ఏనుగుకు కవలల జననం, రెండో బిడ్డ పుట్టాక భయంతో తల్లి ఏం చేసిందంటే...

థాయ్‌లాండ్

ఫొటో సోర్స్, BBC/Benjamin Begley

ఫొటో క్యాప్షన్, 36 ఏళ్ల చమ్‌చూరి కవలలకు జన్మనిస్తుందని ఎవరూ ఊహించలేదు
    • రచయిత, రిన్ జిరేనువాట్, జోయెల్ గింటో
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

సెంట్రల్ థాయ్‌లాండ్‌లో ఒక ఆసియా ఏనుగు కవలలకు జన్మనిచ్చింది. ఆ ఏనుగు సంరక్షకులు దీనిని ‘అద్భుతమైన’ ఘటనగా అభివర్ణించారు.

అయుతయ ఎలిఫెంట్ ప్యాలెస్ అండ్ రాయల్ క్రాల్‌లో ఉంటున్న చమ్‌చూరి అనే 36 ఏళ్ల ఏనుగుకు కవలలు జన్మనిస్తాయని ఎవరూ అనుకోలేదు. గత శుక్రవారం చమ్‌చూరి మగపిల్లకు జన్మనిచ్చాక ప్రసవం పూర్తయిందని సిబ్బంది భావించారు.

పిల్ల ఏనుగును శుభ్రం చేస్తుండగా, వాళ్లకు దబ్బుమని పెద్ద చప్పుడు వినిపించింది. చమ్‌చూరి రెండో గున్నకు జన్మనిచ్చిందని వాళ్లకు అర్ధమైంది. ఈసారి ఆడ ఏనుగు పుట్టింది.

అయితే, రెండో ప్రసవంతో తల్లి ఏనుగు భయపడిపోయింది. ఆ ఆందోళనలో పిల్లను తొక్కకుండా నిరోధించేందుకు మావట్లు తల్లి ఏనుగును బంధించాల్సి వచ్చింది. ఈ పెనుగులాటలో ఒక మావటి గాయపడ్డారు.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫుటేజీలో మావట్లు ఆడ ఏనుగు గున్నను తల్లి నుంచి వేరు చేయడం కనిపించింది.

వాట్సాప్

ఏనుగులకు కవలలు పుట్టే అవకాశం ఒక శాతం మాత్రమే ఉంటుంది. పైగా ఇలా మగ, ఆడ ఏనుగు పిల్లలు పుట్టడం చాలా అరుదైన విషయమని ‘సేవ్ ది ఎలిఫెంట్స్’ అనే పరిశోధనా సంస్థ తెలిపింది.

"మేం ఎప్పటినుంచో ఏనుగు కవలలను చూడాలనుకుంటున్నాం. అయితే, అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే అవి చాలా అరుదు" అని ఆ ఏనుగుల పార్క్‌లో పని చేస్తున్న పశువైద్యురాలు లార్డ్‌థాంగ్‌టేర్ మీపన్ అన్నారు.

రెండోసారి ఏనుగు ప్రసవించాక పిల్ల ఏనుగును తల్లి తొక్కడాన్ని అడ్డుకునే క్రమంలో చరిన్ సోమ్‌వాంగ్ అనే మావటి కాలు విరిగింది.

"నాకు చాలా సంతోషంగా ఉంది, నాకేమీ ఇది పెద్ద నొప్పిగా అనిపించడం లేదు" అని బీబీసీతో ఆయన అన్నారు.

"ప్రసవం అయ్యాక తల్లి ఎప్పుడూ బిడ్డను తన్నడానికి లేదా నెట్టేయడానికి ప్రయత్నించడం సాధారణం. అందువల్లే అది పిల్లను తొక్కేస్తుందేమో అని నేను భయపడ్డాను. అందుకే నేను ముందుకు వచ్చి పిల్ల ఏనుగుకు అడ్డుగా నిలబడ్డా" అని ఆయన చెప్పారు. సోమ్‌వాంగ్ 15 సంవత్సరాలుగా ఈ పార్కులో పని చేస్తున్నారు.

థాయ్‌లాండ్

ఫొటో సోర్స్, BBC/Benjamin Begley

ఫొటో క్యాప్షన్, ఆడ ఏనుగు పిల్ల సాధారణంగా ఏనుగు పిల్లలు ఉండాల్సిన సైజుకంటే కొంచెం చిన్నగా ఉండటంతో స్టూల్‌పై నిలబెట్టి పాలు తాగిస్తున్నారు

థాయ్‌లాండ్‌లో ఏనుగులను పవిత్రంగా పరిగణిస్తారు. ఇక్కడ జనాభాలో ఎక్కువ మంది బౌద్ధులు. థాయ్‌లాండ్ జాతీయ చిహ్నం ఏనుగు.

ఈ కవలలు జన్మించినప్పుడు, అయుతయ ఎలిఫెంట్ ప్యాలెస్ అండ్ రాయల్ క్రాల్ ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేసింది.

కవల ఏనుగు పిల్లలు పుట్టాక, పార్క్‌కు వచ్చే సందర్శకులందరూ వాటిని చూడటానికి అనుమతించారు.

థాయ్ సంప్రదాయానికి అనుగుణంగా పుట్టిన ఏడు రోజుల తర్వాత ఈ కవల ఏనుగు పిల్లలకు పేరు పెడతారు.

రెండో కాన్పులో పుట్టిన ఈ ఆడ ఏనుగు పిల్ల 55 కిలోల బరువు ఉంది. అయితే, ఉండాల్సినదానికన్నా కొంచెం తక్కువ ఎత్తు ఉంది. దీంతో తల్లి దగ్గర పాలు పట్టేటప్పుడు దీనిని స్టూల్‌పై నిలబెట్టాల్సి వస్తోంది.

మొదట పుట్టిన మగ ఏనుగు గున్న 60 కిలోల బరువుంది.

థాయ్‌లాండ్

ఫొటో సోర్స్, BBC/Benjamin Begley

ఫొటో క్యాప్షన్, ఏనుగుల్లో ఒక శాతం మాత్రమే కవలలు జన్మిస్తాయి

అడవుల్లో చెట్లను కొట్టేయడాన్ని 1989లో, థాయ్‌లాండ్ నిషేధించడంతో ఏనుగులతో మొద్దులను మోయించే వృత్తిలో ఉన్న మావట్లకు ఉపాధి లేకుండా పోయింది. దీనితో వారు డబ్బు కోసం, పర్యాటకుల ముందు ఏనుగులతో విన్యాసాలు చేయించేవారు. అయితే ఇది చట్టవిరుద్ధమని 2010లో ప్రకటించారు.

థాయ్‌లాండ్ పూర్వ రాజధాని అయిన అయుతయలో, కొన్ని ఏనుగులు పర్యాటకులను వీపుపై దేవాలయాలు, చారిత్రక ప్రాంతాల దగ్గరికి మోసుకువెళ్లేవి.

జంతు పరిరక్షకులు ఏనుగు స్వారీని వ్యతిరేకిస్తున్నారు.

వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ (డబ్ల్యుఏపీ) నివేదిక ప్రకారం, మనుషులను వీపులపై మోసేలా అడవి ఏనుగులకు శిక్షణ ఇచ్చేందుకు కఠినమైన పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఈ ప్రక్రియను ‘బ్రేకింగ్-ఇన్’ లేదా ‘క్రష్’ అని పిలుస్తారు.

థాయ్‌లాండ్

ఫొటో సోర్స్, BBC/Benjamin Begley

ఫొటో క్యాప్షన్, ఎక్కువ మంది బౌద్ధులు ఉన్న థాయ్‌లాండ్‌లో ఏనుగులను పవిత్రంగా పరిగణిస్తారు

అయుతయతో పాటు, ఉత్తరాన చియాంగ్‌ రాయ్, చియాంగ్ మాయిలోని గ్రామాల్లోనూ ఏనుగులు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ టూరిస్టులు వాటికి అరటిపండ్లు తినిపిస్తారు. వాటికి మట్టితో స్నానం చేయిస్తారు.

అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంఘం ప్రకారం ఏనుగుల వేట, అక్రమ వ్యాపారం. వాటి నివాస ప్రదేశాలు నాశనం కావడం కారణంగా, ఆసియా ఏనుగులను అంతరించిపోతున్న జాతిగా గుర్తించారు.

మరెక్కడా లేనంతగా, థాయిలాండ్‌లోని టూరిజం పరిశ్రమలో 3 వేలకు పైగా ఏనుగులను ఉపయోగిస్తున్నారు. ఇతర దేశాలలో మాదిరిగా కాకుండా, థాయ్‌లాండ్‌లోని ఏనుగులన్నీ దాదాపు ప్రైవేట్ యజమానుల చేతిలో ఉన్నాయి.

ఆఫ్రికన్ ఏనుగులతో పోలిస్తే, ఆసియా ఏనుగులు గుండ్రటి చిన్న చెవులు, కొంచెం వంగిన వీపుతో ఉంటాయి.

ప్రస్తుతం సందర్శకులు కవల పిల్లలను చూడటానికి అయుతయలోని ఈ పార్క్‌కు గుంపులు గుంపులుగా వస్తున్నారు. ఈ ఏనుగు పిల్లలకు పెట్టబోయే పేర్ల కోసం వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

పిల్ల ఏనుగులు తల్లి కాలి చుట్టూ తమ తొండాన్ని చుట్టి ఆడుకోవడాన్ని చూస్తూ ఆనందిస్తున్నారు.

"ఏనుగు పిల్లల్ని కనడం చూస్తుంటే నాకు సంతోషంగా ఉంటుంది" అని గాయం నుంచి కోలుకుంటున్న మావటి సోమ్‌వాంగ్ అన్నారు.

"అవి కవలలే అయి ఉండాల్సిన అవసరం లేదు. ఏనుగు పిల్లలు పుట్టడం ఎప్పుడూ ఆనందమే." అన్నారాయన.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)