కువైట్ అగ్నిప్రమాదానికి కారణమేంటి, అక్కడి ప్రభుత్వం ఏం చెబుతోంది?

ఫొటో సోర్స్, Reuters
కువైట్‌లోని మంగాఫ్ ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 49 మంది మరణించారు. వీరిలో అత్యధికులు భారతీయులేనని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ బీబీసీకి తెలిపారు.
కువైట్ ప్రభుత్వంతో మాట్లాడిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్, మృతదేహాలను వీలైనంత త్వరగా భారత్‌కు పంపాలని విజ్ఞప్తి చేశారు.
"అగ్ని ప్రమాదం గురించి కువైట్ ఆర్థిక మంత్రి అబ్దుల్లా అలీ అల్ యాహ్యాతో మాట్లాడాను. సంఘటనకు సంబంధించి కువైట్ అధికారులు తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకున్నాను. అగ్నిప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, దానికి బాధ్యులెవరో కనుగొంటామని ఆయన హామీ ఇచ్చారు’’ అని జైశంకర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
‘‘మృతదేహాలను వీలైనంత త్వరగా పంపించాలని కోరాను. క్షతగాత్రులకు సరైన వైద్యం అందిస్తున్నట్లు కువైట్ అధికారులు తెలిపారు. రేపు కేంద్ర సహాయ మంత్రి కీర్తి వర్ధన్‌సింగ్ కువైట్‌కు వెళ్లాక పరిస్థితిని మళ్లీ సమీక్షిస్తాం’’ అని జైశంకర్ తెలిపారు.
ఏఎన్‌ఐ వార్తా సంస్థ ప్రకారం, ప్రమాదంలో గాయపడినవారిలో 30 మందికి పైగా భారతీయులు గాయపడ్డారు. వారిని కువైట్‌లోని అల్-అదాన్ ఆసుపత్రిలో చేర్చారు.
కువైట్‌లోని భారత రాయబారి ఆదర్శ్ స్వైకా ఆసుపత్రులను సందర్శించి క్షతగాత్రులను పరామర్శించారు.
బాధితులకు, వారి బంధువులకు అవసరమైన సహాయ సహకారాలను అందజేస్తామని భారత రాయబార కార్యాలయం తెలిపింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
‘కిటికీలోంచి దూకాం..’
కువైట్‌లో అగ్ని ప్రమాదం నుంచి బయటపడిన ఓ వ్యక్తి మాట్లాడుతూ, "నేను 5వ అంతస్తులో నిద్రిస్తుండగా, పక్కనున్న అపార్ట్‌మెంట్ వారు అకస్మాత్తుగా మా తలుపు కొట్టారు. నేను బయటకు వచ్చేసరికి నల్లటి పొగ తప్ప మరేమీ కనిపించలేదు. నా గది తలుపు కొట్టిన వాళ్లు కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయారు. మా అపార్ట్‌మెంట్ కిటికీ కాస్త పెద్దది కాబట్టి మా గదిలో ఉన్న నలుగురం దానిలోంచి బయటపడ్డాం. కానీ మా గదికి సమీపంలో ఉన్న వారి గదిలోని కిటికీ చాలా చిన్నది, దీంతో వాళ్లు తప్పించుకోలేకపోయారు” అని చెప్పారు.

ఫొటో సోర్స్, IMRAN QURESHI
పెళ్లయిన 9 నెలలకే విషాదం
ఈ ప్రమాదంలో మరణించిన ఉమరుద్దీన్ షామిర్‌ది ఓ విషాద గాథ. కేరళలోని కొల్లాంకు చెందిన 29 ఏళ్ల ఉమరుద్దీన్ షామిర్ కువైట్‌లో భారతీయులకు చెందిన ఓ ఆయిల్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు.
"ఉమరుద్దీన్ కుటుంబ సభ్యులకు కొన్ని గంటల క్రితమే ఆయన మరణవార్త తెలిసింది. ఆయన 9 నెలల క్రితం ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకున్నారు. ఆయన తల్లిదండ్రులు మాట్లాడే స్థితిలో లేరు" అని కొల్లాంలోని ఆయన పొరుగువారు బీబీసీకి తెలిపారు.
కువైట్‌లోని ఉమరుద్దీన్ స్నేహితుడు నౌఫల్ బీబీసీతో మాట్లాడుతూ, ‘‘ఉమరుద్దీన్ కుటుంబం గురించి నాకు పెద్దగా తెలియదు. నేను ఆయన అపార్ట్‌మెంట్‌కు మూడు బిల్డింగుల దూరంలో ఉంటున్నాను. మేమంతా ఒకే ఆయిల్ కంపెనీలో పనిచేస్తున్నాం. ఆ భవనంలో ఎవరు ఉన్నారో, ఎవరు లేరో చెప్పడం కష్టం'' అని ఆయన అన్నారు.
"ఆయిల్ కంపెనీలో కార్మికులంతా షిఫ్టుల వారీగా పని చేస్తారు. ఏడుగురు అర్ధరాత్రి 1.30 గంటలకు పనికి వెళ్ళారు. తిరిగి వచ్చిన వాళ్లంతా జరిగింది చూసి షాక్‌లో మునిగిపోయారు" అని నౌఫల్ చెప్పారు.
ఆ భవనంలో చాలా మంది భారతీయులు ఉన్నారని, వాళ్లు ప్రధానంగా కేరళ, తమిళనాడుకు చెందిన వారని నౌఫల్ చెప్పారు.

ఫొటో సోర్స్, @INDEMBKWT
‘డీఎన్ఏ పరీక్ష అవసరమేమో’
ఈ ప్రమాదంపై కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్ (కేఎంసీసీ) కువైట్ చాప్టర్ హెడ్ షర్‌బుద్దీన్ కోనట్టు బీబీసీతో మాట్లాడుతూ, ‘‘మేమింకా అగ్నిప్రమాదంలో మరణించిన లేదా గాయపడిన వారి మృతదేహాల కోసం వెతుకుతున్నాం. పలువురి మృతదేహాలను గుర్తించలేకపోయారు. ఇప్పటివరకు, కనీసం 11 మంది భారతీయులు మరణించారని తెలుస్తోంది. మృతదేహాలను గుర్తించడానికి డీఎన్ఏ పరీక్ష అవసరం కావచ్చు” అని చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ప్రమాదానికి కారణం ఏమిటి?
కువైట్ దేశీయ వ్యవహారాల శాశ మంత్రి ఫహద్ యూసుఫ్ అల్ సబా ఘటనా స్థలాన్ని సందర్శించారు.
భవనం యజమానుల అత్యాశే ఈ ఘటనకు కారణమమని ఆయన అన్నారు.
భవన నిర్మాణంలో చట్టపరమైన ఉల్లంఘనలు ఏమైనా ఉన్నాయా అనేదానిపై విచారణ జరుపుతామన్నారు.
కువైట్ మీడియా కథనాల ప్రకారం, ప్రమాదానికి జరిగిన భవనం ఎప్పుడూ కిక్కిరిసి ఉండేది.
ఆ అపార్ట్‌మెంట్‌లో పరిమితికి మించి వలస కార్మికులు ఉంటున్నట్లు ఆ మీడియా సంస్థలు చెబుతున్నాయి.
కువైట్ జనాభాలో మూడింట రెండు వంతుల మంది వలస కార్మికులే.
కువైట్ నిర్మాణ, మౌలిక సదుపాయాల రంగం వలస కార్మికులపైనే ఆధారపడి ఉంది.
కువైట్‌లోని వలస కార్మికుల జీవన ప్రమాణాలపై మానవ హక్కుల సంస్థలు పదే పదే ప్రశ్నలు లేవనెత్తుతుంటాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
‘నిద్రలోనే ఊపిరి వదిలారు’
తమిళనాడులోని విరుదునగర్‌కు చెందిన మణికందన్, కువైట్‌లో మంటలు చెలరేగిన అపార్ట్‌మెంట్‌కు సమీపంలోనే ఉంటున్నారు.
"కువైట్‌లో పగటిపూట వేడిగా ఉంటుంది కాబట్టి, చాలా మంది రాత్రిపూట పనికి వెళతారు. వారిలో కొందరు పని ముగించుకుని త్వరగా ఇంటికి తిరిగి వచ్చి, ఆహారం వండుకుంటారు. వంట గది అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో ఉంది.
వంటగదిలో మంటలు చెలరేగి అవి పై అంతస్తులకు విస్తరించాయి" అని వివరించారు.
తెల్లవారుజాము కావడంతో గదుల్లో నిద్రిస్తున్న పలువురు ఊపిరాడక చనిపోయారని, తప్పించుకునే ప్రయత్నంలో కొందరు పై నుంచి దూకి మరణించారని మణికందన్ తెలిపారు.
"ఇక్కడ ఉండేవారు ఎక్కువగా కేరళ, తమిళనాడుకు చెందినవాళ్లు. వాళ్లకు ఏమైందో నాకు తెలీదు" అని ఆయన అన్నారు.
బాధిత కుటుంబాలకు సహాయం చేసేందుకు భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. బాధితుల గురించి తెలుసుకునేందుకు, సహాయం కోసం ప్రజలు +965-65505246కు కాల్ చేయవచ్చు.
ఇవి కూడా చదవండి:
- కేంద్ర కేబినెట్, స్వతంత్ర, సహాయ మంత్రి హోదాల మధ్య తేడాలేంటి?
- సన్‌స్క్రీన్ లోషన్లు వాడుతున్నారా, ఈ ఎనిమిది విషయాలు తెలుసుకోండి...
- సత్యకుమార్ యాదవ్: వెంకయ్యనాయుడి పర్సనల్ సెక్రటరీ నుంచి చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి వరకు
- కువైట్‌లో అగ్నిప్రమాదం: ‘మంటల్లో చిక్కుకుని కొందరు, పొగలో ఊపిరాడక మరికొందరు చనిపోయారు’
- వంటకు ఏ పాత్రలు వాడాలి? పోషకాలు కోల్పోకుండా ఆహారం ఎలా వండాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














