వోల్ఫ్ డాగ్: పుణెలో కుక్కల్లాంటి తోడేళ్లు, ఈ సంకరజాతి జంతువుల వల్ల రాబోయే ప్రమాదం ఏంటి?

ఫొటో సోర్స్, THE GRASSLANDS TRUST
- రచయిత, జాన్వీ మూలే
- హోదా, బీబీసీ ప్రతినిధి
పుణెకు సమీపంలోని మల్రానాకు వెళ్లినప్పుడు సిద్ధేష్ బ్రహ్మాంకర్‌కు వింతగా ఉన్న ఒక జంతువు కనిపించింది.
"మేం అక్కడ తిరుగుతున్నప్పుడు అనుకోకుండా అది కనిపించింది. ఒక తోడేలులా కనిపించింది. కానీ, అది నిజంగా తోడేలా, కాదా? అన్నది మాకు అర్థం కాలేదు. పైగా అది బూడిద రంగులో లేదు. కాస్త పసుపు రంగులో కనిపించింది. 2014లో ఇదంతా జరిగింది’’ అని ఆయన చెప్పారు.
ఆయనతో పాటు, పుణెకు చెందిన ‘ది గ్రాస్‌ల్యాండ్స్ ట్రస్ట్’ అనే స్వచ్ఛంద సంస్థలో పని చేస్తున్న ఆయన సహచరులు కూడా ఆ ప్రాంతంలో ఇలాంటి జంతువులు సంచరిస్తున్న కథలను విన్నారు. దాంతో వాళ్లు అలాంటి జంతువులు మరిన్ని కనిపిస్తాయేమో అని వెతికేవాళ్లు.
“లాక్‌డౌన్ సమయంలో మాకు పుణె సమీపంలో పసుపు వర్ణంలోని మరో జంతువు కనిపించింది. అది తోడేలులా అనిపించింది. కానీ, దాని చర్మంపై చారలు ఉన్నాయి.” అని గ్రాస్‌ల్యాండ్స్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు మిహిర్ గాడ్‌బోలే గుర్తు చేసుకున్నారు.
అటవీ శాఖ అనుమతి తీసుకున్న తర్వాత ఈ బృందం శాస్త్రవేత్తల మార్గదర్శకత్వంలో ఆ జంతువుల వెంట్రుకలు, మలం నమూనాలను సేకరించింది. కానీ, అది అంత సులభమేమీ కాలేదు.


ఫొటో సోర్స్, THE GRASSLANDS TRUST
“తోడేళ్ళు అద్భుతమైనవి, అంతుచిక్కనివి. వాటిని ఫాలో కావడం పెద్ద సవాలు. అవి ఇక్కడ మానవులకు దగ్గరగా నివసిస్తున్నాయి. తెలివిలో అవి మనల్ని మించిపోతాయి. కానీ, మేం రోజుల తరబడి ఆ మందను ట్రాక్ చేశాం. అవి ఎక్కడ కూర్చుంటాయో, ఎప్పుడు ఆ స్థలాన్ని వదిలిపోతాయో తెలుసుకున్నాం. మేము ఈ వింతగా కనిపించే జంతువుల వెంట్రుకలను, మలాన్ని సేకరించగలిగాము’’ అని మిహిర్ చెప్పారు.
తర్వాత నిర్వహించిన జీనోమ్ సీక్వెన్సింగ్, వాళ్ల అనుమానం నిజమని రుజువు చేసింది. అవి తోడేలు, కుక్కకు జన్మించిన సంకర జంతువు అని వెల్లడైంది.
సాధారణంగా తోడేలు, కుక్క సంకరంగా పుట్టిన జంతువులను వోల్ఫ్‌డాగ్ అంటారు. అయితే ఇక్కడ కనిపిస్తున్నవి వోల్ఫ్‌డాగ్‌కు భిన్నమైనవని గుర్తించాలి.
తోడేలు-కుక్కల సంకరజాతులను ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో పరిశోధిస్తున్నా, భారతదేశంలో దీనికి సంబంధించిన శాస్త్రీయ రుజువులు దొరకడం ఇదే మొదటిసారి. ఈ అధ్యయనం రెండవ తరం హైబ్రిడైజేషన్ ఉనికిని కూడా రుజువు చేసింది. అంటే ఒక సంకర జాతి, మళ్లీ తోడేళ్ళతో కలిసి సంకరం కావడం.
గ్రాస్‌ల్యాండ్స్ ట్రస్ట్, అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ది ఎన్విరాన్‌మెంట్ (ATREE), నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ (NCBS) అనే మూడు సంస్థల సహకారంతో చేసిన ఈ పరిశోధన జర్నల్ ఆఫ్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్‌లో ప్రచురించారు.
తోడేళ్ళు, ఇతర వన్యప్రాణులకు ప్రమాదంగా మారిన మచ్చిక తప్పిన కుక్కల సమస్యనూ ఇది వెలుగులోకి తెచ్చింది.
ఈ హైబ్రిడైజేషన్‌కు కారణమేమిటని ఎవరైనా ఆశ్చర్యపోతుండవచ్చు. దీనిపై మరింత పరిశోధన అవసరమా?

ఫొటో సోర్స్, THE GRASSLANDS TRUST
ఉష్ణమండల పచ్చికబయళ్లలో స్వేచ్ఛా విహారం
ప్రపంచవ్యాప్తంగా బూడిద రంగు తోడేళ్ళు గడ్డి భూములు, ఎడారులు, అడవులు, టండ్రా వంటి వివిధ ఆవాసాలలో కనిపిస్తాయి. భారతదేశంలో ఇవి మానవ నివాసాలను ఆనుకొని ఉన్న పొదలు, ఉష్ణమండల పచ్చికబయళ్లలో నివసిస్తాయి.
ఆఫ్రికన్ పచ్చికబయళ్లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. కానీ, భారతదేశంలో కూడా రాజస్థాన్‌లోని ఉప-హిమాలయ లోతట్టు ప్రాంతాలు, మహారాష్ట్రలోనూ ఇలాంటి పచ్చికబయళ్లు ఉన్నాయనేది పెద్దగా తెలియని వాస్తవం.
"భారతీయ పచ్చిక బయళ్లు ఒక ప్రత్యేకమైన పర్యావరణ వ్యవస్థ. దీనిలో జింకలు, పందికొక్కులు, అంతరించిపోతున్న గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ వంటి పక్షులు ఉన్నాయి. అత్యంత ప్రమాదకరమైన తోడేళ్ళు వీటిలో ఒక ముఖ్యమైన భాగం" అని మిహిర్ వివరించారు.
భారతదేశంలో రెండు జాతుల తోడేళ్ళు ఉన్నాయి. ఒకటి - హిమాలయన్ తోడేలు (కానిస్ హిమాలయెన్సిస్), రెండు - భారతీయ బూడిద రంగు తోడేలు (కానిస్ లూపస్ పాలిపస్).
ప్రత్యేకించి వీటిలో భారతీయ బూడిద రంగు తోడేలు ముఖ్యమైనది. ఎందుకంటే మునుపటి పరిశోధన ప్రకారం, ఇది ప్రపంచంలోని పురాతన జాతులలో ఒకటి. అవి అంతరించిపోతే, పరిణామక్రమాన్ని అర్థం చేసుకునే పురాతనమైన, కీలకమైన లింక్ తెగిపోతుంది.
అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి ( IUCN) భారతదేశం వంటి దేశాలలో బూడిద రంగు తోడేళ్ళు అంతరించిపోతున్న జాతి అని పేర్కొంది. వీటికి భారతదేశంలో వన్యప్రాణుల చట్టం (1972) కింద రక్షణ లభిస్తున్నా, భారతీయ బూడిద రంగు తోడేళ్ళు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. మానవ కార్యకలాపాలు వాటి నివాసప్రాంతాలకు విస్తరిస్తున్నాయి.
భారతీయ బూడిద రంగు తోడేళ్ళ సంఖ్య 2,000-3,000 వరకు ఉంటుందని అంచనా. అయితే, పులుల మాదిరిగా సరైన గణన జరగనందువల్ల, ఈ సంఖ్యను విశ్వసించలేమని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఈ తోడేళ్ళు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో మహారాష్ట్ర ఒకటి. దాదాపు ఇలాంటి 30 తోడేళ్ళు, పుణే సమీపంలోని గడ్డి భూములలో నివసిస్తున్నాయి. శాస్త్రవేత్తలకు సంకర జంతువు కనిపించింది ఇక్కడే.

ఫొటో సోర్స్, THE GRASSLANDS TRUST
పరిశోధనలో ఏం వెల్లడైంది?
"కుక్కలు, తోడేళ్ళు జన్యుపరంగా చాలా దగ్గరగా ఉంటాయి. ఒక కోణం నుంచి చూస్తే కుక్కలు పెంపుడు తోడేళ్ళు." అని అశోక ట్రస్ట్‌కు చెందిన జీవవైవిధ్య పరిశోధకుడు అబి వనక్ చెప్పారు.
"ప్రపంచవ్యాప్తంగా, తోడేలు-కుక్కల సంకరం జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఒక ప్రాంతంలో తోడేళ్ళ జనాభా తగ్గి, వాటికి జత దొరకనప్పుడు అవి కుక్కలతో సంకరం చేస్తాయి.’’ అని ఆయన చెప్పారు.
ఇటీవలి దశాబ్దాలలో భారతీయ పచ్చిక బయళ్ల చుట్టూ వ్యవసాయం, పశువుల మేత, చెత్త దిబ్బలు, పట్టణీకరణ వంటి కార్యకలాపాలు పెరిగాయి. మానవ నివాసాల రాకతో స్వేచ్ఛగా తిరిగే ఊరకుక్కలు, అడవి తోడేళ్ళు పరస్పరం ఎదురు పడటం జరుగుతోంది.
హైబ్రిడైజేషన్ తోడేళ్ళను ప్రమాదంలో పడేస్తుంది. ఎందుకంటే దీనికి జన్యుపరంగా విభిన్నమైన జాతులను తుడిచిపెట్టే సామర్థ్యం ఉంది. మానవ ప్రేరిత క్రాస్ బ్రీడింగ్ జరిగిన సందర్భాలూ ఉన్నాయి. కానీ చాలా ప్రదేశాలలో దీన్ని చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు.

ఫొటో సోర్స్, THE GRASSLANDS TRUST
భారతదేశంలో తోడేలు-కుక్క ఉనికిని నిర్ధరించే జీనోమ్ సీక్వెన్సింగ్ చేసిన ల్యాబ్ నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్‌లో (NCBS) మాలిక్యులర్ ఎకాలజిస్ట్, ప్రొఫెసర్ ఉమా రామకృష్ణన్ ఈ విషయాన్ని వివరించారు.
“మీ దగ్గర రెండు పెయింట్ డబ్బాలు ఉండి, మీరు వాటిని కలపడం ప్రారంభిస్తే, అవి అలాగే ఉండవు. అదే విధంగా, హైబ్రిడైజేషన్ ఒక జాతి జీన్ పూల్‌ను పలుచన చేస్తుంది.
ఉదాహరణకు కుక్కల మాదిరిగా ఒక జాతిలో చాలా జంతువులు ఉండి, తోడేళ్ళలాగా మరొక దాని సంఖ్య తక్కువగా ఉంటే, ఆ కుక్కలు తోడేళ్ల జన్యు సమూహాన్ని పలుచన చేసి, చివరికి వాటిని తుడిచిపెట్టే అవకాశం ఉంది." అని ఉమా అన్నారు.
అబి వనక్ మాట్లాడుతూ, “రెండింటి మధ్య చాలా జన్యుపరమైన తేడాలు ఉన్నాయి. జంతువుల మచ్చిక ప్రక్రియ కారణంగా, కుక్కలు తోడేళ్ళలోని చాలా లక్షణాలను కోల్పోయాయి. శరీర పరిమాణం రీత్యా చిన్నగా, కొంచెం బలహీనంగా తయారయ్యాయి. హైబ్రిడైజేషన్‌తో ఆ లక్షణాలు కొన్ని తిరిగి తోడేళ్ళకు రావచ్చు, దాని వల్ల అవి ప్రమాదంలో పడతాయి’’ అన్నారు.
కానీ, తోడేళ్ళకు క్రాస్ బ్రీడింగ్ ఒక్కటే ప్రధాన సమస్య కాదు.
“కుక్కలు వైరస్‌లు, రేబిస్ వంటి వ్యాధులను వ్యాపింపజేస్తాయి. అవి ఒక ప్రాంతంలోని అడవి తోడేళ్ళ జనాభా మొత్తాన్ని తుడిచి పెట్టగలవు. సాధారణంగా తోడేళ్ళు ఆహారం కోసం ఆధారపడే చిన్న జంతువులను కుక్కలు కూడా వేటాడతాయి." అని మిహిర్ గాడ్‌బోలే అన్నారు.
చిరుతపులి జనాభా పెరుగుదల ఈ పచ్చిక బయళ్ల పర్యావరణ సమతుల్యతను ఎలా భంగం చేస్తుందో ఆయన బృందం చేసిన మరొక అధ్యయనం చూపిస్తుంది.
అయితే ఇంత జరుగుతున్నా, ఇప్పటికీ తోడేళ్ళను రక్షించేందుకు గట్టి ప్రయత్నాలు జరగడం లేదు.

ఫొటో సోర్స్, THE GRASSLAND TRUST
తోడేళ్ళను రక్షించడం, పచ్చిక బయళ్లను పరిరక్షించడం
అబి వనక్ ఇలా అన్నారు: “పులుల సంరక్షణలా కాకుండా తోడేళ్ళ సంరక్షణ గురించి మనం ఆలోచించాలి. మనం వీటి కోసం రక్షిత ప్రాంతాలను సృష్టించలేం. ఎందుకంటే అవి మనం అనేక రకాలుగా ఉపయోగించుకుంటున్న భూభాగంలోనే సంచరిస్తుంటాయి. తరచుగా వాటి ఆహారం కోసం పశువులపై ఆధారపడతాయి. కాబట్టి, మనం పశువులను కాసే వారి దగ్గర్నుంచి, అనేకమందిని పరిగణనలోకి తీసుకోవాలి.’’ అని అన్నారు.
గ్రాస్‌ల్యాండ్స్ ట్రస్ట్ ఇప్పుడు దీనిపై ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తోంది. ఇందులో స్థానిక గ్రామస్తులు, వాటాదారులు పచ్చిక బయళ్ల పునరుద్ధరణ, దానిలోని వన్యప్రాణులను సంరక్షించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. వీరు తోడేళ్ళ సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించే ప్రణాళికు సంబంధించిన ప్రతిపాదనను రాష్ట్ర అటవీ మంత్రిత్వ శాఖకు సమర్పించి, దాని ఆమోదం కోసం వేచి చూస్తున్నారు.
అయితే ఈ పరిశోధన ఉమలో కొత్త ప్రశ్నలను లేవనెత్తింది.
"ఒక పెద్ద సవాలు ఏమిటంటే, మీరు హైబ్రిడ్‌ను ఎలా వర్గీకరిస్తారు? దానికి వన్యప్రాణి చట్టం కింద రక్షణ దొరుకుతుందా? ఇవి నైతిక ప్రశ్నలు మాత్రమే కాదు, పర్యావరణ, జీవసంబంధమైన ప్రశ్నలు కూడా.’’ అన్నారామె.
నిర్దిష్ట ప్రాంతంలో ఒక జాతికి ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి జన్యు సంతకాలు (జినోమిక్ సిగ్నేచర్స్) వారికి సహాయపడతాయి. శాస్త్రవేత్తలు వాటి ఆధారంగా సిఫార్సులు చేస్తారని ఆమె చెప్పారు.
“మనం పరిణామ క్రమం గురించి ఆలోచించినప్పుడు, గతం గురించి ఆలోచిస్తాం. అయితే భవిష్యత్తులో కూడా పరిణామం జరగబోతోంది. ఒక జాతి పరిణామం చెందుతున్నప్పుడు, ఆ దారి మానవుల వల్ల గణనీయంగా ప్రభావితమవుతుందా?" అని ఆమె ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి:
- టీడీపీ, వైసీపీ మధ్య ఓట్ల తేడా ఎంత? అది ఫలితాలను ఎలా మార్చేసింది?
- చంద్రబాబు కేబినెట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..
- భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు
- చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతిలో ఎందుకు చేయడం లేదు
- ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














