వరవరరావుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు.. ముంబయి విడిచి వెళ్లరాదంటూ షరతు

ఫొటో సోర్స్, AFP
భీమా కోరెగావ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 82 ఏళ్ల వరవరరావుకు సుప్రీంకోర్టు సాధారణ బెయిల్ మంజూరు చేసింది.
వరవరరావు వయసును, క్షీణిస్తున్న ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జస్టిస్ యు.యు.లలిత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
కేవలం వైద్య కారణాల ప్రాతిపదికనే బెయిల్ మంజూరు చేశాం కానీ ఈ కేసులో వరవరరావు తరఫున మొగ్గు ఉన్నట్లు కాదని ధర్మాసనం పేర్కొంది.
వరవరరావు తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ 'బీబీసీ'తో మాట్లాడుతూ.. ''సుప్రీంకోర్టు మంచి తీర్పునిచ్చింది. నా క్లయింటుకు సాధారణ బెయిల్ మంజూరు చేయడం సంతోషంగా ఉంది'' అన్నారు.
అయితే, వరవరరావు ముంబయి దాటి బయటకు వెళ్లరాదని సుప్రీంకోర్టు తన ఆదేశాలలో పేర్కొంది.
దీంతో పాటు మరికొన్ని షరతులూ విధించింది. అవి ఏమిటంటే...
- స్పెషల్ ఎన్ఐఏ కోర్టు అనుమతి లేకుండా గ్రేటర్ ముంబయి దాటి వరవరరావు వెళ్లరాదు.
- బెయిల్ రూపంలో కోర్టు కల్పిస్తున్న ఈ స్వేచ్ఛను వరవరరావు దుర్వినియోగం చేయరాదు.
- ఇతర సాక్షులను కలవడానికి వీల్లేదు.
- కేసు దర్యాప్తును ప్రభావితం చేసే ప్రయత్నం చేయరాదు.
- ఆయన తను ఎంచుకున్న వైద్యాన్ని చేయించుకోవచ్చు. అయితే ఆ విషయాలను ఎన్ఐఏ అధికారులకు తెలియజేస్తూ ఉండాలి.

ఫొటో సోర్స్, FACEBOOK/VARAVARA RAO
వరవరరావు మీద కేసు ఏమిటి?
భీమాకోరేగావ్ అల్లర్లకు సంబంధించి మహారాష్ట్ర పోలీసులు 2018 జూన్ మొదటి వారంలో కొందరిని అరెస్టు చేశారు. వీరిలో కొందరు మావోయిస్టు సానుభూతిపరులు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. వీరంతా ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నారని, వీరికి వరవరరావు ఆర్థికంగా సహకరిస్తున్నారని మహారాష్ట్ర పోలీసుల అభియోగం.
ఈ కేసులో రోనా విల్సన్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. రోనా విల్సన్ వద్ద దొరికిన లేఖలో వరవరరావు పేరు ఉందని పోలీసులు చెబుతున్నారు.
ఆ నేపథ్యంలో 2018 ఆగస్టు 28న హైదరాబాద్‌లో పెండ్యాల వరవరరావును మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసి పుణె తీసుకెళ్లారు.
అయితే.. పోలీసుల ఆరోపణలను హక్కుల సంఘాలు, వామపక్ష ప్రజాసంఘాలు మాత్రం ఇదంతా కుట్ర అని, ప్రశ్నించే గొంతునొక్కడమేతప్ప మరేమీ కాదని అంటున్నారు.
అనంతరం ఈ కేసు దర్యాప్తును నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ చేపట్టింది.
వరవరరావు బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించగా అక్కడ ఆయన బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.
తనకు సాధారణ బెయిల్ మంజూరు చేయాలన్న వరవరరావు అభ్యర్థనపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. రెండున్నరేళ్లు కస్టడీలో ఉండడం.. వృద్ధాప్యంలో ఉండడంతో వైద్య కారణాల రీత్యా ఆయనకు బెయిల్ సాధారణ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
వాద ప్రతివాదనలు...
ఈ కేసులో చార్జ్‌షీట్ దాఖలు చేసినా కూడా.. నిందితుల్లో కొందరిని ఇంకా అరెస్ట్ చేయలేదని, అలాగే కొందరు నిందితులు వేసిన పిటిషన్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని ధర్మాసనం తన ఆదేశాల్లో ఉటంకించింది.
వరవరరావు తరఫు న్యాయవాది ఆనంద్ గ్రోవర్ వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో విచారణ ఇంకా మొదలు కాలేదని, ఈ రోజు విచారణ మొదలైతే అది పూర్తి కావటానికి కనీసం 10 సంవత్సరాలు పడుతుందని పేర్కొన్నారు.
కక్షిదారు న్యూరలాజికల్ సమస్యలు, కొలెస్టరాల్, రక్తపోటు తదితర చాలా జబ్బులకు సంబంధించి రోజుకు 13 రకాల మందులు వాడుతున్నారని చెప్పారు. వరవరరావు క్లస్టర్ హెడేక్స్ అని పిలిచే తలనొప్పితో తరచుగా బాధపడుతున్నారని, దానికి ఇంకా వైద్య పరీక్షలు, నిరంతర పర్యవేక్షణ అవసరమని తెలిపారు.
ఎన్ఐఏ తరఫున వాదించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు.. ఒక ప్రశ్నకు బదులిస్తూ.. యూఏపీఏ చట్టం కింద నమోదైన ఈ కేసులో వరవరరావుకు విధించగల గరిష్ట శిక్ష మరణ శిక్ష కావచ్చునని చెప్పారు.
వరవరరావు బెయిల్ మీద ఉండగా దానిని దుర్వినియోగం చేసినట్లు చెప్పటానికి ఏమీ లేదన్నారు. అయితే ఆయన పార్కిన్సన్స్ జబ్బుతో బాధపడుతున్నారన్న వాదన సరికాదని పేర్కొన్నారు. ఈ కేసు విచారణకు ఎలాంటి అడ్డంకులూ ఎదురుకానట్లయితే ఏడాదిన్నరలో విచారణ పూర్తి చేయవచ్చునని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఆగస్ట్ 15న ఇంటి మీద జెండా ఎగరేయబోతున్నారా... ఈ 10 విషయాలు గుర్తుంచుకోండి
- మనం ఎందుకు చనిపోతాం? సంతాన సామర్థ్యం.. వృద్ధాప్యానికీ, మరణానికీ దారితీస్తుందా?
- అప్పు తీర్చాలంటూ ఏజెంట్లు దురుసుగా ప్రవర్తిస్తే ఏం చేయవచ్చు, మీకున్న హక్కులేంటి
- తల్లిపై అత్యాచారం జరిగిన 28 ఏళ్ల తర్వాత నిందితులపై కేసు పెట్టి అరెస్టు చేయించిన కొడుకు
- హమీదా బాను: 20 ఏళ్ల తర్వాత పాకిస్తాన్లో కనిపించిన భారతీయ మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









