ఉపా చట్టం కింద అరుంధతీ రాయ్ విచారణ, అసలు ఈ కేసేంటి?

ఫొటో సోర్స్, Getty Images
ప్రసిద్ధ రచయిత్రి అరుంధతీ రాయ్, కశ్మీరీ డాక్టర్ షేక్ షౌకత్ హుస్సేన్‌లను చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద విచారించేందుకు దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా అనుమతి ఇచ్చారు.
ఆ కేసు 2010 నవంబర్ 27 నాటిది. అంటే 14 ఏళ్ళ కిందటిది.
‘ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ పుస్తకానికి గానూ అరుంధతీ రాయ్ 1997లో బుకర్ ప్రైజ్ అందుకున్నారు.
షేక్ షౌకత్ హుస్సేన్ కశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీలో మాజీ ఇంటర్నేషనల్ లా ప్రొఫెసర్.
వివిధ వర్గాల మధ్య శత్రుత్వం, ప్రజలను రెచ్చగొట్టేలా ప్రకటనలు చేశారనే అభియోగంపై భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) సెక్షన్ 196 కింద నిందితులను విచారించేందుకు కిందటేడాది అక్టోబరులో లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జీ) అనుమతి ఇచ్చారు.
అంతకు ముందు అరుంధతీ రాయ్, షౌకత్ హుస్సేన్‌లను విచారించేందుకు దిల్లీ పోలీసులు ఐపీసీ 153ఏ, 153బీ,504, 505 సెక్షన్లు, ఉపా చట్టంలోని 13వ సెక్షన్ కింద అనుమతి కోరినప్పటికీ, ఎల్‌జీ కేవలం ఐపీసీ సెక్షన్ల కింద మాత్రమే విచారణకు 2023 అక్టోబర్‌లో అనుమతి మంజూరు చేశారు.
ఉపా చట్టంలోని సెక్షన్ 13 కింద చట్టవ్యతిరేక కార్యకలాపాలను ప్రేరేపించడం, ప్రోత్సహించడం లేదా సమర్థించడం తదితర అంశాలను విచారిస్తారు.
ఆ సెక్షన్ కింద గరిష్ఠంగా ఏడేళ్ళు జైలు శిక్ష పడుతుంది.
మతం, జాతి, జన్మస్థలం, నివాసం, భాష తదితర విషయాల ఆధారంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వం పెంచడం లాంటి నేరాలను 153ఏ సెక్షన్ కింద విచారిస్తారు.
దేశ సమగ్రతకు, సౌభ్రాతృత్వానికి హాని కలిగించే చర్యలపై సెక్షన్ 153బీ కింద విచారణ జరుపుతారు.
శాంతికి విఘాతం కలిగించే చర్యలు సెక్షన్ 505 కిందకు వస్తాయి.


ఫొటో సోర్స్, GETTY IMAGES
ఏం జరిగింది?
అరుంధతీ రాయ్‌పై విచారణకు తాజాగా అనుమతిచ్చిన కేసు, కశ్మీర్ అంశంపై ఆమె చేసిన ప్రసంగానికి సంబంధించినది.
సుశీల్ పండిత్ అనే వ్యక్తి 2010 అక్టోబర్ 28న చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసులో వారిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
దిల్లీలోని ఎల్‌టీజీ ఆడిటోరియంలో ‘అజాదీ – ది ఓన్లీ వే’ పేరుతో జరిగిన సదస్సు భారత్ నుంచి కశ్మీర్‌ను వేరు చేయాలనే వాదనను సమర్థించిందని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం జారీచేసిన ప్రకటన పేర్కొంది.
‘‘ఆ సదస్సులో ప్రసంగించిన వారిలో సయ్యద్ అలీ షా గిలానీ (కశ్మీర్ వేర్పాటువాద నేత), సయ్యద్ అబ్దుల్ రహమాన్ గిలానీ (పార్లమెంట్‌పై దాడి కేసులో శిక్షపడి నిర్దోషిగా విడుదలైన దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్), అరుంధతీ రాయ్, డాక్టర్ షేక్ షౌకత్ హుస్సేన్, మావోయిస్టు సానుభూతిపరుడు వరవరరావు ఉన్నారు’’ అని ఆ ప్రకటనలో తెలిపారు.
కశ్మీర్ భారత్‌లో ఎన్నటికీ భాగం కాదని, భారత సైనిక దళాలు బలవంతంగా దానిని ఆక్రమించాయని వారు బలంగా వాదించారని అందులో ఆరోపించారు.
‘‘సదస్సుకు సంబంధించిన రికార్డులను ఫిర్యాదుదారు సమర్పించారు. ఫిర్యాదు దారు సీఆర్పీసీ సెక్షన్ 156 (3) కింద దిల్లీలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో వారిపై ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు కావడంతో పాటు విచారణ ప్రారంభించారు’’ అని ఆ ప్రకటన తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
సోషల్ మీడియాలో ప్రతిస్పందనలు
అరుంధతీ రాయ్, షేక్ షౌకత్ హుస్సేన్‌లను విచారించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి మంజూరు చేసిన తరువాత సోషల్ మీడియాలో అనేక ప్రతిస్పందనలు వచ్చాయి.
‘‘కశ్మీర్ స్వాతంత్య్రాన్ని సమర్థించినందుకు అరుంధతీ రాయ్‌పై నమోదైన 14 ఏళ్ళనాటి ఎఫ్ఐఆర్ ఆధారంగా, ఆమెను ఉపా చట్టం కింద విచారించేందుకు ఎల్‌జీ అనుమతి ఇచ్చారన్నమాట. చూస్తూంటే 2024 ఓటమి నుంచి మోదీ ప్రభుత్వం ఏమీ నేర్చుకున్నట్టు కనిపించడం లేదు. భారత్‌ను మరింత నియంతృత్వ దేశంగా మార్చేందుకు కట్టుబడినట్టున్నారు’’ అని సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో రాశారు.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ‘ఎక్స్’లో రాస్తూ.. ‘‘అరుంధతీ రాయ్‌ను ఉపా చట్టం కింద విచారించాలనుకోవడం ద్వారా బీజేపీ తన మునుపటి దారిలోనే ఉన్నానని చెప్పాలనుకుంటోంది. కానీ వారెప్పటికీ ఆ దారిలోకి రాలేరు.. సరిగ్గా ఇలాంటి ఫాసిజానికి వ్యతిరేకంగానే భారతీయులు ఇటీవల ఓటు వేశారు’’ అని పేర్కొన్నారు.
‘‘2010 నాటి ద్వేష పూరిత ప్రసంగం కేసులో ఉపా చట్టం కింద రచయిత, సామాజిక కార్యకర్త అరుంధతీ రాయ్‌ని విచారించేందుకు దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి ఇచ్చారు. కానీ ఎన్నికలలో మతం పేరుతో విషం చిమ్మినవారు సురక్షితంగా ఉంటారు. అసమ్మతి గళాలను జాతి వ్యతిరేకులుగా ముద్రవేస్తున్నారు’’ అని ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్ ‘ఎక్స్’ఖాతాలో స్పందించారు.
‘కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో భాగం కాదు’ అంటూ అరుంధతీ రాయ్ చేసిన ప్రసంగ భాగాన్ని అనేకమంది ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
మరికొందరు అరుంధతీ రాయ్ పుస్తకాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆమెను కొనియాడుతున్నారు.

ఫొటో సోర్స్, ANI
మోదీ ప్రభుత్వంపై విమర్శలు
అరుంధతీ రాయ్ 1997లో ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ పొందారు. 26 ఏళ్ళ తరువాత 2023సెప్టెంబర్‌లో ఆమెకు జీవిత కాల సాఫల్య పురస్కారంగా 45వ యురోపియన్ ఎస్సే ప్రైజ్ లభించింది.
అజాదీ పేరుతో 2021లో ప్రచురితమైన ఫ్రెంచ్ అనువాద సంకలనానికి ఆ పురస్కారాన్ని అందించారు. ఈ అనువాదం ఎన్నో ప్రశంసలు పొందింది.
మోదీ ప్రభుత్వంపై అరుంధతీ రాయ్ తీవ్ర విమర్శలు గుప్పిస్తుంటారు.
తన రాజకీయ వ్యాఖ్యల కారణంగా ఆమె తరచూ లక్ష్యంగా మారుతున్నారు.
రాజకీయాలపై ఆమె రాసిన వ్యాసాలకు సంబంధించిన రెండు సంకలనాలు ప్రచురితమయ్యాయి.
2022లో అరుంధతీ రాయ్ రాసిన ఓ వ్యాసంలో అధికార బీజేపీని జనవరి 6న అమెరికాలోని క్యాపిటల్ హిల్‌పై దాడిచేసిన అల్లరి మూకలతో పోల్చారు. ‘‘ప్రత్యేకించి నేనేం మాట్లాడినా, రాసినా, ముఖ్యంగా కశ్మీర్ గురించి.. నాలాంటి వారు జాతివిద్రోహులుగా లిస్ట్ ఏ జాబితాలో ఉంటారు’’ అని ఆమె చెప్పారు.
ది వైర్ కోసం కరణ్ థాపర్ 2022లో చేసిన ఇంటర్వ్యూలో కూడా అరుంధతీ రాయ్ మోదీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.
హిందూ జాతీయవాద భావజాలం విభజనతో కూడుకున్నదని, ఈ దేశ ప్రజలు ఆ సిద్దాంతాన్ని గెలవనీయరని చెప్పారు.
బీజేపీని ఫాసిస్ట్‌గా పేర్కొన్న అరుంధతీ రాయ్ ఏదో ఒక రోజు దేశ ప్రజలు దానిని వ్యతిరేకిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు.
‘‘నాకు భారత దేశ ప్రజలపై నమ్మకముంది. ఈ చీకటి రోజుల నుంచి దేశం బయటపడుతుందనే నమ్మకముంది’’ అని అన్నారు.
‘‘మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో అసమానతలు పెరిగాయని, జీడీపీలో పాతిక శాతం 100 మంది వద్దే ఉందని, నలుగురు మాత్రమే దేశాన్ని నడుపుతున్నారని, ఇద్దరు కొంటారు, ఇద్దరు అమ్ముతారు, ఆ నలుగురు గుజరాత్ వారే.. అని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ రైతు చేసిన వ్యాఖ్య సముచితమైనది’’ అని ఆమె వ్యాఖ్యానించారు.
అరుంధతీ రాయ్ బీజేపీపై ఈ రీతిలోనే పలుసార్లు విమర్శలు గుప్పించారు. కానీ బీజేపీ వాటిని ఖండించింది.
‘‘ఆమె ఓ అరాచకవాది, వివాదాల దేవత, ఆమెను నేనో మేథావిగా చూడను. ఆమె కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం కాదని కూడా చెబుతారు’’ అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఇండియా టుడేతో 2019 డిసెంబర్ 26న చెప్పారు.
హిందూ రాష్ట్ర, మతతత్త్వం, కశ్మీర్ అంశాలపై అరుంధతీ రాయ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన పై విధంగా స్పందించారు.
‘‘కశ్మీర్‌లో సైన్యం దురాగతాలకు పాల్పడిందని అరుంధతీరాయ్ ఆరోపించారు. ఆమె గోవా స్వాతంత్య్రాన్ని కూడా వ్యతిరేకిస్తారు. ఆమె సుప్రీం కోర్టును, రాజ్యాంగాన్ని కూడా విశ్వసించరు’’ అని ఆయన విమర్శించారు.

ఉపా కేసులు పెరుగుతున్నాయా?
గడిచిన ఐదేళ్ళలో ఉపా కేసుల సంఖ్యలో భారీ పెరుగుదల కనిపిస్తోంది.
అసమ్మతి గళాలను అణచివేసేందుకు ప్రభుత్వం ఆ చట్టాన్ని ఉపయోగిస్తోందని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
2018లో భీమా కోరేగావ్ ఘటన తరువాత ఉపా చట్టం కింద పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్న విషయం వెలుగులోకి వచ్చింది.
అనేక మంది మేథావులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, కార్మిక సంఘ కార్యకర్తలపై హింసను ప్రేరేపించారనే అభియోగాలు మోపారు.
వారిలో న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, రోనా విల్సన్, షోమా సేన్, మహేశ్ రౌత్, కవి వరవరరావు, సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, వెర్నాన్ గోన్సాల్వేస్, జర్నలిస్టు గౌతమ్ నవలఖా, రచయిత, ప్రొఫెసర్ ఆనంద్ తెల్తుంబ్డే, ఫాదర్ స్టాన్ స్వామి, హనీ బాబు, సాగర్ గోర్ఖే, రమేష్ గైచోర్ జ్యోతి జగ్తాప్ తదితరులు ఉన్నారు.
వీరిలో చాలామంది ఇంకా జైళ్లలోనే ఉన్నారు. కొందరికి బెయిల్ వచ్చింది.
ఇక 2020 ఫిబ్రవరిలో జరిగిన దిల్లీ అల్లర్ల కేసు రెండోది.
ఆ కేసులో కూడా అనేకమందిని ఉపా చట్టం కింద అరెస్ట్ చేశారు.
ఆ కేసులో జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీ మాజీ విద్యార్థి ఉమర్ ఖలీద్ 2019 నుంచి జైల్లోనే ఉన్నారు.
ఆయనకు ఇప్పటిదాకా బెయిల్ రాలేదు.
ఉపా చట్టానికి సంబంధించి తాజా కేసు న్యూస్ క్లిక్ పోర్టల్‌ది.
గతేడాది అక్టోబర్‌లో న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు, ముఖ్య సంపాదకుడు ప్రబిర్ పుర్కాయస్థ, మానవ వనరుల విభాగాధిపతి అమిత్ చక్రవర్తిని అరెస్ట్ చేసి, ఉపా చట్టం కింద అభియోగాలు మోపారు.
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ కేసుకు సంబంధించి పాత్రికేయుడు సిద్ధిఖీ కప్పన్‌పై 2020లో ఉపా చట్టం కింద అభియోగాలు మోపారు.
ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు.
2016-2019న మధ్యన ఉపా చట్టం కింద 5,922 మందిపై కేసులు నమోదు చేశారు.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2021 నివేదిక ప్రకారం ఆ కేసులలో కేవలం 132 మందిపై మాత్రమే అభియోగాలను నమోదు చేయవచ్చని పేర్కొంది.
దేశవ్యాప్తంగా ఒక్క 2019లోనే 1,948 మందిపై ఉపా చట్టం కింద కేసులు నమోదు అయ్యాయని అప్పటి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి రాజ్యసభకు తెలిపారు. అయితే ఆ ఏడాది ప్రాసిక్యూషన్ అభియోగాలను నిరూపించడంలో విఫలం కావడంతో 64 మంది నిర్దోషులుగా బయటపడినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
ఇక 2018 గురించి మాట్లాడుకుంటే మొత్తం 1,421మందిపై ఉపా చట్టం కింద కేసులు నమోదు చేస్తే కేవలం నాలుగు కేసులలో మాత్రమే ప్రాసిక్యూషన్ అభియోగాలను నిరూపించింది.
68 మందిని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది.
ఈ చట్టం కింద 2016, 2019 మధ్యన అరెస్టయిన వారిలో కేవలం రెండు శాతం కంటే కొంచెం ఎక్కువ మందిపై మాత్రమే అభియోగాలు నిరూపితమయ్యాయి.

ఫొటో సోర్స్, FAIRFAX MEDIA VIA GETTY IMAGES
ఏమిటీ ఉపా చట్టం?
ఉపా చట్టాన్ని 1967లో ప్రవేశపెట్టారు.
2008, 2012లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఆ చట్టంలో సవరణలు చేయడం ద్వారా దానిని మరింత కఠినంగా మార్చింది.
ఆ తరువాత మోదీ ప్రభుత్వం 2019లో ఆ చట్టానికి మరోసారి సవరణలు చేసి మరింత కఠినంగా మార్చింది.
ఉపా చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం భారతదేశ ఐక్యత, సమగ్రత, భద్రత, ఆర్థిక భద్రత లేదా సార్వభౌమాధికారాన్ని ప్రమాదంలో పడేసే ఉద్దేశంతో దేశంలో లేదా విదేశాల్లోని ప్రజలలో, లేదా ప్రజలలో ఏదైనా ఒక వర్గంలో తీవ్రవాదాన్ని వ్యాప్తి చేయడం లేదా ప్రేరేపించడం, లేదంటే అటువంటి నేరానికి అవకాశం కలిగించే ఉద్దేశంతో చేసే చర్యలను 'తీవ్రవాద చర్య' గా పేర్కొన్నారు.
బాంబు పేలుళ్ళ నుంచి నకిలీ నోట్ల వ్యాపారం వరకూ ప్రతి అంశాన్ని ఈ నిర్వచనం కిందకు చేర్చారు.
తీవ్రవాదానికి, తీవ్రవాదికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వడానికి బదులుగా ఉపా చట్టంలోని సెక్షన్ 15లో ఇచ్చిన నిర్వచనంలోని అర్థాన్ని మాత్రమే అన్వయించి కేసులు నమోదు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
సెక్షన్ 35 ప్రకారం విచారణ ముగియడానికి ముందే ప్రభుత్వం ఏ వ్యక్తినైనా, లేదా సంస్థనైనా తీవ్రవాదిగా ప్రకటించవచ్చు.
ఇవి కూడా చదవండి:
- కీబోర్డుపై నొక్కుతూ పనిచేస్తున్నట్లు నటిస్తున్న వారిని ఉద్యోగాల నుంచి తొలగించిన ప్రముఖ బ్యాంకు
- పవన్ కల్యాణ్: ‘డిప్యూటీ సీఎం’ అని ఎందుకు ప్రమాణం చేయలేదు, ఈ పదవి గురించి రాజ్యాంగంలో ఏముంది?
- ‘లక్షణమైన మహిళలకు మాత్రమే అనుమతి’ అంటూ ఆ జిమ్ చేసిన ప్రకటన ఎందుకు వివాదాస్పదంగా మారింది?
- వైసీపీ ఓటమికి వాలంటీర్ వ్యవస్థ కూడా ఒక కారణమా? ఇప్పుడు వాలంటీర్ల పరిస్థితి ఏంటి?
- ఏపీ కేబినెట్లో మహిళా మంత్రులు.. ఒకప్పుడు ఏం చేసేవారు, ఇప్పుడు ఏయే శాఖలకు మంత్రులయ్యారు
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














