దిల్లీలో అగ్నిప్రమాదం: ఒకే ఒక్క ఇరుకైన మెట్ల దారి.. భవనానికి ఫైర్ ఎన్ఓసీ లేదు

ముండ్కా అగ్నిప్రమాదం
ఫొటో క్యాప్షన్, అగ్నిప్రమాదం జరిగిన భవనం
    • రచయిత, దిల్నవాజ్ పాషా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పశ్చిమ దిల్లీ శివార్లలో ముండ్కాలోని ఒక వాణిజ్య భవనంలో శుక్రవారం సాయంత్రం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 27 మంది మరణించినట్లు నిర్ధారించారు.

ఈ భవనం ఒక షాపింగ్ కాంప్లెక్స్‌లా కనిపిస్తోంది. ముండ్కా మెట్రో స్టేషన్ నుంచి సుమారు రెండు వందల మీటర్ల దూరంలో దిల్లీ-రోహ్తక్ రహదారిపై ఉంది. దిల్లీలో రద్దీగా ఉండే హైవేలలో ఇదీ ఒకటి.

ఈ నాలుగు అంతస్తుల భవనంలో బెస్‌మెంట్ కూడా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఆఫీసులు, దుకాణాలు ఉన్నాయి. పైన మూడు అంతస్తులలో సీసీటీవీ కెమేరాలు తయారుచేసే సంస్థ కార్యాలయం ఉంది.

ప్రమాదంలో మరణించిన వారిలో ఎక్కువ మంది ఈ సంస్థ ఉద్యోగులే. బీబీసీ బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించింది.

ముండ్కా అగ్నిప్రమాదం

పైకి వెళ్లడానికిఇరుకైన మెట్ల దారి..

భవనానికి ఒకవైపు దిల్లీ-రోహ్తక్ హైవే ఉంది. మరో పక్క వీధి ఉంది. ఆ వీధి వైపు నుంచి భవనానికి మెట్లు ఉన్నాయి. పై అంతస్తుల్లో ఉన్న ఆఫీసుకు వెళ్లడానికి ఇదొక్కటే మార్గం.

మంటలు ఆరిన తరువాత అగ్నిమాపక దళంతో పాటు బీబీసీ బృందం ఆ మెట్ల ద్వారా భవనంలోకి ప్రవేశించింది.

అది ఇరుకైన మెట్ల దారి. అక్కడ ఒక చిన్న లిఫ్ట్ కూడా ఉంది. ఇది కాకుండా భవనంలోకి వెళ్లేందుకు మరో దారి లేదు. ఫైర్ ఎగ్జిట్ కూడా లేదు.

మంటలు బాగా అంటుకోవడంతో భవనం పూర్తిగా తగలబడిపోయింది. కాంక్రీట్ గోడలు మాత్రమే మిగిలాయి.

మెట్లెక్కి పైకి వెళ్లాక ఒక పెద్ద ద్వారం లాంటిది (గేటు లాంటి నిర్మాణం) కనిపించింది. దానికి చిన్న గేటు ఉంది. మంటలు చల్లారాక కూడా ఈ చిన్న గేటు మూసుకునే ఉంది. దానిలోంచి ఒకరు మాత్రమే లోపలికి వెళ్లగలరు. బయటకు రాగలరు.

భవనంలోని ఫర్నీచర్ పూర్తిగా దగ్ధమైంది. ఫాల్స్ సీలింగ్ కూడా బూడిదైపోయింది.

మెట్లు ఎక్కగానే గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక గోడౌన్ లాంటిది ఉంది. దాని నిండా అట్టపెట్టెలు ఉన్నాయి. మొదటి అంతస్తులో ఆఫీసు ఉంది. అక్కడ అన్నీ పూర్తిగా కాలిపోయాయి. భారీగా కాగితాలు, అట్టపెట్టెలు కనిపించాయి. అవి ఇంకా మండుతూనే ఉన్నాయి.

పై అంతస్తుల్లో దట్టంగా పొగ వ్యాపించి ఉంది. మేమక్కడికి వెళ్లలేకపోయాం.

ముండ్కా అగ్నిప్రమాదం

ఫొటో సోర్స్, AFP

అగ్ని ప్రమాదాల నుంచి తప్పించుకునే ఏర్పాటు లేదు

భవనంలో ఉన్న సీసీటీవీ కెమేరాల తయారీ కంపెనీలో చాలామంది పని చేస్తున్నారు. సేల్స్, కంపెనీ నిర్వహణ ఇక్కడ నుంచే జరుగుతుంది. మూడు అంతస్తుల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తున్నారు.

ఇంత పెద్ద వాణిజ్య భవనంలో అగ్నిప్రమాదం నుంచి రక్షించే వ్యవస్థ లేదు. అగ్నిమాపక పరికరాలు ఉన్నాయనే సంకేతాలు లేవు. ఫైర్ ఎగ్స్‌టింగ్విషర్ లేదా స్ప్రింక్లర్, హైడ్రెంట్ సిస్టం గానీ లేవు. బయటకు వెళ్లేందుకు ఒకే ఒక్క ఇరుకైన మెట్ల దారి ఉంది.

ఆ మెట్ల దారిలో భవనం పై అంతస్తులకు చేరుకోవడం కష్టమైందని అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. ఈ భవనం పక్క నుంచి హైవోల్టేజీ వైర్లు కూడా వెళ్తున్నాయి. దీని వల్ల కూడా రెస్క్యూ, రిలీఫ్‌ పనుల్లో ఇబ్బందులు కలిగి ఉండవచ్చు.

ముండ్కా అగ్నిప్రమాదం

గోడౌన్‌లా కూడా వాడుతున్నారు

భవనంలోని చాలా భాగాలను గోడౌన్‌లా ఉపయోగిస్తున్నారు. ఇక్కడ సీసీటీవీ కెమెరాల తయారీకి సంబంధించిన వస్తువులే కాకుండా అట్టపెట్టెలు, కాగితాలు కూడా భారీగానే ఉన్నాయి.

అక్కడ పడి ఉన్న చెత్తాచెదారం చూస్తుంటే ప్యాకింగ్ పనులు కూడా జరుగుతాయని అర్థమవుతోంది. ముఖ్యంగా, బేస్‌మెంట్, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇలాంటి వస్తువులే ఎక్కువ కనిపించాయి.

ఈ భవనంలో సీసీటీవీ కంపెనీతో పాటు ఇతర సంస్థల కార్యాలయాలు కూడా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.

ముండ్కా అగ్నిప్రమాదం
ఫొటో క్యాప్షన్, బాధితుల కుటుంబాలు

బిల్డింగ్‌కు ఫైర్ ఎన్ఓసీ లేదు

ఈ భవనానికి అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ) లేదని ఔటర్ డిస్ట్రిక్ట్ డీసీపీ సమీర్ శర్మ తెలిపారు.

నిబంధనల ప్రకారం, వాణిజ్య భవనాలకు అగ్నిమాపక శాఖ నుంచి ఎన్ఓసీ పొందడం తప్పనిసరి. అంతేకాకుండా, ఇలాంటి భవనాల్లో తరచూ తనిఖీలు జరుగుతూ ఉంటాయి.

భవనం యజమానిని మనీష్ లక్డాగా గుర్తించారు. ప్రస్తుతానికి ఆయన పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

మనీష్‌ను అరెస్ట్ చేసేందుకు దిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆ కంపెనీ నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ప్రమాదంలో 27 మంది మరణించారని, 12 మందికి పైగా గాయపడ్డారని సమీర్ శర్మ తెలిపారు.

ముండ్కా అగ్నిప్రమాదం

మంటలు అంటుకోవడానికి కారణం..

అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. కానీ, షార్ట్ సర్క్యూట్ వలనే మంటలు అంటుకుని ఉంటాయని భావిస్తున్నారు.

మొదటి అంతస్తులో నిప్పంటుకుందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. మొదట్లో పెద్దగా మంటలు చెలరేగినట్టు కనిపించలేదని, పొగ మాత్రమే కనిపించిందని చెప్పారు.

అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోవడానికి కొన్ని గంటలు పట్టిందని కూడా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ఎక్కువమంది ఉద్యోగులు మొదటి, రెండు అంతస్తుల్లో చిక్కుకుపోయారు. దట్టంగా పొగ కమ్ముకోవడంతో వాళ్లు మెట్ల దారి గుండా బయటకి రాలేకపోయారు.

స్థానికులు క్రేన్ సహాయంతో లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. నిచ్చెనల సాయంతో కొందరిని కిందకు దించేందుకు ప్రయత్నించారు.

వాళ్లను బయటకు తీసుకురావడానికి సరైన మార్గం కనిపించలేదని, సదుపాయాలు ఏవీ అందుబాటులో లేకపోవడంతో భవనంలో చిక్కుకున్న వారందరినీ కాపాడలేకపోయామని ప్రత్యక్ష సాక్షి విజయ్ చెప్పారు. కొంతమంది భయంతో పై నుంచి కిందకు దూకడం వల్ల కూడా ప్రాణాలు కోల్పోయారు.

భవనంలో మండే పదార్థాలు ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. అందువల్లే మంటలు ఆర్పేందుకు ఆరు గంటలకు పైగా సమయం పట్టింది.

ఇంతమంది ఉద్యోగులు, ఇన్ని ఆఫీసులు, దుకాణాలు ఉన్న ఈ భవనంలో అగ్నిప్రమాదాల నుంచి రక్షించే వ్యవస్థ లేకపోవడం, అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌ఓసీ లేకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వీడియో క్యాప్షన్, కొడుకు ప్రాణాలు కాపాడేందుకు ఆ తల్లి ఎలాంటి నిర్ణయం తీసుకుందంటే...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)