తెలంగాణ: ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు దాడి, ఇద్దరు రైతుల మృతి

ఏనుగు

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, ప్రవీణ్ కుమార్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలోకి ఏనుగు ప్రవేశించింది.

24 గంటల వ్యవధిలో కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు దాడిలో ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారు.

మహారాష్ట్ర వైపు నుంచి ప్రాణహిత నదిని దాటి ఏనుగు ఆసిఫాబాద్ జిల్లాలోకి ప్రవేశించినట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు.

బుధవారం చింతలమానేపల్లి మండలం బూరెపల్లిలో మిరప తోటలో పని చేసుకుంటున్న అల్లూరి శంకర్ (55) అనే రైతుపై ఏనుగు దాడి చేయడంతో పొలంలోనే చనిపోయారు.

తాజాగా గురువారం పెంచికల్ పేట్ మండలం కొండపల్లిలో మరో రైతు పోచయ్య (50) ఏనుగు దాడిలో చనిపోయారు. ఆయన పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.

బాధిత కుటుంబీకులు
ఫొటో క్యాప్షన్, బాధిత కుటుంబీకులు

ఇప్పటి దాకా పులులు, ఇప్పుడు ఏనుగు..

ఆసిఫాబాద్ జిల్లాలో రెండేళ్ల వ్యవధిలో ముగ్గురు వ్యక్తులు పులి దాడిలో చనిపోయారు. ఇప్పుడు ఈ ప్రాంతవాసులను ఏనుగు భయపెడుతోంది.

ఏనుగు సంచరిస్తున్న ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలను అటవీ శాఖ అప్రమత్తం చేసింది.

మరణించిన రైతు అల్లూరి శంకర్ కుటుంబానికి తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

అల్లూరి శంకర్ కుటుంబాన్ని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పరామర్శించారు. మహారాష్ట్ర మాదిరిగా అడవి జంతువుల దాడుల్లో మరణించిన కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, ఏనుగును తిరిగి పంపించే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.

ఏనుగు దాడి

అధికారులు ఏమంటున్నారు?

ఏనుగు దాడులపై కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అటవీ అధికారి (డీఎఫ్ఓ) నీరజ్ టీబ్రేవాల్ బీబీసీతో మాట్లాడారు.

'తెలంగాణ ప్రాంతంలోకి ఏనుగు ఎందుకు ప్రవేశించిందన్న అంశంపై ఇప్పుడే నిర్ధరణకు రాలేకపోతున్నాం.

అది నీళ్ల కోసం వచ్చి ఉండదు. ప్రాణహితలో కావాల్సినంత నీరు ఉంది. ఆ నదిని దాటి ఇక్కడికి వచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం.

ఉదయం 9 గంటలకు ముందు, సాయంత్రం 4 గంటల తర్వాత ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.

ఏనుగు సంచరిస్తున్న ప్రాంతాల్లో నిఘా పెట్టాం. సమస్యను అధ్యయనం చేేసేందుకు కొన్ని స్వచ్చంద సంస్థల సహకారం కోరాం.

2021లో కూడా ఇలాగే ఏనుగులు సరిహద్దు వరకు వచ్చి తిరిగి వెళ్లిపోయాయి. ఇప్పుడు ఒకే ఏనుగు వచ్చింది. దాని ప్రవర్తన హింసాత్మకంగా ఉంది' అని ఆయన చెప్పారు.

ఏనుగు ఆచూకీ కనిపెట్టేందుకు థర్మల్ డ్రోన్

ఆసిఫాబాద్ జిల్లాలో సంచరిస్తున్న ఏనుగు ఆచూకీ కనిపెట్టేందుకు థర్మల్ డ్రోన్ ఉపయోగిస్తున్నామని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం తెలిపారు.

ఈ డ్రోన్‌తో రాత్రి పూట ఏనుగు సంచారం తెలుసుకోవచ్చు.

‘‘కాగజ్ నగర్ అటవీ డివిజన్ ఫారెస్టు సిబ్బంది అంతా ఆ ఏనుగు కోసమే గాలిస్తున్నారు.

ప్రజల ప్రాణాలే మా మొదటి ప్రాధాన్యం. ఏనుగును వెనక్కి పంపే ప్రయత్నం చేస్తున్నాం.

ఇక్కడ బీటీ కాటన్ పంట ఉంది, అవతలి వైపు మహారాష్ట్రలో చెరకు, మొక్కజొన్న తోటల్లోకి దానికదే వెనక్కి వెళ్లిపోయే అవకాశాలున్నాయి. ఈ ఏనుగు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర మీదుగా ఇక్కడికి వచ్చింది’’ అని శాంతారాం వివరించారు.

ఏనుగు దాడుల నేపథ్యంలో దహెగాం, బెజ్జూరు, చింతలమానేపల్లి మండలాల్లో ప్రజలు గుంపులుగా తిరగకుండా 144 సెక్షన్ విధించారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)