శాంతి దిశగా ప్రపంచ నాయకులు అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్యసమితి చార్టర్ ఆధారంగా చర్చించే వేదికను అందించడమే లక్ష్యం’’ అని స్విస్ ప్రభుత్వం తెలిపింది.
యూఎస్ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, జర్మన్ చాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ, యురోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ తదితరులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.
ఈ సదస్సులో పాల్గొనాలని రష్యాకు ఆహ్వానం అందలేదు. రష్యా లేకుండా తాము రాలేమని చైనా తెలిపింది.
ఆక్రమిత రష్యన్ దళాలతో పోరాడటానికి యుక్రెయిన్‌కు సాయం చేసేందుకు స్తంభింపచేసిన రష్యా ఆస్తులపై వడ్డీని ఉపయోగించాలని జీ7 దేశాల నేతలు అంగీకరించారు.
యుక్రెయిన్‌పై 2022 ఫిబ్రవరిలో రష్యా పూర్తిస్థాయి ఆక్రమణ తరువాత ఈయూతోపాటు జీ 7 దేశాలు దాదాపు 325 బిలియన్ డాలర్ల విలువైన రష్యన్ ఆస్తులను స్తంభింపచేశాయి.
ఈ ఆస్తులపై ఏటా 300 కోట్ల డాలర్లు( సుమారు రూ. 25 వేలకోట్లు ) వడ్డీ రూపంలో లభిస్తోంది.
ఈ వడ్డీని యుక్రెనియన్ల కోసం అంతర్జాతీయ మార్కెట్ల నుంచి తీసుకున్న 5 వేల కోట్ల డాలర్ల( సుమారు రూ. 41 వేలకోట్లు ) అప్పుకు వార్షిక వడ్డీగా చెల్లించాలనేది జీ7 దేశాల ప్రణాళిక.
అయితే ఈ డబ్బు ఈ ఏడాది చివరకు గానీ వచ్చే అవకాశం లేదు. కానీ యుక్రెయిన్ యుద్ధ ప్రయత్నాలకు, ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలిచేందుకు ఇదో దీర్ఘకాలిక పరిష్కారమవుతుందని భావిస్తున్నారు.
జీ7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా అమెరికా, యుక్రెయిన్ 10 సంవత్సరాల ద్వైపాక్షిక భద్రతా ఒప్పందంపై సంతకం చేశాయి. దీనిని కీయేవ్ చరిత్రాత్మకమని ప్రశంసించింది.
ఇవి కూడా చదవండి:
- కీబోర్డుపై నొక్కుతూ పనిచేస్తున్నట్లు నటిస్తున్న వారిని ఉద్యోగాల నుంచి తొలగించిన ప్రముఖ బ్యాంకు
- పవన్ కల్యాణ్: ‘డిప్యూటీ సీఎం’ అని ఎందుకు ప్రమాణం చేయలేదు, ఈ పదవి గురించి రాజ్యాంగంలో ఏముంది?
- ‘లక్షణమైన మహిళలకు మాత్రమే అనుమతి’ అంటూ ఆ జిమ్ చేసిన ప్రకటన ఎందుకు వివాదాస్పదంగా మారింది?
- వైసీపీ ఓటమికి వాలంటీర్ వ్యవస్థ కూడా ఒక కారణమా? ఇప్పుడు వాలంటీర్ల పరిస్థితి ఏంటి?
- ఏపీ కేబినెట్లో మహిళా మంత్రులు.. ఒకప్పుడు ఏం చేసేవారు, ఇప్పుడు ఏయే శాఖలకు మంత్రులయ్యారు
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














